నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట..
మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్ మరింత ముదురుతోంది. పరస్పర ఆరోపణల మధ్య ఇప్పటికే రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి గ్యాప్ పెరిగింది. సమయం వచ్చినప్పుడల్లా గవర్నర్.. తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి తెలుపుతూనే ఉన్నారు. లేటెస్ట్ గా గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఆడవాళ్లు ఇబ్బందుల్లో ఉంటే సాటి మహిళగా చూస్తూ తట్టుకోలేనంటున్న తమిళిసై, తెలంగాణ మహిళలకు తోడుగా ఉంటానన్నారు. అంతేకాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య తాను ఒక వారధిలా ఉంటానన్నారు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో.. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతో మహిళా దర్బార్ నిర్వహించినట్లు తమిళిసై తెలిపారు. మహిళా దర్బార్‌కు హాజరైన కొందరు మహిళలు ఆమ్నేషియా పబ్ సమీపంలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న తమిళిసై…ఈ మధ్య ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ గ్యాంగ్‌రేప్‌పై తనకు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని విమర్శించారు.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తమిళిసై… రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్‌ను గౌరవించమని ప్రభుత్వానికి చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాలని అనుకుంటానని చెప్పిన గవర్నర్… దీనికి ఎదురు చెప్పే వారి గురించి తాను పట్టించుకోనని తెలిపారు. తాను ఉత్ప్రేరకం మాత్రమేనని చెప్పిన తమిళిసై.. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
గవర్నర్ ప్రజలను కలవగలరా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారన్న తమిళిసై.. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ప్రజలే కోసమేనన్నారు. కరోనా సమయంలో వైద్యులు ఇబ్బందులు పడుతుంటే..తాను కలిసొచ్చానని గవర్నర్ గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పని చేశారు. తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన తొలి నాళ్లలోనే ఆమె ప్రజాదర్బార్ నిర్వహించాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను సైతం రూపొందించారు. కానీ కరోనా కారణంగా ప్రజా దర్బార్ ఆలోచన వాయిదా పడింది. దీంతో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం కోసం రాజ్ భవన్ గేటు ముందు ఓ బాక్సును ఏర్పాటు చేశారు. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్ నిర్వహించిన మహిళా దర్బార్ మరింత హీటెక్కించింది..
మొన్నటి వరకు గ్రీవెన్ సెల్ ద్వారా ప్రజా సమస్యలు విన్న తమిళిసై ఇక మీదట గవర్నర్ హోదాలో స్వయంగా ప్రజల నుండి ఆమె ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మహిళా దర్బార్ నిర్వహించి పంతం నెగ్గించుకున్న తమిళిసై, రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉందని, ఇది పొలిటికల్ కార్యాలయం కాదని, మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలన్న ఆమె, రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
నామినేటెడ్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య కోల్డ్ వార్ హైలెట్ అయింది. ఆ తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, గవర్నర్ ప్రోటోకాల్ వివాదం, రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన తమిళిసై.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో వేర్వురుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఆ భేటీల తర్వాత తమిళిసై చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమె కామెంట్స్‌పై టీఆర్ఎస్ నాయకులు ఘాటుగానే స్పందించారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని.. ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులమని కౌంటర్ ఇచ్చారు. తమిళిసై బీజేపీ మూలాలను కలిగి ఉండటంతో రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మార్చారని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ అగ్రనేతలు ఆరోపించారు.
స్పాట్
దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా పరిస్థితులు మారాయి. మరోవైపు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పలు సంఘటనలపై స్పందిస్తున్న గవర్నర్.. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కోరుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా వివిధ జిల్లాలో తమిళిసై పర్యటిస్తున్నారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించడంతో పాటుగా.. అక్కడి ప్రజలతో మమేకమవుతున్నారు. ఆఖరికి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆ వేడుకలను తమిళిసై రాజ్‌భవన్‌లో కొద్ది మంది అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేక్‌ను కట్ చేశారు. పలువురు కళాకారులకు సన్మానం చేశారు. ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.. మీ సహోదరిని అని తమిళిసై అంటున్నారు. అయితే, జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై తమిళిసై సౌందర్‌రాజన్ నివేదిక కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో అసలు రాజకీయాలకంటే రాజ్ భవన్ రాజకీయాలు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి. దీనిపై అధికార టియ్యారెస్ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది.
