Story Board: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పార్టీల బలాబలాలేంటో చాటిచెప్పాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనేదానికంటే.. ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. ఓటర్ల ఆలోచన తీరుపై మరింత స్పష్టత వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది ఓటేసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కు 39.08 శాతం ఓట్లు వచ్చాయి. అదే బీఆర్ఎస్‌కు 28.75 శాతం ఓట్లు, బీజేపీకి 15.67 శాతం ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 3.28 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు కలిపి కూడా ఓట్ల శాతం 44 దాటలేదు. ఈ లెక్కన అధికార పార్టీకి తిరుగులేదని తేలిపోయింది.
తెలంగాణలో త్రిముఖ పోటీ ఉన్నా.. కాంగ్రెస్‌కే అడ్వాంటేజ్ అవుతోంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీలిపోతోంది. బీజేపీకి ఓట్లు పెరిగినా కూడా.. ఆ పెరిగే ఓట్లు బీఆర్ఎస్ ఓటుబ్యాంకు నుంచే చీలుతున్నాయి తప్ప.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు చెదరటం లేదు. దీంతో కాంగ్రెస్ ఓట్లు సాలిడ్‌గా ఆ పార్టీకి పడిపోతున్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఓట్ల శాతం విషయానికొస్తే.. ఆ రెండు పార్టీల్లో ఓ పార్టీ ఓట్ల శాతం పెరిగితే.. మరో పార్టీ ఓట్ల శాతం తగ్గిపోతోంది. అంతకుమించి ఈ రెండు పార్టీల్లో కూడా ఏ పార్టీ కూడా అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉండటం లేదు. తద్వారా ప్రతిపక్షాలు రెండో స్థానం కోసం పోటీపడటంతోనే వాటికి సరిపోతోంది. అసలు మొదటి స్థానంపై గురిపెట్టే అవకాశమే వాటికి రావడం లేదు. రెండో స్థానం కోసమే గట్టిపోటీ ఉండటంతో.. అది రావడమే ఘనం అని సరిపెట్టుకునే స్థితిలో ప్రతిపక్షాలున్నాయి.
కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లు ఇబ్బందులుపడ్డా.. 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచి కాంగ్రెస్ ఓటుబ్యాంకు స్థిరపడిందని గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్నుంచి ఇప్పటి మున్సిపల్ ఎన్నికల వరకూ కాంగ్రెస్ ఓటుబ్యాంకు చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు వస్తే.. బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. అదే బీజేపీకి 13.90 శాతం ఓట్లు, ఎంఐఎంకి 2.22 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆర్నెళ్ల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటుబ్యాంకు అలాగే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చూస్తే.. కాంగ్రెస్ కు 40.10 శాతం ఓట్లు, బీజేపీకి 35.08 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 16.68 శాతం ఓట్లు, ఎంఐఎంకి 3.02 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభకు వచ్చేసరికి కాంగ్రెస్ తన ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకోవటమే కాదు.. కాస్త పెంచుకుంది కూడా. అదే ప్రతిపక్షాల విషయానికొస్తే.. బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల శాతాలు అసెంబ్లీతో పోలిస్తే తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్.. లోక్‌సభకు వచ్చేసరికి మూడో స్థానానికి పడిపోయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉన్న బీజేపీ.. లోక్‌సభకు వచ్చేసరికి రెండో స్థానానికి ఎగబాకింది.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని.. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా.. కాంగ్రెస్ ఓట్లకు ఢోకా లేదని తేలిపోతోంది. బీఆర్ఎస్ ఓటుబ్యాంకు తగ్గగా.. బీజేపీ ఓటుబ్యాంకు కాస్త పెరిగింది. అంటే బీఆర్ఎస్‌కు తగ్గిన ఓటుబ్యాంకు కాస్తా.. బీజేపీకి బదిలీ అయిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే ఎంఐఎం విషయానికొస్తే.. ఓటుబ్యాంకులో మరీ ఎక్కువ తేడా కనిపించడం లేదు. ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రెండో స్థానం దక్కడానికి మోడీ ఇమేజ్ కారణమనే వాదన ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పెద్దగా పుంజుకోకపోవడమూ కారణమే. కానీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నా ఓట్ల శాతం మాత్రం పెంచుకోలేకపోయింది. పైగా తగ్గించుకుంది. ఇక ఆ తగ్గిన ఓట్లు కాస్తా బీజేపీకి పడటంతో.. ఆ పార్టీ ఓట్ల శాతం కాస్త పెరిగినట్టుగా కనిపిస్తోంది. ఏతావాతా ముక్కోణపు పోటీ కాంగ్రెస్‌కే లాభమని తేలిపోతోంది.
