iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!

Motorola Razr Flex

Motorola Razr Flex

Motorola Razr Flex: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు మోటరోలా రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాదిలో Motorola Razr Flex పేరుతో వైడ్ స్క్రీన్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఆస్ట్రేలియా సపోర్ట్ టెస్టింగ్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ పేరు కనిపించడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే మోటరోలా ఇప్పటివరకు అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. మోటరోలా వెబ్‌సైట్‌లోని సపోర్ట్ పేజీలో ‘Motorola Razr Flex 2027’ అనే పేరు కనిపించింది. అయితే అందులో పేర్కొన్న సెక్యూరిటీ వివరాలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేజీలో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్, ఆగస్టు 2029 వరకు సపోర్ట్ వంటి వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా ‘టెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్’ అనే వివరాలు కూడా ఉన్నాయి.

నిజానికి సెప్టెంబర్ 9, 2026న మోటరోలా తన అధికారిక X ఖాతాలో ఓ ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో చిన్న పరిమాణంలో, వెడల్పాటి డిస్‌ప్లేతో ఉండే ఫోల్డబుల్ ఫోన్ సిల్హౌట్‌ను చూపించింది. చివర్లో ‘Our Next Move’ అనే ట్యాగ్‌లైన్‌ను ఉంచింది. అయితే ఆ సమయంలో ఫోన్ పేరును లేదా లాంచ్ తేదీని వెల్లడించలేదు. లీకుల ప్రకారం.. Motorola Razr Flexలో 6.92 అంగుళాల OLED మెయిన్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. బయటివైపు 4.97 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. వెనుక భాగంలో 50 MP చొప్పున రెండు కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 12GB RAM, 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ప్రస్తావన కూడా కనిపించినట్లు సమాచారం. అయితే ఈ వివరాలేవీ మోటరోలా అధికారికంగా ధృవీకరించలేదు. ధర విషయంలోనూ ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. యూరప్‌కు చెందిన ఓ రిటైలర్ వెబ్‌సైట్‌లో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,510.90 యూరోలుగా ఉంది.