తెలంగాణలో సెప్టెంబర్ 17 పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. . కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర ప్రభుత్వం పోటా పోటీగా సెప్టెంబర్ 17 న అధికారిక కార్యక్రమాల నిర్వహణకు సిద్దమయ్యాయి. కాంగ్రెస్, ఎంఐఎం కూడా తమ యాక్షన్ ప్లాన్ ప్రకటించాయి.
తెలంగాణలో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. మునుగోడు ఉపఎన్నికల తరుణంలో.. రాజకీయం ఇప్పటికే వేడెక్కగా.. సెప్టెంబర్ 17నాటి కార్యక్రమాలతో సెంటిమెంట్ రగిలించాలని పార్టీలు పోటీ పడుతున్నాయి. స్వయంగా కేంద్రం రంగంలోకి దిగి విమోచన దినోత్సవం జరుపుతామని ప్రకటించడం, కౌంటర్ గా టీఆర్ఎస్ కూడా జాతీయ సమైక్యత దినం అనడం ఆసక్తి కలిగిస్తోంది.
తెలంగాణలో హై ఓల్డేజ్ రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మునుగోడు ఉపఎన్నికల తరుణంలో.. విమోచన రాజకీయం మొదలైంది. తెలంగాణ ఏర్పాటైన దగ్గర్నుంచీ సెప్టంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో జరుపుతూ వచ్చాయి. అయతే ప్రభుత్వం మాత్రం అధికారికంగా నిర్వహించడం లేదు. ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా, విమోచనా.. విద్రోహమా అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ లేనంత హడావుడి ఈసారి కనిపిస్తోంది. కేంద్రం హైదరాబాద్ సంస్థానం విమోచన ఉత్సవాలు నిర్ణయించడం, ఏడాది పాటు జరపాలని ప్రకటించడం కలకలం రేపింది. కేంద్రం ప్రకటన రాగానే.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది.సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా జరిపి.. ఏడాది పాటు వజ్రోత్సవాల పేరుతో కార్యక్రమం జరపాలని భావిస్తోంది. స్వాతంత్ర్య అమృతోత్సవాల్ని ఎలా అయితే కేంద్రానికి పోటీగా ఎలా జరిపామో.. సెప్టెంబర్ 17న కూడా అదే వ్యూహం అమలుచేయాలనేది టీఆర్ఎస్ ఆలోచన.
ఇప్పటివరకూ తెలంగాణలో అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతామని చెబుతూ వచ్చిన బీజేపీ. ఇప్పుడు సడెన్ గా నిర్ణయం తీసుకోవడం వెనుక మునుగోడు ఉపఎన్నిక కారణమనే వాదన ఉంది. టీఆర్ఎస్ కూడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో జాతీయ సమైక్యత దినం, ఏడాది పాటు వజ్రోత్సవాలకు రెడీ అవుతోంది. తాము కూడా ఏడాది పాటు విలీన ఉత్సవాలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా.. జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుతామని ఎంఐఎం ప్రకటించింది. రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. సెప్టెంబర్ 17న ఏం జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది.
సెప్టెంబర్ 17నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఎవరి వాదనను ప్రజలు ఆదరిస్తారనేది చూడాల్సి ఉంది. బీజేపీ విమోచన అంటుంటే.. కాంగ్రెస్ విలీనం అంటోంది. టీఆర్ఎస్, ఎంఐఎం జాతీయ సమైక్యత అంటున్నాయి.. పేర్ల సంగతి సరే.. ఏ పార్టీ నిర్వహించే కార్యక్రమం ఎలా ఉండబోతుందనేది కూడా కీలకంగా మారింది. సెప్టెంబర్ 17 సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్న పార్టీల ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేదా అనేది చూడాలి.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మొదలైన సెప్టెంబర్ 17 వేడి.. ఇకపై కొనసాగుతుందా.. కేవలం ఈ ఒక్క ఏడాదికేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మునుగోడు ఉపఎన్నికల ఫలితాన్ని కేవలం ఈ కార్యక్రమాలే నిర్ణయించవనే అభిప్రాయం కూడా ఉంది. రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. అసలు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. మునుగోడు ఫలితాన్ని బట్టి సెప్టెంబర్ 17పై పార్టీల అభిప్రాయం మారుతుందా.. ఇలాగే ఉంటుందా అనేది కూడా తేలాల్సిన అంశమే. సెప్టెంబర్ 17తో మొదలైన సెంటిమెంట్ రాజకీయం అంతటితో ఆగుతుందా.. లేకపోతే తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు జరగాల్సిన న్యాయం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా.. లేదా అనే అంశాలపైనా చర్చ జరుగుతుందా.. అనేది చూడాలి.
ప్రజా సమస్యల్ని అజెండాగా చేయకుండా.. సెంటిమెంట్ రాజకీయాల్ని రగిలించాలని చూడటంపై వేర్వేరు వాదనలున్నాయి. ప్రతి పార్టీకీ సొంత స్ట్రాటజీ ఉంది. మరి దీన్ని మునుగోడులో ఎలా అప్లై చేస్తారు, అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి కార్యాచరణ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది.
తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్ కత్తులు దూస్తున్న వేళ ఈసారి సెప్టెంబర్ 17న రాష్ట్రంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినం నిర్వహించనుంది. అటు బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ సర్కార్ భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేయడం, నాడు తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, పోరు జరిగిన కేంద్రాలను స్మరణకు తెచ్చుకోవడం, ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ జాతీయ సమైక్యత దినం నిర్వహించి.. ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని హైలైట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ నెల 17న అటు కేంద్రం ..ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు.. రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. సెంటిమెంట్ ను ఓన్ చేసుకొనేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున అధికారికంగా మళ్లీ తెలంగాణ విలీన దినం నిర్వహించాల్సిన అవసరం లేదంటూ.. ఇప్పటివరకు కేవలం పార్టీ కార్యాలయంలో మాత్రమే టీఆర్‌ఎస్ జాతీయ జెండా ఆవిష్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆ రోజు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం. ఈ నెల 17న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోటా పోటీ ఉత్సవాలతో మరింత వేడెక్కే సూచనలు కన్పిస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుంచి రాష్ట్రానికి నిజాం నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న కూడా అధికారికంగా జరుపుకోవాలనే డిమాండ్ ఉంది. తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17న అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. మజ్లిస్ ఒత్తిడి కారణంగానే టీఆర్ఎస్ ఈ రకంగా చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో.. రాబోయే రోజుల్లో బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి తమను టార్గెట్ చేసే అవకాశం ఉండటంపై టీఆర్ఎస్ సర్కార్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణలో బీజేపీ బలపడుతుంటంతో.. ఆ పార్టీకి చెక్ చెప్పేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. కొందరు విలీన దినోత్సవంగా జరుపుకుంటే… మరికొందరు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న వేళ.. ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం చుట్టూ.. ఎప్పుడూ లేనంత రచ్చ జరుగుతోంది.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. నిజాం పాలనలోని దక్కన ప్రాంతం మాత్రం 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు.. భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించారు. ఇది జరిగి దశాబ్దాలు గడిచినా.. ఏటా సెప్టెంబర్ 17 ప్రత్యేకతను మాత్రం మర్చిపోలేదు ప్రజలు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో వైఖరి. బీజేపీ తెలంగాణ విమోచనం దినం అంటే.. కాంగ్రెస్ తెలంగాణ విలీన దినంగా పాటిస్తుంది. ఆ రోజున జాతీయ పతకాన్ని ఎగరేస్తాయి పార్టీలు. ఎవరు ఏ పేరుతో కార్యక్రమాలు నిర్వహించినా.. సెప్టెంబర్ 17న మాత్రం ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు చేయాలన్నది బీజేపీ తదితర పక్షాల డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పటైన తర్వాత కానీ.. అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించింది లేదు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమానికి ఆ పార్టీ సీఎం హాజరయ్యేవారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ భవన్‌లో ప్రొగ్రామ్స్ నిర్వహిస్తోంది. అయితే తెలంగాణలో అధికారికంగా కార్యక్రమాలు చేపట్టాలనేది విపక్ష పార్టీల డిమాండ్. ఇదే విషయంపై అధికారపార్టీని రాజకీయంగా కార్నర్ చేయాలని చూస్తున్నాయి. ఆజాదీ అమృతోత్సవాల్లోనూ ఇదే డిమాండ్ వినిపించాయి. అయితే ఈ అంశంలో విపక్షాలకు చెక్ పెట్టేలా ఈ ఏడాది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనం.. విమోచనం అనే పదాలకు ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హైలైట్ చేస్తూ.. సెప్టెంబర్ 17న అధికారికంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 17ను మతకోణంలో చూసే పార్టీలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. పైగా ఆ రోజు అధికారిక కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేసేవారి నోళ్లకు తాళాలు పడతాయని టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయట. వామపక్షపార్టీలు సైతం సై అనే విధంగా ప్రొగ్రామ్స్ ఉంటాయట. అలాగే ఎంఐఎంకు టీఆర్ఎస్ భయపడుతోందనే విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలుస్తోంది. మరి.. సెప్టెంబర్ 17 విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ప్రధాని నరేంద్ర మోడీ సహా.. హోంమంత్రి అమిత్ షా వరకూ.. బీజేపీ కీలక నేతలు ఎవ్వరూ తెలంగాణకు వచ్చినా.. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కచ్చితంగా ప్రస్తావిస్తారు. ఈ మధ్య అమిత్ షా మునుగోడు వచ్చిన సందర్భంలోనూ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి కీలక కామెంట్స్ చేశారు. మజ్లిస్ పార్టీకి భయపడి.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని.. తాము అధికారంలోకి వస్తే.. కచ్చితంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కానీ.. అధికారంలోకి రాకముందే.. భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశారు.
సెప్టెంబరు 17న తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన రోజు కాబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ రోజు హైదరాబాద్‌లో జరిగే కవాతుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం బొమ్మై, మహారాష్ట్ర నుంచి సీఎం షిండే గానీ.. ఫడ్నవీస్ కవాతుకు హాజరుకానున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. విమోచన దినోత్సవం కోసం బీజేపీ పెద్దఎత్తున ప్లాన్ చేస్తోంది. కేవలం బీజేనే కాదు.. టీఆర్ఎస్ కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. ఈనెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ విమోచన దినోత్సవంపై చర్చ చేపట్టే ప్లాన్ లో ఉంది. మొత్తానికి సెప్టెంబరు 17తో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా.. అమిత్ షా మజ్లిస్ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను కాల్చే ప్రయత్నం చేస్తారు. దీంతో ఈసారి హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా.. ఏం మాట్లాడతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణతోపాటు మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్‌లో చేరకపోతే.. అది దేశ మనుగడకే ముప్పు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయించారు. నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపి, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడిని ప్రారంభించింది. హైదరాబాద్ నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్ దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 14న ఔరంగాబాద్, జాల్నా, నిర్మల్, వరంగల్, సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకోని హైదరాబాద్ వైపు వచ్చారు. తుల్జాపూర్, తల్ముమడి నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించారు. మద్రాస్ వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. 16 వ తేదీ మధ్యాహ్నం సమయానికి భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్ లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కాసేపటి నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తయ్యింది.