తెలంగాణ ప్రభుత్వం గంజాయిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా చాలా కాలంగా గంజాయి ముఠాలు పట్టుబడుతున్నాయి. అయితే.. తాజాగా అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అదనపు సీపి సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒరిస్సా, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఈ అంతర్రాష్ట్ర ముఠా గంజాయి సప్లై చేస్తోందని అదనపు సీపి సుధీర్ బాబు వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ నుండి మహారాష్ట్రకు ఈ ముఠా గంజాయి సరఫరా చేస్తుందని, నాలుగు వాహనాలలో 470 కిలోలు సుమారుగా కోటి రూపాయలకు పైగా విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సుధీర్ బాబు పేర్కొన్నారు. చోరీ కేసులో జైలుకు వెళ్లిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌కు ఈ గంజాయి సరఫరా వాళ్ళతో సంబంధాలు ఏర్పడ్డాయని, శ్రీకాంత్ కు రాహుల్ తో పాటు పవన్ పరిచయం అయ్యాడని తెలిపారు. తూర్పు గోదావరిజిల్లాలోని డొంకరాయి నుండి ముంబైకి హైదరాబాద్ మీదుగా తీసుకెళ్లాలి అనేది ఒప్పందమని, ఓఆర్ఆర్ సమీపంలోని పసుమాముల వద్ద మరో కారులో తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
అయితే.. జహీరాబాద్ కు చెందిన నవాజుద్దీన్ షేక్, రాథోడ్, కిషన్‌ల కార్లకు మారుస్తున్న సందర్భంలో పట్టుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ ముఠాలో అమ్మాయిలు కూడా ఉన్నారని, సరఫరాదారులు కొత్త పద్ధతులలో ఈ గంజాయిని సరఫరా చేస్తున్నారని అందుకోసమే అమ్మాయిలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో అమ్మాయికి 25 వేలు కమీషన్ ఇస్తారని పేర్కొన్నారు.