తెలంగాణలో పేరుకి మూడు ప్రధాన పార్టీలున్నా.. ఓటర్లు మాత్రం కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓటర్లుగా మాత్రమే ఉన్నారనేది గత రెండేళ్లలో జరిగిన ఎన్నికలు నిరూపిస్తున్న సత్యం. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్‌కు పడే ఓట్లు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లే. కాకపోతే ఎవరు కాంగ్రెస్‌కు నిజమైన ప్రతిపక్షంగా ఉన్నారనే విషయంలో ఓటర్ల మధ్య కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్‌ను, లోక్‌సభకు వచ్చేసరికి బీజేపీని కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారనే విషయం స్పష్టంగానే ఉంది. కానీ స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ కాస్త పుంజుకున్నట్టుగా.. బీఆర్ఎస్ ఓట్లు కాస్త తగ్గినట్టుగా కనిపించడం దేనికి సంకేతమనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. అలా చూసుకున్నా.. బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోవాల్సిందే తప్ప.. ఎవరికీ కొత్తగా ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపించడం లేదు. తద్వారా ప్రభుత్వ అనుకూల ఓట్లను ఆకర్షించడంలో రెండు ప్రతిపక్ష పార్టీలూ విఫలమైనట్టే. పైగా ఈ రెండు పార్టీలూ ఒక దాని ఓటుబ్యాంకుని మరొకటి లాక్కునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిపక్షాలు రెండో స్థానం కోసమే పోటీపడుతున్నాయని ధీమాగా చెప్పగలుగుతున్నారు.
మొత్తం మీద తెలంగాణలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంకు స్థిరపడింది. ఆ ఓటుబ్యాంకును ప్రతిపక్షాలు టచ్ చేయలేకపోతున్నాయి. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా, లోకల్ అయినా.. కాంగ్రెస్ ఓటరు.. అధికార పార్టీతోనే ఉంటున్నాడు. అభిప్రాయం మార్చుకోవాలని అనుకోవడం లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో మాత్రం అభిప్రాయాలు మారిపోతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎవర్ని ఎంచుకోవాలనే విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ రావడం లేదు. కనీసం ఏదో ఒక పార్టీ ఓటుబ్యాంకు కూడా స్థిరపడటం లేదు. ఈ పరిణామం అధికార పార్టీకి మరింత రాజకీయ సానుకూలత తెచ్చిపెడుతోంది. రెండేళ్లుగా తంటాలు పడుతున్నా.. అటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ తమ ఓటుబ్యాంకును స్థిరపరుచుకోలేకపోవడం.. ప్రతిపక్షాలుగా వైఫల్యమే అని చెప్పకతప్పదు. ఇక్కడ బీజేపీ ఓటుబ్యాంకులో స్వల్ప పెరుగుదల కూడా సహజ పరిణామక్రమంలానే కనిపిస్తోంది. గతంలో ఓ దశలో దాదాపుగా 45 శాతం ఓటుబ్యాంకును సాధించిన బీఆర్ఎస్.. అక్కడ్నుంచి క్రమంగా పతనమౌతూ వచ్చింది. ఇప్పుడు ఇరవై శాతం ఓటుబ్యాంకుకే పరిమితమైంది. కాకపాతే ఆ ఓటుబ్యాంకు కూడా కచ్చితంగా తర్వాతి ఎన్నికల్లో గులాబీ పార్టీకి పడుతుందనే గ్యారెంటీ లేకపోవడం దురదృష్టకరం. అలా 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచి ఇప్పటి మున్సిపల్ ఎన్నికల వరకు చూసుకుంటే.. అధికార పార్టీగా కాంగ్రెస్ మాత్రమే తన ఓటుబ్యాంకును స్థిరపరుచుకుని.. పదిలంగా కాపాడుకుంటోంది. ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం తమ ఓటుబ్యాంకుపై సరైన క్లారిటీ లేకుండా ఉన్నాయి. పైకి సర్కారుకి ఎన్ని సవాళ్లు విసిరినా.. గ్రౌండ్‌లో పునాదుల విషయంలో మాత్రం ఆ పార్టీలకు తడబాటు తప్పటం లేదు.
2023 నుంచి కాంగ్రెస్ రాజకీయంగా ఆధిపత్యం స్థిరపరుచుకున్నా..అంతకుముందు పరిస్థితి వేరుగా ఉంది. తెలంగాణ తెచ్చామని చెప్పుకుని టీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చామని చాటుకుని కాంగ్రెస్ ఓటర్ల ముందుకెళ్లాయి. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి పదేళ్లు టీఆర్ఎస్ పైచేయి సాధించింది. కాంగ్రెస్ రెండో స్థానానికే పరిమితమైంది. దీనికి 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాలే తిరుగులేని నిదర్శనం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 46.87 శాతం ఓట్లు సాధించింది. అప్పుడు కాంగ్రెస్ కు 28.43 శాతం ఓట్లు, బీజేపీకి 6.98 శాతం ఓట్లు, ఎంఐఎంకి 2.71 శాతం ఓట్లు వచ్చాయి. అదే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్ఎస్‌కు 41.29 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 29.48 శాతం ఓట్లు, బీజేపీకి 19.45 శాతం, ఎంఐఎంకి 2.78 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ మిగతా పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్ స్పష్టమైన రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించింది.
తెలంగాణ ఆవిర్భావానికి తామే కారణమని గట్టిగా చెప్పుకున్న టీఆర్ఎస్.. ఆవిర్భావం తర్వాత తొలి పదేళ్లూ ఓటర్లను బాగా ఆకట్టుకోగలిగింది. దీనికి తోడు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను.. ఇతర పార్టీల చేతిలో పెట్టొద్దంటూ టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా బాగా వర్కవుట్ అయింది. టీఆర్ఎస్‌ను కాదంటే ఏమౌతుందో అనే ఆందోళన కూడా తెలంగాణ ఓటర్లను తొలి పదేళ్ల పాటు ఆ పార్టీ వెంట నడిచేలా చేసింది. దీంతో లోకల్ అడ్వాంటేజ్‌ను గట్టిగా వాడుకున్న టీఆర్ఎస్ ఓటుబ్యాంకు తగ్గకుండా చూసుకోగలిగింది. ఎవరేమనుకున్నా.. తెలంగాణతో టీఆర్ఎస్‌ది పేగుబంధమంటూ ఆ పార్టీ ఉపయోగించిన సెంటిమెంట్ అస్త్రం బాగా పనిచేసింది. అటువైపు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చే సమయంలో ఏం జరిగిందో వివరంగా చెప్పినా కూడా ఆ పార్టీని తొలి పదేళ్లూ తెలంగాణ ఓటర్లు అంతగా ఆదరించలేదు. అలాగని కాంగ్రెస్ పూర్తిగా పతనం కాలేదు. ఆ పార్టీ ఓటుబ్యాంకు పాతిక శాతం దగ్గరే స్థిరంగా ఉంటూ వచ్చింది. అలా చూసుకుంటే ప్రతిపక్షంలోనూ తన ఓటుబ్యాంకుని