Story Board: ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. మొదట ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాత ఇరాన్ యుద్ధం ఆర్థికవ్యవస్థల్ని కుదిపేశాయి. ఏ యుద్ధం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలన్నీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊపిరి బిగబట్టాయి. నాలుగేళ్లు దాటినా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కాకపోతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న సూచనలతో.. ఓ సంక్షోభం అయినా ఆగుతుందని మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. చాలా రోజుల నష్టాల తర్వాత కాస్త లాభాలు కళ్లజూశాయి. కానీ ఈ కాస్త సానుకూలతకు ఆదిలోనే హంసపాదు పడింది. ఓవైపు సాంకేతికంగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా.. దాన్ని బేఖాతరు చేస్తూ.. అమెరికా అర్థరాత్రి ఇరాన్‌పై విరుచుకుపడింది. అదేమంటే ఆత్మరక్షణ సాకు చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా లెబనాన్‌పై దాడులు ఉధృతం చేయాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు వస్తున్నప్పుడు.. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థమేమిటనే ప్రశ్నలకు ఇప్పట్లో జవాబులు వచ్చేలా లేవు.
ఏ యుద్ధంలో అయినా కాల్పుల విరమణ జరిగాక.. ఉద్రిక్తతలు చల్లారతాయి. కానీ ఇరాన్ యుద్ధంలో పోరు కంటే శాంతే ఎక్కువగా భయపెడుతోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక కూడా.. చమురు ధరలు దిగిరావటానికి సంకోచిస్తున్నాయి. కాస్త ధైర్యం చేసి కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్న మార్కెట్ల ఆశలపై .. అటు ట్రంప్, ఇటు నెతన్యాహు ఇద్దరూ కలిసికట్టుగా నీళ్లు చల్లారు. దీంతో రేపోమాపో ఇరాన్ యుద్ధానికి హేతుబద్ధమైన ముగింపు దక్కుతుందని సంబరపడ్డ ప్రపంచానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పుడు మళ్లీ యుద్ధం మొదలైతే.. అది మరోస్థాయిలో జరుగుతుందని ముందే సూచనలున్నాయి. అదే జరిగితే.. అప్పుడు ఎలాంటి దుష్పరిణామాలుంటాయో ఊహించటానికి కూడా ఆర్థికవేత్తలు ఇష్టపడటం లేదు. ఆ స్థాయిలో విధ్వంసం ఉంటుందనే అంచనాలు అన్ని దేశాల్నీ కలవరపెడుతున్నాయి.
ఇరాన్ యుద్ధం సంగతి ఇలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా మరోస్థాయికి తీసుకెళ్లాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలిచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్.. కీవ్ లో విదేశీయులు, ఇతర దేశాల దౌత్య సిబ్బంది తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. కీవ్‌పై ఉధృతంగా దాడులు చేస్తామని చెప్పేశారు. ఆ తర్వాత రష్యా విదేశాంగ శాఖ కూడా వివరంగా ప్రకటన విడుదల చేసింది. అయితే రష్యా ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొద్దిరోజుల క్రితం కూడా కీవ్‌పై ఉధృత దాడులు తప్పవని హెచ్చరించింది. కానీ వాటిని ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ కొట్టిపారేస్తూ వచ్చింది. అంతమాత్రాన పుతిన్ హెచ్చరికల్ని లైట్ తీస్కునే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి ఎలా ఉందంటే.. ఎక్కడనుంచైనా సరే ఏ చిన్న మంచి కబురు విన్నా.. అదే పదివేలు అనుకుంటోంది. మరీ ముఖ్యంగా అన్ని దేశాల్నీ భయపెడుతున్న యుద్ధాలు ఆగిపోతాయనే ఆశ లేకపోయినా.. కనీసం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలనే దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలో తారుమారైన పరిస్థితులు.. ఆ ఆశలపైనా నీళ్లు చల్లుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మొదట్లో యూరప్ అల్లకల్లోలమైపోయింది. ఆ తర్వాత యుద్ధానికి అలవాటుపడి.. ఇతర దేశాల తోడ్పాటుతో కాస్త నిలదొక్కుకుంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం వచ్చినా.. అధిక నిల్వలున్న దేశాలు ఆదుకోవడంతో ఆపద తప్పింది. కానీ ఇరాన్ యుద్ధం ఉక్రెయిన్ యుద్ధాన్ని మించిపోయింది. ఏ దేశాన్నీ వదలకుండా.. ప్రతి దేశాన్నీ ముప్పుతిప్పలు పెట్టింది. ఆధునిక ప్రపంచానికి ప్రాణవాయువుతో సమానమైన ఇంధనం ఇప్పుడు కరువైపోయింది. ఇంధన సంక్షోభం శరవేగంగా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అంతటితో ఆగితే పర్వాలేదు. కానీ సమీప భవిష్యత్తులో కూడా చమురు సరఫరా సాధారణ స్థితికి చేరే అవకాశం లేకపోవడం.. మరింతగా భయపెడుతున్న విషయమని చెప్పక తప్పదు.
మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత రాజ్యమేలుతోంది. ఎవరూ ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాల దగ్గర్నుంచి పౌరుల దాకా అందరికీ ఎప్పుడేమౌతుందోననే చింత నిద్ర పట్టకుండా చేస్తోంది. మొన్నటిదాకా ఏ ప్రాంతంలో యుద్ధం వస్తే.. ఆ చుట్టుపక్కల దేశాలే ప్రభావితం అయ్యేవి. మిగతా ప్రపంచం చీకూ చింతా లేకుండా ఉండేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగిన తరుణంలో.. ప్రపంచీకరణ పతాకస్థాయికి చేరిన సందర్భంలో.. యుద్ధం ఎక్కడ జరిగినా.. ప్రపంచం మొత్తంపైనా దుష్ప్రభావం తప్పడం లేదు. దీంతో ఒకవేళ యుద్ధం ఆగినా.. ఆదుకోవటానికి, తోడ్పాటు అందించటానికి ఎవరూ లేకుండా పోతున్న చోద్యం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జరుగుతున్న యుద్ధాల కంటే.. వాటి ప్రభావానికి ప్రపంచం లోనౌతున్న తీరే ఎక్కువగా భయపెడుతోందన్న విషయం కాదనలేని సత్యం.
నిజానికి రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత.. అసలు సంఘర్షణకు తావులేని ప్రపంచాన్ని నిర్మించాలని అన్ని దేశాలు ఓ మాటనుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొన్ని వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. కానీ ఆ తర్వాత కూడా అడపాదడపా యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోనీ మొన్నటిదాకా యుద్ధాలు జరిగినా.. అవి ఓ పద్ధతిలో జరిగాయి. ఒక్కసారి ఉధృతి తగ్గాక, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక.. రోజుల వ్యవధిలోనే ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధం మాత్రం యుద్ధం-శాంతి ఎపిసోడ్లను రిపీట్ చేస్తూ.. అనూహ్యంగా సాగుతోంది. అన్నంటికీ మించి యుద్ధం కంటే శాంతే భయంకరంగా ఉంటుందనే వింత దుస్థితిని ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకే ఇప్పుడు ఇరాన్ యుద్ధం పేరు చెబితే చాలు.. ప్రపంచంలో ప్రతి పౌరుడూ ఉలిక్కిపడుతున్నాయి. ప్రతి దేశమూ కంగారు పడుతోంది. ఏ దేశ మార్కెట్ చూసినా.. యుద్ధ భయంతో గుడ్లు తేలేస్తోంది. పెట్టుబడిదారులైతే.. ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా నష్టాలు తప్పవేమోనని చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు ఇలాంటి దుస్థితిని ప్రపంచం గతంలో చూడలేదేమో అనే అభిప్రాయాలకూ కొదువలేదు. ఏతావాతా ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలు వేరు.. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం వేరని ప్రపంచం ఫిక్సైపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇరాన్ యుద్ధం నిజంగానే ఆగినా.. అది వాస్తవమేనని నమ్మటానికి ప్రపంచానికి కొంత సమయం పడుతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నిజానికి కరోనా తర్వాత నుంచీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు. మునుపటి స్థాయికి చేరుతుందనే ఆశ కూడా అంతకంతకూ అడుగండుతూ వచ్చింది. ఇది చాలదన్నట్టుగా ఉరుము లేని పిడుగులా వచ్చిపడ్డ యుద్ధాలు.. ఆర్థిక వ్యవస్థను పెనం మీద నుంచి పొయ్యిలో పడేశాయి. ఒక దేశం కాకపోతే మరో దేశం బాగుంటే.. అప్పుడు కష్టాల్లో ఉన్న దేశాలు కూడా తెరిపిన పడతాయనే ఆశ మినుకుమినుకుమంటుంది. కానీ ఇప్పుడు ఆశ మాత్రమే కాదు.. అసలా ఆలోచనే లేని దుస్థితికి ప్రపంచం దిగజారింది. అంతగా యుద్ధాలు అన్ని దేశాలనూ తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
