హైదరాబాద్ లో పబ్బులు గబ్బు రేపుతున్నాయి. భారీ శబ్దాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. చాలా పబ్బులు అనుమతి లేకుండానే నడుస్తున్నాయి. పబ్బుకు వచ్చినవాళ్లు చేసే రోత పనులకు సామాన్యులు హడలిపోతున్న పరిస్థితి. పబ్బుల్ని నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 తర్వాత నిర్దేశిత పరిమితి కంటే శబ్దాలు వినిపించడానికి వీల్లేదని పబ్బులకు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏ చట్టం ప్రకారం పబ్బులకు అనుమతి ఇచ్చారో చెప్పాలని పోలీసుల్ని నివేదిక కోరింది. మరి ఇప్పటికైనా పబ్బులు పద్ధతి మార్చుకుంటాయా..? హైకోర్టు ఆదేశాల్ని పాటిస్తాయా..? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?
హైదరాబాద్ పబ్బుల్ని కట్టడి చేసే దిశగా హైకోర్టు ముందడుగు వేసింది. పబ్ లు నిబంధనలు పాటించాలని ఆదేశించింది. పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్ పబ్ లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి పది గంటలు దాటితే పబ్స్ లో ఎలాంటి సౌండ్ పెట్టవద్దని ఆదేశించింది. రాత్రి పది గంటల నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకూ ఎటువంటి సౌండ్స్ పెట్టరాదని తెలిపింది. వాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని తెలిపింది. అంతే తప్ప రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వీలు లేదని పేర్కొంది.
అసలు ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చారో చెప్పాలని కోరింది. దీనిపై ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పబ్ లలో రాత్రి వేళ కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదని పేర్కొంది. టాట్ పబ్ విషయంపై హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై జరిగిన విచారణలో ఈ ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
సిటీలో పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అయితే ఆ ఘటన తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన పబ్స్ నిర్వాహకులు.. మళ్లీ యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొందరైతే బార్ అండ్ రెస్టారెంట్లను కూడా పబ్స్‌గా మార్చేస్తూ యువతుల అర్ధనగ్న నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న ఈ తరహా ఘటనలు హైదరాబాద్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.
అర్ధరాత్రిళ్లు డీజే సౌండ్స్‌తో అమ్మాయిల అశ్లీల నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. గంటగంటకు రేట్లు పెంచుతూ లక్షల్లో దండుకుంటారు. విదేశీ యువతులతో క్యాబరేలు ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి అందినకాడికి దండుకుంటారు. పైకి కాఫీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతో చలామణి అవుతూ నిబంధనలకు విరుద్దంగా పబ్స్ నడుపుతున్న వ్యవహారాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.
పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతుంది. డ్రగ్స్‌తో పాటు అశ్లీల నృత్యాలు ఇక్కడ కామన్. పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గామారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు.. పబ్స్, రిసార్ట్స్‌లో వారి చేత అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు దండుకుంటున్నారు.
అయితే పబ్స్ నిర్వాహకులు తీసుకువస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఇక విదేశీ యువతుల నృత్యాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు గంటకు 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు.. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇక యువతుల అశ్లీల నృత్యాలతో పాటు పబ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు కావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్స్ వ్యవహారాల్లో కొందరు పోలీసుల తీరుపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు చూసీచూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే పబ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.
కమర్షియల్ ఏరియాలకే పరిమితం కావాల్సిన పబ్ లు.. ఇళ్ల మధ్యకు వచ్చేశాయి. బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. చాలా మంది రెస్టారెంట్ లైసెన్స్ తో బార్లు నడుపుతున్నా అడిగేవాడు లేడు. విశ్వనగరంగా వెలుగుతున్న హైదరాబాద్ కు పబ్ కల్చర్.. అతి పెద్ద సమస్యగా మారుతోంది. పబ్ అంటే రిలాక్సేషన్. పబ్ అంటే ఎంజాయ్ మెంట్. పబ్ అంటే రిక్రియేషన్ సెంటర్. ఇలా పబ్బుకు ఎందుకు వెళ్తున్నారని అడిగితే.. ఎవరి సమాధానాలు వారికి ఉన్నాయి. కానీ పబ్ ల పేరుతో లోపల జరిగే తంతుకు.. వీళ్లు చెప్పే సమాధానాలకు పొంతన కుదరడం లేదు.
