NTV Telugu Site icon

Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు ఆదివాసీలు

Indravelli Adilabad

Indravelli Adilabad

Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. నేడు ఇంద్రవెళ్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీతక్క హాజరుకానున్నరు. అక్కడ అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించనున్నారు. ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపం వద్దకు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివస్తున్నారు.

ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 43 ఏళ్లు. రైతు కూలీ సంగం ఆదివాసీల స్మారకార్థం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించింది. 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమైట్‌తో స్థూపం పేల్చివేయడంతో.. గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం 1987లో ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపాన్ని నిర్మించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలోని రికార్డుల ప్రకారం మండలంలోని ముట్నూర్ సమీపంలో 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. హక్కు పత్రాలతో పాటు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు. అమరవీరుల స్థూపాన్ని స్మారక పార్కుగా మార్చేందుకు రూ.97 లక్షలు కేటాయించారు.

Read also: Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..

అసలేం జరిగింది..?

హక్కుల కోసం ఉద్యమిస్తున్న అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గిరిపుత్రులు చనిపోయారు. రక్తపు మరకలు ఇప్పటికీ కొట్టుకుపోలేదు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. నాడు వ్యాపారులు, అధికారుల చేతుల్లో దోపిడికి గురైన గిరిజనం ఉద్యమానికి సిద్ధమైంది. దీంతో గిరిజన గ్రామంలో పోలీసుల బూట్ల చప్పుడు మొదలైంది. ఈనేపథ్యంలో గిరిజన సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. ఈ క్రమంలో అడవుల్లోని ఖాళీ భూముల్లో గిరిజనులు దున్నేందుకు పూనుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో పలు సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నాటి ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. అయినా గిరిజన సంఘాలు వెనక్కి తగ్గలేదు. రైతు సంఘాలు నిర్వహించిన సభకు ఆనాటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇదేమీ తెలియని ఆదివాసీలు సభకు భారీగా తరలివచ్చారు. సభను అడ్డుకునేందుకు నాటి పోలీసులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. వాహనాలను అడ్డుకునేందుకు రోడ్లను దిగ్బంధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఓ గిరిజన యువతితో ఓ జవాన్ అసభ్యంగా ప్రవర్తించాడు.

Read also: Beauty : మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చేస్తున్న మారుతీ..

ఆ యువతి తనపై అకారణంగా చేయి వేశాడని కొడవలితో వేటు వేసింది. అంతే జవాన్ కిందపడిపోయాడు. ఇంతలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తుపాకీలను ఆశ్రయించారు. తుపాకుల మోతతో ఇంద్రవెల్లి వణికిపోయింది. పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై చిందేసింది. వందలాది మంది గిరిజనులు పెద్దగా కేకలు వేస్తూ వాగుల వెంట పరుగులు తీశారు. ఈ ఒక్క ఘటనతో ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. గిరిజనులతో పాటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడవిబిడ్డల్లో దాగిన చీకట్లను తరిమికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలనే సంకల్పం ఓ గొప్ప ఉద్యమానికి దారితీసింది. ప్రజల ప్రాణాలు తీసింది. ఇంద్రవెల్లిలో ఓ ఆదివాసీ మహిళతో ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తించడం హింసకు దారి తీసింది. పోలీసులు తుపాకులు, బుల్లెట్లతో ఎదురుదాడి చేయగా, గిరిజనులు కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన విప్లవకారుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఏప్రిల్ 20వ తేదీ రాగానే చాలామంది ఈ సంఘటన గుర్తొచ్చి భయంతో వణికిపోతున్నారు.
Karnataka: ముస్లిం మహిళకు రైడ్ ఇవ్వడంతో.. యువకుడిపై దాడి.. చివరకి..