Grok misuse controversy: ‘ఎక్స్’ (ట్విట్టర్) సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ కొందరు అసభ్య, అశ్లీల కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా లాంటి కొన్ని దేశాలు ‘గ్రోక్’పై తాత్కాలికంగా బ్యాన్ విధించాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ‘ఎక్స్’ సంస్థ తాజాగా దిద్దుబాటు చర్యలకు చేపట్టింది. ‘గ్రోక్’ సాయంతో వ్యక్తుల ఫొటోలను అసభ్యకరంగా మార్చే అవకాశాలను పూర్తిగా కట్టడి చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా నిజమైన వ్యక్తుల చిత్రాలను బికినీలు, లోదుస్తులు ధరించినట్లుగా ఎడిట్ చేసేలా వినియోగించడాన్ని నిలువరించేందుకు సాంకేతిక ఆక్షలు విధించినట్లు పేర్కొనింది.
కాగా, ఈ విధమైన మార్పులను చట్టవిరుద్ధంగా పరిగణించే దేశాల్లో ఆ ఫీచర్లను పూర్తిగా బ్లాక్ చేస్తున్నామని ఎక్స్ తెలిపింది. ఈ ఆంక్షలు పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ సహా అందరికీ వర్తిస్తాయని ఎక్స్ భద్రతా బృందం ప్రకటించింది. ఇక, ‘గ్రోక్’ వ్యవహారంపై భారత్‌లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని కేంద్ర సర్కార్ ఇటీవల ‘ఎక్స్’కు ఆదేశాలు ఇచ్చింది. దీనికి స్పందించిన సంస్థ, తమ ఖాతాలో ఉన్న 3,500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 ఖాతాలను డిలీట్ చేసినట్లు తెలియజేసింది. ఇక, తమ ప్లాట్‌ఫారంపై అసభ్యతకరమైన, అశ్లీలత ఎలాంటి తావు ఇవ్వబోమని, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ‘ఎక్స్’ కంపెనీ హామీ ఇచ్చినట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది.