ఇరాన్ యుద్ధం.. రూపాయి విలువని మహాపతనం దిశగా నడిపిస్తోంది. చారిత్రక కనిష్ఠాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా నిలిచిన రూపాయి.. త్వరలో సెంచరీ మార్కు దాటే అవకాశం ఉంది. స్వతంత్ర భారతంలో రూపాయి ఇప్పటిదాకా ఏకంగా 29 రెట్లు పతనమైంది. రూపాయి విలువ తగ్గడంతో.. దిగుమతులు భారమై.. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్టే.. రూపాయి పతనానికి కూడా పలు అంశాలు దోహదపడుతున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముందే పతనం మోడ్‌లో ఉన్న రూపాయి.. యుద్ధం మొదలయ్యాక.. మహాపతనం దిశగా వేగంగా పరుగు పెట్టింది. యుద్ధానికి చమురు ధరలు, వాణిజ్యలోటు తోడవడంతో.. రూపాయి పతనం ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. రూపాయి విలువ పతనానికి దారి తీస్తోన్నాయి. ఇరాన్ యుద్ధానికి ముందు నుంచీ భారీగా పతనమౌతూ వస్తోంది రూపాయి. ఈ యుద్ధం దీనికి మరింత ఆజ్యం పోసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి, భారత కరెన్సీ సుమారు 5.1 శాతం మేర బలహీనపడింది. యుద్ధ ప్రభావం దేశీయ కరెన్సీ మీద ఏ స్థాయిలో పడిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, సహజవాయువు ఇంధన సరఫరాలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోండటం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం వంటి పరిణామాలు రూపాయి పతనానికి ప్రధాన కారణం అయ్యాయి. పశ్చిమాసియా సంఘర్షణ చమురు సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగవచ్చనే భయాలను రేకెత్తించింది. దీని ప్రభావం కరెన్సీలనే కాకుండా గ్లోబల్ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై కూడా పడింది. స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని చూడగా, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై పెట్టుబడిదారుల ఆందోళనకు ఇది అద్దం పట్టింది.
అంతర్జాతీయ పరిణామాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహాలు రూపాయిపై ఒత్తిడిని కొనసాగించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే బ్యాంకులకు విదేశీ మారకపు స్థానాలపై పరిమితులను కఠినతరం చేసింది. ప్రతి పని దినం ముగిసేలోపు నికర ఓపెన్ రూపాయి స్థానాలను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని ఆదేశించింది గానీ అవేవీ కార్యరూపం దాల్చట్లేదు. ఈ ఆదేశాల తరుణంలో బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ లావాదేవీలను నిలిపివేసి, దేశీయ మార్కెట్‌లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది. అయినప్పటికీ- రూపాయం పతనానికి బ్రేకులు పడట్లేదు. ఆర్‌బీఐ చర్యలు స్వల్పకాలిక ఊరటను మాత్రమే ఇచ్చాయనేది తాజా పతనంతో స్పష్టమౌతోంది. కొద్ది రోజుల కిందటే 95 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ. అతి తక్కువ సమయంలోనే 96 రూపాయలను దాటడం అత్యంత ఆందోళనకరం. అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ ఈ స్థాయికి పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టినట్టవుతుంది.
పశ్చిమాసియాలో యుద్ధం తరుణంలో హర్మూజ్ జలసంధి దగ్గర చమురు సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే దిగుమతులు కష్టమవుతున్నాయి. పలు దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలోనే క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే మన రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు కూడా రూపాయి పతనానికి దారి తీస్తున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడం రూపాయిని ముంచేస్తోంది. సాధారణంగానే డాలర్ పెరిగితే.. రూపాయి పతనం అవుతుంటుంది. ఇది చాలదన్నట్టుగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడుల్ని పెద్ద మొత్తంలో ఉపసంహరించుకుంటున్నారు.
మన దేశం చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. మనం ఈ దిగుమతుల కోసం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో.. డాలర్లలో చెల్లింపులు పెరిగి రూపాయిపై ఒత్తిడి పడుతోంది. కేవలం చమురు మాత్రమే కాదు.. బంగారం విషయంలోనూ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచంలోనే బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ధరలు పెరిగినా.. చమురు దిగుమతుల విలువ ఏకంగా 25 శాతం వరకు పెరిగింది. ఇలా చమురు, బంగారం వంటి వాటి దిగుమతులు పెరుగుతుండటంతో ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు పెరిగి కూడా రూపాయి విలువ క్షీణిస్తోంది.
ఆసియాలోనే డాలరుతో పోలిస్తే అత్యంత పేలవమైన పనితీరు కనబర్చిన కరెన్సీగా రూపాయి నిలిచింది. మలేషియన్ రింగిట్.. ఈ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఆసియాలోనే అత్యంత మంచి పనితీరు కనబరుస్తోంది. చైనా సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటున్నటువంటి చర్యల నేపథ్యంలో చైనీస్ యువాన్ కూడా స్థిరంగానే ఉంది. మరోవైపు ఆసియాలో సింగపూర్ డాలర్ కూడా డాలర్ ఒత్తిడిని తట్టుకొని నిలబడింది. ఇక రూపాయితో పాటు ఇండోనేషియన్ రూపియా, థాయ్ బాట్, జపనీస్ యెన్ వంటివి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఒకవైపు మార్కెట్లలో విపరీతమైన ఒడిదుడుకులు.. మరో వైపు కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు.. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ పోరాడుతున్నా.. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మొత్తం మీద అమెరికా డాలర్ దెబ్బకు దేశీయ కరెన్సీ విలవిలలాడుతోంది. డాలర్ ఇండెక్స్ 98-99 స్థాయిలో పటిష్టంగా కొనసాగుతుండటం రూపాయిని మరింత కుంగదీస్తోంది. కరెన్సీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. మరోవైపు కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోయి, డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.ఈ దశలో రూపాయి పతనాన్ని ఆర్బీఐ అడ్డుకోకపోతే డాలర్‌తో మారకం విలువ ఏకంగా 102 స్థాయికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు మన దేశ విదేశీ మారక నిల్వలు సుమారు 728 బిలియన్ డాలర్ల వద్ద ఉండేవి. ఇప్పుడు అవి ఏకంగా 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు కేవలం మార్చి నెలలోనే ఆర్బీఐ 28 బిలియన్ డాలర్లను ఖర్చు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే రూపాయిని ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం అస్థిరతను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆర్బీఐ పరోక్షంగా స్పష్టం చేసింది.
మరోవైపు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ దేశ ఆర్థిక రంగాన్ని కలవరపెడుతోంది. 2025 ఏడాది మొత్తంలో 19 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోతే, ఒక్క మార్చి నెలలోనే విదేశీ మదుపర్లు 11 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. తాజా లెక్కల ప్రకారం వాణిజ్య లోటు 259 మిలియన్ డాలర్ల నుంచి 283 మిలియన్ డాలర్లకు పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది.గతంలో 2013, 2022 సంవత్సరాల్లో కూడా రూపాయి సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితులనే దీటుగా ఎదుర్కొంది. ఈసారి కూడా అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడి, ముడి చమురు ధరలు శాంతిస్తే రూపాయి తిరిగి 95-96 రేంజ్ వద్ద స్థిరపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ అలాంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుండటమే.. ఆందోళనకు అసలు కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు విపరీతమైన ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడుతూ, కరెన్సీ విలువను సున్నితంగా నియంత్రించే వ్యూహాన్నే ఆర్బీఐ అనుసరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ రూపాయి పతనమౌతూనే ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆ పతనం ఆందోళనకరంగా మారిందనడంలో సందేహం లేదు. మన కంటే చిన్న ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కరెన్సీల కంటే.. మన రూపాయి బలహీనపడటం.. ప్రమాదకర సంకేతమే. మొత్తం మీద రూపాయి పతనంలో ఇరాన్ యుద్ధానికి ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సినంతగా మార్పులున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత రెండున్నర నెలలుగా భారత రూపాయి విలువ తీవ్రంగా పడిపోవడం దేశ ఆర్థిక విధాన రూపకర్తలకు పెద్ద ఆందోళనగా మారింది. ఈ సమయంలో పది రోజుల క్రితం ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. అనవసర వాహన వినియోగాన్ని తగ్గించడం, పెట్రోల్-డీజిల్ ఆదా చేయడం, విదేశీ ప్రయాణాలను తగ్గించడం, సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడం, సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించడం వంటి సూచనలు చేశారు. ఇవి కేవలం ఇంధన పొదుపు కోసం మాత్రమే కాదు. వీటి అసలు ఉద్దేశం విదేశీ మారక నిల్వలను కాపాడి, రూపాయి పతనాన్ని నియంత్రించడమే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. మన విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. 2026 ఫిబ్రవరి 27న 728.5 బిలియన్ డాలర్లుగా ఉన్న నిల్వలు, 2026 మే 12 నాటికి 690.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే కేవలం రెండున్నర నెలల్లోనే 38 బిలియన్ డాలర్ల తగ్గుదల నమోదైంది.
రూపాయి స్థిరత్వం విషయంలో సాధారణంగా రెండు వాదనలు ఉన్నాయి. ఒక వర్గం రూపాయి విలువ మార్కెట్ డిమాండ్-సరఫరాపై ఆధారపడి ఉంటుందని భావిస్తుంది. కాబట్టి రూపాయి విలువ తగ్గినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. వారి వాదన ప్రకారం, రూపాయి బలహీనపడితే దిగుమతులు తగ్గుతాయి, ఎగుమతులు పెరుగుతాయి. రూపాయి ప్రస్తుతం అతి ఎక్కువ విలువతో ఉందని, రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటే దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
మరోవైపు, బలమైన రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలని మరొక వర్గం విశ్వసిస్తోంది. బలమైన కరెన్సీ మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి, అప్పులు చెల్లింపులు, లాభాంశాలు, రాయల్టీలు, వేతనాలు, ఇతర ఆదాయ బదిలీల వల్ల విదేశీ మారకం బయటకు పోకుండా చూడగలదని వారి అభిప్రాయం. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రూపాయి విలువ కేవలం 2.3 శాతం మాత్రమే పతనమైంది. కానీ 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 11.7 శాతం పతనం చెందింది. ప్రత్యేకంగా 2026 ఫిబ్రవరి 27న యుద్ధం ప్రారంభమైన తర్వాత మే 13 వరకు రూపాయి విలువ 91.1 నుంచి 95.5 రూపాయలకు పడిపోయింది. అంటే కేవలం రెండున్నర నెలల్లోనే 4.4 శాతం పతనం జరిగింది.ఇది కేవలం ఇంధన ధరల సమస్య మాత్రమే కాదు. పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు గ్లోబల్ బాండ్ ఈల్డ్స్‌ను పెంచుతున్నాయి. దీంతో డాలర్ ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల (Emerging Markets) నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో, భారత రూపాయి 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10% మేర పడిపోయి, ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా అవతరించింది. ఇతర ప్రాంతీయ కరెన్సీలు కొంత బలంగా కనిపిస్తున్నా, రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థలోని లోతైన సమస్యలను సూచిస్తోంది.ఇది కేవలం ఇంధన ధరల సమస్య మాత్రమే కాదు. పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు గ్లోబల్ బాండ్ ఈల్డ్స్‌ను పెంచుతున్నాయి. దీంతో డాలర్ ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో, భారత రూపాయి 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10% మేర పడిపోయి, ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా అవతరించింది.
ఇతర ప్రాంతీయ కరెన్సీలు కొంత బలంగా కనిపిస్తున్నా, రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థలోని లోతైన సమస్యలను సూచిస్తోంది. ఈ పరిణామాలతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరుగుతోంది. అధిక ఇంధన దిగుమతుల కారణంగా, ఇది GDPలో 2% ను దాటే అవకాశం ఉందని అంచనాలున్నాయి. దీంతో మన ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి తప్పదు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.3% గా నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడం మరింత కష్టతరం అవుతుంది. దిగుమతి చేసుకొనే ఇంధనంపై విపరీతమైన ఆధారపడటం వల్ల, భౌగోళిక షాక్‌లకు దేశం సులభంగా గురవుతోంది. ఇది దిగుమతి ఖర్చులను పెంచడమే కాకుండా, వాణిజ్య సమతుల్యతను దెబ్బతీస్తోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని నిర్వహించడంలో సవాళ్లను విసురుతోంది. RBI తన విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లను అమ్ముతూ కరెన్సీ అస్థిరతను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా.. మన దగ్గరున్న విదేశీ మారక నిల్వల్నిమరియు నిల్వలను మరింతగా తగ్గిస్తోంది.
ప్రభుత్వ మొత్తం అప్పు రాష్ట్రాల రుణాలతో కలిపి, GDPలో దాదాపు 81.92% గా ఉంది. ఇది ప్రభుత్వానికి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పరిమితులను విధిస్తోంది. దీర్ఘకాలం పాటు అధిక చమురు ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం వల్ల ప్రభుత్వానికి సబ్సిడీలు, రుణ వ్యయాలు పెరిగి, ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. 10-సంవత్సరాల భారత ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 7.02% పెరగడం కూడా దీనికి నిదర్శనం. మున్ముందు పరిస్థితిని పరిశీలిస్తే, ఫారెక్స్ విశ్లేషకులు భారత రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని భావిస్తున్నారు. చమురు ధరలు అధికంగానే ఉండి, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే, రూపాయి మరిన్ని రికార్డు కనిష్టాలను నమోదు చేసే అవకాశం ఉంది. దిగుమతి ద్రవ్యోల్బణం, పెట్టుబడుల తరలింపు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.
మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో రూపాయి విలువ అమెరికన్ డాలర్కు ప్రతిగా కేవలం 3.30 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే అమెరికన్ డాలర్ తో భారతీయ రూపాయి విలువ దాదాపు సమానం అని చెప్పవచ్చు. అక్కడి నుంచి సరిగ్గా గమనించినట్లయితే గడచిన ఏడు దశాబ్దాల్లో భారతీయ రూపాయి విలువ సుమారు 29 రెట్లు పతనం అయింది. అంటే దేశ స్వాతంత్రం సాధించిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే రూపాయి విలువ తగ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు కనిపించలేదు.నిజానికి 1947లో భారతదేశానికి బ్రిటన్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఒక డాలర్ విలువ సుమారు 3.30 రూపాయలు మాత్రమే ఉండేది. ఆ సమయంలో భారతదేశంపై ఎలాంటి విదేశీ అప్పులు ఉండేవి కాదు. రూపాయి విలువ బ్రిటిష్ పౌండ్‌కు సమానంగా ఉండేది. అయితే ఎప్పుడైతే మన దేశం విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకోవడం ప్రారంభించిందో అప్పటి నుంచి రూపాయి పతనం అవడం ప్రారంభమైంది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో విదేశాల నుంచి ఆహారం సైతం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గోధుమలు, ఆలుగడ్డలు, చక్కెర, ఇతర ముడి సరుకులు, ఆధునిక యంత్రాలు, వాహనాలను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఫలితంగా రూపాయి విలువ తగ్గడం ప్రారంభించింది.
