Tirumala Hundi records : కలియుగ వైకుంఠం తిరుమల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారి వైభవాన్ని ఎన్నిసార్లు పొగిడినా అది తక్కువే. వందల ఏళ్లుగా తరగని వైభవం తిరుమల సొంతం. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి రమణీయత భక్తుల్ని కట్టిపడేస్తాయి. లక్షల మంది భక్తులు వచ్చినా ఆటంకం లేకుండా దర్శనం జరగటం ఓ అద్భుతం. అత్యున్నత స్థాయి నిర్వహణే దీనికి కారణం.
ఐదు వందల సంవత్సరాల తిరుమల వైభవం తరగనిది. చిత్రంగా గత ఏడాది కాలంగా తిరుమల వేంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య.. హుండీ ఆదాయం ఏ నెలకు ఆ నెల పెరుగుతూనే ఉన్నాయి. అదీ రికార్డ్ స్థాయిలో ఆగస్ట్ లో 141 కోట్ల రూపాయలు పైచిలుకు వచ్చింది. వేంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఇంటికీ.. ప్రతి వ్యక్తికీ ఏదో తెలియని అనుబంధం ఉంటుంది.
కలియుగ వైకుంఠం తిరుమల.కలియుగంలో వైకుంఠవాసం నుంచి స్వామివారు భూలోకానికి చేరుకుని సప్తగిరులపై స్వయంభువై వెలసి భక్తులకు దర్శనభాగ్యం ఇస్తున్నారు. ఎనిమిదిన్నర అడుగుల సాలిగ్రామ రూపంలో కన్నులారా భక్తులకు దర్శనం ఇస్తూన్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్దం రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివేస్తూఉంటారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే సాధారణంగా ఏ ఆలయంలో అయినా సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి ఆలయంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలి వస్తూనే ఉంటారు.
తిరుమల అంటే ఇంటింటి సెంటిమెంట్. ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో కేవలం కొన్ని సీజన్లలో మాత్రమే భారీగా భక్తులు వచ్చేవారు. వేసవి సెలవుల్లోనూ.. ప్రత్యక దినాల్లో అనూహ్యంగా భక్తుల రద్దీ ఉండేది.. ఇక మిగిలిన సీజన్లలో కేవలం వారంతాల్లో భారీగా రద్దీ ఉండేది. కానీ కరోనా తరువాత.. తిరుమల కొండకు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. ఓ వైపు వానలను లెక్క చేయడం లేదు.. స్కూళ్లు ఓపెన్ అయిన తరువాత రద్దీ తగ్గడం లేదు. కేవలం వీకెండ్స్ లోనే కాదు.. సాధారణ రోజుల్లోనూ శ్రీవారి దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.
70 సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనార్దం విచ్చేసే భక్తులు రోజుకి అక్షరాల 600 మంది మాత్రమే. సౌకర్యాలు పెరిగే కొద్ది శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. స్వామివారిని తలుచుకుంటే చాలు…తమ కష్టాలు గట్టెక్కుత్తాయని, శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు దాటింది. అయిప్పటికీ తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. అదే స్థాయిలో.. శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. ఆగస్ట్ నెలలో టీటీడీలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతు వస్తూంటే, దర్శన విధానంలో కూడా టిటిడి మార్పులు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితుల వలన కులశేఖరపడి వరకు భక్తులును అనుమతిస్తే, గంటకు వెయ్యి మంది భక్తులుకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తూంది. అదే లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు రెండు నుంచి రెండున్నర వేలమంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. ఇక మహలఘు విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగున్నర వేల నుంచి ఆరు వేల మంది వరకు భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. ప్రస్తుతం భక్తుల తాకిడికి అనుగుణంగా టిటిడి మహలఘు దర్శన విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో స్వామివారిని 50 అడుగుల దూరం నుంచే మహలఘు విధానంలో భక్తులు దర్శించుకుంటున్నారు.
