What is Governor Work ? Why clash with Governments?
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు పరిధులు దాటుతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలిపై కూడా చర్చ జరుగుతోంది. అసలు గవర్నర్లకు ఇచ్చిన బాధ్యతలేంటి.. వాళ్లు చేస్తున్నదేంటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణలో గవర్నర్, సీఎం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. కొన్నాళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది. గవర్నర్ మరో అడుగు ముందుకేసి.. పొలిటికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ టిఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ తీరు పైనా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనే ఉద్దేశం తోనే ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాల తరుణంలో.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అనుకోవడం లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి వెళ్లిన తర్వాత కూడా ప్రోటోకాల్ విషయంలో స్టేటస్ కో కొనసాగుతోందన్నారు తమిళిసై. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్.. తానెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటానన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి బాధితులు నిలదీసే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఓవైపు సీఎం కేసీఆర్ మౌనం పాటిస్తున్నా.. గవర్నర్ మాత్రం పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గవర్నర్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ నిరాకరణ దగ్గర్నుంచీ.. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోంది. కేసీఆర్ గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకాకపోవడం, రిపబ్లిక్ డే స్పీచ్ లో తమిళిసై కేంద్ర పథకాలు ప్రస్తావించడం, ఆ తర్వాత గవర్నర్ స్పీచ్ లేకుండానే అసెంబ్లీ సెషన్ మొదలుకావడం లాంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. గవర్నర్, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. అంతేకానీ రెండు వ్యవస్థలు ఇగోకు పోతే అంతిమంగా ప్రజలకే నష్టం జరుగుతుందనేది నిపుణుల వాదన. రాష్ట్ర పరిధిలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్.. పరిధులు దాటడమే సమస్యకు మూలమని ఓ వాదన కాగా.. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారనేది మరో వాదన. ఎవరి వాదనకు వారు గట్టిగా కట్టుబడటంతో.. చిక్కుముడి వీడటం లేదు.
గవర్నర్ రాజ్యాంగ బద్ధమైన వ్వవస్థ. ఇక్కడ వ్యక్తులు ప్రధానం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలే ప్రధానం. గవర్నర్ గా వచ్చిన తర్వాత.. రాజకీయాలకు స్థానం ఉండకూడదు. గతంలో ఈ సంప్రదాయాలు కచ్చితంగా పాటించేవారు. కానీ ఇప్పుడు విలువలకు తిలోదకాలిస్తున్నారు. గవర్నర్లు తరచుగా పరిధులు దాటుతున్నారనే విమర్శలు వస్తున్నా.. పట్టించుకోవడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుతో కీలక బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని సీఎంలు మొత్తుకుంటున్నారు.
గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా.. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలన బాధ్యతలు చూసుకోవాలి. ఎవరి పనులు వాళ్లు చేస్తే అసలు సమస్య వచ్చే అవకాశమే లేదు. కానీ ఒకరి పరిధిలోకి మరొకరు రావాలని చూసినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఎవరి పరిధిని వారు గుర్తుంచుకుని ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. గవర్నర్ తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారాలకు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుబట్టడం లేదు. కానీ నేరుగా కార్యాచరణలోకి దిగే స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలే చర్చనీయాంశమౌతున్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తలపెట్టిన ప్రజాదర్భార్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫిర్యాదుల విభాగం ఉందని.. అలాంటప్పుడు గవర్నర్ ప్రజా దర్భార్ నిర్వహించాలని అనుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని కొందరు నాయకులు కామెంట్ చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై తన పరిధి దాటుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాజకీయ కార్యాకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని కామెంట్ చేశారు.
గవర్నర్, ప్రభుత్వం మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తూనే ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అనవసర అహాలే కొంపలు ముంచుతున్నాయనే వాదన ఉంది. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్.. సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారనే అభిప్రాయాలు కలిగేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అటు గవర్నర్ కు, ఇటు ప్రభుత్వానికి ఎవరి బాధ్యతలు ఏంటి.. ఎవరి పరిధి ఏంటి అని సలహాలు ఇవ్వడానికి న్యాయ నిపుణులు ఉన్నారు. అవసరమైతే రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. కానీ చిన్న విషయం కూడా పెద్దది చేసుకుంటున్నారని.. ఎవరికి వారే తామే కరెక్ట్ అనుకుంటున్నారనే వాదన ఉంది.
గవర్నర్ పరిధికి మించి చొరవ తీసుకుంటున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అసలు గవర్నర్ వేరు.. ప్రభుత్వం వేరు కాదు. ప్రతి ప్రసంగంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ నా ప్రభుత్వం అనే సంబోధిస్తారు. అలాంటప్పుడు సమస్య ఏమిటనేది ఎవరికీ అర్థం కాని విషయం. ప్రజలతో ఎన్నికైన ఏ సర్కారు అయినా గవర్నర్ ను గౌరవించాల్సిందే. గవర్నర్ కూడా తన పరిధి మేరకు ఉండాల్సిందే. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకోలేని అమాయకులు ఎవరూ లేరు. అయితే కొన్ని కారణాల వల్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులు.. లేనిపోని దూరం పెంచేస్తున్నాయి. అటు గవర్నర్ కు, ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారులు కూడా నలిగిపోవాల్సి వస్తుంది. ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రతిష్ఠంభన ఎక్కువ కాలం ఎవరికీ మంచిది కాదు. గవర్నర్ పదవికి ఉన్న హుందాతనాన్ని కాపాడేలా వ్యవహరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
దేశంలో గవర్నర్ లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతమూ కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు, మమత బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పెద్ద సంక్షోభమే నడిచింది. గవర్నర్ అసెంబ్లీ వద్ద కు వెళ్లి గేటు వద్ద నిలబడవలసిన అరుదైన ఘట్టం జరిగింది. మమత ప్రభుత్వాన్ని రకరకాలుగా గవర్నర్ ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలొచ్చాయి. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ కు, సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వానికి మద్య అంతగా మంచి సంబంధాల్లేవు. గవర్నర్ వ్యవస్థ ఉండాలా?వద్దా అన్న చర్చ కూడా చాలాకాలంగా సాగుతోంది.తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నర్ ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో తీర్మానాలు చేసింది.
రాష్ర్టాల పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకొంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్, సీఎం మమత మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. పాలనా వ్యవహారాల్లో ధన్‌కర్ జోక్యం పెరిగిందని మమత తరచూ ఆరోపిస్తూ వచ్చారు అధికారులను గవర్నర్ పదే పదే రాజ్‌భవన్‌కు పిలిపించుకొని వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ఆయనను బ్లాక్ చేశారు. మమత ఆరోపణలపై ధన్‌కర్ స్థాయిని మరిచి స్పందిస్తున్నారు.
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన దగ్గరే పెట్టుకొన్నారు. నెలలు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా సీఎం స్టాలిన్ కలిసి గుర్తు చేయడంతో గవర్నర్ కదిలారు. బిల్లును తిప్పి పంపారు. పైగా, నీట్ మంచిదే అని రాజకీయ ప్రకటన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ ప్రభుత్వం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపింది. దీంతో పాటు ద్రావిడులపై రవి చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఎన్నిక ప్రక్రియకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ మోకాలడ్డుతున్నారు. 2021 ఫిబ్రవరిలో అప్పటి స్పీకర్ నానా పటోల్ రాజీనామా చేశారు. డిసెంబర్‌లో శీతాకాల సమావేశాల్లోనూ స్పీకర్ ఎన్నికకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలుపలేదు. కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న ఉద్ధవ్ సర్కారు కూలి.. షిండే సర్కారు ఏర్పడింది. ఈ పరిణామానికి ఊతమివ్వడానికే గవర్నర్ అలా వ్యవహరించారనే వాదన ఉంది.