Story Board: భారతీయ సమాజంలో సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వారి కోసమే ఆస్తులు కూడబెడతారు. సంతానాన్ని కూడా ఆస్తిగానే భావిస్తారు. అలాంటిది సంతానం లేదంటే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. దీంతో సంతాన సాఫల్యం కోసం కృత్రిమ మార్గాలను వెతుకుతారు. గతంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రాచుర్యంలోకి రానప్పుడు దత్తతలు ఎక్కువగా జరిగేవి. కానీ ఎప్పుడైతే దత్తత చట్టం వచ్చిందో, ఆ చట్టం ప్రకారం దత్తత తీసుకోవడం చాలా సంక్లిష్టంగా మారిందనే భావన నెలకొంది. దీనికి తోడు అలా ఆస్పత్రికి వెళ్తే.. ఇలా బిడ్డను చేతిలో పెట్టే రెడీమేడ్ విధానాలు రావడంతో.. ఐయూఐ, ఐవీఎఫ్, సరోగసీ లాంటి పద్ధతులకు ఆదరణ పెరిగింది. సాధారణ ఆస్పత్రుల్ని మించి ఫర్టిలిటీ సెంటర్లు సంపాదిస్తున్నాయంటే నమ్మకతప్పదు. హార్మోనల్ ఇంజెక్షన్లు చేసి.. కృత్రిమంగా అండాలు విడుదల చేయించడమే కాదు.. స్మెర్మ్ క్వాలిటీ పెంచటానికి కూడా తమ దగ్గర మందులున్నాయని మభ్యపెట్టే డాక్టర్లు బయల్దేరారు. పైగా ఆధునిక జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలతో.. యువ దంపతుల్లో సంతాన సాఫల్యత తగ్గటం కూడా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్లకు వరంగా పరిణమించింది. దేశంలో రోజురోజుకూ ఫర్టిలిటీ సెంటర్ల సంఖ్య పెరుగుతోందంటే అతిశయోక్తి కానే కాదు.
పిల్లలకు జన్మనివ్వాలని ప్రతీ జంట కోరుకుంటుంది. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని మహిళలు, నాన్నా అని పిలిపించుకోవాలని పురుషులు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. కానీ, కొంతమంది ఎదురు చూపులు శాశ్వతంగా ఉండిపోతాయి. ఎన్నటికీ ఫలించవు. కొంత మంది మహిళల గర్భసంచి గర్భం దాల్చడానికి అనువుగా ఉండదు. ఒకవేళ గర్భం దాల్చినా కొన్ని నెలల తర్వాత అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది. లేదంటే ప్రీమెచ్యూర్ బేబీలుగా పుట్టి చనిపోతూ ఉంటారు. ఇంకా వేరే ఇతర మెడికల్ కండీషన్స్ కారణంగా మహిళలు పిల్లలను కనలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసే వారికి మాతృత్వపు వరాన్ని అందించేందుకు ఉద్దేశించినదే సరోగసి విధానం. గర్భ సంచిలో సమస్యలు ఉన్నప్పుడు మరొక స్త్రీ గర్భం ద్వారా బిడ్డను కనే విధానాన్ని సరోగసి అంటారు. సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ ఉన్న మహిళల్లో గర్భం నిలవదు. లేదంటే మృతశిశువులు జన్మించడమో, ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టడమో జరుగుతుంది. ప్రీమెచ్యూర్ బేబీలు బరువు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి జన్మించిన తర్వాత కూడా చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి సరోగసి విధానం వరం లాంటిది..
