Site icon NTV Telugu

Adilabad Airport: ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. కీలక ముందడుగు

Flight

Flight

Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ (Joint User Airfield) ఏర్పాటుకు సంబంధించి మొత్తం 700 ఎకరాల భూసేకరణకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి, వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు దారితీయనుంది.

విమానాశ్రయ అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన నివేదిక సానుకూలంగా రావడంతో, ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ఉత్తర తెలంగాణకు ఆర్థికంగా కొత్త ఊపిరి పోసే ప్రాజెక్ట్ అని అన్నారు. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలు, అత్యవసర సేవలు.. ప్రతి రంగానికీ ఇది లాభదాయకం అవుతుంది అని పేర్కొన్నారు.

ప్రాంతీయ సమతుల్యాభివృద్ధి కోసం సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కొత్త దిశలో సాగుతోందని అన్నారు. ఆదిలాబాద్ భవిష్యత్తులో దేశ విమానయాన పటంలో ఒక కీలక స్థానాన్ని సంపాదించబోతోందన్నారు.

ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ ఆర్థిక వృద్ధికి నూతన ద్వారం అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

YS Jagan: రేపు మొంథా తుఫాన్‌ బాధిత ప్రాంతాలకు వైఎస్‌ జగన్‌..

Exit mobile version