Annaram Saraswati Barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం రేపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో వాటర్ ఉబికి వస్తుంది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం 5.71 టిఎంసీలు ఉన్న నీరు కాగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు అధికారులు. అయితే ప్రతి యేటా జరిగే మెయింటెనెన్స్ లో భాగంగా ఇలా చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో నష్టం ఏమీ లేదని వివరించారు. గత సంవత్సరం కూడా ఇలానే లీకేజీ జరిపి దానిని పరిశీలించామని వెల్లడించారు. కావున ఈ లీకేజీ మేము పరిశీలించేందుకే తప్ప అన్నారం సరస్వతి బ్యారేజీ లీకేజీ ఏమీ జరగలేదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కాగా.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ బ్యారేజీ 15వ స్తంభం నుంచి 20వ పిల్లర్ వరకు వంతెన వంగి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. గేట్ల నుంచి శబ్ధాలు వస్తున్నాయని.. తెల్లవారుజాము వరకు ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తిరుపతిరావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ బ్రిడ్జిని నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. లక్ష్మీ బ్యారేజీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ నిర్ధిష్ట బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడంతో కేంద్ర బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ అధ్యక్షతన ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రాజెక్టును పరిశీలించింది.
MLA Lakshmareddy: గ్రామాల రూపురేఖలు మార్చాం.. ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి