NTV Telugu Site icon

Gross Domestic Product :దేశం ఎందుకు అప్పులకుప్పగా మారుతోంది..? ఇండియా మరో శ్రీలంక అవుతుందా.?

Story Board

Story Board

Gross Domestic Product : కొద్దిరోజులుగా రాష్ట్రాల అప్పులు, ఉచిత పథకాలపై జరుగుతున్న చర్చ వెనుక అసలు విషయం ఏంటో కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ పర్యవేక్షించాల్సిన కేంద్రం కూడా పరిమితికి మించి అప్పులు చేస్తోందని తేలింది.

ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి. పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ ఆక్షేపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోయాయి. దేశాన్ని అప్పులకుప్పుగా మార్చేశాయి. అర్జెంటుగా అప్పులు తగ్గించాలని కాగ్ వాయించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం దేశ జీడీపీలో 40 శాతం వరకు అప్పులు చేసుకొనే వెసులుబాటు ఉన్నది. కానీ 2022 ఆర్థిక సంవత్సరం నాటికి మోదీ సర్కారు ఏకంగా 54 శాతం అప్పులు చేసింది. 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని కాగ్ చెప్పింది. 2015-16లో జీడీపీలో కేంద్రం అప్పులు 5.5 శాతం ఉండగా, 2019-20 నాటికి 52.30 శాతానికి, 2022-23 నాటికి 54 శాతానికి పెరిగిపోయాయి. కేంద్రానికి ఏడాది కాలంలో సమకూరుతున్న మొత్తం ఆదాయంలో 2019-20లో వడ్డీలకు 34 శాతం చెల్లించింది. 2022-23 నాటికి అది 37 శాతానికి పెరిగిపోయింది. 2016 నుంచి కేంద్రం చెల్లించాల్సిన వడ్డీ రేటు తగ్గింది. 2016లో వడ్డీరేటు 6.91 శాతం ఉండగా, 2020 నాటికి 6.61 శాతానికి తగ్గింది. అయినా, చెల్లించాల్సిన వడ్డీ సొమ్ము పెరుగుతూనే ఉన్నది. వడ్డీల రూపంలో కేంద్రం 2016లో 4.57 లక్షల కోట్లు చెల్లించగా, 2020లో 6.55 లక్షల కోట్లు చెల్లించింది.

అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు పెరిగినా.. అది జీడీపీ పెరుగుదలకంటే అధికంగా ఉండరాదనేది ఆర్థిక సూత్రం. కానీ, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికే జీడీపీ పెరుగుదల రేటును వడ్డీల పెరుగుదల రేటు దాటిపోయిందని కాగ్‌ వెల్లడించింది. 2019-20 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు కన్నా అప్పుల వృద్ధి రేటు రెట్టింపు ఉన్నది. 2019-20లో జీడీపీ వృద్ధిరేటు 6.22%. అప్పుల్లో మాత్రం ఏకంగా 12.62 శాతం వృద్ధి కనిపించింది. 2015-16 నుంచి చూసుకున్నా జీడీపీ వృద్ధిరేటుతో సమానంగా అప్పుల వృద్ధిరేటు కొనసాగుతోంది.

2015-2020 మధ్య మోదీ ప్రభుత్వం ఏటా సగటున రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కాగ్‌ స్పష్టం చేసింది. 2015-16లో కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.69.55 లక్షల కోట్లు ఉండగా 2019-20 నాటికి ఇది రూ.105 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. మోడీ ప్రభుత్వం ఐదేండ్లలోనే రూ.35 లక్షల కోట్ల అప్పులు చేసిందని కాగ్‌ వెల్లడించింది. 2018-19లో ద్రవ్యలోటు రూ.1.88 లక్షల కోట్లు ఉండగా ఒకే ఏడాదిలో అది దాదాపు రెట్టింపయ్యి రూ.3.75 లక్షల కోట్లకు పెరుగడం పట్ల కాగ్‌ అందోళన వ్యక్తం చేసింది.

భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. 2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62 లక్షల కోట్లు ఉండగా, 2021-22 బడ్జెట్‌ నాటికి అది రూ.కోటి 35 లక్షల కోట్లకు చేరింది. ఏడేళ్లలో 117% పెరిగింది. 64 ఏళ్లలో దేశం రుణం రూ.62లక్షల కోట్ల మేర ఉండగా, గత ఏడేళ్లలోనే కొత్తగా రూ.73 లక్షల కోట్ల అప్పు చేసినట్లు వెల్లడైంది. 1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2 వేల కోట్లు, విదేశీ రుణం రూ.32 కోట్లమేర ఉండగా, 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.లక్ష కోట్లు, విదేశీ రుణం రూ.41 లక్షల కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు. ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.కోటి 62 లక్షల కోట్లకు చేరింది.
బడ్జెట్‌లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్‌ ఫైనాన్సింగ్‌ కింద కరెన్సీని ప్రింట్‌ చేసుకొని చెలామణీలోకి తీసుకురాగలదు. కానీ, రాష్ట్రా లకు ఆ అవకాశం కూడా లేదు. ప్రస్తుత భారత ప్రభుత్వం నెత్తి మీద ఉన్న అప్పు రూ. 155 లక్షల కోట్లు. మన జీడీపీలో అరవై శాతం. అంటే అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇప్పులు తెచ్చారన్నమాట. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు కడుతున్న ఈఎంఐలు పిసరంత అయితే చేస్తున్న అప్పులు కొండంత.
ఓ వైపు దేశ ప్రజలపై పన్నులతో దాడి చేస్తున్నారు. మరో వైపు పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నారు. ఈ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయన్నది చాలా మందికి అర్థం కాని విషయం. అర్థమయ్యేలా సమాచారం కూడా కేంద్రం ప్రజలకు ఇవ్వడం లేదు. అటు కేంద్రం అప్పులు.. కూడా ప్రజలపైనే పడతాయి. ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవీ ప్రజలపైనే పడతాయి. అందుకే ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పన్నుల భారం పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితి దిగజారిపోవడంతోనే శ్రీలంక పరిస్థితి అలా తయారయింది. లంకను చూసి కూడా మన ప్రభుత్వాలు మారడం లేదు. అప్పులు చేయడం తప్పు కాదు.. కానీ తెచ్చిన అప్పును సంపద సృష్టికి వాడకపోవడం తప్పు. కాగ్ కూడా ఇదే చెబుతోంది. తెచ్చిన తప్పులతో ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టకుండా.. ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారని తప్పుబట్టింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో.. అప్పులు ఎంత్ ప్రమాదకరమో మన ప్రజలకు తెలిసొచ్చింది. అప్పట్నుంచి ప్రభుత్వాలు చేస్తున్న అప్పులపై ఫోకస్ పెరిగింది. దీంతో కేంద్రం ముందుగానే తప్పంతా రాష్ట్రాలదే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయతే కొన్ని రాష్ట్రాలు కేంద్రం అప్పుల్ని కూడా గణాంకాలతో సహా బయటపెట్టడంతో.. అన్నీ ఆ తాను ముక్కలే అని తేలిపోయింది. ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసి.. కనీసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే స్పృహ కూడా లేకుండా.. ప్రజల నెత్తిన రుణభారం పెంచుతున్నారు పాలకులు.

భారతావని అప్పుల కుప్పగా మారుతోంది. గత నాలుగున్నరేళ్లలో దేశ రుణభారం ఏకంగా 50 శాతం పెరిగి పోయింది. కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.82 లక్షల కోట్లను దాటిపోయాయి.

2014 జూన్ నాటికి రూ.54 లక్షల కోట్లుగా ఉన్న రుణాల విలువ గతేడాది సెప్టెంబర్ నాటికే రూ.82 లక్షల కోట్లకు చేరింది. అంటే గత నాలుగున్నరేళ్లలో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగింది. మోడీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.27 లక్షల కోట్లు పెరిగాయి. అప్పుల సేకరణకు గల ఏ అవకాశాన్నీ విడిచిపెట్టట్లేదు కేంద్రం. మోడీ సర్కార్ అధికారంలోకి రాకముందు గోల్డ్ బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలేమీ లేవు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో అందుకున్న అప్పుల విలువ రూ.9 వేల కోట్లు. ఇక మార్కెట్ ఆధారిత రుణాలూ గతంతో పోల్చితే 47.5 శాతం పెరిగి రూ.52 లక్షల కోట్లకుపైగా పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరటంతో ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఎనిమిది నెలల్లోనే ద్రవ్యలోటు రూ.7.17 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే 114.8 శాతంగా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకు రూ.80వేల కోట్ల నిధులను తరలించాలని మోదీ సర్కార్ లక్ష్యం. అయితే ఇప్పటిదాకా రూ.34 వేల కోట్లకు పైగానే సమీకరించింది. ఓ వైపు పెరుగుతున్న రుణ భారం.. మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.. మోడీ సర్కారుపై ఒత్తడి పెంచుతున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగులు నిల్వలపై కూడా కన్నేసింది. ఆ సొమ్ముతో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనేగాక, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థలో కలిగిన సమస్యలనూ అధిగమించవచ్చునని భావించింది. అది కుదురక ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్‌ను కూడా కేంద్రం కోరింది.