గతంలో యుద్ధాలు కేవలం ప్రాణనష్టానికే పరిమితమయ్యేవి. ఆ తర్వాత ఆర్థిక నష్టం పరిమితంగా ఉండేది. కానీ ప్రస్తుత యుద్ధాలు మాత్రం ప్రాణనష్టం, ఆర్థిక నష్టం రెండింటిలోనూ ఊహించనంత ఉత్పాతం సృష్టిస్తున్నాయి. ప్రాణనష్టం ఏదోలా మరపుకు వచ్చినా.. యుద్ధాలు చేసే ఆర్థిక విధ్వంసం మాత్రం ప్రపంచానికి ప్రతి క్షణం చేదు గుళికల్ని మింగిస్తూనే ఉంది. యుద్ధం ఎప్పుడు ఎక్కడ జరిగినా సరఫరా గొలుసుల్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. గతంలో ఈ సరఫరా గొలుసు విస్తృతి పరిమితంగా ఉండేది. కానీ ప్రపంచీకరణ ఊపందుకున్నాక.. సరఫరా గొలుసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఈ కారణంగానే యుద్ధాలు ఎక్కడ జరిగినా.. సరఫరా గొలుసులు తెగిపోయి.. ప్రపంచానికి ఇబ్బందులు తప్పటం లేదు. సరఫరా గొలుసులకు ఆటంకాలు ఏర్పడటంతో.. సాఫీగా సాగాల్సిన వస్తువుల రవాణాకు అవరోధాలు తప్పడం లేదు. దీంతో చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరల పెరుగుదల కారణంగా జనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది ఎక్కడైనా అంతిమంగా మాంద్యానికే దారితీస్తుంది. మాంద్యం కొన్ని దేశాలకే పరిమితమై పర్వాలేదు. కానీ ఒకదానితర్వాత ఒకటిగా అన్ని దేశాలూ మాంద్యం నీడలోకి జారుకున్నప్పుడు ఆర్థిక సంక్షోభం.. కాస్తా ఆర్థిక విధ్వంసానికి దారితీస్తుంది. ఆ దుస్థితి కూడా ఎక్కువకాలం కొనసాగితే.. ఆర్థికవ్యవస్థలు మొత్తం కుప్పకూలి.. ఆర్థిక అయోమయం తలెత్తుతుంది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచం చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోంది. ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం అంచనాను 15 శాతం నుండి 25 శాతానికి పెంచారు. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీలో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత అసలు మాంద్యం లేని దేశాల జాబితాను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చంటున్నారు. అలాగని అవి కూడా పూర్తిగా సేఫ్ కాదు. త్వరలోనే ఆ దేశాలూ మిగతా వాటి బాటక తప్పదనే అంచనాలున్నాయి.
జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. వీటన్నింటికీ మించి టెక్నాలజీ కంపెనీలు, వాటి షేర్ల పరిస్థితిని చూడాలి. ఈ కంపెనీల షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దీర్ఘకాలంగా ర్యాలీ చేశాయి. ప్రస్తుతం మాంద్యం భయంలో ట్రేడవుతున్నాయి. అటు ఏఐ, ఇటు యుద్ధాలు కలిసికట్టుగా సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల్ని కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఈ ప్రభావం అనుబంధ రంగాల మీదా కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగాల కోతలు ఉద్యమ స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రఖ్యాత కంపెనీలు కూడా ఎడాపెడా పింక్ స్లిప్పులు ఇస్తుండటంతో.. చిన్న కంపెనీలు ముందే చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ రాబోయే మాంద్యానికి సూచనలే అంటున్నారు ఆర్థికవేత్తలు.
మొత్తం మీద మాంద్యానికీ ప్రపంచంలో ఏ దేశమూ అతీతం కాదని తేలిపోయినట్టే. చేజేతులా కొనితెచ్చుకున్న యుద్ధాలే ఈ పరిస్థితులకు కారణమని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అనుకోకుండా వచ్చే సమస్యలకు అలాగే పరిష్కారం దొరకొచ్చు. కానీ పనిగట్టుకుని తెచ్చిపెట్టే సంక్షోభాలకు.. ప్రపంచం భారీ మూల్యం చెల్లించక తప్పదు. మళ్లీ పాత సరఫరా గొలుసుల పునరుద్ధరణ అసాధ్యమనే అంచనాలున్నాయి. ప్రపంచ ఆర్థికం అంతా సరఫరా గొలుసులే ఇరుసుగా నడుస్తోంది. ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన సరఫరా గొలుసులు.. యుద్ధభయాలకు మాంద్యం తోడైతే.. మొత్తంగా తెగిపోతాయి.
రష్యా నుంచి గ్యాస్ ఆగిపోతే యూరప్ ఊపిరి ఆగినంత పనైంది. ఇప్పుడు మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు సరఫరాకు అడ్డంకి ఎదురైతే.. మొత్తం ప్రపంచానికి ఆక్సిజన్ అందనట్టే. ప్రస్తుత ప్రపంచానికి చమురు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చమురు ధరల్లో ఒడిదుడుకులతో దేశాలకు దేశాలే ప్రభావితమైన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు మొత్తానికి సరఫరాకే ఆటంకం వస్తే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాల కరెన్సీలు కూడా దారుణంగా పతనమౌతున్నాయి. ఓవరాల్ గా ప్రపంచ వాణిజ్యంలో కల్లోలం ఖాయం. ఎగుమతులు, దిగుమతులు ప్రభావితమయ్యే.. కొన్ని దేశాలు దివాళా తీస్తాయి. మరి కొన్ని దేశాలకు చేతిలో పైసా ఆడని పరిస్థితి వస్తుంది. కొన్ని దేశాలు ఇబ్బడిముబ్బడి ఉత్పత్తుల్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలోకి జారుకుంటాయి. మరికొన్ని దేశాలు అత్యవసరాల కోసమూ అంగలార్చాల్సి రావచ్చు. ఇంతటి తీవ్ర పరిస్థితులు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నా.. యుద్ధం చేస్తున్న దేశాలు కానీ.. వాటికి మద్దతిస్తున్న దేశాలు కానీ ఎక్కడా పునరాలోచన చేయడం లేదు. పైగా మరింత యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మూడో ప్రపంచ యుద్ధానికి పెద్దగా భూమి బద్దలయ్యే కారణాలు అక్కర్లేదన్న గతకాలపు అంచనాలు నిజమౌతున్నట్టుగా కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొన్ని ప్రాంతాలపై నెలకొన్న వివాదం.. రెండు ఖండాల మధ్య చిచ్చుపెట్టింది. అలాగే దశాబ్దాలుగా అడపాదడపా కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. అనూహ్యంగా యుద్ధ మలుపు తీసుకుని.. ఇప్పుడు ప్రపంచ యుద్ధం స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచం నెత్తిన మాంద్యాన్ని రుద్దుతున్నాయి. ఆర్థికంగా కుప్పుకూలిన తర్వాత కోలుకోవటానికి ప్రపంచానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టమనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి.