నిజానికి సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1992 వరకు కొనసాగింది.అప్పట్లో భక్తుల తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరిని కులశేఖరపడి వరకు అనుమతించేది టిటిడి.1950లో ఏడాది మొత్తానికి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల సంఖ్య 2 లక్షల 26 వేల మంది భక్తులు మాత్రమే.అంటే రోజుకి 619 మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసేవారు. 1960 నాటికి ఈ సంఖ్య 11 లక్షల 67 వేలుకు చేరుకుంది. అప్పట్లో రోజుకి 3197 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవారు. 1970లో స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏడాదికి 33 లక్షల 94 వేల మంది అయితే, ప్రతి నిత్యం 9299 మంది భక్తులు శ్రీవారిని కులశేఖరపడి నుంచే దర్శించుకునేవారు. 1980లో ఏడాదికి శ్రీవారిని 79 లక్షల 52 వేల మంది భక్తులు దర్శించుకుంటే, రోజువారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య కూడా 21786 మందికి పెరిగింది. 1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది.
1990లో కోటి 18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం సరాసరి 32, 332 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2000లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రెండింతలైంది. ఆ ఏడాది
2కోట్ల 37 లక్షల 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే, రోజు వారి భక్తుల సంఖ్య 65 వేలకు చేరుకుంది. 2010లో 2 కోట్ల 55 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే, ప్రతి నిత్యం 70 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఇక 2020 కి భక్తుల సంఖ్య ఏడాదికి 2 కోట్ల 70 లక్షల మంది భక్తులు కాగా, రోజులో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 75 వేలుగా వుంది.
భక్తులు సంఖ్య పెరిగే కోద్ది క్యూ లైను విధానంలో కూడా టిటిడి మార్పులు చేస్తూ వచ్చింది. 1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ప్రవేశించే సౌలభ్యం వుండగా, 1970 కి భక్తులు సంఖ్య వందల నుంచి వేలకు చేరుకోవడంతో, పిపిసి షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టిటిడి. భక్తుల సంఖ్య 30 వేలకు చేరుకోవడంతో 1984లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను , 2001లో రెండో క్యూ కాంప్లెక్స్ నిభక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టిటిడి. ఆ తర్వాత కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ, దాదాపు 150 రోజులు పాటు క్యూ లైను వెలుపలికి వస్తూండడంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూ లైనులు ఏర్పాటు చేసింది టిటిడి. ఇలా భక్తులు తాకిడికి అనుగుణంగా క్యూ లైనులు మారుస్తూ వచ్చిన టిటిడి, దర్శనవిధానంలో కూడా భక్తులు రద్దికి అనుగుణంగా మార్పులు చేస్తూ వచ్చింది.
1992 వరకు భక్తులందరిని కులశేఖర పడి వరకు అనుమతిస్తూ వచ్చిన టిటిడి, 1992 డిసెంబర్ లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. రాములవారి మేడ వరకు అనుమతించడం ప్రారంభించింది. 2005లో మహలఘు విధానం వచ్చిన తర్వాత, టిటిడి జయవిజయల గడప నుంచే స్వామివారి దర్శనభాగ్యం లభించింది. తాకిడి అంతకంతకు పెరుగులూ ఉండటంతో 2014 లో మహలఘు విధానంలోనే మూడు వరుసల క్యూ లైన్లు ప్రవేశపెట్టింది టిటిడి. ఇలా శ్రీవారి దర్శన విధానాన్ని భక్తుల తాకిడి పెరిగే కొద్ది మార్పులు చేస్తూ వచ్చిన టిటిడి, ప్రస్తుతం దర్శనాల విషయంలో పూర్తి సామర్థ్యానికి చేరుకుందని చెప్పుకోవచ్చు.
ఏటా భక్తుల సంఖ్య పెరగటంతో ఏడుకొండలవాడి హుండి ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది. వరుసగా నాలుగో నెల హుండి ఆదాయం 120 కోట్ల మార్క్ దాటింది. ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే శ్రీవారికి 800 కోట్ల రూపాయలు పైగా కానుకలు సమర్పించుకున్నారు భక్తులు.