తాజా పరిణామాలతో తెలంగాణలో రాజకీయాల కంటే.. రాజ్ భవన్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి గవర్నర్ గా నరసింహన్ ఉన్నంతకాలం అంతా స్మూత్ గానే జరిగిపోయింది. కేసీఆర్ రెగ్యులర్ గా గవర్నర్ తో భేటీ అయి కీలక విషయాలపై అప్ డేట్ ఇస్తూ ఉండేవారు. కానీ తమిళిసై వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. తమిళిసై వచ్చిన మొదట్లో కూడా గవర్నర్, సీఎం మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. అప్పట్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కూడా అంత తీవ్ర స్థాయి యుద్ధం లేకపోవడం, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవటం దానికి కారణం కావచ్చు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గున మండే పరిస్థితి ఉంది. అటు కేంద్రంపై కూడా కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరును టీఆర్ఎస్ అగ్రనేతలు ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ కి బీజేపీతో పెరుగుతున్న దూరానికి సమాంతరంగా.. ప్రగతి భవన్ కు రాజ్ భవన్ తో కూడా దూరం పెరుగుతూ వచ్చింది. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నిర్వహించిన ప్రజాదర్భార్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
ఇప్పటికే రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫిర్యాదుల విభాగం ఉందని.. అలాంటప్పుడు గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహించాలని అనుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంలో భాగంగానే.. ఢిల్లీ డైరెక్షన్‌లోనే తమిళిసై సౌందర్‌రాజన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గవర్నర్ దర్బార్‌తో మహిళలకు ఏమీ ఉపయోగం ఉండబోదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆమెకు జరిగిన అవమానాలపై చర్యలు తీసుకోలేకపోయిన తమిళిసై… మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
గవర్నర్ తమిళిసై తన పరిధి దాటుతున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాజకీయ కార్యాకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని కామెంట్ చేశారు.
ఇప్పుడు తెలంగాణలో తమిళిసై వ్యవహారం ఇంతటితో ఆగేలా కనిపించటం లేదు. గవర్నర్ సై అంటే సై అన్నట్టుగా ఉండటంతో మరింత హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తమిళిసై మహిళా దర్బార్ నిర్వహించారు సరే.. కానీ, వచ్చిన ఫిర్యాదులపై ఆమె ఏదైనా చర్యలు తీసుకోవాలంటే వాటిని అమలు చేసే అధికారులెవరు? మళ్లీ సీఎన్ నే సంప్రదించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఆమె ఏ నిర్ణయాన్నీ అమలు చేసే అవకాశమే లేదు. అలాంటపుడు ఈ కార్యక్రమంతో ప్రయోజనమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్పాట్
గవర్నర్ నేపథ్యం ఏదైనా కావచ్చు.. ఒక్కసారి రాజ్ భవన్ లోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ, తమిళిసై పలు దర్భాల్లో గవర్నర్ గా కంటే బిజెపి నేతగానే వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. రెండున్నరేళ్లకు పైగా గవర్నర్ తో మర్యాదగా మెలిగిన ప్రభుత్వం ఇప్పుడు డోంట్ కేర్ అనేలా మారటంలో ఎవరి పాత్ర ఎంత అనేది చర్చించాల్సిన అంశమే. ఎందుకంటే గవర్నర్ల వ్యవస్థపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 163లో చాలా స్పష్టంగా ఉంది. గవర్నర్లకు తమకు తాము సొంతంగా ఏదీ చేసే అధికారాలు లేవు. ఇది చాలా స్పష్టమైన విషయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసుల మేరకే గవర్నర్ తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఇంతకు మించి గవర్నర్లకు అంటూ ప్రత్యేక పనులేమీ పేర్కొనలేదు
అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు గవర్నర్ వ్యవస్థకు కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి. యుద్ధాలు, రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితి వంటివి ఏర్పడినపుడు, ప్రత్యేక సందర్భాలలో గవర్నర్‌కు అనేక అధికారాలుంటాయని చెప్పింది. అసాధారణ సందర్భాలలో గవర్నర్‌కు ఉండే వెసులుబాట్ల పేరుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు పాల్పడకూడదు. కానీ పలు సందర్భాలలో గవర్నర్లు తమ పరిధులు, పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
నిజానికి గవర్నర్ ల వ్యవస్థపై అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. గవర్నర్లు కేంద్ర ప్రభుతానికి తొత్తులుగా మారారని, రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ప్రయత్నించారనే విమర్శలున్నాయి. 1969లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మద్రాసు రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజమన్నార్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ 1971లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో గవర్నర్ల వ్యవస్థపై సునిశిత పరిశీలన ఉంది. గవర్నర్ల నియామక వ్యవస్థలో మార్పులు చేయాలని, గవర్నర్లను నియమించే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అంతే కాదు, రాష్ర్టాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్లు ప్రవర్తిస్తే వారిని రీకాల్ చేసే అధికారం ఉండాలని, సూచించింది.
