పసిడితో అనాదిగా ముడివేసుకున్న జనం బంధాన్ని తెగ్గొట్టాలని కొన్ని కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం జనం అవసరాలు, ప్రస్తుత ఆర్థిక విషమ పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. దీనికి తోడు బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే కుటుంబాలు కూడా ఇప్పుడు తప్పనిసరి స్థితిలో అమ్మకానికి మొగ్గుచూపుతున్నాయి. మరికొందరు గతంలో తాకట్టు పెట్టిన బంగారానికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీ బంగారం మేం విడిపించి కొంటాం.. అనే ప్రమోషన్లకు త్వరగా ఆకర్షితులౌతున్నారు. ఈ బలహీనతే.. కంపెనీలకు తిరుగులేని ఆయుధంలా మారి.. బంగారం అమ్మేయాలని జనంపై మానసిక ఒత్తిడి పెంచేలా చేస్తోంది. బంగారం ధర తగ్గుతోందనే ఆనందం పూర్తిగా అనుభవించకముందే.. మరోసారి పసిడి పైపైకి పోతోంది. దీనికి యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు దోహదం చేస్తున్నాయి. మరోవైపు తగ్గుతున్న జీవన ప్రమాణాలు.. మధ్యతరగతి.. ఆ దిగువ వర్గాలను బంగారం అమ్మకాలకు ప్రేరేపిస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు పసిడి కొంటామని ప్రమోషన్లతో ఊరిస్తున్నాయి.
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. యుద్ధాలు, అనిశ్చితులతో మళ్లీ పసిడి పుంజుకుంటోంది. కొంతకాలంగా తగ్గుతున్న ధరలు.. మరోసారి చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షన్నర రూపాయలు దాటిపోయింది. మరోవైపు ఆర్థిక పరిస్థితులు విషమిస్తున్నాయి. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు బంగారం అమ్ముకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. గతంలో బంగారం తాకట్టుకు మొగ్గుచూపే ఈ వర్గాలు. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు కూడా వారిని పసిడి అమ్మేలా ప్రేరేపిస్తున్నాయి. నిజానికి బంగారం అమ్మకం అశుభం అని భావించే కుటుంబాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కంపెనీలు తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి.. ఇవాల్టి మార్కెట్ రేటుకు మేం కొంటాం అని ఊరిస్తున్నాయి. మానసికంగా వినియోగదారుల్ని బంగారం అమ్మాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది చట్టపరంగా తప్పు అని చెప్పలేకపోయినా.. నైతికంగా మాత్రం సరైనది కాదని చెప్పటానికి సందేహించాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పటికైనా జనం మేలుకుని కంపెనీల ప్రమోషన్ల ఉచ్చులో పడకుండా.. బంగారం అమ్మకానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బంగారం అమ్మితే.. భవిష్యత్తులో కొనడం సాధ్యం కాకపోవచ్చు.
బంగారం కొనటం.. అమ్మటం చట్టపరంగా తప్పుకాదు. కానీ విలువ, దీర్ఘకాలిక అవసరాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రం.. ఇప్పుడు బంగారం అమ్మేయాలని ప్రోత్సహించటం మాత్రం నైతికంగా తప్పే. ఎందుకంటే బంగారం భవిష్యత్తులో కూడా పెరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం అమ్ముకుంటే.. ఆ తర్వాత పసిడి కొనటం అంత తేలిక కాకపోవచ్చు. కాకపోతే సామాన్యులకు ఎప్పుడూ అవసరం ముఖ్యం కాబట్టి.. అంత ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. అంతమాత్రాన ఇదే అదనుగా వారితో బంగారం అమ్మించడం కచ్చితంగా ఓ రకమైన దోపిడీనే అవుతుంది. ఈ విషయంలో జనం కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.
నిజానికి చాలా మంది బంగారం కొనేది ఆపదలో ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే. అలాగే అత్యవసరమైనప్పుడు బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవడం కూడా చాలా మందికి అలవాటే. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఈ పోకడ ఎక్కువ. అలా తాకట్టు పెట్టిన బంగారాన్ని మళ్లీ డబ్బులొచ్చాక విడిపించుకోవడం మామూలే. అలా చూసుకున్నప్పుడు బంగారం రెడీమేడ్ నగదుగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు కంపెనీలు చేస్తున్న ప్రమోషన్ల మాయలో పడిపోతే మాత్రం మన బంగారం శాశ్వతంగా మనకు దూరమౌతుంది. ప్రస్తుతానికి డబ్బు వస్తుంది కదా అనుకోవడం సహజమే అయినా.. భవిష్యత్తులో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు చేతిలో ఉన్న రెడీమేడ్ క్యాష్‌ను చేజార్చుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి బంగారానికి మించిన భరోసా మరోటి లేదు. ఇళ్లు, స్థలాలు ఉన్నా కూడా అవి అవసరానికి వెంటనే అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు పసిడే ఆపదలో ఆదుకుంటుంది. కానీ ఇప్పుడు కంపెనీలు చేస్తున్న ప్రకటనల ఒత్తిడికి తలొగ్గి.. తాకట్టు బదులు అమ్ముకుంటే ఎక్కువ డబ్బు వస్తుంది అనుకుంటే.. అది భవిష్యత్తు దృష్ట్యా అంత మంచి నిర్ణయం అనిపించుకోదనే అభిప్రాయాలున్నాయి.
