డ్రగ్స్ కేసుల్లో ఏం జరుగుతోంది?ఒక్క సెలబ్రిటీకి కూడా శిక్షపడదా?ఆధారాల్లేకుండానే అరెస్టులు, విచారణలు జరుగుతున్నాయా?సెలబ్రిటీలను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారా?
ఓ రేంజ్ లో హడావుడి చేస్తారు..దేశమంతా దాని గురించే చెప్పుకుంటారు..
ఫలానా నటుడు, నటి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని..అని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటాయి.. ఓ పది పదిహేను రోజులు.. గట్టిగా ఓ నెల రోజులు ఈ వ్యవహారం చుట్టే అందరి దృష్టి ఉంటుంది. బెయిల్ ఇచ్చేది లేదంటారు..ప్రశ్నలు, విచారణలు, అబ్బో ఒకటేమిటి…ఇవాళో, రేపో ఏకంగా శిక్ష పడుతుందనే రేంజ్ లో హైప్ వస్తుంది. కొద్ది రోజులకు అందరి దృష్టి మళ్లుతుంది.. నెమ్మదిగా అందరూ మర్చిపోతారు. వన్ ఫైన్ డే క్లీన్ చిట్ అని చెప్పేస్తారు..
ఏమిటీ తంతు..?డ్రగ్స్ కేసుల్లో ఏం జరుగుతోంది?ఎందుకింత హడావుడి చేస్తున్నారు?ఎందుకు తుస్సుమనిపిస్తున్నారు?
ఇప్పుడు షారుక్ కొడుకు ఆర్యన్ కు క్లీన్ చిట్ వచ్చింది..నిర్దోషిగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వదిలేసింది.
గతంలో కూడా చాలా హడావుడి చేసిన కేసుల్లో కూడా దాదాపు ఇలాంటి ముగింపే వచ్చింది. ఇలాంటివి చూసినపుడే అనేక ప్రశ్నలు వస్తాయి. మరి ఆర్యన్ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? ఏంటీ ఈ ప్రహసనం? ఇప్పుడు నిర్దోషిగా ఎలా తేల్చారు?
షారూఖ్ కొడుకు ఒక్కడే కాదు.. డ్రగ్స్ కేసులో ఏ సెలబ్రిటీని విచారించినా చివరికా కేసులు ఎటూ తేలవు. దీపికా పడుకునే, రియా చక్రవర్తి, అనన్య పాండే… జాక్వెలిన్ ఫెర్నాండెజ్… వీళ్లందరినీ డ్రగ్స్ కేసులో ఎందుకు పిలిచారో అర్థం కాదు? ఎందుకు ప్రశ్నించారో? చివరికి ఏం తేల్చారో.. అన్నీ అయోమయాలే.. సెలబ్రిటీలను చూడాలనే మోజుతో విచారణకు పిలుస్తున్నారా? ఏమైనా ఆధారాలు ఉండి పిలుస్తున్నారా? వాళ్లని ఏ చర్యలూ లేకుండా తిరిగి మళ్లీ ఎందుకు వదిలేస్తున్నారు?
బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ అంతే… పూరీ, రవితేజ, ఛార్మి, సుబ్బరాజు, తరుణ్, తనీష్, వీళ్లందరినీ ఎందుకు ప్రశ్నించారు? ఎందుకు కేసులు పెట్టారు? చివరికి ఏం తేల్చారు? అసలు వాళ్లు దోషులా.. నిర్దోషులా? డ్రక్స్ తీసుకున్నారా? తీసుకోలేదా? ఏది తేల్చారా? ఏంటీ డ్రామా?
సెలబ్రిటీలను వేధించడం కోసం డ్రగ్స్ కేసుల్లో ఇరికిస్తున్నారా? లేక వాళ్లను ప్రశ్నించిన తర్వాత కాంప్రమైజ్ అయి వదిలేస్తున్నారా? సెలబ్రిటీల విచారణ పేరుతో నెలల తరబడి ఏంటీ ఈ దర్యాప్తు తంతు? ఇండియాలో ఒక్క సెలబ్రిటీకి అయినా, డ్రగ్స్ కేసులో శిక్ష పడుతోందా? ఇక కన్నడ, తెలుగు నటి సంజన గల్రాణీ కూడా చివరకు బెయిల్ తెచ్చుకుని హ్యాపీగా ఇంట్లో ఉంది. మరి ఏంటీ డ్రగ్స్ డ్రామా?
లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అన్ని ఆరోపణల నుంచి బయటపడ్డాడు. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో గతేడాది ఆర్యన్‌ఖాన్‌తోపాటు మరో 19 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సిట్‌కు బదిలీ అయ్యింది. దీనిపై సిట్ సుదీర్ఘంగా విచారించింది. 14 మందిపై కేసులు నమోదు చేసింది. ఐతే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆర్యన్ సహా మరో ఆరుగురిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఆ తర్వాత ముంబై కోర్టులో ఎన్సీబీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 6 వేల పేజీల ఛార్జ్‌షీట్‌లో 14 మందిపై అభియోగాలు మోపారు..
గతేడాది అక్టోబర్‌లో ముంబై తీరంలోని ఓ క్రూజ్ నౌకలో రేవ్ పార్టీ, డ్రగ్స్ వాడకం జరగడం సంచలనంగా మారింది. దీనిపై పక్కా సమాచారం ఉందని చెప్పిన ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో షారుక్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. ఆర్యన్ ఖాన్‌కు కోర్టు.. జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిగినా..ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వలేదు. చివరకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కి అతడికి వ్యతిరేకంగా తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ తీరిగ్గా తేల్చింది. ఈ కేసులో 28 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు.
అంతకుముందు కూడా బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ కేసు కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాతా రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్ కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడ్నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు పిలవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏ లింక్ లేకపోతే అధికారులు ఎంక్వైరీకి ఎందుకు పిలుస్తారనే చర్చ నడిచింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ ఓ పద్ధతి ప్రకారం కేసు సైలెంటైపోయింది.
డ్రగ్స్ కేసు శాండల్ వుడ్ లోనూ దుమారం రేపింది. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన అరెస్ట్ కు దారితీసింది. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ప్రముఖులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలొచ్చాయి. అప్పుడూ చాలా మంది ప్రముఖులకు నోటీసులిస్తారనే ప్రచారం జరిగినా.. అదేదీ నిజం కాలేదు. రాగిణి, సంజనకు కూడా మొదట్లో బెయిల్ రాకపోయినా.. తర్వాత బెయిల్ దొరికింది. అప్పట్నుంచీ ఆ కేసులోనూ అతీగతీ లేదు.
అంటే కేవలం సెలబ్రిటీల పేర్లున్నాయనే హడావుడి చేస్తున్నారా.. నిజంగా కేసు సాల్వ్ చేయాలనే చిత్తశుద్ధి అధికారులకు లేదా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
బాలీవుడ్.. టాలీవుడ్.. శాండల్ వుడ్ ఎక్కడ డ్రగ్స్ కేసు తీసుకున్నా.. మొదట్లో అధికారులు చాలా హడావుడి చేశారు. నిందితులు ఎంతటి పెద్దవారైనా వదలబోమని సినిమా డైలాగులే చెప్పారు. సినీ ప్రముఖులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించామని, కోర్టుల్లో కచ్చితంగా శిక్ష పడుతుందని కూడా చెప్పారు. కానీ వాస్తవంలో జరిగిందేమిటి? అధికారుల మాటలకు, కేసులు సాగుతున్న తీరుకు పొంతన కనిపించడం లేదు. సెలబ్రిటీల్ని ఇష్టారాజ్యంగా విచారణ పేరుతో ఇబ్బందిపెడుతున్నారా? లేక కాంప్రమైజ్ అయి వదిలేస్తున్నారా? లేకపోతే ఎలాంటి ఆధారాల్లేకుండానే కేసులు పెడుతున్నారా? ఈ ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి.
