అవే కథలు…అవే డైలాగ్‌లు…అదే స్క్రీన్ ప్లే…టాలీవుడ్ ఇంకెప్పుడు మారుతుంది ? వాట్సాప్‌లో వచ్చే కుళ్లు జోకులు…జబర్దస్త్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లేనా ? కొత్త కాన్సెప్ట్‌లు…కొత్త స్టోరీలు మనకు దొరకవా ? లేదంటే మన దర్శకులు రాసే ప్రయత్నం చేయరా ? బాలీవుడ్, మల్లూవుడ్ దర్శకులకు డిఫరెంట్ స్టోరీలు ఎలా దొరుకుతున్నాయి ? టాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తీసిన కథలే…తిప్పి తిప్పి మళ్లీ మళ్లీ తీస్తున్నారు. ఒక సినిమాలో పెట్టిన సీన్లనే సిగ్గు ఎగ్గు లేకుండా కాపీ కొట్టేస్తున్నారు. ఎవరేం అనుకుంటే మాకేంటి అన్నట్లు దర్శకులు, హీరోలు వ్యవహరిస్తున్నారు. కొత్తదనంతో సినిమా తీద్దాం…కొత్తగా డైలాగ్‌లు రాద్దామనే ఆలోచన అసలు లేదు. కొంచెం కూడా బుర్రకు పని చెప్పడం లేదు. నయా కాన్సెప్టుల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు. బాలీవుడ్, హాలీవుడ్, ఇండియన్ మూవీస్‌ను చూడటం…ఆ సినిమాలన్నింటిని కలిపి గ్రైండర్ వేయడంలో మన టాలీవుడ్ దర్శకులు ఆరితేరిపోయారు. కొందరు దర్శకులు పాత సినిమాల్లో కాన్సెప్టులను కాపీ కొట్టడం…దానికో కొత్త టైటిల్ పెట్టడం….పబ్లిసిటీ చేసుకోవడం కామన్ అయింది.
టాలీవుడ్ దర్శకులు బుర్ర లేని వారని…తాము తీసే సినిమాలతో నిరూపించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలే టాలీవుడ్ దర్శకులు పని తీరును నిరూపిస్తున్నాయి. మల్లూవుడ్, బాలీవుడ్ సినిమాలు కొత్త కాన్సెప్టులు….కథలు…డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దుమ్ము రేపుతున్నాయి. ఆడియెన్స్ కూడా ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. థియేటర్లకు జనం క్యూకడుతున్నారు. కానీ మన దర్శకులు, హీరోలు మాత్రం మారడం లేదు. మేమింతే…మేం తీసిందే సినిమా…మేం చెప్పిందే కథ అంటున్నారు దర్శకులు…హీరోలు తానా అంటే…దర్శకులు తందానా అంటూ ఒకరికొకరు భజన చేసుకుంటున్నారు.
టాలీవుడ్ హీరోలు…తమకు భజన చేసే దర్శకులకే పెద్ద పీట వేస్తున్నారు. కథ పాతదయినా…కాన్సెప్టు కొత్తగా లేకపోయినా…స్క్రీన్ ప్లే సో సో అయినా…తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మన డబ్బా…పర డబ్బా…పరస్పర డబ్బా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మళయాళం, బాలీవుడ్ దర్శకులతో మనోళ్లు పోటీ పడలేకపోతున్నారు. వాళ్లే కలెక్షన్లు, కథలతో దూసుకుపోతుంటే…మనోళ్లేమో ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు పరిస్థితిని తయారు చేసుకుంటున్నారు. వాట్సాప్‌ల్లో వచ్చే కుళ్లు జోకులు….జబర్దస్త్‌లో వచ్చే డబుల్ మీనింగ్ కామెడీ సీన్లనే నమ్ముకుంటున్నారు. మన దర్శకులు సొంతంగా ఆలోచించడం ఎప్పుడో మానేశారు.