భారత్ ఆర్థికవ్యవస్థ దశాబ్దాలుగా బలం పుంజుకుంటూ వస్తోంది. మొదట్లో ఆహారధాన్యాలకు కటకటలాడిన స్థితి నుంచి హరిత, శ్వేత విప్లవాలతో కోలుకుంది. ఆ తర్వాత 90వ దశకంలో జరిగిన ఆర్థిక సరళీకరణలు.. మన ఆర్థిక వ్యవస్థను మరో స్థాయికి చేర్చాయి. ఇక కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా బౌన్స్ బ్యాక్ అయి.. అభివృద్ధి చెందిన దేశాల్నీ, ఆర్థికవేత్తల్ని కూడా ఆశ్చర్యపరిచింది. అంతవరకు బాగానే ఉంది. అదే ఊపులో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా సమర్థంగా కాచుకుంది. యుద్ధం తొలినాళ్లలో మనకు కొన్ని సమస్యలు వచ్చినా.. అవి ముదరకముందే.. ప్రత్యామ్నాయాలు చూసుకోగలిగాం. చివరకు యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్‌కూ, రష్యాకూ కూడా సాయపడే స్థాయికి వచ్చాం. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత మన ఆర్థిక వ్యవస్థ బలహీనతల్ని బట్టబయలు చేసింది. చమురు సరఫరాకు ఏ కాస్త విఘాతం కలిగినా.. మనం తట్టుకోలేమనే విషయం తేటతెల్లమైంది. మొదట గ్యాస్ తర్వాత పెట్రోల్ సరఫరా సమస్యలు భారత్‌ను చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు కమర్షియల్ గ్యాస్ సంక్షోభం వచ్చింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆ సమస్య చక్కబడలేదు. ఇక పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా కటకట రాకపోయినా.. ధరలు మాత్రం దశలవారీగా పెరిగి సామాన్యుడి నడ్డివిరిచాయి.
పెట్రోల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడితే.. ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తాయి. అదే జరిగితే ఇప్పటికే జనం చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. సామాన్యుడి కొనుగోలు శక్తి మరింతగా పడిపోతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు జరగక.. మాంద్యం వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుత దశల వారీ పెట్రోల్ ధరల పెంపునే మాంద్యానికి తొలిదశగా పరిగణించాలనే హెచ్చరికలు వస్తున్నాయి. ఏతావాతా ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తున్న మాంద్యం సూచనలు.. మన దగ్గరకు వచ్చేసరికి.. చమురు మంటల రూపంలో ప్రజ్వలిస్తున్నాయి. ఆరేళ్లుగా నిలకడగా సాగుతున్న దేశ ఆర్థిక వృద్ధి గాథకు ఇరాన్ యుద్ధం సడెన్ బ్రేకులేసింది. ఇప్పుడు వృద్ధి సంగతి పక్కనపెట్టి.. నిలదొక్కుకుంటే చాలనే ధోరణి పెరుగుతోంది. మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పరుగులు తీసిన మార్కెట్లు.. ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఇరాన్ యుద్ధానికి ముందు మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పరుగులు పెట్టిన భారత్.. ఇప్పుడు ఏడో ఆర్థిక వ్యవస్థగా పతనమైంది. ఈ పతనం ఇంకాస్త వేగం పుంజుకోకుండా ఉంటే అదే పదివేలు అనుకుంటోంది. మొత్తం మీద ఎక్కడో పశ్చిమాసియాలో వచ్చిన యుద్ధం.. ఇక్కడ ఇండియాలో ఆర్థిక పునాదుల్ని కదిలించినంత పని చేసింది.
మొత్తం మీద దేశంలో మాంద్యం తప్పదని తేలిపోవడంతో.. కేంద్రం కూడా ముందే సన్నద్ధమౌతోంది. ప్రధాని మోడీ మరో అడుగు ముందుకేసి.. దేశ ప్రజల్ని కూడా సమాయత్తం చేసే పనిలో పడ్డారు. మాంద్యం గురించి పరోక్ష సంకేతాలిస్తూ.. పొదుపు మంత్రం అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పైకి ఇంధనం విషయంలో ప్రత్యామ్నాయాలు, వాడకంలో జాగ్రత్తల గురించి చెప్పినట్టుగా ఉన్నా.. అంతర్లీనంగా ఉన్నది మాత్రం పొదుపు సందేశమేనని ఆర్థికవేత్తలు తేల్చేశారు. అలా ప్రధాని ప్రసంగం అయ్యిందో లేదో.. ఇలా కేంద్రం కూడా ఒకదానివెంట ఒకటిగా మాంద్యాన్ని ఎదుర్కునే చర్యలు చేపట్టింది. 78 రోజులు పాటు బిగబట్టిన పెట్రో ధరల పెంపును దశలవారీగా అమల్లో పెట్టేసింది. బంగారంపై దిగుమతి సుంకం పెంచేసింది. భవిష్యత్తులో ఇంకేం చేస్తుందోననే సందేహాలు అందర్నీ వేధిస్తున్నాయి. పనిలోపనిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధనం, ఎరువులు, విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి మూడు ఎఫ్‌లే కీలకమంటూ మాట్లాడటం కూడా యథాలాపంగా చేసిన ప్రకటన కాదనే సంకేతాలున్నాయి. ఇవన్నీ మాంద్యానికి సర్కారు ప్రిపేరవుతుందని, కాబట్టి పౌరులు కూడా సిద్ధంగా ఉండాలనే అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది.