అపరిమితంగా అప్పులు చేసి దివాలా దిశగా కొన్ని రాష్ట్రాలు వెళ్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ రాష్ట్రాలను నియంత్రించాల్సింది కేంద్రమే. ఎందుకంటే రాష్ట్రాల అప్పులు పూర్తిగా కేంద్ర అనుమతుల మీదనే ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. కానీ కేంద్రం కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు ఇక సరిచేసేదెవరనేది ఇక్కడ అసలు ప్రశ్న.

మౌలిక సదుపాయాల కోసం ప్రజాధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా అప్పులు చేస్తూ సంక్షేమం పేరుతో ప్రజలకు పంచే రాజకీయ వ్యూహాలే ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడి వ్యయం చేయడాన్ని అనవసరంగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నారు.
రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే.. ఆ తప్పులో సింహ భాగం వాటా కేంద్రానికే దక్కుతుంది. ఇప్పుడు శ్రీలంకలో అలా జరిగిందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సుద్దులు చెప్పినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దిగజారిపోయింది. పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి.. కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత తాము ముందే హెచ్చరించామంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నష్టపోయేది దేశం. అందుకే రాష్ట్రాలు దివాలా తీస్తే అది దేశానికి నష్టం.. ఆ పాపం కేంద్రానిదే అవుతుంది. రాష్ట్రాలు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలి.

దేశంలోని అనేక రాష్ట్రాల అధిక అప్పులకు ప్రాథమికంగా కొవిడ్‌ పరిస్థితులు కారణం. నిజానికి కరోనా కన్నా రెండేళ్ల ముందు అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. రాష్ట్రాల సొంత రెవెన్యూ రాబడులు తగ్గిపోవడంతో.. అప్పులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల్‌ సెంటర్‌ డిస్కం ఎస్యూరెన్సు యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణం. ఆయా రాష్ట్రాల్లో కొన్ని ఇతర అంశాలూ వాటి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయి. రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ విధానాల వల్లే జీఎస్‌డీపీలో వారి రుణాల వాటా అధికమవుతోంది.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత అయిదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కన్నా వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఆయా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వాటిని తీర్చలేని పరిస్థితి తీసుకొస్తోంది. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటించారు. ప్రస్తుత అప్పులకు అవి కూడా తోడయితే వాటి పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.

అధికారం ఓ బాధ్యత. ప్రభుత్వం ప్రజల ఆస్తికి ధర్మకర్తగా ఉండాలే కానీ.. అప్పులకొండను తెచ్చి నెత్తిన పెట్టకూడదు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు బాధ్యతలు గాలికొదిలేసి.. ఎడాపెడా అప్పులు చేస్తూ.. ప్రజలకు తిప్పలు తెస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. అప్పులు పెరగడమే కానీ.. తగ్గుతున్న దాఖలాల్లేవు. ఒకప్పుడ కాగ్ సూచనల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇప్పడు దున్నపోతు మీద వాన కురిసిన చందంగా దులిపేసుకుంటున్నారు. కాగ్ పని కాగ్ ది.. మా పని మాదే అన్నట్టుగా ఉంది వ్యవహారం.