ఇప్పుడు గవర్నర్ దర్బార్ లు పెట్టినా ఆ విన్నపాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిందే కదా. తాను స్వయంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. గవర్నర్ తన విన్నపాలను సీఎస్ కి పంపటం మాత్రమే చేయగలరు. ఈ పనుల కోసం ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గవర్నర్ ప్రజలతో ఎన్నికైన వ్యక్తి కాదు. సాంకేతికంగా తమిళిసై చేస్తున్న దర్బార్ తప్పు కాకపోవచ్చు. కానీ, గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి మాత్రమే. రాజ్యాంగం నిర్వహించే పనులు చేయాల్సిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తెచ్చుకోవటం వల్ల ప్రయోజనమేంటి? ఓ పక్క ప్రధానితోనే సీఎం కెసీఆర్ తలపడుతున్నారు. ఇలాంటి సమయంలో తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహిస్తే, ఆమెకున్న బిజెపి నేపధ్యం వల్ల రాజకీయ విమర్శలు రావటంలో ఆశ్చర్యమేముంది. కానీ, ఇదేమీ తెలియనట్టు…తాను మహిళల కోసం చేస్తున్నానని, తనకు అడ్డే లేదనేలా వ్యాఖ్యానించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ రాష్ట్రప్రభుత్వం జరుగుతున్న కోల్డ్‌వార్ వల్ల అంతిమంగా ప్రజలకే కదా నష్టం. ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, తమ విధులు నిర్వహించాలి. తమకు నిర్దేశించిన పరిధిలోనే మెలగాలి. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసమో, మరే ఇతర లక్ష్యాలతోనో నిర్ణయాలు తీసుకుంటే, దానివల్ల అంతిమంగా ప్రజాస్వామ్యానికే నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
నిజానికి దేశవ్యాప్తంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లకు, సీఎంలకు మధ్య అంతగా సఖ్యత లేదు. దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్ భవన్ సాక్షిగా రాజకీయాలు చేయడమేంటని నిలదీశారు. గవర్నర్లను బీజేపీ రాజకీయాలకు వాడుకోవడమే ఈ సమస్యలకు మూలకారణమనే వాదన కూడా ఉంది. ఇటు తెలంగాణలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. తమిళి సై హార్డ్ కోర్ బిజెపి నేత. తమిళనాడులో ఆ పార్టీకి అద్యక్షురాలిగా పనిచేశారు. గత లోక్ సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆమెను ప్రధాని మోడీ గవర్నర్ గా నియమించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి బాద్యతలు కూడా ఆమెకు అప్పగించడం ద్వారా ఆమె ప్రాధాన్యతను తెలియచేసినట్లయింది. అంతెందుకు గవర్నన్ పదవి తర్వాత ఆమె మళ్లీ పార్టీలో యాక్టివ్ గా మారకుండా ఉంటారా? అలాంటపుడు బిజెపితో ఇప్పుడున్న సంబంధాల దృష్ట్యా, ఆమె వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వంలో, టియ్యారెస్ నేతల్లో అసంతృప్తి ఉండటం ఆశ్చర్యపరిచే విషయం కాదనే చెప్పాలి
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి పేరుని పెండింగులో పెట్టడంతో మొదలైన విభేదాలు ఆ తర్వాత మరింత ఉధృతమయ్యాయి. కరోనా సమయంలో ప్రభుత్వం వద్దన్నా నిమ్స్ కు వెళ్లడం, కొన్ని విషయాలపై ప్రభుత్వ అధికారుల వివరణ కోరడం వంటివి చేసినా పెద్దగా సీరియస్ కాలేదు. కాని ఎమ్మెల్సీ వ్యవహారాన్ని టియ్యారెస్ తేలిగ్గా తీసుకోలేదు. ఆ తర్వాత ఆమె ఏకంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక బాక్స్ ను ఏర్పాటు చేశారు. కెసిఆర్ కు సహజంగానే అది రుచించలేదు. రిపబ్లిక్ డే పరిణామాలతో మరింతగా గ్యాప్ పెరిగింది. గవర్నర్ మేడారం వెళ్లినప్పుడు హెలికాప్టర్ కేటాయించలేదనే చర్చ కూడా ఉంది. తన తల్లి చనిపోయినప్పుడు ప్రత్యేక విమానం అడిగినా.. నిరాశే ఎదురైందని స్వయంగా తమిళిసై ప్రెస్ మీట్లో చెప్పారు.