అప్పట్లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు మొదలుకుని చిన్నాచితకా నటుల వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అధికారులు కూడా చెప్పుకొచ్చారు. ఏకంగా 11 మంది సినీ ప్రముఖుల్ని విచారణకు పిలిచి.. వాళ్ల శాంపిల్స్ కూడా సేకరించడంతో.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తంతు ఎందుకు జరుగుతుందని సామాన్యులు భావించారు. కానీ నాలుగేళ్ల తర్వాత వేసిన ఛార్జ్ షీట్లో సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారా లేదా.. వాళ్లు బాధితులా.. బానిసలా.. సప్లయర్‌లా.. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
కెల్విన్ అరెస్ట్ తో మొదలైన డ్రగ్స్ కేసు విచారణ.. మొత్తం సినీ ఇండస్ట్రీ చుట్టూనే తిరిగింది. కొన్ని రోజుల పాటు హైడ్రామా నడిచింది. విచారణకు హాజరైన ప్రముఖుల ద్వారా మరింత మంది సినీ పెద్దల బాగోతాలు వెలుగులోకి వచ్చాయని, మరికొంతమందికి నోటీసులు వెళ్తాయని కూడా వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఛార్జ్ షీట్ చూశాక.. ఈ మాత్రం దానికి అంత హడావుడి ఎందుకు చేశారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు సెలబ్రిటీల్ని రోజుల తరబడి విచారించి ఏం సాధించారనే అనుమానాలు వినిపించాయి. రవితేజ, ఛార్మి, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తనీష్, ముమైత్ ఖాన్ వంటి అనేక మంది నటీనటులను సీరియల్‌గా రోజుకొకరిని చొప్పున పిలిచి.. వేసిన ప్రశ్నలే వేసి చివరికి ఏం తేల్చారంటే సమాధానం లేదు.
ప్రభుత్వ యంత్రాంగానికి వేరే పనేదీ లేనట్టు, ఏళ్ల తరబడి ఒక కేసు చుట్టూ తిరిగారు.చివరికి ఏం లేదని…కొండను తవ్వి ఎలుకను పట్టారు…అసలు సెలబ్రిటీలకి ఏం తెలియకపోతే, వాళ్లను మాత్రమే ఎందుకు పిలుస్తున్నారు? కెల్విన్ లాంటి డ్రగ్స్ పెడ్లర్స్ ఫోన్ లో సినిమా వాళ్ల నంబర్లు మాత్రమే ఉంటాయా? ఇదంతా వ్యవస్థల్ని అపహాస్యం చేయటం కాదా? ఇంతా చేసి, చివరికి డ్రగ్స్ అనేవి అసలు మన దగ్గర లేనే లేవన్నట్టుగా చేశారు.
దేశంలో వివిధ భాషల సినిమాఇండస్ట్రీలతో డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాల గురించి చాలా కథనాలు వినిపిస్తాయి. 1970ల నుంచీ బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఉందని చెబుతారు. ఇటు హైదరాబాద్ , బెంగళూర్ లోనూ సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు ఉందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ డ్రగ్స్ కేసు బయటకు వచ్చిపుడల్లా అందరూ కాకపోయినా.. కొందరైనా కచ్చితంగా డ్రగ్స్ తీసుకునే ఉంటారనే భావిస్తారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అయితే, ఏకంగా సిట్ వేశారు. ఎప్పుడూ లేని విధంగా సెలబ్రిటీల్ని గంటల తరబడి విచారించారు. దీంతో దాల్ మే కుఛ్ కాలా హై అనే డౌట్లు బలపడ్డాయి. కానీ అందరికీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చి.. మొత్తం తుస్సుమనిపించారు.
సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా అమాయకుడైతే శిక్షపడాలని ఎవరూ ఆశించరు. కానీ సెలబ్రిటీలకు వ్యతిరేకంగా ఒక్క ఆధారంగా కూడా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అదే నిజమైతే అసలు సినీ స్టార్లను విచారణ పేరుతో ఎందుకు ఇబ్బందిపెట్టారనే ధర్మసందేహం అందరికీ ఉంది. విచారణ సమయంలో జరిగిన హడావుడి చూస్తే.. కచ్చితంగా ఒకరిద్దరు స్టార్లు కటకటాలు లెక్కపెడతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో తెర వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి.