సినిమాలో ఎంతసేపు హీరోల ఎలివేషన్లేనా. ఒక పిస్తల్‌తో వంద మందిని కాల్చేసే ఓవర్ యాక్షన్ సన్నివేశాలేనా. స్వకుచ మర్దనాలతో ఎంతకాలం గడుపుతారు. వీటి నుంచి తెలుగు సినిమా రంగం ఎప్పుడు బయట పడుతుంది. టాలీవుడ్ రేంజ్ ఎప్పుడు పెరుగుతుంది. చౌకబారు స్టోరీలు, రోత పుట్టించే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు…మూసకథలు, భజన డైలాగ్‌లతోనే కాలం గడిపేస్తారా ? కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయరా ? తమిళ్, మళయాళం, బాలీవుడ్ దర్శకులు…ఓ వైపు దూసుకుపోతున్నారు. డిఫరెంట్ ప్రజెంటేషన్…స్క్రీన్ ప్లేతో తలపండిన డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు.
నాలుగు కామెడీ సీన్ల చుట్టూ కాన్సెప్టును తయారు చేసుకోవడం…బడా హీరోల ఒప్పిచి సినిమాలు తీస్తున్నారు. దాన్నే కొత్త కథ అంటూ ప్రేక్షకుల మీదకు వదులుతున్నారు. కొత్తదనం లేని కథలతో సినిమాలు తీస్తే…ప్రేక్షకులు ఎందుకు చూడాలి. కొంచెమైనా బుద్ది ఉండక్కర్లేదా ? మనకు బుర్రలేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు…డైరెక్టర్లు సోమరిపోతుల్లా తయారువుతున్నారు. మనం ఇంకా వాట్సాప్ జోకులు… జబర్దస్త్ కామెడీల దగ్గరే ఆగిపోయాం. నాలుగు కామెడీ స్క్రిప్ట్లు రాసుకొని …దాని సినిమా తీస్తూ దౌర్బగ్యంలో ఉండిపోయాం. కొత్త కాన్సెప్టులు…కొత్త కథలు…కొత్త స్క్రీన్ ప్లేను ఎప్పుడు నేర్చుకుంటుంది. మన దర్శకులు ఎప్పుడు మారుతారు. ఓటీటీలు వచ్చాక…టాలీవుడ్ దర్శకులు డొల్లతనం…మేధావితనం బయటపడుతోంది.
తమిళ్, మలయాళం దర్శకులు…చిన్న కాన్సెప్టుతోనే అదిరిపోయే సినిమాలు తీస్తున్నారు. అలా మన టాలీవుడ్ డైరెక్టర్లు ఆలోచిస్తారు. ఎంతసేపు భారీ బడ్జెట్లు…స్టార్ కాస్ట్….లోకేషన్లు…గ్రాఫిక్స్‌ను నమ్ముకోవడం మనేస్తారా ? మారుతున్న కాలానికి అనుగుణంగా కాన్సెప్టు…స్క్రీన్ ప్లే…కథలు రాసుకోకపోతే….అప్పట్లో ఒకటి ఉండేదని టాలీవుడ్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావడం గ్యారెంటీ…అదెంతో కాలం లేదు….
మల్లూవుడ్, కొలివుడ్‌ను చూసి…తెలుగు హీరోలు దర్శకులు ఎంతో నేర్చుకోవాలి. కాన్సెప్టులు, స్క్రీన్ ప్లే, టేకింగ్ విధానంలో టాలీవుడ్ చాలా వెనుకబడింది. భారీ బడ్జెట్లు…పెద్ద సెట్టింగ్‌లు…విదేశాల్లో షూటింగ్‌లు…టాలీవుడ్‌కు ఇవి మాత్రమే తెలుసా ? డైరెక్టర్లు…హీరోలు ఎప్పుడు మారుతారు ?