మరీ తగ్గకుండా చూసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అదే బీఆర్ఎస్ విషయానికొస్తే.. అధికారంలో ఉండగా వచ్చిన ఓట్ల శాతానికి, ప్రతిపక్షంలోకి వచ్చాక వచ్చిన ఓట్ల శాతానికి పొంతన లేదు. పైగా ఓటుబ్యాంకు దాదాపుగా సగానికి పడిపోయింది. పోనీ ఆ సగానికి పడిన ఓటుబ్యాంకైనా స్థిరంగా ఉందా అంటే అదీ లేదు. మరింతగా పతనమౌతూ జారుడుమెట్ల మీద ఉంది. అదే బీజేపీ విషయానికొస్తే.. తెలంగాణ వచ్చిన తొలి పదేళ్లూ సింగిల్ డిజిట్ ఓట్ల శాతం దాటని బీజేపీ.. 2019 లోక్‌సభ ఎన్నికల దగ్గర్నుంచి డబుల్ డిజిట్ కు చేరి.. అప్పట్నుంచీ ఓటుబ్యాంకు పెంచుకోవటానికి నానాపాట్లు పడుతోంది. కాషాయ పార్టీకి ఎంతోకొంత ఓట్ల శాతంలో పురోగతి ఉన్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం లేదనే చెప్పాలి. ఇక్కడ ఎంఐఎం ఓటుబ్యాంకులో మాత్రం ఎప్పుడూ పెద్దగా మార్పు రాలేదు.
ఇక్కడ ఓట్ల శాతం చాలా అంశాలపై క్లారిటీ ఇస్తోంది. ఓ పార్టీ బలాబలాలతో పాటు.. ఓటర్ల మనోభావాలు, వారి అభిప్రాయాల్లో మార్పు, సమకాలీన రాజకీయ స్థితిగతుల్ని స్పష్టంగా తెలియజెబుతోంది. ఇక్కడ గెలిచిన సీట్లు తాత్కాలికంగా పార్టీల బలాబలాలకు చిహ్నమైతే.. దీర్ఘకాలంలో ఓట్ల శాతమే పార్టీల వాస్తవబలాన్ని కళ్లకు కడుతుందనేది రాజకీయ పండితులు చెప్పే మాట. ఓట్ల శాతాన్ని బట్టే పార్టీ పునాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తేలుతుంది. అలా చూసుకుంటే కాంగ్రెస్ పునాదులు మొదట్నుంచీ పదిలంగానే ఉన్నాయి. అందుకే ఆ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఓట్ల శాతంలో మరీ ఎక్కువ అంతరం లేదు. కానీ టీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా.. పార్టీ పునాది బలంగా లేకపోవడంతో.. ప్రతిపక్షంలోకి రాగానే ఓట్ల శాతం సగానికి పడిపోయింది. బీజేపీకి గ్రౌండ్ లో బలంపై సరైన అంచనానే లేదు. ఆపార్టీకి ఏ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయో ఆ పార్టీకి కచ్చితంగా తెలియదనేది బహిరంగ రహస్యం. అందుకే వస్తే అనూహ్య ఫలితాలు.. లేకపోతే మరీ తక్కువస్థాయి సీట్లు రావడం కాషాయ పార్టీకి సాధారణమే. ఎంఐఎం విషయానికొస్తే పాతబస్తీ వరకు పార్టీ పునాదులు పటిష్ఠంగా ఉండటంతో.. ఆ పార్టీ ఓట్ల శాతంలో పెద్ద తేడా కనిపించడం లేదు. ఇలా పార్టీ పునాదికి, ఓట్ల శాతానికి డైరక్ట్ లింక్ ఉందని తేలిపోతోంది.
తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ముక్కోణపు పోటీ కొనసాగుతోంది. మొదట్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం చూసి..ఆ పార్టీ పెద్ద పోటీదారుగా ఉండదనే అంచనాలున్నా.. ఆ తర్వాత కాషాయ పార్టీ కూడా మెల్లగా పుంజుకుంది. ఇప్పుడు త్రిముఖ పోటీ లేదని ఎవరూ గట్టిగా అనలేని పరిస్థితి. దీంతో ఈ త్రిముఖ పోటీని ద్విముఖ పోటీ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రతి పార్టీ మిగతా రెండు పార్టీలకూ చీకటి ఒప్పందాలున్నాయని ప్రచారం చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని ఓటర్లు కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా నమ్ముతూ వచ్చారు. అందుకు తగ్గట్టే పార్టీల ఓట్ల శాతాలు అటూ ఇటూ అవుతున్నాయి. అయితే ఈ కన్ఫ్యూజన్‌లో కూడా కాంగ్రెస్ ఓటరు మాత్రం స్థిరంగానే ఉంటున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఓటర్లలోనే కాస్త ఎక్కువ అయోమయం కనిపిస్తోంది. దీనికి తోడు జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఆ రెండు పార్టీల మధ్య ఏదో ఉందనే అనుమానాలు పుట్టుకురావడానికి కారణమయ్యాయి. దీంతో ఏమో ఏదో ఉందేమో అనుకునే సందిగ్ధాన్ని.. కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. అదే సమయంలో ఈ సందిగ్ధతకు తెరదించడంలో ఆ రెండు పార్టీలూ అంత చొరవ తీసుకోలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ పదిలంగా ఉన్న పునాదులు కూడా అడ్వాంటేజ్‌గా మారాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్‌కు క్యాడర్ ఉండటం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. రాజకీయంగా ఎలాంటి మార్పులొచ్చినా.. కాంగ్రెస్ ఓటర్లు చెక్కుచెదరకుండా ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. అదే అడ్వాంటేజ్ మిగతా రెండు పార్టీలకు లేకపోవడంతో.. వాటికి ఒడుదుడుకులు తప్పటం లేదు.
ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ ఓటుబ్యాంకు మాత్రమే స్థిరపడింది. మిగతా రెండు పార్టీల్లో ఏవీ తమకు కచ్చితంగా ఇంత ఓట్ల శాతం ఉందని కానీ, ఇన్ని ఓట్లు వస్తాయని కానీ గట్టిగా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాయి. మరి మిగతా రెండు పార్టీలకు ఎప్పటికి ఓటుబ్యాంకు స్థిరపడుతుందనేది భవిష్యత్తులో తేలాల్సిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా జీహెచ్ఎంసీ, పరిషత్ ఎన్నికలున్నాయి. ఇవి కూడా పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి కాబట్టి.. వాటిలో అయినా ప్రతిపక్షాల తమ ఓటుబ్యాంకును స్థిరపరుచుకుంటాయా.. కనీసం ఒక్క పార్టీ అయినా తమ ఓటుబ్యాంకును కాపాడుకుంటుందా అనేది ఉత్కంఠకు దారితీస్తోంది.
