Storyboard: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ దుమ్ము రేపింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఊహకందని రీతిలో ఈ కూటమి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. గెలిచిన పార్టీల నేతలు కూడా అంచనా లేని విధంగా ప్రజలు విజయం కట్టబెట్టారు. 243 స్థానాలకు గాను ఏకంగా 200 స్థానాలకు పైగా గెలిచింది. ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా మరోసారి బిహార్‌లో ఎన్డీఏకు తిరుగులేదని తాజా ఫలితాలు నిరూపించాయి. బీహార్‌లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంలో… కీలకమైన అంశం డబుల్ ఇంజిన్ సర్కార్. దేశంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ చాలా కీలకంగా ఉండడం ఇక్కడ కలిసొచ్చే అంశం. ఇప్పటికే కేంద్రం నుంచి అనేక నిధులు తెచ్చామని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మరిన్ని తెస్తామని ప్రజలకు వివరించింది. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి బిహార్ అభివృద్ధి చేస్తామన్న ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు నినాదాన్ని ప్రజలు ఆదరించారు. ఈ క్రమంలోనే ఎన్డీఏను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ది జరుగుతుందని ప్రజలు భావించి గెలిపించారు.
నితీశ్ సర్కార్ తీసుకువచ్చిన అనేక పథకాలు ఎన్డీఏ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు నీతీశ్ సర్కార్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం విజయానికి దోహదపడింది. ఈ పథకం ద్వారా నీతీశ్ సర్కార్ ఒక్కొక్కరికీ 10వేలు రూపాయల చొప్పున 75లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించడం ప్రయోజనం కలిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సహా మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు పలు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మెప్పుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల వేళ బిహార్‌లో పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం ఎన్డీఏకు ఎన్నికల్లో బలంగా మారింది.
ఎన్డీఏ గెలుపులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఇద్దరు ముందుండి ప్రచారాన్ని హోరెత్తించారు. వరుస సభలతో మహాగఠ్‌బంధన్ కూటమిపై విరుచుకుపడ్డారు. మోదీ కరిష్మా, అమిత్ షా వ్యూహాలతో జనాలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏకూటమి ఎక్కువగా ప్రస్తావించిన పదం జంగిల్‌రాజ్. ఆర్జేడీ పాలించిన కాలాన్ని జంగిల్ రాజ్‌గా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షా విసృత ప్రచారం నిర్వహించారు. మహాగఠ్బంధన్కు ఓటు వేస్తే జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందని ప్రజల్లో చైతన్యం కల్పించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపునకు పలు అంశాలు దోహదపడ్డాయి. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సహా, మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు, 75 లక్షల మంది మహిళలకు 10వేల చొప్పున ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ఎన్డీఏకు కలిసొచ్చింది. మహాగఠ్‌బంధన్ కూటమి బలహీనతలను ఎన్డీఏకు తన అనుకూలంగా మార్చుకుంది. ప్రధానంగా బిహార్ రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన నాయకుల్లో ఒకరైన సీఎం నీతీశ్ కుమార్ కూటమికి బలంగా మారారు. దాదాపు 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న నీతీశ్ కుమార్ అనుభవం కూటమికి కలిసొచ్చింది. సుపరిపాలన నినాదంతో నీతీశ్ ప్రసిద్ధిచెందారు. తన అనుభవంతో ఎన్డీఏను గెలుపు తీరాలకు చేర్చారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్…బాధ్యతలు చేపట్టడం గ్యారెంటీ. అయితే గతంలో మాదిరిగా…కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయలేరు. తనకున్న పార్లమెంట్ సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొడతానని…చక్రం తిప్పుతాననే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే…బిహార్‌లో జేడీయూ కంటే కాషాయ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2020లో జేడీయూకు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ…నితీష్‌కుమార్‌ను సీఎంను చేసింది బీజేపీ. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మునుపటిలా నితీష్ కుమార్ డిమాండ్లు పెట్టే స్థితిలో లేడు. అంతకంటే ముఖ్యం…షరతులు కూడా విధించే ఛాన్స్ లేదు. ప్రధాన మంత్రి మోదీ చెప్పినట్లే…నితీష్‌కుమార్ వినాల్సిందే. ఇచ్చిన పదవి తీసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే…మాత్రం వచ్చే పదవి కూడా రాకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.
కూటమి నుంచి నితీష్‌కుమార్ బయటకు వెళ్లిపోయినా…బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. బీజేపీ, ఎల్జేపీ, హెచ్‌ఏఎం సీట్లకు తోడు…ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. నితీష్‌బాబు…కొంచెం ఎక్స్‌ట్రాలు చేసినా…తోక కట్ చేసేందుకు మోదీ-షా ద్వయం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ఎన్టీఏ కూటమిలో పార్టీలన్నీ మైండ్‌లో పెట్టుకుంటే మంచిది. అలా కాదని…కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించేందుకు…ఎన్డీఏ భాగస్వామస్య పార్టీలు ప్రయత్నిస్తే…ఉన్న పదవులను కూడా పొగొట్టుకోవడం గ్యారెంటీ. మాకు ఎంపీ సీట్లు ఎక్కువున్నాయని…తమ దయతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లింది. అసలు బిహార్ ఎన్నికలు ఇచ్చిన కిక్‌తో మోదీ ఇమేజ్ మరింత పెరిగింది. నితీష్‌కుమార్…ఎంపీ సీట్లు ఎక్కువగా ఉన్నాయని కేంద్రాన్ని బెదిరించే ఛాన్స్ లేకుండా పోయింది. మునుపటిలా భయపెడితే…బీజేపీ భయపడే స్థితిలో లేదు. ఎందుకంటే బీజేపీ…గతం కంటే అసెంబ్లీ సీట్లను భారీగా పెంచుకుంది. పైగా కేంద్రంలోనూ అధికారంలో ఉంది. ప్రధాని మోదీ…పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అత్యంత బలవంతుడు. మోదీ-షా ద్వయం ప్లాన్ చేసినా…ప్రతీరాష్ట్రమూ బీజేపీ ఖాతాలో పడింది. ఇప్పుడు బిహార్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. నితీష్‌కుమార్…కొంచెం హద్దు దాటినా…ఇంటికి పరిమితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