ఆ తర్వాత రిపబ్లిక్ డే స్పీచ్ లో ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించకపోవడంపై విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కు, బిజెపి పెద్దలకు సఖ్యత ఉన్నంతకాలం తమిళసై కూడా జోక్యం చేసుకోలేదు. కాని ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నందున బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరు పెరుగుతోంది. దీంతో ఆమె కూడా తన గేమ్ మొదలుపెట్టారని భావిస్తున్నారు.
గతంలో ఎన్.టి.రామారావు హయాంలో గవర్నర్ కు, ఆయనకు మద్య పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆనాటి గవర్నర్ రామ్ లాల్ కు, ఎన్.టి.ఆర్.కు సంబంధాలు సజావుగా లేవు. ఆ తర్వాత పరిణామాల్లో రామ్ లాల్ ను ఇందిరాగాంధీ తొలగించి శంకర్ దయాళ్ శర్మను నియమించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రంలో గవర్నర్ తీరుపై విమర్శలు పెరిగాయి..
రాష్ర్టాల పాలనా వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకొంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కర్, సీఎం మమత మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్నది. పాలనా వ్యవహారాల్లో ధన్‌కర్ జోక్యం పెరిగిందని మమత తరచూ ఆరోపిస్తున్నారు. అధికారులను గవర్నర్ పదే పదే రాజ్‌భవన్‌కు పిలిపించుకొని వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో ఆయనను బ్లాక్ చేశారు. మమత ఆరోపణలపై ధన్‌కర్ స్థాయిని మరిచి స్పందిస్తున్నారు. కేంద్రం పట్ల సానుకూలంగా ఉండే ధన్‌కర్.. ప్రతీ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వానికి అడ్డుపడుతుండటం గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగానికి అద్దం పడుతున్నది.
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన దగ్గరే పెట్టుకొన్నారు. నెలలు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా సీఎం స్టాలిన్ కలిసి గుర్తు చేయడంతో గవర్నర్ కదిలారు. బిల్లును తిప్పి పంపారు. పైగా, నీట్ మంచిదే అని రాజకీయ ప్రకటన చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ ప్రభుత్వం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఎన్నిక ప్రక్రియకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ మోకాలడ్డుతున్నారు. కోశ్యారీ విచక్షణాధికారాల వినియోగంలో న్యాయబద్ధతకు సమాధి కట్టి కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఇలా చేస్తున్నారనే వాదనలున్నాయి.
ఇక కర్మాటకలోనూ మాజీ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ యడ్యూరప్పకు మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏకైక అతి పెద్ద పార్టీ అనే సాకుతో.. బలనిరూపణకు పరిమితికి మించి సమయం ఇచ్చారని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ఇక ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం మధ్య గొడవలు సరేసరి. కేరళలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ కు, సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వానికి మద్య కూడా అంత మంచి సంబంధాల్లేవు.
రాజకీయ నేతలను గవర్నర్ లు గా నియమించినప్పుడు ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. రాజకీయేతర వ్యక్తులను, మాజీ బ్యూరోక్రాట్ లను గవర్నర్ లు గా చేసినప్పుడు తక్కువ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. గవర్నర్ లు కేంద్రానికి ఏజెంట్లుగా ఉండాలని రాజ్యాంగం చెప్పలేదు. గవర్నర్ లను కేంద్రం సూచలనతో రాష్ట్రపతి నియమించినా, గవర్నర్ రాజ్యాంగానికి ప్రతినిధి మాత్రమే. కానీ, ఇది ఆచరణలో మారిపోతోంది. తమకు అనుకూలంగా ఉన్న వాళ్లను రాష్ట్రాల్లో గవర్నర్ లు గా పంపి, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళిసై వ్యవహార శైలిపై విమర్శలు రావటంలో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఈ రాజ్ భవన్ రాజకీయం ఏ దిశగా మళ్లుతుందో చూడాలి..