శ్రీవారి ఆలయ గోడలపై వున్న శాసనాలు ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది. శ్రీవారి ఆలయ గోడలపై వున్న శాసనాలను పరిశీలిస్తే, పల్లవ రాణి సామవై, శ్రీకృష్ణదేవరాయులు, రాగోజీ భోన్సలే, వెంకటగిరి రాజులు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచబేరాలలో ఒక్కటిగా పేర్కోనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు. శ్రీకృష్ణదేవరాయుల అయితే ఏడుకోండలవాడి దర్శనార్ధం ఏడు విడతలు తిరుమలకు రాగా, వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు.ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రగోజి భోన్సలే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్ని 1933 తరువాత తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు అర్చకులు.
శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోను, అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను తిరుపతి పరిపాలన భవనంలోని ట్రెజరిలోను భద్రపర్చింది టీటీడి. శ్రీవారికి రూ.30 కోట్లు విలువ చేసే వజ్రాల కీరిటం, 5 కోట్లు విలువ చేసే వజ్రాల కటి, వరద హస్తాలు, 3 కోట్ల విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్లు విలువ చేసే బంగారు కీరిటం, 75 లక్షలు విలువ చేసే నాగాంబరం, 1740 నాటికే 33 వేలు విలువ చేసే పచ్చలు పోదిగిన ముత్యాల హారం, 28 వేలు విలువ చేసే వైడ్యూరాలు పొదిగిన బంగారు డాల్లరు, 28వేలు విలువ చేసే 17 పేటల ముత్యాల హారం, 45 వేలు విలువ చేసే 5 పేటల వజ్రాల బంగారు హారం, 8 వేలు విలువ చేసే బంగారు కిరీరిటం వంటివి కాకుండా 35 కిలోల మకరతోరణం, 32 కేజిల ఐదు సవర్ల సహస్రనామమాల, 28కిలోల వజ్రకీరిటం,19కిలోల పీతాంబరం,19 కీలోల శ్రీవారి పద్మసీఠం,10 కేజిల నాలుగు పేటల మోహరిల దండ ఇలా ఎన్నో ఆభరణాలు వున్నాయి. ఇలా శ్రీవారి అలంకరణకు 1094 రకాల ఆభరణాలు వుంటే, అందులో 374 వజ్రవైఢ్యురాలతో కూడిన ఆభరణాలు వున్నాయి. ఇవన్ని కూడా శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపర్చి వుంటాయి. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు ఉపయోగించని ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని మాత్రం తిరుపతిలోని పరిపాలన భవనంలో భద్రపర్చింది టీటీడి.
శ్రీవారికి మహారాజులే కాదు…సామాన్యులు కూడా ఘనంగానే కానుకలు సమర్పిస్తున్నారు. శ్రీవారికి హుండిలో సమర్పించే బంగారం విలువ ప్రతి నెల 100 కిలోలు దాటేస్తూంటే, ఏడాదికి 1300 కిలోల వరకు పసిడి శ్రీవారి సొంతమవుతోంది. 2008 ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా విక్రయించేది టిటిడి. 2008 నుంచి స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిసాజిట్ చేయ్యడం ప్రారంబించింది టిటిడి. ఇలా టిటిడి అకౌంట్ లో ప్రస్తూతం 10 వేల కిలోల బంగారం బ్యాంకులో డిపాజిట్లుగా వుంది. ఇక స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్యతో పాటే లభిస్తున్న కానుకలు కూడా అంతే స్పీడుగా పెరుగుతూ వస్తున్నాయి.
110 సంవత్సరాల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం మూడున్నర లక్షలు మాత్రమే. 1907-08 లో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల 3 లక్షల 87 వేల 406 రూపాయలు ఉంటే అది, 1923-24 నాటికి రూ.16 లక్షల 35 వేల 517 రూపాయలుకు చేరింది.