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పట్నుంచో గ్యాప్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని ఎల్జీజి కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మరో వివాదం తలెత్తింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ్‌పూర్ పర్యటనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి నిరాకరించారు. ఆగస్ట్ 1న సింగపూర్‌లో జరిగేది మేయర్ల సదస్సు అని, పట్టణ పాలనలోని వివిధ అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎంసీడీ, డీడీఏ, ఎన్డీఎంసీ వంటి సంస్థల పరిధిలోకి ఢిల్లీ ప్రభుత్వం రాదని చెప్పారు. ఆయా సంస్థలకు సంబంధించిన అంశాల సదస్సులో సీఎం పాల్గొనడం సబబు కాదని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో సీఎం పాల్గొంటే చెడ్డ ఉదాహరణకు కారణమవుతారని పేర్కొన్నారు. సింగపూర్ టూర్‌కు వెళ్లవద్దని కేజ్రీవాల్‌కు ఎల్జీ సూచించారు. కాగా, సింగపూర్ టూర్‌కు ఎల్జీ అనుమతించకపోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ సలహాతో విభేదిస్తున్నట్టు బదులిచ్చారు. దేశంలోని ప్రతి రాజ్యాంగ అధికారి పర్యటనను ఆ అధికార పరిధిలోని అంశాల ఆధారంగా నిర్ణయించడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రధాని కూడా తన అధికార పరిధిలో లేని రాష్ట్రాల అంశాలను విదేశీ టూర్లలో చర్చిస్తారని, అలాంటప్పుడు ప్రధాని కూడా ఎక్కడికీ వెళ్లలేరని అందులో పేర్కొన్నారు. సింగపూర్ సదస్సుకు వెళ్లడంపై ముందుకు సాగాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. దీని కోసం నేరుగా విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ నగరాల సదస్సుకు సింగపూర్ ప్రభుత్వం తనను ప్రత్యేకంగా ఆహ్వానించిందని కేజ్రీవాల్ తెలిపారు.
ముఖ్యమంత్రులైనా.. గవర్నర్లు అయినా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించార. ఏ వ్యవస్థకు నిర్దేశించిన బాధ్యతలు వారికి ఉన్నాయి. ఎవరికి వారు పరిధి దాటకుండా పనిచేస్తే వివాదాలకు చోటే ఉండదు. కానీ లక్ష్మణ రేఖను దాటినప్పుడే ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రం గాడి తప్పిందనే మాట గట్టిగా వినిపిస్తోంది. గవర్నర్ పదవిలో ఉన్నవాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వాస్తవంలో కొన్నిసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అదే సమస్యకు దారితీస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం రాష్ట్ర వ్యవహారాల పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం, గవర్నర్ ప్రాధమిక విధి. ఒక రాష్ట్రం కార్యనిర్వాహక, శాసన సంస్థలపై గవర్నర్ చర్యలు, సిఫార్సులు, పర్యవేక్షక అధికారాలు రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విషయంలో, గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఉన్నాయి.
గవర్నర్‌కు రెండు రకాల అధికారాలుంటాయి.ఒకటి.. రాజ్యాంగబద్ధమైనవి. రెండు.. సందర్భాన్ని అనుసరించి. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయవలసి వచ్చినప్పుడు, మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్లు స్వంత నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవలసి వచ్చినప్పుడు, తన అభీష్టానుసారం వ్యవహరించవచ్చు.
కేంద్రపాలిత ప్రాంత నిర్వాహకునిగా అదనపు బాధ్యతను అప్పగించినప్పుడు, స్వంత అభీష్టానుసారం చర్యలు తీసుకోవచ్చు.
ష్ర్టాల గవర్నర్లు కొన్ని సందర్భాలలో తమ అభీష్టానుసారం పని చేయవచ్చు. ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు లేదా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మరణించడం వల్ల కొత్త ముఖ్యమంత్రిని నియమించవలసి వచ్చినప్పుడు.
రాష్ట్ర శాసనసభలో విశ్వాసాన్ని అధికారపక్షం నిరూపించుకోలేకపోవడంతో మంత్రిమండలిని రద్దు చేయవలసి వచ్చినప్పుడు. ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో రాష్ట్ర శాసనసభను సకాలంలో రద్దు చేయవలిసి వచ్చినప్పుడు. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా కోసం ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు, గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌కు వేర్వేరు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు, నాగాలాండ్‌లోని నాగా హిల్స్-తుయెన్సాంగ్ ప్రాంతంలో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్నంత కాలం రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి, అస్సాంలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి, మణిపూర్‌లోని కొండప్రాంతాల పరిపాలనకు సంబంధించి, సిక్కింలో వివిధ వర్గాల శాంతి, సామాజిక, ఆర్థిక పురోగతి కోసం అధికారాలు ఉపయోగించవచ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి, కర్ణాటకలో హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు కూడా గవర్నర్ విచక్షణ పనిచేస్తుంది.