రాష్ట్రాలు చేసిన అప్పులు.. కేంద్రం చేసిన రుణాలు అన్నీ లెక్కలేసుకుంటే దేశ.. రాష్ట్రాల జీడీపీలను దాటేశాయి. అంటే భారత దేశం తాకట్టులో ఉందని అనుకోక తప్పదు. ఇప్పుడు పాలకులు దేశాన్ని తాకట్టు నుంచి విడిపించడానికి ప్రజలపైనే పడుతున్నారు. దాని ఫలితమే పన్నులు.. ధరల పెరుగుదల. చివరికి పాలు, పెరుగు మీద కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ అప్పుల భారం అంతా ప్రజలపైనే పడుతోంది. మరి లక్షల కోట్ల పన్నేశారు. చెత్తపన్నేశారు. మద్యాన్ని ఊహించనంత ధరలకు అమ్మతున్నారు. పేరుకి ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నా.. బాకీ పడింది మాత్రం ప్రజలే. కట్టాల్సిందీ ప్రజలే. కానీ అసలు పాపం మాత్రం పాలకులది.

నీ తెలివి తక్కువ తనంతో పోలిస్తే నాదెంత ? .. నీ చేతకాని తనంతో పోలిస్తే నాదెంత ?” అని ఓ సినిమాలో ఎప్పుడూ పనికి మాలిన వేషాలేసి దొరికిపోయే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కామెడీ చేస్తుంది. ఇది సినిమాలో క్యారెక్టర్ కావొచ్చు కానీ మన నిత్య జీవితంలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. అది మనుషుల్లోనే కాదు ప్రభుత్వాల్లో కూడా. ఇప్పుడు అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న పంచాయతీ చూస్తే ఇదే నిజమనిపించక మానదు.

మీరు అప్పులు ఎక్కువ చేశారంటే.. మీరు అప్పులు ఎక్కువ చేశారని రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ నోరు తెరువవు. తెరిచేంత స్వేచ్చ ఉండదు. ఒక వేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా తేడాలంటే కేంద్రం బయట పెట్టదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట మాత్రం లెక్కలన్నీ బయటకు వస్తాయి. అక్కడా కొన్ని ” పొలిటికల్ ప్రివిలేజెస్ పొందే రాష్ట్రాలున్నా.. కేంద్రం మాత్రం లీకుల ద్వారా అయినా బయటకు చెబుతోంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఎలా కుప్పకూలిపోయిందో కళ్ల ముందే కనిపిస్తోంది. అదే మన దేశ ప్రజల్ని కూడా మేల్కొలిపింది. అందుకే అప్పులపై చర్చ ప్రారంభమయింది. అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలంటూ అటు కేంద్రం.. ఇటు ఆర్బీఐ కొన్ని రాష్ట్రాల వివరాలను వెలుగులోకి తెచ్చింది. అందులో ప్రధానంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలున్నాయి. కొన్ని బీజేపీ రాష్ట్రాలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ రాజకీయాన్ని పక్కన పెడితే ఆయా రాష్ట్రాలు పూర్తిగా అప్పుల ఊబిలో ఉన్నాయనేది నిజం. ఆదాయాన్ని మించి అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులు.. వడ్డీలు తిరిగి కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో కేంద్రం చేస్తున్న అప్పులపైనా చర్చ ప్రారంభమయింది. అటు రాష్ట్రాలు.. ఇటు కేంద్రం ఎవరి వాదన వారు వినిపిస్తూ.. ఎవరు ఎక్కువ అప్పులు చేశారో లెక్కలు బయట పెడుతున్నారు. దీంతో ప్రజల్లో మరింత చర్చ జరుగుతోంది.

పార్లమెంట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని, శ్రీలంకను గుణపాఠంగా తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ. 8.57 లక్షల కోట్లు రుణ పరిమితిగా నిర్ణయించింది. ఈ అప్పు ఆ రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతం మించి ఉండకూడదు. ఇది నిబంధన. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధన ప్రకారం కేంద్రం ఈ పరిమితి విధిస్తుంది. దీనికి లోబడి ప్రతి రాష్ట్రం రుణాలు సేకరిస్తాయి. ఈ రుణాలను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, చిన్న పొదుపు మొత్తాల నుండి, మార్కెట్‌లో బాండ్లను అమ్మడం తదితరాల ద్వారా సేకరిస్తాయి. ఈ అప్పులు బడ్జెట్‌ పత్రాల్లో చూపించాలి. ప్రతి ఏడాది అప్పులపై అసలు, వడ్డీలకు ఎంత చెల్లిస్తున్నారో కూడా బడ్జెట్‌లో ముందుగానే పేర్కొంటారు. అయితే రాష్ట్రాలు ఆదాయం.. అప్పులకు మించి ఖర్చు చేస్తూ అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి తమ ఆస్తులను తనఖా పెట్టడం , కార్పొరేషన్ల పేరుతో ఆదాయాన్ని చూపి బ్యాంకుల ద్వారా, బాండ్ల ద్వారా రుణాలు సేకరించుకుంటున్నాయి. వీటినే బడ్జెట్‌యేతర అప్పులు అంటారు. వీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఈ బడ్జెట్‌యేతర రుణాలు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 7.9 లక్షల కోట్లు ఉందని, ఈ తరహా అప్పులు పెరిగిపోతున్నాయని, ద్రవ్యలోటు 3.5 శాతం నిబంధనను దాటిపోతుందని అంతిమంగా రాష్ట్రాల రెవిన్యూ వ్యయం పెరుగుదలకు తీవ్ర ప్రభావం పడుతున్నదని కేంద్రం అంటోంది. రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం దాటిందని, ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది.

