Story Board : పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడినప్పటికీ, దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప, ప్రాణం వదిలేయలేదని జనానికీ, మేధావులకూ అనిపించింది. 208 సీట్లు గెలుచుకొని బీజేపీ అధికారంలో కూచుంటే, ప్రజాతీర్పు మేరకు 80సీట్లతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ రెండు పార్టీల మధ్యా ఓట్ల తేడా 5శాతమే ఉన్నందున, సీట్ల లెక్కన టీఎంసీ ఎన్నికల రంగంలో దెబ్బతిన్నదే కానీ, ప్రజాక్షేత్రంలో దాని పునాదులు బలంగానే ఉన్నాయనే భావన కలిగింది. కానీ ఓటమి తర్వాతే టీఎంసీలో అసలైన కుదుపులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి అసెంబ్లీలో రెబల్ ఎమ్మెల్యేల నేతే విపక్ష నేత కావడం.. ఇది చాలదన్నట్టుగా పార్లమంట్‌లోనూ ఎంపీల తిరుగుబాటు తప్పదనే సంకేతాలు మమతను నైరాశ్యంలో ముంచేశాయి. దీంతో దిక్కుతోచని మమత.. పార్టీ పరంగా ఉన్న అన్ని కమిటీల్ని రద్దు చేసింది. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలో శివసేన విషయంలో జరిగిందే.. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి జరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చీలిక దిశగా అడుగులు వేస్తోంది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు దీదీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అంతేగాకుండా ఆమె సస్పెన్షన్ వేటు వేసిన రితబ్రత బెనర్జీని శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారు.
బెంగాల్ బెబ్బులిగా అభిమానులు పిలిచుకునే మమతా బెనర్జీ.. వీధిపోరాటాలతోనే రాజకీయాల్లో ఎదిగారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. టీఎంసీ అధినేత్రిగా ఉన్నా.. చివరకు సీఎం అయ్యాక కూడా.. ఆమె తనకు అచ్చొచ్చిన వీధిపోరాటాల్ని ఏనాడూ విడిచిపెట్టలేదు. రాజకీయంగా ఇప్పటిదాకా మమతకు ఏ సమస్య వచ్చినా.. ఆమె ప్రతిసారీ పరిష్కారాన్ని వీధుల్లోనే వెతుక్కున్నారు. ఈసారి కూడా ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరోసారి పార్టీకి జవసత్వాలు ఇవ్వటానికి కూడా వీధిపోరాటాలే మార్గమని భావించారు. కానీ ఇంతకాలం దీదీకి బూస్ట్ ఇచ్చిన వీధిపోరాటాలు.. ఈసారి మాత్రం వ్యతిరేక ఫలితం ఇచ్చాయి. అంతేకాదు దశాబ్దాలుగా పోరాటాల కోసం వీధికెక్కే మమతా బెనర్జీ.. ఈసారి మాత్రం పార్టీ పూర్తిగా బలహీనపడి.. నిజంగానే రోడ్డున పడిన దుస్థితి కనిపించింది. మొన్నటిదాకా బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన మమతకు.. ఓటమి తర్వాత వరుస పరిణామాలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. బెంగాల్ కూతుర్నంటూ గాండ్రించిన మమత.. ఇప్పుడు రాజకీయంగా శత్రువులు కూడా జాలిపడేంత దీనస్థితికి దిగజారారని చెప్పటానికి సందేహించాల్సిన పని లేదు.
బెంగాల్లో బీజేపీ సర్కారు గద్దెనెక్కాక.. టీఎంసీ నేతలపై వరుసదాడులు జరుగుతున్నాయని దీదీ ఆరోపించారు. అంతకు ముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలో అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీపై వీధుల్లోనే దాడి జరిగింది. ఇది సర్కారు కుట్రేనని మమత ఆరోపిస్తుంటే.. ప్రజాగ్రహమే కారణమని సువేందు తిప్పికొట్టారు. అయితే ఈ ఘటనల్ని ఇలాగే వదిలేస్తే.. ఇక టీఎంసీ నేతలు రోడ్లపై తిరగలేరనే నిర్ధారణకు వచ్చిన దీదీ.. నిరసన కోసం తనకు అలవాటైన ధర్నా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. గతంలో దీదీ ధర్నాలంటే పార్టీ నేతలు కదలివచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలే రావడం మమతకు షాకిచ్చింది. మొన్నటి ఘోర ఓటమిలోనూ 80 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న మమత.. తన ధర్నాకు వచ్చిన రెస్పాన్స్ చూసి అవాక్కయ్యారు. చివరకు ఎమ్మెల్యేల సమావేశం పెట్టినా.. పట్టుమని ఇరవై మంది రాకపోవడం కూడా మమతను ఆలోచనలో పడేసింది.