ముందు ఒత్తిడి తగ్గించుకోవడానికో, ఎంజాయ్ మెంట్ కోసమో పబ్బులకు వెళతారు. క్రమంగా మద్యానికి, డ్రగ్స్‌కీ అలవాటు పడతారు. ఆ తర్వాత డ్రగ్స్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీయడానికి, డ్రగ్స్ కోసం హత్యలు కూడా చేయడానికి పరోక్షంగా పబ్బులే కారణమౌతున్నాయి. ఎలాంటి అలావాట్లు లేనివాళ్లు కూడా వ్యసపరులుగా మారడానికి పబ్బులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పబ్బుల్లో జరిగే విచ్చలవిడి మద్యం సరఫరా.. మందుబాబుల సంఖ్యను విపరీతంగా పెంచుతోంది. పబ్బుల్లో పరిమితికి మించిన తాగినవాళ్లను డ్రైవర్ ను ఇచ్చి పంపించాలని పోలీస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ ఏ పబ్బూ ఈ నిబంధన పాటించడం లేదు. కేవలం ఈ ఒక్క రూల్ పాటించకపోవడం వల్లే.. హైదరాబాద్ లో దాదాపు ప్రతిరోజూ ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం జరుగుతోంది. వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నా.. పబ్ లకు పట్టడం లేదు.
హైదరాబాద్‌లోని పబ్బుల్లో నిబంధనలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తెల్లవార్లూ డీజే మోతలు, అశ్లీల నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. సంపన్నుల పిల్లలకు ఎర వేస్తున్నారు. చదువుకునే వయసులోనే, మైనారిటీ తీరకముందే అనైతిక చర్యలకు ఉసిగొల్పుతున్నారు.
పబ్బులపై హైకోర్టు ఆదేశాల తరుణంలో.. అసలు పబ్బుల నిబంధనలేంటి? అవి అమలవుతున్నాయా? పోలీసులు పర్యవేక్షిస్తున్నారా? అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్ల క్రితం అమ్నీషియా పబ్‌కు వచ్చిన అమ్మాయిని ట్రాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. అనైతికంగా ప్రవర్తించిన వారిలో ప్రజా ప్రతినిధుల పిల్లలు కూడా ఉండటం దుమారానికి దారితీసింది. ఈ ఘటన విషయంలో దర్యాప్తు కూడా సరిగా జరగలేదని, పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయనే విమర్శలొచ్చాయి. అమ్నీషియా పబ్ ఘటన తర్వాత కద్ది రోజులు పబ్ లు నిబంధనలు పాటించినట్టు నటించాయి. 21ఏళ్లు దాటిన వారికే పబ్ లలో ప్రవేశం అంటూ పలు పబ్ ల ముందు బోర్డులు వెలిశాయి. 21ఏళ్లలోపు వారు ఒక్కరు ఉన్నా..గ్రూపు..కుటుంబ పార్టీలకు పబ్ లు నో చెప్పాయి. కానీ ఇది మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అమ్నీషియా పబ్ వ్యవహారం మరుగున పడగానే.. మళ్లీ పబ్బులు విశ్వరూపం చూపిస్తున్నాయి.
హైదరాబాదులో పబ్ కల్చర్ గబ్బు లేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. మద్యానికి, డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి పబ్బులకు వెళ్తున్నామని చెప్తున్న యువతను నిబంధనలు పాటించని పబ్ యాజమాన్యం ఆర్థిక వనరుగా మార్చుకుంటోంది. ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. జీహెచ్ఎంసీ అధికారులు పబ్ లు సీజ్ చేసినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు.
పబ్ లు ఎలాంటి ప్రాంతాల్లో నడపాలనే విషయంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. స్కూళ్లు, ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి పబ్ లకు అనుమతి లేదు. కనీసం ఔట్ లెట్లు పెట్టుకోవడానికి కూడా వీల్లేదు. అలాగే ఇళ్ల మధ్య కూడా పబ్ లకు అనుమతి లేదు. కానీ లంచాలు తీసుకుంటున్న అధికారులు కళ్లుమూసుకుని ఇస్తున్న అనుమతులు.. సామాన్యుల కొంప ముంచుతున్నాయి. రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేని దైన్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రముఖులు ఉండే చోటే.. పబ్ ల అరాచకానికి అంతు లేకుండా పోతోంది. ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలు విస్తరించిన మాదాపూర్, గచ్చిబౌలిలో పబ్ కల్చర్ విష సంస్కృతిగా మారుతోంది. నిబంధనల ప్రకారం రాత్రి 12 గంటలకే పబ్ లు మూసేయాలి. కానీ చాలా పబ్ లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి. మరికొన్ని పబ్ లయితే తెల్లార్లూ జాగారం చేస్తున్నాయి. తెల్లవారుజాము వరకు పబ్బుల్లో తాగి ఊగుతున్న యువత.. తర్వాత రోడ్ల మీదకు వచ్చి చేసే న్యూసెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటోంది.