ప్రేక్షకులు వినోదం కోసం, నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం, ఫిల్మ్‌స్కూల్ విద్యార్థులు కేస్‌స్టడీ కోసం, రచయితలు వినూత్నమైన ఐడియాల కోసం.. కొత్త మలయాళ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కథలో కొత్తదనం, కథనంలో వైవిధ్యం, సంభాషణల్లో సహజత్వంతో.. భారతీయ సినిమా పరిశ్రమకు సరికొత్త ఫిల్మ్ మేకింగ్ పాఠాలు నేర్పుతోంది మాలీవుడ్. టాలీవుడ్ పాత కాన్సెప్టులతో తిరుగుతుంటే…మల్లూవుడ్, కొలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం రోజుకో కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకులను మాయ చేస్తోంది. ఇలా కూడా సినిమాలను తీయవచ్చా అని కుళ్లు ? సున్నితమైన అంశాలను…తమ టేకింగ్‌తోనే అందరగొడుతున్నారు. టాలీవుడ్‌లో మాత్రం….ఎంతసేపు అవే కథలు. ఉస్తాద్‌భగత్, మన శంకర వరప్రసాద్…అన్ని హీరోల ఎలివేషన్ ఇచ్చేవి. దర్శకులు కూడా హీరోల భజనం చేయడంలో ముందుంటున్నారు.
మలయాళం సినిమాల్లో భారీ బడ్జెట్‌లు ఉండవు. ఖరీదైన సెట్టింగులు…అసలు కనిపించవు. పంచ్ డైలాగులు…అన్నవే వినిపించవు. గ్రాఫిక్స్ మాయతో గారడి చేయవు. ఇవన్నీ లేకుంటే సినిమా ఎలా తీస్తారని అనుమానం రావొచ్చు. ఏ కథకైనా ఆత్మ ఉంటుంది. పాత్రల్లో జీవకళ తొంగిచూస్తుంది. సంభాషణల్లో సహజత్వం తొణికిసలాడుతుంది. ఆలూమగలు మాట్లాడుకున్నట్టూ, ప్రేమికులు ఊసులు చెప్పుకున్నట్టూ, ఇరుగుపొరుగు ముచ్చట్లు పెట్టుకున్నట్టూ అతి సహజంగా సాగి పోతాయి. కాకపోతే, కథ వేగం అందు కోడానికి కొంత సమయం పడుతుందంతే. కొన్నిసార్లు అసలు కథ అనేది ఉందా అనే అనుమానమూ కలుగుతుంది. అదే మలయాళం దర్శకుల మాయ. కథ ఉంటుంది…స్క్రీన్ ప్లే ఉంటుంది…సస్పెన్స్..సహజత్వం…ఇలా అన్ని ఉంటాయి. ఎక్కడా స్టార్లు కనిపించరు. అన్నీ పాత్రలే కనిపిస్తాయి. ఎవరూ నటించరు…ఆ పాత్రలో పరిపూర్ణంగా జీవిస్తారు.
అదే మన తెలుగు సినిమాల్లో అయితే భారీ సెట్టింగ్‌లు….గ్రాఫిక్స్…డైలాగ్‌లు…ఇలా ఒకటేమిటి. అన్ని హీరోలకు ఎలివేషన్ ఇచ్చేవే. డైరెక్టర్లు కూడా హీరోలను దృష్టి పెట్టుకొనే కథలు రాస్తున్నారు. అహో ఓహో అనే రేంజ్‌లో భారీ డైలాగ్‌లు పెడుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలే కనిపిస్తారు తప్పా…ఎక్కడ నటులు పాత్ర ఒదిగిపోయినట్లు చూపించరు. ప్రతి ఫ్రేమ్ కూడా హీరోనే సర్వంతర్యామి అనేలా బిల్డప్ ఇస్తున్నారు. అందుకే తెలుగు సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి. మలయాళ చిత్రాలు మాత్రం…తెలుగు సినిమాల పోటీని తట్టుకుని థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తునాయి. ఓటీటీ క్లిక్కుల్లో దూసుకుపోతున్నాయి.
