Story Board: వాతావరణం అన్నాక మార్పులు సహజం. కానీ అసహజ ధోరణులు పుట్టి ముంచుతున్నాయి. ఒక వైపు వరదలు.. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు. టోటల్‌గా అసాధారణ వాతావరణం అందర్నీ వణికిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లు అసాధారణ వర్షాలు.. వాన వెలిసిన వెంటనే మాడు పగిలేలా ఎండలు. ఏం వచ్చినా పట్టలేం అన్నట్టుగా ఉంది వాతావరణం పోకడ. ఈ మధ్య కాలంలో ఈ అపరిచిత ధోరణులు బాగా పెరిగాయి. ఎంత సాంకేతికత ఉన్నా.. వాతావరణాన్ని అంచనా వేయడం వీలుకావడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. వాతావరణం పదేపదే బురిడీ కొట్టిస్తోంది. అంచనాలకు అందని ప్రవర్తనతో అవాక్కయ్యేలా చేస్తోంది. మిగతా రంగాల్ని పక్కనపెడితే.. వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు తప్పటం లేదు. తరతరాలుగా దుక్కి దున్నటం దగ్గర్నుంచి కోతల దాకా కాలానుగుణంగా చేయటానికి అలవాటుపడ్డ రైతులు.. మారుతున్న వాతావరణాన్ని చూసి బెంబేలెత్తుతున్నారు. వాతవారణానికి తగ్గట్టుగా పంటకాలం మార్చాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే ఊరికో రకంగా ఉండే వాతావరణాన్ని నమ్ముకుని.. ఎలా ప్లాన్ చేయాలనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
వర్షకాలంలో వానలు కురవాలి. ఎండాకాలంలో ఎండలు కాయాలి. కానీ వర్షాకాలంలో ఉక్కపోత.. ఎండాకాలంలో తుపాన్లు నిత్యకృత్యంగా మారాయి. అదీ అసహజంగా వస్తున్నాయి. ఎండలు కాస్తే రోళ్లు పగలాల్సిందే అన్నట్టుగా ఉంటోంది. వర్షం కురిస్తే.. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా కుండపోతే. అంతేకానీ సాధారణ పోకడలు ఎక్కడా కనిపించటం లేదు. పోనీ అసహజ పోకడైనా ఓ ప్రాంతమంతా సమతులంగా ఉంటుందా.. అంటే అదీ లేదు. ఓ ఊరిలో వాన కురుస్తుంది. పక్కూరిలో ఎండ కాస్తుంది. అంతెందుకు ఒకే ఊరిలో ఓ వీధిలో వాన.. పక్క వీధిలో ఎండ కవల పిల్లల్లాగా ఉంటున్నాయి. దీంతో వాతావరణానికి తగ్గట్టుగా అప్రమత్తం కావడం కూడా సవాల్ గా మారుతోంది. చివరకు వాతావరణ కేంద్రాలు కూడా చేతులెత్తేసేలా ప్రకృతి పగబడుతోంది.
సాధారణ వర్షాలు అన్న మాటే మరచిపోయేలా తయారైంది వాతావరణం. వాన పడిందంటే అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ చెరిగిపోతున్నాయి. ఏడాది పాటు సరిపోయే వర్షం మొత్తం ఒకేరోజు కురుస్తోంది. ఇలాంటి అరుదైన పరిస్థితులు గత కొన్నేళ్లుగా రొటీన్‌గా మారిపోయాయి. తాజాగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వాన 50 ఏళ్ల రికార్డును చెరిపేసింది. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ భారతదేశాన్ని వరదలు అతాలాకుతలం చేస్తున్నాయి. కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణ ప్రక్రియే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే కాదు ఇప్పుడు జూన్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు వర్షాకాలంలో చల్లబడాలి.. సాధారణం కంటే వర్షాలు తక్కువగా కురిసినప్పుడు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు అసాధారణ వర్షాలు కురిసినా వాతావరణంలో చల్లదనం కనిపించడం లేదు. ఉక్కపోత ఎక్కువగానే ఉంటోంది.
సాధారణంగా ప్రతి పది సంవత్సారాలకు ఓ సారి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో వాతావరణంలో ఇలాంటి హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ, ఇప్పుడు ప్రతి రెండు మూడేళ్లకు కాల గమనంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంది. ఇటు భూమిపైన, అటు సముద్రంపైన వేడి పెరుగుతుండటం వల్ల అతివృష్టి. అనావృష్టి సంభవిస్తోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కారణంగానే దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకే సమయంలో ఓ చోట కరవు ఉంటే.. మరోచోట వరదలు ముంచేస్తున్నాయి. వర్షానికి, వర్షానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటోంది. భారీ వర్షాలు ఒకవైపు, వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉంటున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెప్టెంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు.
దేశంలో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఇప్పటికిప్పుడు మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకు, తద్వారా తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది.
సీజన్‌లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది.
వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు. ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది. సాధారణంగా సెప్టెంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశ్చిమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది.
సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు. రోజులతరబడి ముసురేసి, వాగుల్ని, వంకల్ని ఏకం చేసి జనావాసాల్ని ముంచేసే వర్షాలు.. హోరుమంటూ తీరాన్ని తాకి బీభత్సం సృష్టించే ప్రళయ భీకర తుఫాన్లు.. మండుటెండలను మించి చుర్రున కాల్చేసే ఎండలు.. తీవ్రమైన కరువు కాటకాలు! …దేశంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఇలాంటి అసాధారణ ప్రకృతి విపత్తులు వస్తూనే ఉన్నాయి. బిహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లోని 60 శాతానికిపైగా జిల్లాలు కనీసం ఏడాదికి ఒక్క అసాధారణ ప్రకృతి ఉత్పాతాన్నైనా చవిచూస్తున్నట్టు వెల్లడైంది.
సాధారణంగా ప్రకృతి విపత్తులంటేనే భయంకరంగా ఉంటాయి. కానీ, పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఆ విపత్తులు ఇలా అసాధారణ స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గడిచిన ఐదు దశాబ్దాల్లో ఇలాంటి అసాధారణ ప్రకృతి విపత్తులు నాలుగు రెట్లు పెరిగాయని తేలింది. గడిచిన దశాబ్దకాలంలో అయితే.. ఏకంగా ఐదురెట్ల పెరుగుదల ఉన్న ట్టు తెలిపింది. కరువునేలలను వరదలు ముంచేస్తుండగా, వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. భూగోళంపై నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టే వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులు తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్నాయి.
వేసవిలో గాలి దుమారాలు సహజం. కానీ వాటి తీవ్రత ఊహించని రీతిలో పెరిగి మహానగరాలను వణికిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. గాలి దుమారాలు, ధూళి తుఫాన్లు, వర్షాల తీవ్రత నానాటికీ పెరగడం ఒకెత్తయితే.. ఇలాంటి విపత్తుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఇటీవల దుబాయ్ లో వరదలొచ్చాయి. ఏకంగా ఎయిర్ పోర్ట్ మునిగిపోయింది. అంతంతమాత్రంగా వర్షాలు పడే చోట.. ఏకంగా భీకర వరదలు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రుతుపవన వర్షపాతంపై ఆధారపడ్డ మన దేశాన్ని.. అసహజ ప్రకృతి పోకడలు భయపెడుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే.. అన్ని రంగాల గణాంకాలు మారిపోవడం ఖాయం. అలా జరగకూడదంటే.. మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాల్సిందే. లేకపోతే గతమెంతో మంచికాలం.. ఇప్పుడంతా ముంచేకాలం అని బాధపడాల్సిన రోజు ఎంతో దూరంలో లేకపోవచ్చు.