అటు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పెద్ద స్టార్ల పేర్లు బయటికొచ్చాయి. రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా దీపికా పదుకునే కూడా డ్రగ్స్ తీసుకుందనే వాట్సప్ చాట్ బయటపడటంతో.. బాలీవుడ్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ అయింది. చాటింగ్‌లో ఉన్న కోడ్ భాషలో డీ అంటే దీపిక అని, కే అంటే కరిష్మా అని అనుమానించారు. ఓ దశలో డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా అనేకమంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేసింది. వినిపించిన పేర్లన్నీ ప్రముఖ హీరోయిన్లవే. సుశాంత్,రియా, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లు తరుచుగా పార్టీలు చేసుకుంటారని కూడా చెప్పేశారు.
సుశాంత్ మరణం తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన కేసు చివరకు డ్రగ్స్ వద్దకు వచ్చి ఆగింది. దీనిపై బీటౌన్‌లో పెద్ద దుమారమే రేగింది. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ మత్తులో జోగుతోందని కొందరు, ఒకరో ఇద్దరో చేసిన పనికి అందర్నీ బ్లేమ్ చేయడం సరికాదని మరికొందరు దీంతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. బాలీవుడ్ కు డ్రగ్స్ కొత్తేం కాదని, 70 ల నుంచే చాలా మందికి ఈ అలవాటు ఉందని కొందరు చెప్పుకొచ్చారు. గతంలో కూడా పలువురు హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుని దొరికిపోయారన్నారు. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఫారిన్ వెళ్లిపోయిన కొందరు హీరోయిన్లు కూడా డ్రగ్ అడిక్టులేననేది బహిరంగ రహస్యం. ఇక సంజయ్ దత్ గురించి అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా జాకీష్రాఫ్ కు కూడా డ్రగ్స్ అలవాటు ఉందనే టాక్ ఉంది. ఈ వార్తలన్నీ ఇలా ఉంటే, ఎన్ని డ్రగ్స్ కేసులు వెలుగులోకి వచ్చినా, నాలుగు రోజుల హడావుడి, అధికారుల సంచలన ప్రకటనలు తప్ప, చివరికి తేల్చేదేం కనిపించటం లేదు.
ఇప్పుడు కూడా ఆర్యన్ ఖాన్ పెద్ద డ్రగ్స్ ఎడిక్టనే రేంజ్ లో ఎన్సీబీ హడావుడి చేసింది. కానీ, చివరికి జరిగిందేమిటి? ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్ వచ్చేసింది. ఆర్యన్ డ్రగ్స్‌తో దొరికి ఉండకపోతే, డ్రగ్స్ తీసుకుని ఉండకపోతే, క్లీన్ చిట్ ఇవ్వటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, మొదట దీన్నో సంచలనంగా, తప్పించుకోలేని కేసుగా చిత్రించి, చివరికి అబ్బే ఏం లేదని చేతులెత్తేస్తే ఎలా అర్థం చేసుకోవాలి? అధికారులు ఏ ఆధారాలు లేకుండానే టైం పాస్ అయినా చేస్తుండాలి… లేదా సెలబ్రిటీలతో బేరాలు కుదుర్చుకుని అయినా క్లీన్ చిట్ ఇవ్వాలి. ఏదో ఒకటి నిజం కావాలి కదా.. ఏమీ లేకుండా పట్టుబడిన రోజు, కేసు నమోదయిన రోజు ఆ రేంజ్ ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? ఏ ఆధారాలు లేకుంటే, ఆర్యన్ ఖాన్ ని 28 రోజులు బెయిల్ నిరాకరించి జైల్లో ఎందుకుంచారు? దీనికి అధికారులు సమాధానం చెప్పగలరా?
తప్పు చేసిన వాళ్లకు చట్ట ప్రకారం శిక్షపడాలి..శిక్ష పడాలంటే తప్పు చేశారో లేదో తేల్చాలి..
కానీ, చివరికి తేలేదేం లేకపోయినా, వచ్చేది క్లీన్ చిట్టే అయినా, నెలలు సంవత్సరాలు నరకయాతన మాత్రం తప్పటం లేదు..చివరకు సెలబ్రిటీలకు క్లీన్ చిట్ వచ్చినా.. ఇన్నాళ్ల మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారనేది సమాధానం లేని ప్రశ్నే.డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే.. సోషల్ మీడియాలో నోటికొచ్చిన రాతలు రాస్తున్నారని సెలబ్రిటీల్లో ఆవేదన ఉంది.
