సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు..
వ్యర్ధాల సమర్ధ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతీరోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.