Site icon NTV Telugu

Apple iPhone Journey: యాపిల్ ఐఫోన్ ప్రస్థానం.. 2007 నుంచి 2025 వరకు విడుదలైన మోడల్స్ ఇవే!

Apple Iphone Journey

Apple Iphone Journey

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ రంగాన్ని పూర్తిగా మార్చేసిన బ్రాండ్ ‘యాపిల్’. 2007లో తొలి ఐఫోన్ విడుదలైనప్పటి నుంచి టెక్నాలజీ, డిజైన్, యూజర్ అనుభవంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది కొత్త ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలతో ఐఫోన్ సిరీస్‌లు ముందుకు సాగుతున్నాయి. 2007లో స్టీవ్ జాబ్స్ పరిచయం చేసిన తొలి ఐఫోన్ టచ్‌స్క్రీన్ ఫోన్లకు కొత్త దారులు తెరిచింది. ఆ తర్వాత iPhone 3G (2008), iPhone 3GS (2009) మోడళ్లతో ఇంటర్నెట్ వేగం, పనితీరు మెరుగయ్యాయి. 2010లో వచ్చిన iPhone 4 రెటినా డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్‌తో అప్పట్లోనే ఐకాన్‌గా మారింది.

2011లో iPhone 4 CDMA, iPhone 4S విడుదలయ్యాయి. 4Sలో పరిచయమైన వాయిస్ అసిస్టెంట్ ‘సిరి’ ఐఫోన్‌కు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. 2012లో iPhone 5 పెద్ద స్క్రీన్‌తో వచ్చింది. 2013లో కలర్ డిజైన్‌తో iPhone 5C, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో iPhone 5S విడుదలై టెక్నాలజీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. 2014లో iPhone 6, iPhone 6 Plusతో బిగ్ డిస్‌ప్లేను యాపిల్ కూడా తీసుకొచ్చింది. 2015లో వచ్చిన iPhone 6S, 6S Plusలో 3D టచ్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2016లో కాంపాక్ట్ అభిమానుల కోసం iPhone SE (1st Gen), అలాగే iPhone 7, iPhone 7 Plus విడుదలయ్యాయి. హెడ్‌ఫోన్ జాక్ తొలగింపు అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

2017లో iPhone 8, 8 Plusతో పాటు పూర్తి స్క్రీన్ డిజైన్, ఫేస్ ఐడీతో వచ్చిన iPhone X టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2018లో iPhone XR, iPhone XS, iPhone XS Max మోడళ్లు విడుదలై వివిధ ధరల శ్రేణుల్లో ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. 2019లో iPhone 11, 11 Pro, 11 Pro Max మోడళ్లతో కెమెరా సామర్థ్యం మరింత మెరుగైంది. 2020లో iPhone SE (2nd Gen)తో పాటు 5Gని యాపిల్ పరిచయం చేసింది. అదే ఏడాది iPhone 12, 12 mini, 12 Pro, 12 Pro Max మోడళ్లు విడుదలయ్యాయి. 2021లో iPhone 13 సిరీస్ (13, 13 mini, 13 Pro, 13 Pro Max) మెరుగైన బ్యాటరీ లైఫ్, కెమెరాతో వచ్చింది. 2022లో iPhone SE (3rd Gen)తో పాటు iPhone 14, 14 Plus, 14 Pro, 14 Pro Max విడుదలయ్యాయి. ప్రో మోడళ్లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Also Read: Bhogi 2026: భోగి మంటలు వేసి పండుగ చేసుకుంటున్న జనం.. స్టెప్పులేసిన అంబటి!

2023లో iPhone 15 సిరీస్ (15, 15 Plus, 15 Pro, 15 Pro Max)లో యూఎస్‌బీ-సీ పోర్ట్ పరిచయం చేయడం చరిత్రాత్మక మార్పుగా నిలిచింది. 2024లో విడుదలైన iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max మోడళ్లు మరింత శక్తివంతమైన ఏఐ ఫీచర్లు, కెమెరా అప్‌గ్రేడ్స్‌తో ముందుకు వచ్చాయి. 2025లో iPhone 16e, iPhone 17, iPhone Air, iPhone 17 Pro వంటి కొత్త పేర్లతో ఆపిల్ తన లైనప్‌ను విస్తరించింది. ప్రత్యేకంగా ‘ఎయిర్’ బ్రాండింగ్‌తో అల్ట్రా-స్లిమ్ డిజైన్‌పై ఆసక్తి పెరిగింది. 2007లో మొదలైన ఐఫోన్ ప్రయాణం నేటికీ యాపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలబెట్టింది. సరికొత్త టెక్నాలజీతో ప్రతి మోడల్ ఉన్నత స్థాయికి చేరుకుంటూనే ఉంది. భవిష్యత్తులో ఐఫోన్ ఇంకెన్ని కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తుందో చూడాలి.

Exit mobile version