Lok Sabha Elections 2024: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ లో అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం ఈ సోదాలు ముగిసాయి. తనిఖీలో భాగంగా.. భారీగా డబ్బు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో రూ.6 కోట్ల 65 లక్షల నగదును సీజ్ చేశారు. ఈడబ్బుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సొమ్ము ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎన్నికల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కరీంనగర్ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌తో ప్రతిమ హోటల్స్‌కు సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read also: BJP vs Congress: కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోటీ.. పైచేయి ఎవరిదో..?
బీఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ హోటల్ లోనే జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. నగదు పట్టుబడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో హాజరు పరుస్తామని ఏసీపీ నరేందర్ తెలిపారు. ఎన్నికల వేళ పెద్దఎత్తున నగదు పట్టుబడడంతో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ దశలో సోదాలు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకోవడంతో కరీంనగర్ జిల్లాలో కలకలం రేగింది. లోక్‌సభ ఎన్నికల హవా మొదలైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు పూర్తి.. రౌస్ అవెన్యూ కోర్టుకు..!