NTV Telugu Site icon

Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపెవరిది? పోలింగ్ ముందు పార్టీల సమీకరణాలు మారతాయా?

Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్​గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్​గా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్​కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, మిజోరంలో నవంబర్​ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక, అధికారాన్ని బీజేపీకి అప్పగించింది.

రాజస్థాన్ లో కాంగ్రెస్ కు బీజేపీతో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్​లోని అంతర్గత యుద్ధం. 2018 రాజస్థాన్​ ఎన్నికల్లో గెలవడమే ఆలస్యం.. సీఎం అశోక్ గెహ్లాట్​, డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా.. ఈ వ్యవహారం తరచూ వార్తలకెక్కేది. ఒకానొక దశలో.. మధ్యప్రదేశ్​లో జ్యోతిరాదిత్య సింథియా చేసినట్టు.. సచిన్​ పైలట్​ కూడా తిరుగుబాటు ప్రకటిస్తారనే వాదన వినిపించింది. ప్రభుత్వం దాదాపుగా కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ వెంటనే స్పందించిన హైకమాండ్​.. సచిన్​ పైలట్​ను బుజ్జగించింది. అయినప్పటికీ.. పార్టీపై ఆయన ఒకింత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు కనిపిస్తుండటం.. కాంగ్రెస్​కు కలిసి వచ్చే విషయం. కమలదళంలో సీనియర్​ లెవల్​ నేతలకు పడటం లేదని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలు వచ్చేసరికి.. ఏమీ జరగనట్టు, పార్టీలో నేతలందరు బయటకు నవ్వుతూ కనిపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా రాజస్థాన్​లో నేరాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరాయి. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్​లు.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. చాలాసార్లు.. ఇవి గెహ్లాట్​ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటి ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుందనేది చూడాలి.

Also Read: Shruti Haasan: రాజకీయాల్లోకి శృతిహాసన్ ఎంట్రీ .. ఈసారి గట్టిగా ఇచ్చిన భామ..!

ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్​కు పైచేయి ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. సీఎం భూఫేష్​ భగేల్​ తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు క్లిక్​ అయినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీపై కాస్త అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ పనితీరుపై అధిష్ఠానం సంతృప్తిగా లేదని, ఈసారి గెలిస్తే.. ఆయన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇది కాంగ్రెస్​కు ఒకింత కలిసి వచ్చే విషయం. కాంగ్రెస్​ కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది.

2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్​ పుంజుకుందనే చెప్పాలి. బీఆర్​ఎస్​పై ఆ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ బలంగా మారుతుందని అందరు భావించినా.. కమలదళం ఇక్కడ కాస్త వెనకడుగు వేసింది. ఫలితంగా బీఆర్ఎస్​తో కాంగ్రెస్​ పోరాటం మరింత తీవ్రతరం చేసింది. మిజోరంలోనూ పాగా వేయాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరుణంలో.. కాంగ్రెస్​ పార్టీ ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తోంది. కర్ణాటకలో సాధించిన భారీ విజయంతో నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్​.. అదే తరహాలో ఇతర రాష్ట్రాలపైనా ప్రభావం చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది.
బిహార్​లో నితీశ్​ కుమార్​ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్ని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. దీనికి కేంద్రంలోని బీజేపీ సానుకూలంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్​.. కుల గణన అంశాన్ని తీవ్రస్థాయిలో లేవనెత్తుతోంది. అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడతామని ఆ పార్టీ నేతలు హామీలిస్తున్నారు. కుల గణన అనేది పేదలకు ఓ శక్తివంతమైన ఆయుధం అని రాహుల్​ గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలనే కాదు.. లోక్​సభ ఎన్నికల్లో కూడా ఈ కుల గణన అంశం తమకు సానుకూలంగా మారుతుందని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది.

Also Read: Anupama Parameswaran: స్టైలిష్ పోజులతో మనసు దోచేస్తున్న అనుపమ పరమేశ్వరన్..

2024 సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడించాలని దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలూ ఏకమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇండియా బృందానికి చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రదర్శన బలంగా ఉంటే.. ఇండియా బ్లాక్​లో శక్తివంతమైన భాగంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోక్​సభ ఎన్నికల్లో సీటు షేరింగ్​పై మరింత పట్టు సాధించొచ్చు. ఈ ఐదు రాష్ట్రాలను కలుపుకుంటే.. 83 లోక్​సభ సీట్లు ఉన్నాయి. 2018లో రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో విజయం సాధించినా.. 2019 సార్వత్రిక సమరంలో కాంగ్రెస్​ పార్టీ డీలా పడింది. ఈసారి అలా జరగకూడదని.. ప్రజలను ఆకర్షించే పనిలో పడింది.

అటు ఐదు రాష్ట్రాల ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి వర్గపోరుతో తలబొప్పి కడుతోంది. ఈ సమస్యతోటే.. తొలిసారి సీఎం అభ్యర్థుల్ని ప్రకటించకుండా రంగంలోకి దిగుతోంది కమలం పార్టీ. అయితే స్థానిక నేతల్ని డమ్మీల్ని చేసి.. కేవలం పీఎం మోడీ ఇమేజ్ తోనే ఎన్నికలు గెలుస్తారా.. లేదా అనేది తేలాల్సిన విషయం. ఈ ప్రయోగం గుజరాత్ లో సక్సెస్ అయినా.. కర్ణాటకలో వికటించింది. ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్ బీజేపీకి సంప్రదాయంగా బలం ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ సీనియర్ల మధ్య అంతర్గత పోరు ఎన్నికల్లో పుట్టిముంచుతుందనే అనుమానాలున్నాయి. మరి అంతర్గత సమస్యల్ని బీజేపీ ఎంతవరకు అధిగమిస్తుందనేది.. ఆ పార్టీ విజయావకాశాల్ని డిసైడ్ చేయనుంది.