పబ్ ల పేరుతో లోపల జరుగుతున్న యవ్వారమంతా బూతు సినిమా కంటే ఎక్కువే. యువతులతో గబ్బు డాన్సులు, గంజాయి సరఫరా, రేవ్ పార్టీలు.. ఇలా ఒకటేమిటి.. సకల వికృత చేష్టలకు నిలయంగా మారుతున్నాయి పబ్బులు. యువత చెడిపోవడానికి పబ్బులకు మించిన సాధనాలు అక్కర్లేదన్నట్టుగా దిగజారిపోయింది పరిస్థితి. మరోవైపు పబ్బులకు వెళ్లకపోతే.. కల్చర్ లేనట్టే అనే సంస్కృతి కూడా బాగా పెరిగింది. దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అందరూ పబ్ ల దారి పడుతున్నారు. మొదట్లో వీకెండ్లో పబ్బులకు వెళ్లడానికి అలవాటుపడుతున్నారు. ఆ తర్వాత ప్రతిరోజూ పబ్ కు వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. పబ్ లకు ఎడిక్ట్ అవుతున్న యూత్.. లేని బలహీనతల్ని కొని తెచ్చుకుంటోంది. సోఫిస్టిక్టెడ్ కల్చర్ పేరుతో వెలుస్తున్న పబ్ ల కోసం యువతను పణంగా పెడతారా.. అభివృద్ధి అంటే పబ్బులేనా అనే ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి.
పబ్ ల పేరుతో జరుగుతున్న న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్లు, పబ్ ల దగ్గర యువత తాగి ఊగిన మత్తులో చేసే అల్లరి భరించటం.. స్థానికులకు సమస్యగా మారుతోంది. చిన్నారులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. గుండెజబ్బులు ఉన్నవాళ్లకు ఈ సౌండ్లు ప్రమాదకరంగా మారుతున్నాయని, భరించలేని శబ్దాలతో రాత్రి నిద్ర పోవడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు. ఇక పబ్బుల నుంచి బయటికొచ్చాక యువత రోడ్ల మీదే నానా రభస చేస్తున్నారు. మెయిన్ రోడ్లలో వాహనదారుల మీద.. కాలనీల్లో అయితే స్థానికులపైనా ప్రతాపం చూపిస్తున్నారు. తాగేసిన బీర్ బాటిళ్లు ఇళ్లపైకి విసిరేయడం, ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగే సంస్కృతి బాగా పెరిగిపోయింది. కొన్నిచోట్ల అడ్డొచ్చిన పోలీసుల్ని కూడా చితక్కొడుతున్నారు.
హైదరాబాద్ సిటీలో ఇప్పుడు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవాళ్లు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవాళ్ల కంటే తాగుబోతు డ్రైవర్లే ఎక్కువ ప్రమాదకరంగా మారారు. అందుకే సిటీ పోలీసులు వీకెండ్స్‌లో పబ్ బాట పడుతున్న కుర్రాళ్ల కోసం స్పెషల్ డ్రైవ్‌లు పెడుతున్నారు. కొన్నిసార్లు పబ్‌లుండే వీధి చివర్లలోనే డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. పోలీసులు పుణ్యమా అని తాగి వాహనాలు నడిపేవారి జోరు తగ్గినా… వీకెండ్స్‌లో మాత్రం ఆ భయం అలానే ఉంది. తాగి కార్లు నడపొద్దు.. మీ ప్రాణాలతో పాటు వేరొకరి ప్రాణాలు రిస్క్‌లో పెట్టొద్దు అని చెబితే వింటారా. పబ్‌లో తాగి, తూలాక ఆ మత్తు నెత్తికెక్కుతుంది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాక కూడా అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. బ్రీత్ అనలైజర్‌లో గాలి పీల్చమన్న పోలీసులతో పరాచకాలు ఆడతారు. గాలి వదలమంటే పీల్చే కంత్రీగాళ్లు ఉన్నారు. తాగారని ప్రూవ్ అయ్యాక… మీడియా కెమరాలకు కూడా దొరికాక… వీళ్ల వీరంగం చూడాలి. తమన అన్యాయంగా కేసులో బుక్ చేశారన్న స్థాయిలో రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపిస్తారు.