కేంద్ర ప్రభుత్వ రుణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే తమ అప్పుల గురించి ప్రశ్నించనంత వరకూ రాష్ట్రాలు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. దేశ స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ పెరగనంత అప్పులు బిజెపి పరిపాలనలో పెరిగింది. కేంద్రానికి విస్తృతంగా ఆదాయ వనరులున్నాయి. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం జమేసుకునే వనరులు చాలా వున్నాయి. వివిధ పన్నులమీద విధించే సర్‌ఛార్జీలు, సెస్‌లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించే డివిడెండ్లు, ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, సంస్థల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు పూర్తిగా కేంద్రమే వినియోగించుకుంటుంది. రిజర్వుబ్యాంకు మిగులు నిధులను ప్రతి ఏడాది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుంటుంది. వీటిల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వదు కేంద్రం దేశంలో చేసే అప్పులే గాక విదేశాల నుండి వివిధ రూపాల్లో అప్పులు సేకరించి వాడుకుంటున్నది. ఈ విదేశీ అప్పు నేడు జిడిపిలో 20 శాతానికి దాటిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు విదేశీ బాండ్ల రూపంలో విదేశాల నుండి అప్పులు సేకరించాలని నిర్ణయించింది. దీనికి తోడు పడిపోతున్న రూపాయి మారకపు విలువ, అడుగంటుతున్న విదేశీ మారక నిల్వలు, పైపైకి ఎగబాకుతున్న వాణిజ్య లోటు, బుసలు కొడుతున్న ద్రవ్యోల్బణం ఇవన్నీ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి సంకేతాలు. అన్ని వనరులు ఉండి కూడా జిడిపిలో 60 శాతం దాకా అప్పులు చేసింది మోడీ ప్రభుత్వం. ఇదే అంశాన్ని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రానికి పట్టని నిబంధనలు రాష్ట్రానికి ఎందుకని అంటున్నాయి.

శ్రీలంక సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు అప్పులపై చర్చ పెట్టుకున్నాయి. లేకపోతే అంతర్గతంగానే ఉండేవి. అయితే ఇప్పుడు ఆయా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయా అని మనం అనుకుంటే మన కంటే వెర్రి వాళ్లు ఉండరేమో. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ జాగ్రత్త అనే మాటే తమ వైపు నుంచి రానీయడం లేదు. కేంద్ర అప్పులు జీడీపీలో అరవై శాతానికి మించి పోయాయనన్న లెక్కలు కనిపిస్తున్నా.. కేంద్రం ఏ మాత్రం లెక్క చేయడం లేదు. తమకు ఎంత అనువైన మార్గంలో అవకాశం ఉంటే అన్ని అప్పులు చేస్తోంది. కోటిన్నర కోట్ల అప్పు అంటే ఎంత వడ్డీ చెల్లించాలో లెక్కలు వేసుకుంటే ఓ రాష్ట్ర బడ్జెట్ అంత అనే సమాధాన మనకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందు కోసమే కేంద్రం కూడా అప్పులు చేస్తోంది. రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అటు కేంద్రం ఇటు రాష్ట్రం అయినా మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు నగదు రూపంలో డబ్బులు పంచాలనుకుంటున్నాయి. ఈ విషయంలో అటు కేంద్ర రాష్ట్రాలు రాజీ పడే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఆదాయం దానికి తగ్గట్లుగా లేదు. దేశంలో మెజార్టీ రాష్ట్రాల ఆదాయం కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణా ఖర్చులకే సరిపోతాయి. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు వడ్డీలు కూడా కట్టుకోగలవు. చాలా రాష్ట్రాలు అప్పులు తీర్చడానికి .. వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు చేయడమే కాకుండా.. నగదు బదిలీపథకాలకూ అవే ఉపయోగిస్తున్నారు. దీంతో అప్పు చేసి పప్పుకూడు తిన్న చందంగా ఈ అప్పుల వ్యవహారం సాగిపోతోంది.