కొన్నాళ్లుగా రోలర్‌కోస్టర్ రైడ్‌ను తలపిస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు అప్ ట్రెండ్‌ను అందుకున్నాయనే వాదన వినిపిస్తోంది. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. దశాబ్దాలుగా పసిడి రేట్లను ప్రభావితం చేస్తున్న వాస్తవ వడ్డీ రేట్లు, డాలర్ సూచీ, స్వల్పకాలిక ద్రవ్య సరఫరా వంటి సాంప్రదాయ అంశాలను పక్కనపెట్టి, ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల రిజర్వ్ నిర్వహణ విధానాలు, ప్రభుత్వ ద్రవ్య లోటుల ఆధారంగా ఒక కొత్త పరిమాణాత్మక ఫ్రేమ్ వర్క్‌ను నిపుణులు రూపొందించారు. ఈ అధునాతన మోడల్ ఆధారంగా.. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు 4,650 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి.
బంగారం ధరపై అంచనాలు, ధరల పెరుగుదల ట్రెండ్, కొన్ని కంపెనీల ప్రమోషన్ల దూకుడును విడివిడిగా చూస్తే విషయం అర్థం కాదు. వీటిని కలగలిపి చూసినప్పుడే కంపెనీల అసలు వ్యూహమేంటో అర్థమవుతుంది. ప్రస్తుతం మధ్యస్త ధరకే బంగారం భారీగా సేకరించి.. ఆ తర్వాత భవిష్యత్తులో బాగా లాభపడే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి. ఈ విషయం నేరుగా జనానికి తెలియకుండా.. ఆర్థిక అవసరాలు, వివిధ వర్గాల బలహీనతలతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజలు కంపెనీల అమ్మకాల ప్రమోషన్లలో పడి.. అమ్ముకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ పోకడ మరింతగా ఊపందుకుంటే ప్రమాదమనే హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్ని సంక్షోభాలొచ్చినా.. దేశీయ గృహాల్లో ఉన్న భారీ బంగారం నిల్వలే.. దేశం కుప్పకూలకుండా నిలబెట్టాయనేది నిష్ఠుర సత్యం. అలాగే కుటుంబ స్థాయిలోనూ.. చాలా కుటుంబాలు నిస్సహాయ స్థితిలో బంగారాన్నే ఆదరువుగా చేసుకుని.. ఆపదలు గట్టెక్కి ఒడ్డునపడ్డాయి. కానీ ఇప్పుడు బంగారం అమ్మేసుకుంటే.. ఇక భవిష్యత్తులో బంగారం కొనలేని పరిస్థితి తలెత్తితే.. అప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉన్న అతి పెద్ద ఆర్థిక భరోసా దూరమైనట్టే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో గోల్డ్ లోన్లు బాగా పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థ విషమ స్థితిలో ఉందనటానికి సంకేతమని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా పరిస్థితులు బాగాలేనప్పుడే జనం.. తమ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరాలు గడుపుకుంటారు. అసలు గోల్డ్ లోనే ఆర్థిక దుస్థితికి నిదర్శనం అని భావిస్తున్నప్పుడు.. ఇక పసిడి అమ్మకాలు ఊపందుకుంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక్కడ మరో ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే దేశంలోకి పసిడి దిగుమతుల్ని సర్కారు నియంత్రించింది. పాత బంగారం మార్పిడి చేసుకుని కొత్త నగలు చేయించుకునే ట్రెండ్ వచ్చింది. అలాగే నిజంగా బంగారం కొనగలిగే వారి డిమాండ్‌కు తగ్గ స్థాయిలో మార్కెట్‌లో సప్లై లేని మాట నిజం. ఇలాంటి తరుణంలో.. సామాన్యులు బంగారం తాకట్టు ఆలోచన నుంచి అమ్మకం వైపు పూర్తిగా మొగ్గారంటే.. అప్పుడు ఎక్కడికక్కడ బంగారం వ్యాపారులు కూడా రంగంలోకి దిగి.. అమ్మకాలకు మరింత ఊపునిస్తారనడంలో సందేహం లేదు. వీరి దగ్గర్నుంచి బంగారం సేకరించి.. అవసరమైనవారికి అమ్ముకుంటే.. లాభం కళ్లచూడొచ్చనే ఆలోచన కచ్చితంగా వస్తుంది. ఇప్పటిదాకా సంప్రదాయ బంగారం వ్యాపారులు.. తమ కస్టమర్లను పాత బంగారం అమ్ముతారా అని అడిగే పరిస్థితే లేదు. అంతెందుకు తాకట్టు విషయం కూడా అట్నుంచి ప్రతిపాదన వస్తే తప్ప.. వ్యాపారులు తమంతట తాముగా అడగటానికి సాహసించరు. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు బంగారం తాకట్టును కూడా అశుభంగా భావించే స్థితిలో.. తమవైపు నుంచే ఇలాంటి ప్రతిపాదన పెడితే.. సెంటిమెంట్‌గా ఫీలై.. మరోసారి తమ దగ్గర బంగారం కొనటానికి రారనే భయం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు రంగంలోకి దిగి.. తాకట్టులో ఉన్న బంగారం విడిపిస్తాం.. మార్కెట్ రేటుకు మేమే కొంటాం అనే ఆకర్షణీయ ఆఫర్లతో సామాన్యుల్ని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీరి ప్రమోషన్లు కనుక బాగా సక్సెస్ అయితే.. అప్పుడు మొత్తంగా బంగారం మార్కెట్‌లో వినియోగదారులతో పాటు వ్యాపారుల ట్రెండ్ కూడా మారే అవకాశం లేకపోలేదు. ఈ మార్పు కోసమే కొన్ని కంపెనీలు వినియోగదారులపై ఆకర్షణీయ ఆఫర్ల వల విసిరి.. బంగారం అమ్మాలని మానసికంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పని అనైతికమని తెలిసినా.. తమ లాభం తాము చూసుకుంటున్నాయి.