ప్రత్యేక సందర్భాలు కాకుండా.. ఇతర సందర్భాలలో రాజ్యాంగపరమైన అనుమతిని దాటి గవర్నర్ తన ఇష్టప్రకారం వ్యవహరించటం రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రజల తీర్పు పైన దాడిగా దాన్ని చూడాలంటున్నారు నిపుణులు.
రాజ్ భవన్, ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారాలు వీధికెక్కాల్సిన పనేలేదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, గవర్నర్ సెక్రటరీల మధ్య జరిగే ఉత్తరప్రత్యుత్తరాలపై కూడా రాజకీయ విమర్శలు రావడం నిజంగా దురదృష్టకరం. ఆటోమేటిగ్గా నడిచిపోవాల్సిన ప్రక్రియకు అనవసర అడ్డంకులు ఏర్పడి.. అనుకోని వివాదాలకు దారితీయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
గవర్నర్లు ప్రభుత్వాలతో సుహృద్భావ వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతోనే సమయానుకూలంగా తేనీటి విందులు ఏర్పాటు చేస్ సంస్కృతి మొదలైంది. ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల్ని ఆహ్వానించడం ద్వారా.. గవర్నర్ అందరికీ యాక్సెసబుల్ అనే సంకేతాలు వెళ్తాయి. కానీ ఇప్పుడు గవర్నర్ల అపాయింట్ మెంట్లపై కూడా చర్చ జరిగే పరిస్థితి ఉంది.
గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్యానికి పూర్వం బ్రిటీషు పాలన నుంచి ఉంది. అప్పట్లో వైశ్రాయ్ అనేది కీలకమైన పదవి. గవర్నర్ అనేది కార్య నిర్వాహక అధిపతి. బ్రిటీషు చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఓ గవర్నర్ అవసరం. ఆర్టికల్ 154 ప్రకారం కార్యనిర్వాహక అధికారముంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్ధం. సెక్షన్ 159 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించే అధికారముంటుంది. పేరుకు కార్య నిర్వాహక అధికారి అయినా..వాస్తవాధికారం మాత్రం మంత్రివర్గానిదే. తిరిగి అదే మంత్రివర్గానికి శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి సూచన మేరకు చేసేది కూడా గవర్నరే.
శాసన సభ్యులుగా శాసనసభకి వెళితే వారు శాసనవ్యవస్థలో భాగం అవుతారు. కానీ అదే వాళ్ళు ముఖ్యమంత్రిగానో లేక మంత్రిగానో, సచివాలయానికి లేక ఆయా మంత్రిత్వశాఖలకు వెళ్లినప్పుడు వారు ఎగ్జిక్యూటివ్‌లో భాగం. ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా ఉండేది గవర్నర్. గవర్నర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహించాలి. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు లేక మంత్రులు వెళ్లి స్వాగతం పలకాలి అని ఏమి లేదు. కాకపోతే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎలాగయితే స్వాగతం పలకాలో అలానే గవర్నర్‌కి కలెక్టర్లు, ఎస్పీలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు సర్కారియా కమిషన్, వెంకటచల్లయ్య కమిషన్, పూంచి కమిషన్ నివేదికల్లో స్పష్టంగా పొందుపరిచారు. గవర్నర్‌కి స్వాగతం పలకడం వంటివి అధికారులు చేయవలసి ఉంటుంది. వారికి నివాస సదుపాయాలు లాంటివి కూడా చూసుకోవాలి. కానీ హెలికాఫ్టర్లు ఇవ్వాల్సిందే అనేది ఎక్కడా లేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్వవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశ్యంతో కొనసాగిస్తున్నారు. కానీ ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్‌కు ఉంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అంతిమ అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని తటస్థులను నియమించాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అప్పుడే ఆ పదవికి న్యాయం చేసినట్టవుతుందనే అభిప్రాయాలున్నాయి.
గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగ సభ వివరంగా చర్చించింది. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్‌కు అత్యధికంగా అధికారాలు ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన ప్రాధాన్యత స్వతంత్ర భారతావనిలో అవసరం లేదని, దీనివల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని రాజ్యాంగ సభ సభ్యులు అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఏర్పడితే, మంత్రిమండలి రాజీనామా చేస్తే, గవర్నర్ మరో మంత్రిమండలిని నియమించుకోవటానికి వీలు లేదు అని స్పష్టం చేశారు. గవర్నర్, మంత్రిమండలి మధ్య సంబంధం బ్రిటిష్ రాజు-అక్కడి మంత్రిమండలి సంబంధం లాగానే ఉండాలని, గవర్నర్‌కు ఎలాంటి విశేష అధికారాలు ఉండకూడదని రాజ్యాంగ సభకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం, శాంతిభద్రతలకు, ప్రశాంతతకు ముప్పు వాటిల్లి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సమావేశపరచడమో లేక రద్దు చేయడమో తప్ప ఎలాంటి అధికారం గవర్నర్‌కు ఉండదని రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టం చేశారు. గవర్నర్ అనేది నామినేటెడ్ పదవి అనీ, రాష్ట్రపతిలాగా ఎన్నుకోబడినది కాదు కనుక, ఎటువంటి విచక్షణ అధికారాలనైనా కలిగి ఉండటం సూత్రప్రాయంగా తప్పు అనీ, రాజ్యాంగ, ప్రభుత్వ సిద్ధాంతాలకూ, సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు స్వయంగా నిర్వర్తించే విధులు లేవని, ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ 163 ప్రకారం- మంత్రివర్గం సలహాను తప్పక అంగీకరించాలని అంబేద్కర్ చెప్పారు. ఏదో విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి, క్యాబినెట్ నిర్ణయాన్ని భంగపరచడానికి ఆర్టికల్-163 వీలు కల్పిస్తుందనే విమర్శ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అంబేద్కర్ చెప్పారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలను నిర్వచించే క్రమంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను ప్రస్తావించి రాష్ర్టాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యతను తెలియచేసింది.
కార్యనిర్వాహక వ్యవస్థలో అంటే ప్రభుత్వంలో భాగం గవర్నర్. ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నిందించలేదు. ప్రభుత్వ ప్రతిస్పందనను గవర్నర్ బహిరంగంగా అడగలేరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ నిందిస్తూ, తనకు తాను కార్యనిర్వాహకవర్గానికి దూరమై, ప్రతిస్పందనను కోరుతున్నట్లయితే, దానిని రాజకీయ ఉద్దేశంతో చేసిన చర్యగా భావించాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో అందర్నీ కలుపుకుపోయే శక్తిని రాజ్యాంగమే ప్రసాదించింది. దేశ ప్రజల అఖండతను పరిరక్షిస్తూ, భారతీయులు సవాళ్లను ఎదురొడ్డి నిలిచేటట్టు తీర్చిదిద్దింది కూడా మన రాజ్యాంగమే., దేశానికి రాష్టప్రతి అధిపతి అయితే రాష్ట్రాలకు గవర్నర్లు అధిపతులు. రాష్టప్రతికి ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం, పార్లమెంటు వ్యవహరిస్తాయి. కేంద్రంలో ప్రధానమంత్రికి ఉన్న స్థానం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి ఉంటుంది. రాష్టప్రతి, గవర్నర్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వారి ఎన్నిక, విధులు, బాధ్యతలతో పాటు పార్లమెంటు, ఇతర చట్ట సభలు , సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్ సర్వీసు కమిషన్లు, రాజ్యాంగ సంస్థలు గురించి రాజ్యాంగంలో వివరంగా పొందుపరిచారు. ఈ గైడ్ లైన్స్ పాటిస్తే వివాదాలకు అవకాశమే లేదంటున్నారు నిపుణులు.