ఎంతో కష్టపడి సినీ కెరీర్ మొదలుపెట్టినవాళ్లు, సినిమాల్లో ఓ స్థాయికి వచ్చినవాళ్లకు.. డ్రగ్స్ కేసు మచ్చగా మారుతోందని భావిస్తున్నారు. . కొంతమంది కెరీర్లు కూడా దెబ్బతిన్నాయనే అభిప్రాయాలున్నాయి.
ఏదైనా తప్పు చేస్తే.. శిక్ష పడింది అనుకోవచ్చు. కానీ కేవలం విచారణకు వెళ్లినందుకే.. సమాజంలో దోషులుగా ముద్ర వేయించుకుని.. ఎవరికీ ముఖం చూపించలేక.. మానసిక క్షోభ అనుభవించారు సెలబ్రిటీలు.
అసలు డ్రగ్స్ కేసులో అధికారులు సరైన విచారణ చేయటంలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎలాంటి బలమైన ఆధారాల్లేకుండా సెలబ్రిటీల జీవితంతో ఆడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీల శాంపిళ్లు తీసుకుని కూడా.. వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారో.. లేదో స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కూడా.. సెలబ్రిటీల పాత్రపై ప్రస్తావన మాత్రం కనిపించదు. జెట్ స్పీడ్ లో నడిచిన విచారణ ఆ తర్వాత నత్తనడకన ఎందుకు సాగుతుందో తెలీదు. ఓ దశలో ఎందుకు దూసుకెళ్లిందో.. తర్వాత ఎందుకు నిదానించిందో చెప్పేదెవరు? దీంతో డ్రగ్స్ కేసులో లోగుట్టు పెరుమాళ్ల కెరుక అనుకోవటం తప్ప, చేసేదేం కనిపించటం లేదు.
టాలీవుడ్, అయినా బాలీవుడ్ అయినా ఇదే తీరు. అధికారులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ ప్రకారం సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ వస్తోంది అంటే అంతకాలం సెలబ్రిటీల్ని వేధించినట్టే కదా అనే ప్రశ్నలకు అధికారులే జవాబు చెప్పాలి. ఎంత సెలబ్రిటీలైనా వాళ్లూ మనుషులే. వాళ్లకూ మానవ హక్కులు, సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు, కుటుంబం అన్నీ ఉంటాయి. సినీ ప్రముఖులనే పేరుతో వారిని ఇష్టారాజ్యంగా వ్యవరించటం సరైందేనా? అనే వాదన తెరపైకి వస్తోంది. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా వ్యక్తిగతం, ప్రైవసీ ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు ఆ వ్యవహారాలు కొంతవరకు బాహాటమయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ, నేరస్తులకు కూడా హక్కులుంటాయంటారు..కానీ, డ్రగ్స్ కేసులు ఏం చేశారో లేదో తేలకుండానే సినీ ప్రముఖులు శిక్ష అనుభవిస్తున్నారు.
