ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!

Chatgpt

Chatgpt

ChatGPT Ads: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఆఫీస్ పనుల నుంచి పిల్లల చదువులు, రోజువారీ అవసరాల వరకు చాలామంది AI టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ChatGPTకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. అయితే ఇప్పటివరకు ఉచితంగా ChatGPT ఉపయోగిస్తున్న వారికి త్వరలో ఓ కీలక మార్పు కనిపించొచ్చని సమాచారం. ChatGPT ఫ్రీ వెర్షన్‌లో యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు Sponsored Ads కూడా కనిపించే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ChatGPT ఎప్పటిలాగే సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం కింద ఒక కంపెనీ, ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన ప్రకటన కనిపించవచ్చు. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో పాటు Ads ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను OpenAI పరిశీలిస్తోందట. దీంతో భవిష్యత్తులో ఫ్రీ యూజర్లకు ChatGPT వినియోగ అనుభవంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సహజంగానే యాడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఈ యాడ్స్ చాలా వరకు ఒక తలనొప్పిగా భావించే వాళ్లకు ఇప్పటి వరకు వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయిన ChatGPT లో రాబోయే రోజుల్లో యాడ్స్ రాబోతున్నాయ్ అని తెలియడంతో ఉసూరుమంటున్నారు

అందరికీ Ads కనిపిస్తాయా?

ChatGPT యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో OpenAI Ads విషయంలో తన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా ఉచితంగా ChatGPT ఉపయోగించే వారికి ఈ ప్రకటనలు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి ప్రశ్నకు కచ్చితంగా Ad కనిపిస్తుందని మాత్రం గ్యారెంటీ లేదట. ఏ యూజర్‌కు, ఎప్పుడు, ఎలాంటి ప్రకటన చూపించాలనేది ప్లాట్‌ఫామ్‌లోని Ad మోడల్, సిస్టమ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఉదాహరణకు మీరు ChatGPTను ఏదైనా ప్రొడక్ట్ గురించి అడిగారని అనుకుందాం. ChatGPT ముందుగా మీ ప్రశ్నకు సాధారణ సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం కింద సంబంధిత కంపెనీ లేదా ఆ ప్రొడక్ట్‌కు చెందిన చిన్న Sponsored Ad కనిపించవచ్చు. ఆ ప్రకటనలోని ప్రొడక్ట్ మీకు నచ్చితే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం లేదా కొనుగోలు చేయడం వంటి ఆప్షన్లు ఉండొచ్చు. దీంతో కంపెనీలకు తమ ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేయడానికి మరో కొత్త ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తుంది.

కంపెనీలు ChatGPTలో Ads ఎలా ఇస్తాయంటే..
కంపెనీలు తమ ప్రకటనలను ChatGPTలో చూపించేందుకు OpenAIకి చెందిన Ads ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని ద్వారా తమ ప్రొడక్ట్స్ లేదా సర్వీసులను సంబంధిత యూజర్లకు చేరువ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీలకు తమ యాడ్స్‌ను ChatGPTలో ప్లే చేయడానికి స్టార్టింగ్ కాస్ట్ రోజుకు సుమారు రూ.725 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ధరలు, ప్రకటనల లభ్యత, ఇతర నిబంధనలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో ChatGPTలో Ads రానున్నాయన్న వార్తల నేపథ్యంలో యూజర్లలో ప్రధానంగా ఒక ప్రశ్న తలెత్తుంది. ‘మన వ్యక్తిగత చాట్స్‌ను కంపెనీలు చదవగలవా?’ అనే సందేహం చాలామందిలో ఉంది. OpenAI ప్రకారం, అడ్వర్టైజర్లు యూజర్ల వ్యక్తిగత ChatGPT సంభాషణలను నేరుగా చదవలేరు. అంటే మీరు ChatGPTలో ఏం అడిగారు, ఎలాంటి సమాచారం పంచుకున్నారు, ఏ అంశంపై మాట్లాడారు వంటి వ్యక్తిగత సంభాషణలను అడ్వర్టైజర్లకు అందుబాటులో ఉంచబోమని సంస్థ స్పష్టంగా చెబుతోంది. Ads ను సరైన యూజర్లకు చూపించేందుకు అవసరమైన కొంత సమాచారాన్ని సిస్టమ్ ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత చాట్స్‌ను మాత్రం అడ్వర్టైజర్లతో నేరుగా షేర్ చేయకుండా ప్రత్యేకంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు OpenAI స్పష్టం చేస్తోంది. అంటే.. ఫ్రీగా ChatGPT వాడుతున్నప్పుడు ఇకపై సమాధానాలతో పాటు ప్రకటనలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత చాట్స్‌ను అడ్వర్టైజర్లు చదవలేరన్నది OpenAI చెబుతున్న కీలక విషయం.