హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు సూచిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త సమస్య మొదలవుతోంది. ఇప్పటి వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎలాంటి ఫీజులు వసూలు చేసే వారు కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ఫీజులు వసూలు చేయబోతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రవేశ పరీక్షల్లో ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే ఒక్కోప్రశ్నకు రూ. 500 ఫీజు వసూలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఎన్ని ప్రశ్నలకు ఛాలెంజ్ చేస్తే ప్రతి ప్రశ్నకు రూ. 500 చెల్లించాల్సిందే. విద్యార్థులకు నష్టం కలిగించే ఈ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ప్రాథమిక కీ ఛాలెంజ్ లో ఒక్కో ప్రశ్నకు రూ. 200 మాత్రమే వసూలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం రూ. 500 వసూలు చేయడం గమనార్హం.
అయితే ఇక్కడ విద్యార్థులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. ఇది రీఫండబుల్ ఫీజు అని అధికారులు తెలిపారు. అంటే విద్యార్థులు ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తే దాని సమాధానం తప్పు అని తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తం తిరిగి చెల్లిస్తారు. ఒక వేళ ఆన్సర్ కరెక్ట్ అయితే ఫీజు తిరిగి ఇవ్వరు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులు ధైర్యంగా ప్రాథమిక కీపై ఛాలెంజ్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తున్నాయి.