ఆరోపణలు మాత్రమే ఉంటాయి. పిలిపించి మాట్లాడుతున్నామంటారు.. ఇదంతా చివరికి ఓ ఎంటర్టైన్మెంట్ లా మారిపోతోంది. సమాజంలో వీఐపీ హోదాలో వెలిగిపోతున్నన సెలబ్రిటీల్ని తమ ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశామనే శాడిస్టిక్ ఆనందం పొందడానికి ఇలా చేశారా అనే ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకునే డ్రగ్స్ కేసు నడిచినన్ని రోజులు బయటకు ముఖం చూపించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా కొన్ని ఛాన్సులు కూడా వదులుకుందనే వాదన కూడా ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సంగతి సరేసరి. బాలీవుడ్ డ్రగ్స్ సామ్రాజ్యానికి ఆమే మకుటం లేని మహారాణి అన్నంత రేంజ్ లో హైప్ ఇచ్చారు. బాలీవుడ్ లో సెలబ్రిటీలందరికీ డ్రగ్స్ రియానే సప్లై చేస్తుందనే రేంజ్ లో కథ నడిచింది. కానీ రియాపై కేసు ప్రూవ్ అవలేదు. మీడియా తనను బలిపశువును చేసిందని రియా వాపోయింది కూడా. అంతకుముందే అంతంతమాత్రంగా ఉన్న ఛాన్సులున్న రియా.. డ్రగ్స్ కేసు తర్వాత ఏకంగా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మానసికంగా చాలా ఇబ్బందిపడింది. డ్రగ్స్ కేసులో తన పేరు రాగానే షూటింగ్ స్పాట్ నుంచి హడావుడిగా ఇంటికెళ్లిన రకుల్.. న్యాయ సలహా తీసుకుని మరీ విచారణకు హాజరైంది. కానీ రకుల్ పాత్రపై కూడా ఆరోపణలే కానీ.. ఆధారాలేమీ ఉన్నట్టుగా కనిపించలేదు. మీడియాలో తన క్యారెక్టర్ అస్సాసినేషన్ జరుగుతోందని ఆరోపిస్తూ కోర్టుకెక్కింది రకుల్ ప్రీత్ సింగ్. మీడియా కథనాల్ని నియంత్రించాలని విజ్ఞప్తి కూడా చేసింది.
ఇలా నంబర్ వన్ స్థానంలో ఉన్న సెలబ్రిటీ దగ్గర్నుంచి.. చిన్న చిన్న స్టార్ల వరకూ అందరూ డ్రగ్స్ కేసు కారణంగా ఇబ్బందిపడ్డవాళ్లే. మానసికంగా నరకం అనుభవించినవాళ్లే. అప్పటిదాకా తమ అపాయింట్ మెంట్ల కోసం పడిగాపులు పడ్డవాళ్లు కూడా.. డ్రగ్స్ కేసు సాకుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినవాళ్లే. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీల్ని టార్గెట్ చేసుకుని వచ్చిన పోస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎవరికి తోచిన కథ వాళ్లకు అల్లేసి.. సెలబ్రిటీల స్థాయిని దారుణంగా దిగజార్చేశారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలు.. చీడపురుగుల్లా తయార్యారని నోటికొచ్చిన తిట్లు తిట్టారు. అప్పటికీ తట్టుకోలేక విచారణ పూర్తయ్యేదాకా ఓపిక పట్టాలని కొందరు సినీ స్టార్లు విజ్ఞప్తి చేస్తే.. వారికి మాట్లాడే అర్హత కూడా లేదన్నట్టుగా రియాక్షన్లు వచ్చాయి. కేవలం డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానంతోనే ఇంత రచ్చ జరిగింది. కానీ సెలబ్రిటీల్లో అసలు డ్రగ్స్ వాడిందెవరనేది మాత్రం ఎప్పటికీ తేలని అంశమే.
ఏ కేసులో అయినా విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశం ఉంటే.. ఎక్కువ హడావుడి చేయకూడదు. కానీ ఏకంగా మీడియాకి లీకులిచ్చి.. సెలబ్రిటీలను టెన్షన్ పెట్టి.. వాళ్లేదో సిటీ వదిలేసి పారిపోయినట్టుగా బిల్డప్ ఇచ్చి.. కొంపలు మునిగిపోయినట్టుగా ఎంక్వైరీ చేసి.. చివరకు తుస్సుమనిపించడం ఏమిటో అధికారులకే తెలియాలి. ప్రతి సెలబ్రిటీని సిట్ అధికారులు ప్రశ్నలు-జవాబుల పేరుతో రోజుల తరబడి నడిచిన బాగోతం తర్వాత ఆ స్థాయి నిజాలేమైనా రాబట్టారా అంటే సమాధానం లేదు..
మొత్తంగా డ్రగ్స్ కేసు తెరమీదికి వచ్చిందంటే అధికారులు హడావుడి చేస్తారు. అందులో సెలబ్రిటీలు ఉంటే ఓవరాక్షన్ చేస్తారనే అభిప్రాయాలు పెరిగాయి. చివరికి తేల్చేదేం లేకపోయినా, పావలా విషయానికి రూపాయి గోల చేసి చివరికి క్లీన్ చిట్ ఇచ్చేసి మొత్తం వ్యవస్థలనే అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.