నిజానికి మన ఇంధన దిగుమతుల్లో వైవిధ్యం ఉన్నా.. పశ్చిమాసియా నుంచి వచ్చే సరఫరాలే మనకు కీలకం అని మరోసారి తేలిపోయింది. ఇప్పటిదాకా ఇండియా ఆర్థిక ప్రగతి స్విచ్ ఎక్కడ ఉందో తెలియని వారికి.. ఇప్పుడు అసలు కీలకం తెలిసిపోయిందా అనే భయాలూ వ్యక్తమౌతున్నాయి. అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గానే ఉంది. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ షేక్ అవుతుందే కానీ.. పూర్తిస్థాయిలో కుప్పకూలే సూచనలు కనిపించడం లేదు. ఆ విషయంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగే అనే వాదనలూ లేకపోలేదు. కానీ మొన్నటిదాకా మనకు బలమైన పునాదిగా నిలిచిన వ్యవసాయ రంగం వృద్ధిరేటు.. ఈసారి తగ్గొచ్చనే అంచనాలు మాత్రం బాగా భయపెడుతున్నాయి. ఎందుకంటే ఏ రంగం కుదేలైనా.. వ్యవసాయ రంగం ఆదుకుంటుదనే ధీమా మనకు ఎప్పుడూ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యం కావడమే కాదు.. వర్షాలు కూడా తక్కువగా పడతాయనే అంచనాలు.. మాంద్యాన్ని మరింత వేగవంతం చేస్తాయనే భయాలు పెంచుతున్నాయి.
ఇప్పటికీ ఏం జరిగినా ఇండియా నిలబడగలదనే అంచనాలు లేకపోలేదు. కానీ అది సరిపోదు. భవిష్యత్తులో వచ్చే మాంద్యం ప్రభావాన్ని గణనీయంగా తగ్గించటానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సిందే. అలాగని గతంలో మాంద్యాల్ని మనం సమర్థంగా కాచుకోలేదని కాదు. 2008లో మాంద్యం ప్రభావానికి ప్రపంచమంతా షేకైపోయినా.. భారత్ మాత్రం బలంగా నిలబడింది. కానీ అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు మాంద్యానికి దారితీసిన కారణాలు వేరు. ఇప్పుడు మాంద్యానికి కారణమైన పరిస్థితులు వేరు. ఎందుకంటే గతంలో మాంద్యానికి ముందు, తర్వాతా కూడా భారత్ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు ఎక్కువగా కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం మాంద్యానికి ముందే ఆర్థికవ్యవస్థలో ప్రతికూల సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మాంద్యం వచ్చాక మరింత దుస్థితి తప్పదేమో అనే అంచనాలు వాస్తవరూపం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారీ ఏదో అద్భుతం జరుగుతుందని, ఇప్పుడూ 2008 మాదిరిగానే మాంద్యాన్ని అధిగమిస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈసారి మాంద్యంతో యుద్ధం చేసి పోరాడి గెలవాల్సిందేనని వారు కర్తవ్యబోధ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం సిద్ధమౌతోంది. మరి ప్రజలు ఏమేరకు సంసిద్ధమౌతారనేదే.. మాంద్యం భారత్‌పై చూపే ప్రభావాన్ని నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు.