ఒకప్పుడు ప్రధాన రహదారులకు మాత్రమే పరిమితమైన పబ్బులు.. ఇప్పుడు కాలనీలకు వచ్చేశాయి. ఇళ్ల మధ్యలోనే పబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు వీళ్లకు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు.. ఎలా ఇస్తున్నారనేది దేవుడికే తెలియాలి. జనావాసాల మధ్య నడుస్తున్న పబ్ లు.. సమాజం మొత్తాన్నీ చెడగొడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల కిటికీల నుంచి చూసినా పబ్బులు క్లియర్ గా కనిపించేలా ఉన్నాయి. ఇళ్ల లోపల నుంచి పబ్బులకు వెళ్లి వచ్చే యువతను చూస్తున్న పిల్లలుకూడా చెడిపోతున్నారు. పబ్బుల్లో ఏముందో చూసి తీరాలనే కుతూహలంతో చాలా మంది మైనర్లు.. అర్థరాత్రి పెద్దవాళ్లకు తెలియకుండా పబ్బుల్లో దూరిపోతున్నారు. రెగ్యులర్ కస్టమర్లు పబ్బులు ఎక్కడ పెట్టినా వస్తారు. కానీ కొత్త కస్టమర్లు కావాలంటే.. కాలనీలకు వెళ్లాల్సిందే అనే అనధికార రూల్ అమలు చేస్తున్నాయి పబ్బు యాజమాన్యాలు. దీనికి లంచావతారాల అండ తోడవడంతో.. విచ్చలవడితనానికి అడ్డు లేకుండా పోతోంది. మరి హైకోర్టు ఆదేశాల తర్వాతైనా పరిస్థితులు మారతాయా.. లేదా అనేది చూడాల్సి ఉంది.
రోజు రోజు పబ్బు గబ్బు పెరిగిపోతోంది. పబ్బులతో యువత పెడదారి పడుతోంది. పరిసరాల్లో ఉండేవారికీ లేనిపోని సమస్యలు తప్పడం లేదు. మెట్రో నగరాల్లో పబ్ పొల్యూషన్ భరించలేనంత స్థాయిలో ఉంది.
జల్సాలకు అలవాటు పడిన యువతను ఆకర్షిస్తూ కొంతమంది గలీజ్ దందాలను నడిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పబ్బుల్లో జరుగుతున్న అరాచకాలు అందర్నీ భయపెడుతున్నాయి.. ఇక పబ్బుల్లో డ్రగ్స్ వాడుతూ నానా రచ్చ చేస్తున్నారు కొందరు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినా కొన్ని పబ్బుల నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.
అడ్డూ అదుపు లేకుండా.. ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా నడుపుతున్న పబ్బుల యాజమాన్యాలపై పోలీసులు కన్నెర్ర చేశారు. పబ్బుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఊరికునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లకు లిక్కర్ అమ్మితే బార్లు, పబ్‌లపై చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అయినా సరే నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి పబ్బులు.
పోలీసుల తనిఖీలు.. దాడులు జరుపుతున్నప్పటికీ.. హైదరాబాద్ సిటీలో పబ్బులు.. శివారులో ఉన్న రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. అధికారుల హెచ్చరికలు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు పబ్ నిర్వాహకులు. సమయం దాటిన తర్వాత కూడా పబ్బులను తెరిచి గబ్బు లేపుతున్నారు.అనుమతి లేకుండా డ్రగ్స్ వినియోగిస్తూ.. అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో పబ్బుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వారమంతా పనిచేసే ఉద్యోగులు వీకెండ్ లో పబ్ కి వెళ్తేనే రిలాక్స్ అవుతామంటారు. వారమంతా కాలేజీలకు వెళ్లి అలసిపోయి.. పబ్బుకు వెళ్తేనే ఎంజాయ్ మెంట్ అంటారు విద్యార్థులు. పబ్ లో పరిమితులేమీ ఉండవు. ఇది చేయొద్దు.. అది చేయొద్దు అనే ఆంక్షలుండవు. తాగినంత తాగొచ్చు. ఊగినంత ఊగొచ్చు. డాన్స్ పేరుతో ఏం చేసినా అడిగేవాళ్లుండరు. ఈ అంశాలే యువతను ఆకర్షిస్తున్నాయి. రిక్రియేషన్ పేరుతో పబ్బులకు వెళ్లడం.. లోపల ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చన్న చిలిపి ఊహలే పబ్ లకు లేనిపోని డిమాండ్ తీసుకొస్తున్నాయి. పబ్‌లో లైటింగ్, మ్యూజిక్ దగ్గర నుంచి మద్యం కోసం వాడే గ్లాసుల వరకూ ప్రతీదీ ఆకట్టుకుంటుంది. అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్కసారి పబ్‌లోకి అడుగుపెడితే, యువతకు అది మరో ప్రపంచమే. నేటి తరం పబ్‌కి వెళ్లడాన్ని తప్పుగా చూడ్డం లేదు. జీవితాన్ని అనుభవించే, ప్రశాంతంగా సేదతీరే సంస్కృతిలో పబ్ ఒక భాగం అయిపోయింది. కాదు కాదు అయ్యేలా చేశారు.
