NTV Telugu Site icon

Internet: రాజ్యమేలుతున్న పోర్న్‌ వెబ్‌సైట్లు

Net

Net

పోర్న్ వెబ్ సైట్లు ఇప్పుడు రాజ్య‌మేలుతున్నాయన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఒక‌ప్పుడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు వెళ్లేవారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూసేవారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్‌కేఫ్‌లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అది ఇత‌రుల‌కు తెలిస్తే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్‌ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్‌ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్ లా వ‌చ్చింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారారు.. ఇంకా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు అదుపుతప్పి జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నారు.

పోర్న్‌ వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్‌ చేయిస్తోంది. తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్‌ అయిన వెబ్‌సైట్‌ పేరును పోలిన లేదా దాని చివర అంకెల‌తో వాటిని మ‌ళ్లీ ఏర్పాటు చేసి మరో సైట్‌ ప్రారంభించి బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛగా ఇంటర్నెట్‌లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్‌సైట్లను హోస్ట్‌ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే అని స‌మాచారం. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచ్చిన వెబ్‌సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదన్న‌మాట‌. ఇక్కడి చట్టాలు అక్కడి వారికి పట్టకపోవడంతో నిర్వాహకుల వివరాలు కోరుతూ లేఖలు రాసినా, ఈ– మెయిల్స్‌ పంపినా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఇది పోర్న్‌ వెబ్‌సైట్స్‌ నిర్వాహకులకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు.

ఇంటర్నెట్‌తో పాటు సోషల్‌ మీడియాలో సాగుతున్న చైల్డ్‌ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డన్ర్‌ పని చేస్తోంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్‌నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్‌ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్‌ ఇంజిన్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్‌ మీడియా ఉన్న సీఎస్‌ఏఎంలను గుర్తించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం చైల్డ్‌ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది.

ఆయా సైబర్‌ స్పేస్, సోషల్‌ మీడియాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్‌ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్‌ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్‌ చేసినా, అప్‌లోడ్‌ చేసినా.. తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్‌సైట్స్‌ను ఎవరు సెర్చ్‌ చేసినా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏదిఏమైనా ఇటువంటి పోర్న్‌ వెబ్‌సైట్లు మూలంగా యువ‌త పెడ‌దారిప‌ట్టి త‌న జీవితాల‌ను జైలుపాలు చేసుకుంటోంది. వారితో పాటు చిన్న పిల్ల‌లు అని కూడా చూడ‌కుండా చిన్నారులపై, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డే చేస్తూ జీవితాల‌ను బ‌లితీసుకుంటోంది. ఇలాంటి పోర్న్‌ వెబ్‌సైట్లు పై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుని బంగారు భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంటున్న యువ‌త‌ను కాపాడాల‌ని కోరుతున్నారు. లేకుండా అశ్లీలతకు అలవాటు పడి మనిషి మృగంగా మారి త‌ను ఏంచేస్తున్నాడో కూడా తెలియ‌ని అంధ‌కారంలో జీవించే ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఆ ప్ర‌భావం ఢిల్లీ బ‌స్సులో జ‌రిగిన ఉందంతం, హైదారాబాద్ లో జ‌రిగిన అరాచ‌కం, ఇంకా ఎన్నో మ‌న‌కు తెలిసి కొన్నైతే మ‌న‌కు తెలియ‌నివి కొండంతగా ఉండిపోతున్నాయి.

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?