సరోగసిని అద్దె గర్భంగా పిలవచ్చు. సంతానం కలగక ఇబ్బంది పడుతున్న దంపతుల బిడ్డను మరొక మహిళ గర్భంలో పెంచుతారు. ఇందుకోసం భర్త నుంచి వీర్యం, భార్య నుంచి అండాలు సేకరిస్తారు. IVF.. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా పిండాన్ని సృష్టిస్తారు. ఇలా తయారైన పిండాన్ని సరోగసి తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ తల్లి తొమ్మిది నెలలపాటు బిడ్డను మోసి జన్మనిచ్చి, ఆ దంపతులకు అప్పగిస్తుంది. మహిళల్లో గర్భసంచి సమస్యలు ఉన్నట్టుగానే కొంత మంది పురుషులలో కూడా స్పెర్మ్ వీక్ గా ఉంటుంది. మొబిలిటీ, మొటిలిటీ తక్కువగా ఉంటుంది. దీంతో గర్భసంచి వరకూ స్పెర్మ్ వెళ్లలేకపోతుంది. ఇలాంటప్పుడు స్పెర్మ్ ను పరీక్షించి అందులో హెల్దీ స్పెర్మ్ ను అండాలతో బయట ఫెర్టైల్ చేసి సరోగసి విధానం ద్వారా గర్భ సంచిలోకి ప్రవేశపెడతారు.
మన దేశంలో అందరికీ సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు అనుమతి లేదు. ఈ మేరకు సరోగసీ నియంత్రణ చట్టం కూడా ఉంది. దీని ప్రకారం వాణిజ్య సరోగసి నిషేధం. అంటే డబ్బులు తీసుకొని బిడ్డను కని ఇవ్వడానికి అనుమతి లేదు. పరోపకార సరోగసి విధానానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే పిల్లలు లేని దంపతుల కోసం మానవతాదృక్పథంతో మాత్రమే ఈ పని చేయవచ్చు. అది కూడా కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే చట్టం అంగీకరిస్తుంది. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021 ప్రకారం,గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ వివాహితై ఉండాలి. కనీసం ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. అలాంటి స్త్రీ కేవలం ఒకసారి మాత్రమే సరోగసీ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అదికూడా సమీప బంధువులకే పరిమితం.ఆమెకు ప్రసవానంతరం 16 నెలల బీమా సేవలు అందించాలని ఈ చట్టం పేర్కొంటోంది. అదేవిధంగా,గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళకు, ఆమె ప్రసవించే శిశువు మధ్య ఏవిధమైన జన్యుపరమైన సంబంధం ఉండదని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పిం.
సరోగసి విధానాన్ని కోరుకునే భార్యాభర్తలు ఇద్దరూ భారతీయులై ఉండాలి. వీరిలో భార్య వయసు 23 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. భర్త వయసు 26 నుండి 55 ఏళ్ల లోపు ఉండాలి. వారికి అప్పటికే పిల్లలు ఉండ కూడదు. మానసిక వైకల్యం, శారీరకంగా వైకల్యం ఉన్న పిల్లలు, ప్రాణాంతక రోగంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. అదే సమయంలో చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఉన్న సరోగసీ క్లినిక్‌లో మాత్రమే చికిత్స తీసుకోవాలి. ఇలా పుట్టిన బిడ్డను దంపతులు ఏ కారణంతోనైనా వదిలిపెడితే శిక్ష పడుతుంది. సరోగసీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. పది లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సరోగసి విధానంలో పుట్టిన బిడ్డపై జన్మనిచ్చిన తల్లికి ఎలాంటి హక్కులూ ఉండవు. అండం, స్పెర్మ్ ఇచ్చిన దంపతులకు మాత్రమే ఆ బడ్డపై సర్వ హక్కులూ ఉంటాయి. శుక్రకణాలు, అండం ఆ దంపతులవే కాబట్టి జన్మనిచ్చిన తల్లితో బిడ్డకు జన్యుపరంగా కూడా సంబంధం ఉండదు. DNA టెస్టు చేసినా కూడా స్పెర్మ్, అండం ఇచ్చిన దంపతుల బిడ్డగానే ఫలితాలు వస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్‌లో సరోగేట్ మదర్ కేవలం తన గర్భాన్ని అద్దెకు ఇచ్చిందని అర్థం. 9 నెలలపాటు మోశాను, కన్నాను కాబట్టి ఈ బిడ్డ నాకే కావాలి అంటే చట్టం అంగీకరించదు. ఈ మేరకు ఒప్పందాలు కూడా చట్ట ప్రకారం ముందే జరుగుతాయి.
సరోగసి విధానం ద్వారా బిడ్డను కనాలని కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో.. వారి స్పెర్మ్, అండాలనే అద్దెగర్భంలోకి ప్రవేశపెడతారు. కాబట్టి వారి పోలికలు, జీన్స్ మాత్రమే బిడ్డకు వస్తాయి. సరోగేట్ మదర్ కు సంబంధించినవి ఏవీ బిడ్డకు రావు. సరోగసి అనేది ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే ఉద్దేశించిన విధానం. కానీ కొందరు ఆ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండగా, మరికొందరు దాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు కూడా పాల్పడుతున్నారు. బిడ్డకు జన్మనివ్వడం వల్ల స్త్రీ శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. హార్మోనల్ ఛేంజెస్ వస్తాయి. అందుకే సంతానం కలిగిన తర్వాత మహిళలు రూపు రేఖల్లోనూ మార్పులు వస్తుంటాయి. ఈ కారణంతో కొందరు సరోగసి విధానం ద్వారా బిడ్డను కనేందుకు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇది సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరు డబ్బు సంపాదనే లక్ష్యంగా సరోగసిని అడ్డుపెట్టుకొని భారీస్థాయి అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చేసిన పని ఇదే.
పిల్లులు లేని దంపతులు సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని వస్తే, వారి నుంచి 30 – 40 లక్షల రూపాయలు వసూలు చేసేవారు. అద్దె గర్భం విధానం ద్వారా పుట్టిన బిడ్డనే ఇస్తామని చెప్పేవారు. ఈ మేరకు సరోగేట్ మదర్ ను కూడా దంపతులకు చూపించేవారు. కానీ, పేదవాళ్ల బిడ్డను తక్కువ ధరకు కొని దంపతులకు ఇచ్చేవాళ్లు. సరోగసీ పేరుతో జరుగుతున్న ఛైల్డ్ ట్రాఫికింగ్ సంగతి కూడా పోలీసులు బయటపెట్టారు. ఇక్కడ జరిగిన బాగోతం బట్టబయలు కావడంతో.. ఈ ఫర్టిలిటీ సెంటర్లో సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందిన తల్లిదండ్రులందరిలో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ ప్రేమగా పెంచిన బిడ్డలు మన జీన్సే అని గుడ్డిగా నమ్మేయాలా.. అలా కాదని డీఎన్ఏ టెస్ట్ చేసి పొరపాటున కాదని తేలితే.. తట్టుకోగలమా అనే డైలమాతో మథనపడుతున్నారు.
ఈ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న లోపాల వల్లే వివాదాలు తలెత్తుతున్నాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఫెర్టిలిటీ కేంద్రాల అత్యాశ, ఎలాగోలా బిడ్డ కావాలనుకునే దంపతులు, మాతృత్వం అమ్ముతూ డబ్బుకోసం జీవితాన్ని రిస్క్ చేస్తున్న మహిళలు ఇలా ప్రతి ఒక్క అంశం వెనుక ఒక ప్రత్యేక కోణం కనిపిస్తోంది. ప్రస్తుతం వెలుగుచూసిన దారుణాలు కొన్ని మాత్రమే. ఇంకా చాలామంది ఈ వ్యవస్థను చట్టాన్ని ఉల్లంఘిస్తూ, గోప్యంగా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ వ్యవహారాలపై చట్టప్రకారం సరైన చర్యలు లేకపోవడమే సమస్యగా నిలుస్తోంది. సరోగసీ చట్టం సరిగా అమలౌతుందా.. లేదా.. ఫర్టిలిటీ సెంటర్లలో అసలేం జరుగుతోందని పర్యవేక్షించే యంత్రాంగం కొరవడటమే దురదృష్టకర పరిణామాలకు దారితీస్తోంది.
