NTV Telugu Site icon

SmartPhone: స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు.. సేఫ్‌జోన్‌లో ఉండాలంటే..

Smartphone

Smartphone

గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్‌ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్‌ జోన్‌ దాటిపోయి డేంజర్‌ జోన్‌లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్‌లైన్‌ దొంగలపాలు చేస్తున్నారని వాపోతున్నారు.

తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో ఇంటర్నెట్‌ ఎక్కువ వాడే దేశాల్లో ఇండియా రెండో స్థానానికి చేరింది. మన కన్నా ముందు చైనా మాత్రమే ఉంది. ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగిస్తున్నామంటే హ్యాకింగ్‌, సమాచార చోరీ అధికంగా జరిగే ప్రమాదం ఉందని అర్థం. చీప్‌గా వస్తున్నాయనే ఉద్దేశంతో మనోళ్లు ఎక్కువగా చైనా స్మార్ట్‌ ఫోన్లు కొంటున్నారు. కానీ అవి అంత సెక్యూర్‌ కాదు. దీనికితోడు మన దేశంలో సైబర్‌ సెక్యూరిటీ చట్టంలేదు. దీంతో మోసాలకు పాల్పడటం హ్యాకర్లకు ఈజీ అయిపోయింది. పైగా ఇంటర్నెట్‌ యూజర్లు అలర్ట్‌గా ఉండట్లేదు.

ఈ కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు విలువైన పర్సనల్‌ డేటా పరంగా, డబ్బుల పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మనం ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పడకూడదంటే స్మార్ట్‌గా వ్యవహరించాలి. స్మార్ట్‌ఫోన్‌ ఎప్పటికప్పుడు సూచించే సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్డేట్‌ని ఫాలో అవ్వాలి. లేకపోతే హ్యాకర్లు మన ప్రైవేట్‌ డేటాలోకి చొరబడే వీలుంది. కాబట్టి అప్డేట్‌ అలర్ట్‌ వచ్చినప్పుడు ప్రొసీడ్‌ అవ్వాలి తప్ప స్నూజ్‌ బటన్‌ నొక్కకూడదు. అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

గూగుల్ ప్లే స్లోర్‌లో, యాపిల్‌ ప్లే స్టోర్‌లో ఉండే చాలా యాప్‌లు మన డేటాకి అత్యంత ప్రమాదకరం. యాప్‌ డెవలపర్‌ని, ఇతరత్రా వివరాలను, రివ్యూలను పరిశీలించాకే యాక్సెస్‌కి పర్మిషన్‌ ఇవ్వాలి. వాడని యాప్‌లకు పర్మిషన్లను ఎప్పుడూ స్విచ్చాఫ్‌ చేసి ఉంచటం బెటర్‌. ఇంటర్నెట్‌ వాడటం ద్వారా మనం ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందుతాం. అందులో అనుమానమే లేదు. అయితే అదే సమయంలో కష్టాలను కోరితెచ్చుకోవద్దు. నకిలీ వెబ్‌సైట్ల బారినపడొద్దు. అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయొద్దు.

హెచ్‌టీటీపీ ప్రొటోకాల్‌ ఉన్న సైట్లనే చూడటం మంచిది. సాధ్యమైనంత వరకు ఆటోమేటిక్‌ అప్డేట్లను బ్లాక్‌ చేయటం ఉత్తమం. అంతేకాదు. స్ట్రాంగ్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేసుకోవాలి. ఓపెన్‌ వైఫైని అస్సలు వాడొద్దు. టు-ఫ్యాక్టర్‌-అథెంటికేషన్‌ సెటప్‌ చేసుకోవాలి. ఎక్కువ లాగిన్‌ ప్రయత్నాలు ఫలించనప్పుడు ఆ హిస్టరీని డిలీట్‌ చేసే ఆప్షన్‌ని ముందే సెలెక్ట్‌ చేసుకోవాలి. అవాస్ట్, మెకాఫీ వంటి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను మన డివైజ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.