డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!

Xiaomi 18 Pro Max

Xiaomi 18 Pro Max

Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా భావిస్తున్న షియోమీ 18 సిరీస్‌పై అనేక లీకులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా షియోమీ 18 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన మరికొన్ని కీలక వివరాలు మరోసారి ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లోకి రానుంది.

లీక్ వివరాల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనుంది. నాలుగు వైపులా సమానంగా సన్నని బెజెల్స్, పెద్ద రౌండెడ్ కార్నర్స్‌తో ప్రీమియం డిజైన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల 2K OLED డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు కెమెరా విభాగం ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో LOFIC (Lateral Overflow Integration Capacitor) టెక్నాలజీతో కూడిన 200MP ప్రధాన కెమెరా అందించే అవకాశముంది. అంతేకాకుండా, మరో 200MP టెలిఫోటో కెమెరాను కూడా ఈ ఫోన్‌లో అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. ఈ టెలిఫోటో సెన్సార్ మాక్రో ఫోటోగ్రఫీకి మద్దతు ఇవ్వడంతో పాటు సుమారు 3X ఆప్టికల్ జూమ్‌ను అందించవచ్చని సమాచారం. కెమెరా ట్యూనింగ్ కోసం షియోమీ లైకాతో కలిసి పనిచేసే అవకాశముంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో 8,000mAh కంటే ఎక్కువ సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీ ఉండొచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. గత లీక్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో 8,500mAh బ్యాటరీని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న లీకుల ప్రకారం.. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో షియోమీ 18, షియోమీ 18 ప్రో మోడళ్లతో పాటు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.