దేశంలో 29వ రాష్ట్రంగా మనుగడలోకి వచ్చిన తెలంగాణలో ఆవిర్భావం నుంచి మూడు ప్రధాన పార్టీలే రాజకీయం చేస్తున్నాయి. అందులోనూ కాంగ్రెస్, బీజేపీ రెండూ జాతీయ పార్టీలు కాగా.. బీఆర్ఎస్ మాత్రమే ఏకైక ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉంది. ఈ అడ్వాంటేజ్‌ని బీఆర్ఎస్ బాగా వాడుకుంది. జాతీయ పార్టీలకు తెలంగాణ గురించి పట్టదని, రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే.. పేగుబంధం ఉన్న తమకే పట్టం కట్టాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుకు పదేళ్ల పాటు తిరుగులేకుండా పోయింది. అదే సమయంలో బీఆర్ఎస్ వాదనకు సరైన కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. కానీ తొలి పదేళ్లూ బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చి చూసిన తెలంగాణ ప్రజలు.. ఆశించిన రీతిలో పాలన లేదనే అభిప్రాయానికి వచ్చాయి. ఈలోగా బీఆర్ఎస్ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూ వచ్చిన జాతీయ పార్టీలు తమకంటూ వాదనను బిల్డ్ చేసుకున్నాయి. దీంతో పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ఆత్మరక్షణలో పడిపోగా.. మిగతా రెండు పార్టీలు అడ్వాంటేజ్ తీసుకున్నాయి. అందులోనూ కాంగ్రెస్ కు అప్పటికే ఉన్న క్షేత్రస్థాయి పునాది కలిసొచ్చి.. ఆపార్టీ పవర్లోకి వచ్చింది. కానీ రాజకీయంగా ఎంత వాదించినా.. ఎన్ని వ్యూహాలు రచించినా.. క్యాడర్ బలం లేని బీజేపీ ఊహించినంతగా తెలంగాణలో ఎదగలేకపోయింది. అలాగని పూర్తిగా చేతులెత్తేయకుండా.. మెల్లమెల్లగా పునాదులు బలపరుచుకునే పనిలో పడింది. కానీ బీజేపీ పరిస్థితి చూసి.. రెండడుగులు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఉద్యమ నేపథ్యాన్ని బీఆర్ఎస్ బాగా క్యాష్ చేసుకుంది. ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పూర్తిస్థాయిలో పాల్గొనలేదని, దోబూచులాట ఆడారని ప్రచారం చేసి.. బీఆర్ఎస్ ఆ మేరకు లబ్ధి పొందింది. కానీ పదేళ్లయ్యాక బీఆర్ఎస్ మాటలు చెబుతోందే కానీ.. అందుకు తగ్గట్టుగా పనిచేయడం లేదని తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. ఈలోగా కాంగ్రెస్ ఏం చేసిందో కాస్త అవగతం కావడం.. బీజేపీ ప్రభావం కాస్త పెరగడంలో రాజకీయం మారింది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచీ కాంగ్రెస్ ఓటుబ్యాంకు పెరగటమే కాకుండా స్థిరపడింది. మిగతా రెండు పార్టీలూ రెండో స్థానం కోసం పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో తొలి పదేళ్లూ బీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించినా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు కావడంతో.. ఎవరి ఓటూ మరొకరికి బదిలీ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఆ రెండు పార్టీలకూ తమ ఓట్లు పోకుండా చూసుకోవటానికి బీఆర్ఎస్ తంటాలు పడాల్సి వచ్చేది. కానీ మలి రెండేళ్లలో ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎప్పటిలాగే జాతీయ స్థాయిలో ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీనే ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ ఇప్పుడూ జరగటం లేదు. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఈజీ టార్గెట్ అవుతోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటుబ్యాంకు స్థిరపడటంతో.. ఆ పార్టీకి బీఆర్ఎస్ నుంచి ఓట్లు బదిలీ అయ్యే ప్రసక్తే లేదు. కానీ బీఆర్ఎస్ లాగే ప్రతిపక్షంలో ఉన్న, తెలంగాణలో ఎదిగే దశలో ఉన్న బీజేపీకి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఓటు బదిలీ అవుతోంది. ఈ పరిణామమే బీఆర్ఎస్‌ను కలవరపెడుతోంది. అసలు కాంగ్రెస్ కంటే బీజేపీ నుంచే తమకు ఎక్కువ ముప్పు ఉందని బీఆర్ఎస్ ఉలిక్కిపడాల్సి వస్తోంది. ఈ కారణంగానే కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ చేసే పార్టీనే లేకుండా పోయింది.
తెలంగాణలో వచ్చిన మరో ప్రధాన మార్పు ఏమిటంటే.. తొలి పదేళ్లలో మూడు పార్టీలు వేటికవే విడిగా పోరాడి.. తమ ఓటుబ్యాంకుల్ని కనుగొని.. వాటిని స్థిరపరుచుకునే ప్రయత్నం చేశాయి. ఆ విషయంలో వేటికవే తమవైన ఫలితాలు సాధించాయి. కానీ మలి రెండేళ్లలో కూడా మూడు పార్టీలు వేటికవే విడివిడిగా పోరాడుతున్నా.. తొలి పదేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలు ఓటర్ల ఆలోచనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ఫలితంగానే కేవలం కాంగ్రెస్ ఓటుబ్యాంకు మాత్రమే స్థిరపడింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం తమ ఓటుబ్యాంకును ఇంకా కనుగొనే ప్రయత్నంలోనే ఉన్నాయి. అధికార పార్టీ ఓవైపు రోజురోజుకూ బలం పెంచుకుంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం రోజుకో రకమైన రాజకీయంతో అవి కన్ఫ్యూజ్ అవుతూ.. వాటి ఓటర్లను కూడా అయోమయంలో పడేస్తున్నాయి.
తెలంగాణలో ఏ రకంగా చూసినా తొలి పదేళ్లలో ముక్కోణపు పోటీ నడిచింది. కానీ మలి రెండేళ్లలో పైకి త్రిముఖ పోటీ ఉన్నా.. ఓట్ల పరంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కి అనుకూలమా, వ్యతిరేకమా అనే కోణం మాత్రమే తెరపైకి వస్తోంది. ఆ స్థాయిలో ఓట్లు కన్సాలిడేట్ చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. అలా త్రిముఖ పోటీ ఉన్నా.. కాంగ్రెస్ అనుకూల ఓటు చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. కానీ ప్రతిపక్షంలో రెండు పార్టీల మాదిరిగానే.. వాటికి పడే ఓట్లలోనూ స్థిరత్వం కొరవడుతోంది. ఈ పరిణామం ఫైనల్‌గా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్‌గా మారుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ కు పునాదులు బలంగా ఉండటంతో.. ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా.. ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే తెలంగాణలో తొలి పదేళ్లు బీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యం సాధించినట్టు కనిపిస్తున్నా.. అది పూర్తిగా నిజం కాదని ప్రతిపక్షంలోకి వచ్చాక తెలిపోయింది. కానీ కాంగ్రెస్ మాత్రం తొలి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. మలి రెండేళ్లు పవర్లో ఉన్నా.. ఓట్ల శాతం విషయంలో స్థిరత్వం కొనసాగించి.. రాజకీయ ఆధిపత్యం ఏమిటో ప్రత్యర్థులకు చూపించింది. ప్రతిపక్షంగా పాతిక శాతానికి ఓట్లు తగ్గకుండా చూసుకున్న కాంగ్రెస్.. అధికార పార్టీగా దాదాపు నలభై శాతం ఓట్లు నిలకడగా సాధిస్తోంది. కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యం చూస్తుంటే.. సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్షాల నుంచి కఠిన సవాల్ ఎదురయ్యే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ వ్యూహాలపై పునఃసమీక్ష చేసుకోనంత కాలం కాంగ్రెస్ రాజకీయ ఆధిపత్యానికి ఎదురులేనట్టే. అలాగే కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఇలాగే పదిలంగా ఉన్నంతకాలం.. ప్రతిపక్షాలకు కూడా అధికారం అందని మానిపండే. ఇప్పటికే ముక్కోణపు పోటీలో ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో ఔపోసన పట్టిన కాంగ్రెస్.. ఎన్నిక ఎన్నికకూ రాజకీయంగా మరింత రాటుదేలుతోంది. కాంగ్రెస్ ఇప్పుడున్న స్థితిలో.. అసలు ఆ పార్టీ వ్యూహాలు అర్థం చేసుకోవడమే విపక్షాలకు కనాకష్టంగా కనిపిస్తోంది.