14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!

Huawei Band 11 Series

Huawei Band 11 Series

HUAWEI Band 11 Series: హువావే (HUAWEI) నుండి కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ సిరీస్ HUAWEI Band 11 సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో HUAWEI Band 11, HUAWEI Band 11 Metal, HUAWEI Band 11 Pro మోడళ్లు ఉన్నాయి. మంచి డిజైన్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో ఈ స్మార్ట్ బ్యాండ్లు వినియోగదారులను నచ్చేలా రూపొందించబడ్డాయి.

AMOLED డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్:

HUAWEI Band 11 సిరీస్‌లో 1.62 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. Band 11 మోడల్‌లో గరిష్టంగా 1,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండగా.. Band 11 Proలో 2,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లభిస్తుంది. కేవలం 8.99 మి.మీ. మందంతో, 17 గ్రాముల బరువుతో ఈ బ్యాండ్లు తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రత్యేకంగా HUAWEI Band 11 Metal, Band 11 Pro మోడళ్లలో ప్రీమియం అల్యూమినియం అల్లాయ్ బాడీని ఉపయోగించారు. వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా 100కు పైగా వాచ్ ఫేస్‌లను ఎంచుకోవచ్చు. అలాగే Always-On డిస్ప్లే, కస్టమైజ్ చేసుకునే విడ్జెట్ల సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి:

హెల్త్ మరియు వెల్‌నెస్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సిరీస్‌లో మెరుగైన Sleep Tracking వ్యవస్థను అందించారు. హృదయ స్పందన వేరియబిలిటీ (HRV) ఆధారంగా నిద్ర నాణ్యత, శరీర రికవరీ స్థాయిని విశ్లేషిస్తుంది. అంతేకాకుండా నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, SpO₂ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, స్లీప్ బ్రీతింగ్ అవేర్‌నెస్, వ్యక్తిగతీకరించిన నిద్ర సూచనలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎమోషనల్ వెల్‌బీయింగ్ మేనేజ్‌మెంట్, గైడెడ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, పల్స్ వేవ్ అరిథ్మియా విశ్లేషణ వంటి హృదయ ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్లు కూడా ఇందులో పొందుపరిచారు. దీంతో వినియోగదారులు తమ ఆరోగ్య పరిస్థితిని మరింత సమగ్రంగా ట్రాక్ చేసుకోవచ్చు.

100కు పైగా వర్కౌట్ మోడ్‌లు:

ఫిట్‌నెస్ ప్రియుల కోసం HUAWEI Band 11 సిరీస్‌లో 100కు పైగా వర్కౌట్ మోడ్‌లను అందించారు. ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకింగ్, పనితీరు విశ్లేషణ వంటి ఫీచర్లు వ్యాయామాన్ని మరింత సమర్థవంతంగా చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా HUAWEI Band 11 Proలో స్వతంత్ర GNSS పొజిషనింగ్ సపోర్ట్ ఉండటంతో రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్‌డోర్ కార్యకలాపాల సమయంలో ఖచ్చితమైన రూట్ ట్రాకింగ్ పొందవచ్చు.

14 రోజుల బ్యాటరీ బ్యాకప్:

బ్యాటరీ పరంగా కూడా ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. సాధారణ వినియోగంలో 8 రోజుల వరకు పనిచేస్తుంది. అలాగే మాగ్నెటిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ధరలు:

భారత మార్కెట్లో HUAWEI Band 11 సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే..

* HUAWEI Band 11 – రూ.3,999
* HUAWEI Band 11 Metal – రూ.4,799
* HUAWEI Band 11 Pro – రూ.5,599.