మలయాళం దర్శకులు…సరికొత్త కాన్సెప్టులతో పోటీ పడుతున్నారు. ఏ ఇండస్ట్రీ సాటిరాని విధంగా…కథల ఎంపికలో, టేకింగ్‌తో..స్క్రీన్ ప్లేతో మల్లూవుడ్ దర్శకులు టాలెంట్‌కు పదును పెడుతున్నారు. తెలుగు సినిమాల్లో ఉన్నట్లు భారీ తారాగాణం ఉండదు…డబుల్ మీనింగ్ డైలాగ్‌లు అసలు ఉండవు. యాక్షన్ సీన్స్ కనిపించవు. హీరోలు కనిపించరు. కథ…పాత్రల చుట్టూ సినిమా తిరుగుతుంది. టాలీవుడ్‌లాగా స్వకుచ మర్దనాలు అన్నవి మచ్చుకైనా కనిపించవు. తెలుగులో హీరోల కోసం…హీరోలు చుట్టూ….స్టోరీ మొత్తం తిరిగేలా స్టోరీలను రాసుకుంటున్నారు. కానీ మళయాలంలో కథ బలం. తెలుగులో అయితే హీరోనే బలం. ఇలా ఉంటే సినిమాలు ఎలా హిట్టవుతాయి. నిర్మాతలకు ఎలా డబ్బులు వస్తాయి. దీన్ని మాత్రం మన దర్శకులు ఆలోచించే ప్రయత్నం చేయరు.
మలయాళ దర్శకులు తక్కువ బడ్జెటతో భారీ కలెక్షన్లు రాబడుతున్నారు. అక్కడి డైరెక్టర్లకు దొరుకుతున్న కథలు మనకు ఎందుకు కనిపించడం లేదు. వాళ్లలా మన దర్శకులు ఆలోచించడం లేదు. కొత్త కాన్సెప్టులు ముట్టుకుంటే పరాభవం ఎదురవుతుందని భయపడుతున్నారు. 2018 నూట డెబ్భై అయిదు కోట్లు కొల్లగొట్టడమే కాదు.. ఆస్కార్‌కూ షార్ట్‌లిస్ట్ అయ్యింది. ప్యారడైజ్ అనే సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఆడింది. దృశ్యం సిరిస్ ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు తక్కువే. ఫారిన్ లొకేషన్లూ, ఖరీదైన సెట్టింగులూ పెద్దగా కనిపించవు. చాలా సినిమాలు ఓ పల్లె చుట్టుపక్కలో, ఓ ఇంటి పరిసరాల్లోనో తిరుగుతాయి. జీరో సైజ్ హీరోయిన్లూ, సిక్స్‌ప్యాక్ హీరోలూ వాళ్ల కాస్టింగ్ లిస్ట్‌లో ఉండరు. కాస్టూమ్స్ ఖర్చూ నామమాత్రమే. పురుషులైతే లుంగీలదే హంగామా. స్త్రీ పాత్రలకు నైటీలతోనే తెల్లారిపోతుంది. పాడుబడిన బంగళాలో పద్దెనిమిదో శతాబ్దపు వాతావరణంలో, మూడునాలుగు పాత్రలతో నిర్మించిన మమ్ముట్టి నలుపు తెలుపు సినిమా భ్రమయుగం వందకోట్ల క్లబ్‌లో చేరింది. ప్రమాదంలో చిక్కుకున్న మిత్రుడి కోసం ఓ స్నేహబృందం పడిన తపన మంజుమ్మల్ బాయ్స్ పేరుతో రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇలాంటి కొత్త కాన్సెప్టులతో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయి ? ఎంత మంది హీరోలు కొత్తదనానికి రెడ్ కార్పెట్ పరిచారంటే సమాధానం లేదు. అలాంటి ప్రయత్నం చేయడానికి కూడా సాహసించడం లేదు.
ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం…అంటే ప్రేక్షకులు కలెక్షన్లు ఇచ్చేస్తారా ? సినిమాలను హిట్ చేస్తారా ? కథ, కథనం అక్కర్లేదా ? మలయాళం దర్శకుల రాని కథల కొరత మనకే ఎందుకు వస్తోంది ? కొత్త కాన్సెప్టులకు ఆహ్వానం పలకకపోతే…టాలీవుడ్ దర్శకులు దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనా?
హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి పరిశ్రమనూ కథల కొరత వేధిస్తూనే ఉంటుంది. ఎవరి పద్ధతిలోవారు స్టోరీలను వండివార్చుకుంటారు. ఈ విషయంలో మల్లూవుడ్‌కు ట్రేడ్‌మార్క్ ఫార్ములా ఉంది. తనకంటూ ఓ నియమం పెట్టుకుంది. ఇక్కడ ఫారిన్ సరకును రీసైకిల్ చేయరు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల సీన్లు చించేసి వాడుకోరు. ప్రతికథకూ జీవితమే నేపథ్యం. ప్రతిపాత్రా జనంలోంచి పుడుతుంది. నిజానికి మనకు కథల కొరత లేదు. ఉన్నదంతా ఆలోచనల కొరతేనని…మలయాళ సినిమాలు చూసిన వారికి అర్థం అవుతుంది. మలయాళ సినిమా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అక్కడి దర్శకులు చెబుతున్నారు. కొంతకాలంగా ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథలనే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మలయాళ పరిశ్రమ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. మన దర్శకులు మాత్రం…ఊహల్లో తేలిపోతున్నారు. హీరోలతో పంచ్ డైలాగ్‌లు చెప్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తెలుగు పరిశ్రమలో హీరోల పారితోషికమే పావువంతు ఉంటుంది. అదనంగా పంపిణీ హక్కులు అడుగుతారు. పైగా తాను సూచించిన సహనటులే ఉండాలి…నిర్మాతలుగా తమ కుటుంబసభ్యులే ఉండాలి…చెప్పుకుంటూ పోతే ఎన్నో కండిసన్లు పెడతారు. అందుకే తెలుగు సినిమాల్లో కొత్తదనం ఉండటం లేదు. ప్రేక్షకులు కూడా సినిమాలను బండకేసి కొడుతున్నారు. కనీసం వారం కూడా థియేటర్లలో ఆడటం లేదు. హీరోలు, దర్శకులు…ఆలోచనా విధానం మారాలి. హీరోలు, దర్శకులు కొత్త దనానికి స్వాగతం పలకాలి. నయా కాన్సెప్టులతో వచ్చే దర్శకులను ప్రొత్సహించాలి. అప్పుడే తెలుగు సినిమా రంగం బాగుపడుతుంది.
మలయాళం ఇండస్ట్రీలో హీరోల బాధ అసలే ఉండదు. సూపర్‌స్టార్ల రెమ్యునరేషన్లు చిన్న నిర్మాతలకూ అందుబాటులో ఉంటాయి. దీంతో నిర్మాణ ఖర్చులు అదుపు తప్పవు. అదే సమయంలో రచయితలకు ఏమాత్రం తక్కువ చేయరు. ఫలితంగా నాణ్యమైన స్క్రిప్ట్స్ వస్తున్నాయి. కథ, కథనం, స్క్రీన్ ప్లే, పరిశోధన.. ఇలా దర్శకుడే సకల బాధ్యతలనూ తీసుకోవాలని అనుకోడు. కథ అల్లేవాడు కథ మీదే దృష్టి పెడతాడు. దర్శకుడి పని దర్శకుడిదే. అన్నిటికీ మించి హీరోలు ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోరు. కాబట్టే, సూపర్ స్టార్ మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి పాత్ర పోషించగలిగాడు. ఫహాద్ ఫాజిల్ సైకో పాత్రలకు ఒప్పుకున్నాడు. మమ్ముట్టి చేసిన గే పాత్ర అయినా….ఫహద్ ఫాజిల్ చేసిన సైకో పాత్ర అయినా…తెలుగు ఏ హీరో చేయగలడు. చేసే దమ్ము…ఎంత మందికి ఉంది అంటే సమాధానం లేదు. కథల ఎంపికలోనే మనకు సరైన క్లారిటీ ఉండటం లేదు. అలాంటపుడు సినిమాలు ఎలా హిట్టవుతాయి.