కానీ ఇక్కడ దీదీ మరో తప్పటడుగు వేశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు సమావేశానికి రానప్పుడు.. మరోసారి భేటీ పెడితే బాగుండేది. కనీసం రానివారిని వ్యక్తిగతంగా సంప్రదించి.. మరో తేదీ ఖరారు చేయాల్సింది. కానీ ఏకఛత్రాధిపత్యానికి అలవాటుపడ్డ దీదీ.. ఎమ్మెల్యేల ధిక్కారాన్ని భరించలేకపోయారు. రాని ఎమ్మెల్యేల్ని బుజ్జగించటం కంటే.. బుద్ధిచెప్పటానికే మొగ్గుచూపారు. పార్టీ నేత శోభన్ దేవ్ చటోపాధ్యాయను విపక్ష నేతగా నియమించారు. దీనికి సమావేశానికి రాని ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపినట్టుగా లేఖ విడుదల చేశారు. అందులో భేటీకి హాజరుకాని ఎమ్మెల్యేల సంతకాలు కూడా కనిపించాయి. దీంతో అలాంటి వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ప్రెస్ మీట్ పెట్టారు. తాము సమావేశానికి హాజరుకానప్పుడు.. సంతకాలు ఎలా పెడతామని ప్రశ్నించారు. కనీసం ఇక్కడైనా మమతా బెనర్జీ రాజకీయ విచక్షణకు పదును పెట్టాల్సి ఉంది. కానీ అక్కడ కూడా ఆమె వెనకడుగుకు సిద్ధపడలేదు. సంతకాల ఫోర్జరీని ప్రశ్నించినందుకు.. ఇద్దరు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు. దీంతో సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయారు. మమతకు బుద్ధి చెప్పాల్సిందేనని డిసైడయ్యారు. వెంటనే 58 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం పెట్టుకుని రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకుని స్పీకర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు స్పీకర్ ఆమోదం తెలిపి.. రితబ్రతను విపక్ష నేతగా నియమించారు. ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. స్పీకర్‌కు రెబల్ ఎమ్మెల్యేలిచ్చిన లేఖలో 58 మంది సంతకాలే ఉన్నా.. నిజానికి ఆ గ్రూపుకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 60 నుంచి 73 దాకా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం టీఎంసీలో మరింత గుబులు రేపుతోంది.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 294 స్థానాల్లో టీఎంసీ 80 సీట్లు నెగ్గింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా, ప్రత్యేక వర్గంగా గుర్తింపు పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి. రితబ్రత నేతృత్వంలోని 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఆ మార్కును అధిగమించారు. ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గర 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా ఆమె వెంట ఉండి ధర్నాలో పాల్గొన్నది ముగ్గురు మాత్రమే. రేపు అసెంబ్లీ మొదలైతే కానీ.. టీఎంసీ ఎమ్మెల్యేల అసలు చిత్రం బయటపడే అవకాశం లేదు. తాజా ఎత్తుగడలు 2022లో మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో, 2023లో అజిత్ పవార్ నాయకత్వంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో జరిగిన చీలికలను గుర్తుకు తెచ్చాయి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. టీఎంసీపై తిరుగుబాటు చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని మాత్రం ప్రస్తుతానికి సవాల్ చేయడం లేదు. స్పీకర్‌కు సమర్పించిన లేఖలో దీదీని టీఎంసీ ఛైర్‌పర్సన్‌గా పేర్కొన్నారు. మేం మమతా బెనర్జీని మా నాయకురాలిగా అంగీకరిస్తాం, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని మాత్రం అంగీకరించం అంటూ బాంబు పేల్చారు. కానీ అభిషేక్‌ను రాజకీయ వారసుడిగా చూస్తున్న మమత.. ఎమ్మెల్యేలు తనపై చూపిన స్వామిభక్తిని ఉపయోగించుకుంటారా.. లేదంటే మేనల్లుడికే ప్రాధాన్యత ఇచ్చి.. మరింతగా మునుగుతారా అనేది దీదీ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది.
28 ఏళ్లపాటు తృణమూల్‌పై తిరుగులేని పట్టు సాగించిన అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి మేనల్లుడి కారణంగా అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో ప్రస్తుత సంక్షోభానికి కేంద్ర బిందువు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. పార్టీలోని చాలా మంది నాయకులు అతని పనితీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా మమతా బెనర్జీని తాము గౌరవిస్తున్నామని చెబుతూ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పకోమని కరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మేనల్లుడి విషయంలో దీదీ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరం.
నిజానికి 2014 నుంచి మమతా బెనర్జీ తన వారసుడిగా అభిషేక్‌ను తయారుచేసే పనిలో ఉన్నారు. పార్టీలోని కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కార్పొరేట్, యువ విభాగాలను కూడా అభిషేకే పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమైన నిర్ణయాలనూ తీసుకుంటున్నారు. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అభిషేక్ తీరుపై పార్టీలో చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. సువేందు అధికారి సహా పలువురు నేతలు పార్టీనీ వీడి వెళ్లడానికి కూడా అభిషేక్ వైఖరే కారణమన్న ఆరోపణలూ ఉన్నాయి. మమత కష్టపడి క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తే.. అభిషేక్ తృణమూల్‌ను ఐ-పాక్ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఆయనేనని టీఎంసీ వర్గాలు కూడా నిందిస్తున్నాయి.
అభిషేక్ విషయంలో మమతా బెనర్జీ మధ్యే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. పాత తరం నాయకులను శాంతింపజేస్తూనే, ఆమె మేనల్లుడిని కాపాడుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఇప్పటికే ఆమె పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీని ద్వారా అభిషేక్ కార్పొరేట్ శైలి మేనేజ్‌మెంట్‌ను పక్కన పెట్టానన్న సంకేతాన్ని పంపించారు. తిరుగుబాటుదారులను వెనక్కి రప్పించడానికి రానున్న రోజుల్లో ఆమె అభిషేక్ అధికారాలకు కోత పెట్టి తానే పార్టీని పర్యవేక్షించొచ్చు.
బెంగాల్ రాజకీయాల్లో ఆరితేరిన మమతకు సంక్షోభాలు కొత్త కాదు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఆమె తన జీవితకాల శ్రమతో నిర్మించారు. దాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎంతకైనా తెగిస్తారన్నది పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయం. ఇందుకోసం అభిషేక్‌ను త్యాగం చేయాల్సి వచ్చినా ఆమె వెనుకాడరన్నది వారు చెబుతున్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. మమత పుట్టుకతోనే పోరాట యోధురాలని.. ఆమె ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారని అంటున్నారు. ఒకవేళ విఫలమైతే మాత్రం బెంగాల్‌లో వామపక్షాలకు పట్టిన గతే.. తృణమూల్‌కూ పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రస్తుతం మమతపై ముప్పేట దాడి జరుగుతోంది. పార్టీ పరంగానే సంక్షోభం పెద్దదౌతోంటే.. ఇది చాలదన్నట్టుగా ఆమెపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఆమె పాలనలో సాగిన అరాచకాలు, వచ్చిన ఆరోపణలపై విచారణ కమిటీని నియమించారు. అంటే భవిష్యత్తులో మరిన్ని కేసులు తప్పవన్న మాటే. ఇక పదిహేనేళ్ల పాటు బెంగాల్ సీఎంగా మమత వేసిన ముద్రను చెరిపేయటానికి కూడా సువేందు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీంతో మమత సమస్యల ఊబిలో కూరుకుపోతున్న దుస్థితి కనిపిస్తోంది.