నలుగురితో కలిసిపోయే ప్రదేశంగా మొదలైన పబ్ కల్చర్ క్రమంగా చెడు అలవాట్లకు కారణమౌతోంది. మద్యానికి బానిస కావడం, అది పెద్ద తప్పేమీ కాదనుకునే పరిస్థితికి వచ్చేసింది. యువత మీద చదువులు, ఇతరత్రా ఒత్తిళ్లు కూడా పబ్ కల్చర్ పెరగడానికి ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పబ్బులు రిలాక్సేషన్ హబ్స్‌గా ఉంటూనే, మద్యం వల్ల వచ్చే అనేక సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. తోటివారి ఒత్తిడితో చాలామంది యువత మొదటిసారి మందు రుచి చూసేది పబ్బుల్లోనే. తరువాత అదే అలవాటుగా మారుతోంది. మద్యం వల్ల వచ్చే సమస్యలన్నిటికీ పబ్బులదే బాధ్యత కాకున్నా, కాలేజీకి వెళ్లే కొత్త తరానికి మద్యం అలవాటు చేస్తున్నది మాత్రం కచ్చితంగా పబ్బులే. అలాగే ఎంజాయ్ చేయడానికి పబ్బులొక్కటే దారి కాదంటున్నారు మానసిక వైద్యులు. నిజమైన మానసిక ఆనందం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించడం, పుస్తకాలు చదవడం, ఎక్సర్‌సైజులు చేయడం వంటి వాటిలో ఉంది. అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకానీ పబ్బులకు వెళ్తే కాదని చెబుతున్నారు. కానీ యువత మాత్రం వీరి మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేదు. డీజే పార్టీలు, పబ్బులు, రేవ్ పార్టీలు యువతకు అలవాటైపోయాయి. ఎవరైనా వాటికి దూరంగా ఉంటే వారిని వింతగా చూస్తున్నారు.
తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందనే సామెత పబ్బులకు బాగా వర్తిస్తుంది. ఇళ్ల మధ్యకొచ్చేసిన పబ్బులు.. ఆడుకునే పిల్లల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. పబ్ కు వెళ్తే ఎంజాయ్ మెంట్.. లోపల ఏదో గొప్ప లోకం ఉందన్న మాటలు నిజమే అని నమ్మి.. చాలా మంది మైనర్లు కూడా పబ్బుల బాట పడుతున్నారు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా, పబ్బుల్లో ఏముందో చూడాలనే కుతూహలంతో చాలా మంది పబ్బుల గడప తొక్కుతున్నారు.
పబ్బులపై హైకోర్టు సీరియస్ కావడం.. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశాలివ్వడం ఊరట కలిగించే పరిణామమే. అయితే పోలీసుల కళ్లుగప్పి, అధికారులకు లంచాలిచ్చి.. యథేచ్ఛగా గానాబజానా సాగించే పబ్బులు.. ఇకనైనా మారతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోలీసుల కూడా గతంలో ఏదైనా ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడమే తప్ప.. రెగ్యులర్ చెకింగులు చేయడం లేదు. మరి ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి.. పద్ధతి మార్చుకుంటారేమో చూడాలి. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా పబ్బు గబ్బు ఆగలేదంటే.. కచ్చితంగా అది అధికారుల వైఫల్యమే అనుకోవాల్సి వస్తుంది.