ఏ ఆర్థిక వ్యవస్థకైనా, వనరులకూ అవసరాలకూ పొంతన కుదరనప్పుడు, వనరులను మించి అవసరాలు ఉన్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరమవుతుంది. కనుక అప్పు దానికదిగా తప్పు కాదు. కాని ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులేమిటి, మన అవసరాలేమిటి, మన వనరులను సక్రమంగానే, సమర్థంగానే వినియోగిస్తున్నామా, మన అవసరాలను సరిగానే అంచనా వేస్తున్నామా, అవసరం లేని ఖర్చులూ దుబారా ఖర్చులూ చేస్తున్నామా వంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరుల లోపల తీర్చుకోగలమా లేదా అని ఆలోచించడం లేదు. కేంద్రంలో పాలకులైనా రాష్ట్రాలు.. స్థానిక సంస్థల పాలకులైనా ఆర్థిక వ్యవస్థ పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి. ఓ రూపాయి అప్పు చేస్తే అది మళ్లీ ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి కట్టేలా ఉండకూడదు. ఆ రూపాయితో సంపద సృష్టి జరగాలి. ఆ సంపద నుంచి వచ్చే ఆదాయంతోనే అప్పులు .. వడ్డీలు తిరిగి చెల్లించాలి. నిజానికి సంపద ఎలా పెరుగుతుంది.. అంటే.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా.. యాభై వేల కోట్లు పెట్టి పోలవరం నిర్మించినా అది జాతీయ సంపద. దాని వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట పండుతుంది. అది ప్రజలకు ఆదాయాన్ని తెస్తుంది. అదే అసలైన సంపద సృష్టి. అలా కాకుండా తాము చేసే అప్పులు సగం నగదు బదిలీ చేసి.. సగం అప్పటి వరకూ ఉన్న అప్పులకు వడ్డీలు కడితే ఏం మిగులుతుంది? మరికొంత అప్పు పెరుగుతుంది. కానీ సంపద, ఆదాయం మాత్రం పెరగదు. ఇప్పుడు అత్యధిక రాష్ట్రాల్లో జరుగుతోంది ఇదే.

అటు కేంద్రం అప్పులు.. కూడా ప్రజలపైనే పడతాయి. ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవీ ప్రజలపైనే పడతాయి. ఎవరు అప్పులు చేసినా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే కట్టాలి. అప్పులు.. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం కారణంగానే దేశ ప్రజలు కట్టాల్సిన పన్నులు కూడా పెరిగిపోతున్నాయని అనుకోవచ్చు. అదే సంపద సృష్టి అనేది జరిగి ఉన్నట్లయితే ఈ సమస్య ఉండేది కాదు. అప్పులకు తగ్గట్లుగా సంపద సృష్టి జరగడం లేదు. ఆదాయానికి తగ్గట్లుగా అప్పులు చేయడం లేదు. అంతకు మించి చేస్తున్నారు. కేంద్రమైనా.. రాష్ట్రాలైనా అప్పులు చేసి.. సంపద సృష్టి చేస్తే జీడీపీ పెరుగుతుంది. దాని వల్ల అప్పు పెద్ద భారంగా మారదు. కానీ అప్పులు చేసి అనుత్పాదక వ్యయం చేస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలని శ్రీలంక దుస్థితిని అధ్యయనం చేయాల్సిన పని లేదు. అది బేసిక్ ఆర్థిక సూత్రం. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఓ చోట నుంచి అప్పులు తెచ్చి వారికి ఎంతో కొంత పంచి పెట్టడమో.. మరొకటే చేస్తే మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చనుకోవచ్చు. కానీ అది ప్రజలను కష్టాల్లోకి నెట్టడం అవుతుంది. అంతకు మించి దేశాన్ని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం తప్పు చేసినట్లే. అది ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే అవుతుంది.