అంధురాలైన ఓ శిల్పకారిణి తనపై జరిగిన అఘాయిత్యాన్ని కోర్టుకు ఎలా వివరిస్తుంది ? అనే కోణంలో సాగే నేరు మూవీలో… మోహన్‌లాల్ నటనా కౌశలానికి అద్దం పడుతుంది. సురేశ్ గోపి హీరోగా వచ్చిన గరుడన్ ఓ వినూత్న ప్రయోగం. సగం సినిమా ఒక కోణంలో సాగుతుంది. ఒక పాత్రను ద్వేషిస్తాం. మరో సగం ఇంకో కోణంలో నడుస్తుంది. అదే పాత్రను ప్రేమిస్తాం. ప్రేక్షకుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం మలయాళ దర్శకులకు బాగా తెలుసు. గ్రేట్ ఇండియన్ కిచెన్.. వంటింట్లో నలిగిపోతున్న ఓ యువతి హృదయాన్ని ఆవిష్కరించింది. మలిసంధ్యలో ఒంటరి జీవితం గడుపుతున్న ఓ తండ్రి, తన కొడుకు రూపొందించిన రోబోతో అనుబంధాన్ని ఎలా పెంచుకుంటాడో ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25లో చూపించారు.
ఇలాంటి సినిమాలు మలయాళంలో తప్పించి ఎక్కడా తీయరు, తీయలేరు కూడా. గోట్ లైఫ్ మూవీ ఎన్నో రికార్డులు సృష్టించింది. దాదాపు పదహారేళ్ల పాటు ఈ చిత్రం కోసమే పనిచేశారు దర్శకుడు బ్లెస్సీ. ఎంత ఒత్తిడి వచ్చినా సరే, ఇంకో ప్రాజెక్ట్ తీసుకోలేదు. సినిమాపై అంత ఫోకస్ చేసినందునే…భారీ కలెక్షన్లు సాధించింది. గోట్ లైఫ్ సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. అయ్యప్పన్ కోషియమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ పర్సన్‌లు ఒకరికొకరు ఢీ అంటూ పవర్, ఈగో, బలాబలాలను చూపించుకుంటుంటారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రాన్నే తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేశారు. మలయాళంలో హిట్టయిన ఎన్నో సినిమాలను…తెలుగులో రీమేక్ చేశారు. కొన్నింటిని డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు. అన్ని హిట్ అయ్యాయి. అలాంటి పని తెలుగు దర్శకులు ఎందుకు చేయడం లేదంటే సమాధానాలు లేవు.
తెలుగు ప్రేక్షకులు…మళయాళం, తమిళ సినిమాలకు బాగా అలవాటు పడుతున్నారు. కాన్సెప్ట్, కథ, స్క్రీన్‌ప్లేను ఎక్కువగా చూస్తున్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత మళయాళం, తమిళ సినిమాలకు ఫుడ్ డిమాండ్ పెరిగింది. మలయాళం సినిమాలతో పాటు సిరీస్‌లను జనం వదిలి పెట్టడం లేదు. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, దర్శకులు…కొత్త కాన్సెప్టులు…కథ, స్క్రీన్‌ప్లే ఫోకస్ చేయకపోతే…హీరోలు, దర్శకులను పట్టించుకోవడం మానేస్తారు. ఎలాగో ఓటీటీలు ఉన్నందున… చక్కగా మలయాళం, కొలీవుడ్, బాలీవుడ్ సినిమాలనే చూస్తారు. ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఆలోచనా విధానం మార్చుకోవాలి…అవే డైలాగ్‌లు…అదే కామెడీ డైలాగ్‌లు చెబితే…ప్రేక్షకుల చేత పరాభవం తప్పదు.