1966వ సంవత్సరంలో రూపాయి విలువ భారీగా తగ్గింది. 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అప్పుడు రూపాయి విలువ 4.76 రూపాయల నుంచి 7.50 రూపాయలకు డీవాల్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 1991లో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం కూడా రూపాయి విలువను దెబ్బతీసింది అని చెప్పవచ్చు. భారతదేశం విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరతను అప్పుడు ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ భారీగా నష్టపోయింది. అప్పుడు రూపాయి విలువ తొలిసారిగా ఒక అమెరికన్ డాలర్కు ప్రతిగా 25 రూపాయలకు చేరుకుంది. దేశంలో ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయో విదేశీ పెట్టుబడులు దేశంలోకి తరలివచ్చాయి. అయినా సరే రూపాయి విలువ పతనం మాత్రం ఆగలేదు.
ఇక 2000 సంవత్సరం నుంచి 2010 వరకు గమనించినట్లయితే రూపాయి విలువ స్థిరంగానే ఉంది అని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో 44.31 నుంచి 2010 సంవత్సరంలో 46.02 వరకు రూపాయి విలువ ఎక్కువ ఒడిదుడుకులకు లోనవ్వకుండా స్థిరంగా ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2007 సంవత్సరంలో తలెత్తినప్పటికీ రూపాయి విలువపై ఎక్కువగా ప్రభావం చూపలేదు. కానీ 2013 సంవత్సరంలో ఒక్కసారిగా రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఆ సంవత్సరమే రూపాయి విలువ తొలిసారిగా 70 రూపాయలకు పడిపోయింది. ఇక 2020 నుంచి 2025 సంవత్సరం మధ్యకాలంలో గమనించినట్లయితే కోవిడ్ అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదల కారణంగా తొలిసారిగా రూపాయి విలువ 80 రూపాయలను దాటింది.
ఇక ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ మరింత పతనం అయినట్టు చూడవచ్చు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96 మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది. ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దీనార్ కొనసాగుతున్నా.. అంతర్జాతీయ వ్యాపార కరెన్సీగా యూఎస్ డాలర్ ఉండటంతో.. మనకు డాలర్ మారకం విలువ చాలా ముఖ్యం. ఎందుకంటే దేశీయ అవసరాల్లో 70 శాతానికి దిగుమతులే ఆధారం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు మినహా మిగతా అన్నింటినీ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఏ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నా.. చెల్లింపులు మాత్రం అమెరికా డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. దీంతో రూపాయిపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది.
రూపాయి విలువతో మనకేం పని అనుకోవటానికి లేదు. రూపాయి మహా పతనంతో.. దేశానికి దిగుమతుల బిల్లు భారమౌతుంది. సామాన్యుల నెత్తిన ద్రవ్యోల్బణం పిడుగు పడుతుంది. విదేశీ చదువులు, ప్రయాణాలు కూడా భారమౌతాయి. ఇంధనానికి, బంగారానికి పెరుగుతున్న డిమాండ్‌ను రూపాయిని మరింత ఒత్తిడిలోకి నెడుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.
రూపాయి విలువ రోజురోజుకూ తగ్గుతుంటే.. అప్పుడు మనం దిగుమతి చేసుకునే చమురు, వంట నూనెలు, సహజ వాయువు, బంగారం, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ కార్లు, గడియారాలు మరింత ఖరీదవుతాయి. దీంతో నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గేలా చేస్తుంది. అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపైనే మొత్తంగా ప్రభావం పడుతుంది. విదేశీ విద్య కూడా భారంగా మారుతుంది.
అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా.. దేశంలో ఇంధన డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కానీ డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం, ఉన్న కాస్త సరఫరాకు కూడా భారీగా చెల్లింపులు చేయాల్సి రావడం.. రూపాయిని బాగా బలహీనపరుస్తోంది. దీనికి తోడు బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కూడా.. రూపాయిని డీలా పడేలా చేస్తోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువను స్థిరీకరించేందుకు మన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్బీఐ ముందుగా తన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా డాలర్ల సరఫరా పెరిగి రూపాయి స్థిరీకరించేలా చేయొచ్చు. ఇంకా విలాస వస్తువులు, బంగారం వంటి దిగుమతులపై సుంకాల్ని పెంచి దేశీయ ప్రత్యామ్నాయాల్ని ప్రోత్సహిస్తే కూడా డాలర్ డిమాండ్ తగ్గించొచ్చు. నిక వస్తువుల ఎగుమతుల్ని పెంచడం ద్వారా కూడా దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని తీసుకురావొచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం ద్వారా కూడా విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించొచ్చు. ఇది రూపాయి స్థిరత్వానికి ఉపయోగపడుతుంది. రష్యా, యూఏఈ వంటి కొన్ని దేశాలతో వ్యాపారం చేసినట్లు.. ఇతర దేశాలతో కూడా భారత్ డాలర్లకు బదులుగా రూపాయిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలి. ప్రవాస భారతీయుల్ని ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం.. ప్రత్యేక బాండ్లను ప్రవేశపెట్టి కూడా విదేశీ కరెన్సీ నిల్వల్ని పెంచుకోవచ్చు. కానీ ఇవన్నీ సాధారణ పరిస్థితుల్లో కుదురుతాయేమో కానీ.. ప్రస్తుత సంక్షోభ స్థితిలో.. కష్టమేననే వాదన వినిపిస్తోంది.
డాలర్ మరింత ఖరీదు అయితే దేశంలో రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల నిత్యావసర వస్తువులతో పాటు పలు ఉత్పత్తుల ధర క్రమంగా పెరుగుతుంది. ఈ కరెన్సీ పతనం దేశీయంగా ఇంధన సంక్షోభానికి దారితీసి, సామాన్యులపై భారీ ద్రవ్యోల్బణ ముప్పును తెచ్చిపెట్టింది. ముడి చమురు, ఇతర నిత్యావసరాల దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల రాబోయే రోజుల్లో రవాణా భారమై, మార్కెట్లలో వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
పశ్చిమ ఆసియా సంక్షోభం ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే రూపాయి విలువ మున్ముందు మరింత క్షీణించి, సైకలాజికల్ మార్క్ అయిన 100 స్థాయిని తాకవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి. పశ్చిమాసియా వివాదానికి తగిన పరిష్కారం లభించే వరకు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే యుఎస్ డాలర్ వైపే మొగ్గు చూపుతారని, దీనివల్ల డాలర్ మరింత బలపడి భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్య సమతుల్యతపై ఒత్తిడి పెరగొచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనం అనేది ఆర్థిక సంక్షోభానికి దారితీసి.. సామాన్య ప్రజల రోజువారీ బడ్జెట్‌ను నేరుగా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో రూపాయి దాదాపు 11 శాతంగా పడిపోగా.. అందులో 5 శాతం మేర పతనం కేవలం ఇరాన్ యుద్ధం మొదలయ్యాకే నమోదైంది.
ఎప్పుడైనా కేవలం రూపాయి విలువ మాత్రమే పతనమైతే.. ఏదోలా మ్యానేజ్ చేయొచ్చు. కానీ ఓవైపు యుద్ధం.. మరోవైపు ఇంధన సంక్షోభానికి తోడుగా రూపాయి మహా పతనం ఆర్థికవేత్తలతో పాటు సామాన్యుల్నీ కలవరపెడుతోంది. ఆర్థిక వ్యవస్థ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న దుస్థితి కనిపిస్తోంది. కనుచూపుమేరలో ఎక్కడా పరిష్కార మార్గాలు కానరాకపోగా.. పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యే సూచనలు ఇంకా ఎక్కువగా భయపెడుతున్నాయి. వాస్తవానికి జరుగుతున్న పరిణామాల కంటే.. వాటి కారణంగా కలుగుతున్న భయాలే రూపాయిని ఎక్కువగా కుంగదీస్తున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఆర్థికవ్యవస్థలో కీలక గణాంకాలకు చాలాసార్లు మానసిక భావనలే ఆధారంగా ఉంటాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే.. జరిగే విషయాలకు 20 శాతం, వాటి ఆధారంగా వేసే అంచనాలకు 80 శాతం కలిపే.. రూపాయి విలువ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
