NTV Telugu Site icon

TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ ప్రవేశం?

TikTok

TikTok

భారత సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ టిక్‌టాక్, షేరిట్ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2009 లోని 69వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు జూన్ 29, 2020 ఒక ప్రకటనలో తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నిషేధించిన 59 యాప్‌ల జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్, షేరిట్ వంటి చైనా యాప్‌లు అధికంగా ఉన్నాయి. కాగా.. భారత్​లో టిక్​టాక్, హలోల నిషేధం తర్వాత వాటి మాతృ సంస్థ బైట్​డాన్స్ భారీ నష్టాన్ని మూటగట్టుకోనున్నట్లు తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ కథనం ప్రకారం.. భారత్​లో నిషేధం తర్వాత బైట్​డాన్స్​ 6 బిలియన్​ డాలర్లు (రూ.45 వేల కోట్లు) నష్టపోయిందని సమాచారం.

READ MORE: PM Modi: దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

కాగా.. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చైనాకు వ్యతిరేకంగా కఠిన వైఖరి అవలంబించడంపై ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడారు. దీని తర్వాత, టిక్‌టాక్‌పై నిషేధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే యూఎస్ చట్టసభ సభ్యులు ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్ కాంగ్రెస్ మాత్రం గత సంవత్సరం నిషేధానికి అనుకూలంగా ఓటు వేసింది. ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ యూఎస్ సుప్రీం కోర్ట్‌లో టిక్‌టాక్ నిషేధాన్ని సవాలు చేసింది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. యూఎస్ జనాభాలో దాదాపు సగం మంది టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు దీనిని వాడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు టిక్‌టాక్ యాప్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ చేతుల్లో ఉంది. ఒక వేళ చైనాకు టిక్‌టాక్‌ను అమ్మితే.. భారత్‌లో తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ఎలాంటి ఆటంకాలు లేవు.. ఇరు దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

Show comments