NTV Telugu Site icon

Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో.. ప్రవేశాల జోరు..

Govt Schools

Govt Schools

తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రవేశాల జోరు కొనసాగుతోంది. ప్రైవేట్‌ స్కూల్స్‌ నుంచి విద్యార్థులు గవర్నమెంట్‌ బాట పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 51 వేల 4 వందల 61 మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. దీంతో జూలై 1 నాటికి అన్ని క్లాసులు కలిపి అడ్మిషన్లు పొందిన మొత్తం స్టూడెంట్స్‌ సంఖ్య లక్షా 70 వేల 59కి చేరింది. సెప్టెంబర్‌ 30 వరకు అడ్మిషన్లు జరగనుండటంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధిక ప్రవేశాలతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 15 వేల 636 మంది చేరారు.

ఇందులో ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సంఖ్య సగం కన్నా ఎక్కువే (7 వేల 9 వందల 28 మంది) కావటం విశేషం. ప్రభుత్వం చేపట్టిన బడిబాట, మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయనటానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. బడిబాట కార్యక్రమం జూన్‌ 30తో ముగిసినప్పటికీ ప్రవేశాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం కూడా అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరగటానికి దోహదపడిందని భావిస్తున్నారు. గతంలో గవర్నమెంట్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవటంతో మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్‌ స్కూల్స్‌కి పంపించేవారు.

తెలంగాణ ప్రభుత్వం ఈసారి పాఠ్యపుస్తకాలను రెండు మీడియాల్లో (తెలుగు-ఇంగ్లిష్‌, ఉర్దూ-ఇంగ్లిష్‌, హిందీ-ఇంగ్లిష్‌) ప్రచురించింది. ఇది విద్యార్థులకు మరింత ఉపకరించనుందని చెప్పొచ్చు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రాథమిక సౌకర్యాలన్నీ సమకూరుతున్నాయి. స్కూల్‌కి కరెంట్‌ సదుపాయం, పిల్లలకు మంచి నీళ్లు, కూర్చోటానికి బెంచ్‌లు, స్టాఫ్‌కి తగిన సామగ్రి, మరుగుదొడ్లలో నీళ్లు, బడి బిల్డింగులకు పెయింటింగ్‌, చిన్నా-పెద్ద మరమ్మతులు చేశారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మూడేళ్లలో 7 వేల 2 వందల 89 కోట్ల 54 లక్షల రూపాయలతో అన్ని హంగులూ తీసుకురావాలని తెలంగాణ సర్కారు గట్టి పట్టుదలతో ఉంది.

Captain Miller : ధనుష్ త్రిభాషా చిత్రం ఎలా ఉండబోతోందంటే…