అలా పెరుగుతు వస్తూన్న శ్రీవారి హుండి ఆదాయం 1951లో నవంబర్ మాసంలో అత్యదికంగా 1 లక్షా 31 వేల 409కు చేరింది. అంచెలంచెలుగా పెరుగుతూ వస్తూన్న శ్రీవారి హుండి ఆదాయం 1996-97లో రూ. 99.8 కోట్లకు చెరుకుంది. ఇది 1997-98లో 119.7 కోట్లు….1998-99 లో 133.71 కోట్లు, 1999-2000లో 145.87 కోట్లకు పెరుగుతూ వచ్చింది. ఇది 2009-2010లో రూ. 583 కోట్లకు పెరిగింది.
2019-20 నాటికి శ్రీవారి హుండి ఆదాయం రూ.1313 కోట్లుకు చేరుకుంది.
ఇక కరోనా కారణంగా 2020-21లో స్వామివారి హుండి ఆదాయం రూ.731 కోట్లకు పరిమితం అయ్యింది.
2021-22లో రూ.933 కోట్లు కానుకగా సమర్పించారు భక్తులు. దీనితో ఈ ఏడాది వెయ్యి కోట్లు ఆదాయం వస్తూందని టిటిడి అంచనా వేయగా, ఆరు నెలల కాలంలోనే స్వామివారికి రూ. 800 కోట్లు పైగా హుండి ఆదాయం లభించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆగస్టు నెలలో భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. దీంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ సృష్టించింది. గత నెలలో 22.22 లక్షల మంది స్వామి వారిని దర్శించుకోగా.. రూ.140 కోట్లకుపైగా హుండీ ఆదాయం నమోదైంది. గత నెలలో మొత్తం 47.46 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించగా.. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
అన్ని సమస్యలకూ ఏడుకొండలవాడే పరిష్కారం. పిల్లల పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, అన్నింటికీ ఆపదమొక్కుల వాడే దిక్కు. ఆయనకు మొక్కుకోవడమే. టెన్త్ పరీక్ష రాసి కొండకు వెళ్లాల్సిందే. పెళ్లి కార్డు ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే. చివరకు ఇస్రో రాకెట్ ఎగరేస్తే.. నమూనా కూడా ఆయన పాదాల చెంత పెట్టిన తర్వాతే ప్రయోగం చేయాల్సిందే. సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా వెంకన్న సన్నిధికి దాసులే.
తిరుమల ప్రపంచంలో బెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్. గడిచిన పదేళ్లలో తిరుమల మరింత అద్భుతంగా మారింది. పుణ్యక్షేత్రాలు అంటే అపరిశుభ్రంగా ఉంటాయి. కానీ తిరుమల అలా కాదు. చిన్న కాగితం ముక్క రోడ్డుపై కనిపించదు. చుట్టూ కొండలు, జలపాతాలు ఆహ్లాదకరమైన వాతావవరణంతో పాటు.. అక్కడ పరిశుభ్రత.. భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతుంది. ఈ విషయంలో టీటీడీని అభినందించాలి.
ఆపద మొక్కులవాడు కొలువైయున్న దివ్య ధామం తిరుమల పుణ్యక్షేత్రం. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే అ తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికంగానే ఉంటుంది. అందుకే కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తుంటారు. జనంలో స్వామిపై నమ్మకం, విశ్వాసం పెరుగుతూనే ఉన్నాయి. నెలనెలా ఆయన ఆదాయం పెరుగుతూనే ఉంది. వచ్చే నెల 150 కోట్లు దాటుతుంది. ఇక జనం రోజుకి లక్ష మంది.. సెలవు రోజుల్లో రెండు లక్షల మంది. రోజూ కనీసం 30 వేల మంది వీఐపీలు. వీళ్లందరికీ స్వామి దర్శనం దొరుకుతోంది. ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా లక్షల మంది కొండ ఎక్కి దర్శనం చేసుకుని.. కొండ దిగుతున్నారు. ఇది నిజంగా మిస్టరీనే. దేశం నలుమూలల నుంచి రోజూ రెండు లక్షల మంది వస్తారు. తిరుపతి పట్టణం జనాభా కంటే ఎక్కువ మంది జనం వచ్చిపోతుంటారు. ఎక్కడా ఏ ఆటంకాలూ ఉండవు. టీటీడీ ఉద్యోగులు అలాగే కష్టపడుతుంటారు. భక్తి, నమ్మకం, విశ్వాసం లేకపోతే ఇదంతా సాధ్యమా..? వెంకన్న మహిమ లేకపోతే ఇది జరుగుతుందా..?
తిరుమల కేవలం పుణ్యక్షేత్రం కాదు. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న క్షేత్రం. ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందంటే అతిశయోక్తి కాదు. కొండపైకి వెళ్లడానికి, దిగడానికి ఘాట్ రోడ్డు ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభూతి. ఇక శ్రీవారి ఆలయంలో అణువణువులో అలౌకిక అనుభూతిని ఫీలయ్యే అవకాశం ఉంది. ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరని ఆకర్షణ శ్రీవారి సొంతం. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు వెంకన్న. తిరుమలకు ప్రతి రోజూ ఎక్కువ మంది భక్తులు రావడమే విశేషం కాదు. రిపీట్ యాత్రికులు ఎక్కువగా వచ్చే పుణ్యక్షేత్రం కూడా తిరుమలే అనుకోవచ్చు. ఒక్కసారి తిరుమల వస్తే.. పదే పదే వెళ్లాలనుకుంటారు భక్తులు. భక్తుల్ని సూదంటురాయిగా ఆకర్షిస్తోంది తిరుమల. ఆగమ శాస్త్రం ప్రకారం, శ్రీవారి పవిత్రతకు భంగం లేకుండా నిత్యపూజలు, కైంకర్యాలు, ఉత్సవాల విషయంలో అర్చకులతో సమన్వయం చేసుకుంటుంది టీటీడీ బోర్డు. అలాగే టీటీడీ సిబ్బంది కూడా భక్తి భావంతో, అంకిత భావంతో, భక్తులకు సేవలు అందిస్తుంటారు. ప్రభుత్వాలు మారినా, బోర్డులు మారినా, సిబ్బంది మారినా.. తిరుమల ఆలయ నిర్వహణలో మాత్రం అత్యున్నత ప్రమాణాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్దిష్టమైన వ్యవస్థ, నియమాలు, కట్టుబాట్లే దీనికి ప్రధాన కారణం. టీటీడీకి ఆలయ మర్యాదలు కాపాడే విషయంలో భక్తుల నుంచి కూడా మంచి తోడ్పాటు ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా ఎప్పటికప్పుడు భక్తుల ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, వారి సూచనలు అమల్లో పెట్టే వ్యవస్థ కూడా తిరుమలలో ఉంది. ఇవన్నీ తిరుమలకు మాత్రమే ప్రత్యేకమైనవి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు ఏర్పాటయ్యాయి. అయినా సరే తిరుమలకు ఉన్న ఆకర్షణ పెరుగుతోందే కానీ.. తగ్గడం లేదు. ఇది కచ్చితంగా శ్రీవారి ఆశీర్వాద బలమే అనుకోవాలి.
నిజానికి తిరుమల లాంటి భారీ రద్దీ ఉండే ఆలయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే టీటీడీ అనే వ్యవస్థ ఏర్పాటైంది. వందల మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తేనే.. భక్తులకు సాఫీగా దర్శనం అవుతుంది. ఎంతమంది భక్తులు కొండకు వచ్చినా.. వసతికి, దర్శనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మెరుగైన మార్గాలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఇక నిత్య అన్నదానం, ప్రసాదాలు.. ఒకటా, రెండా .. ప్రపంచంలోనే రోజూ అత్యధిక జనం విచ్చేసే పుణ్యక్షేత్రం. ప్రకృతి పరంగా ఏర్పడి.. ఇన్ని లక్షల మంది దర్శించుకోవడం నిజంగా వెంకన్న వైభవమే.