ప్రజలను లంచాల కోసం రాబందుల్లా పీక్కుని తింటున్నారు కొంత మంది అధికారులు. ఏ పని చేయాలన్నా చేయి తడవనిదే ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ లంచాలు వసూలు చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు. అయితే తాజాగా తనను లంచం కోసం వేధించిన ఇద్దరు ఉద్యోగాలను పట్టించాడు ఓ వ్యక్తి. సనత్ నగర్ విద్యుత్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఏసీబీ రైడ్స్ లో చిక్కారు. విద్యుత్ కార్యాలయంలో 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఏఈ అవినాష్, లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డి.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని మోతీనగర్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే తమకు రూ. 25 వేలు లంచంగా ఇస్తే తప్పా.. అనుమతులు మంజూరు చేయమని భాస్కర్ రెడ్డిని వేధించసాగారు. మూడు నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు బాధితుడు. కాగా ఈ నెల 18న భాస్కర్ రెడ్డి ఏఈ అవినాష్ కి 15 వేలు, వర్క్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డికి రూ. 3500 ఇచ్చాడు. లంచం ఇచ్చినా కూడా ఇద్దరు అధికారుల వేధింపులు ఆగలేదు. మరో రూ.10 వేలు ఇవ్వాలంటూ వేధింపులు కొనసాగించారు. దీంతో బాధితుడు భాస్కర్ రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఏఈ అవినాష్ , లైన్ ఇన్స్పెక్టర్ కృపానంద రెడ్డి కి 10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు