Off The Record : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆవిర్భావం తర్వాత టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇప్పుడు నాయకత్వం కోసం వెదుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబం పార్టీతో ఉన్నన్ని రోజులు ఆ లోపం కనిపించలేదు. ఇక 2014లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా శంకర్ యాదవ్ గెలిచారు. అలాగే 2019లో ఆయన మీద వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి గెలిచారు. ఇక ఆ తర్వాత తంబళ్లపల్లిలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. జిల్లా అగ్ర నాయకులు కనీసం ఇటువైపు దృష్టి సారించలేదు. ఇక గత ఎన్నికల్లో అభ్యర్థి విషయమై చివరి దాకా లాగినా… అధిష్టానం చివరికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కాదని జయచంద్రారెడ్డికి టికెట్టు ఇచ్చింది. ఆయన వైసీపీ అనుకూలుడంటూ శంకర్ వర్గం వ్యతిరేకించింది. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా జయచంద్రారెడ్డికే టిక్కెట్ ఇవ్వడం, దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం తర్వాతి పరిమామాలు. ఇక అప్పటి నుండి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు శంకర్ అనుచరులు. ఆయన టీడీపీ కేడర్‌కు దూరంగా, వైసీపీ కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారని కూడా ఆరోపించారు. రెండు వర్గాలు రోడ్డెక్కి కొట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల గొడవ నుండి ఇన్చార్జ్ మంత్రి సమావేశంలో రచ్చదాకా… ఏదో ఒక వ్యవహారం రెండు గ్రూపుల మధ్య నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో ఎవరు ఊహించని విధంగా మొలకలచెరువు నకిలీ మద్యం వ్యవహారం బయట పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. జయచంద్రారెడ్డితో పాటు ఆయన బామ్మర్ది మీద కూడా దీనికి సంబంధించి కేసులు నమోదవడంతో పార్టీ ఆయన్ని ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తప్పించడమేగాక సస్పెండ్ చేసింది కూడా. ఇక అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నారు జయ చంద్రారెడ్డి. దీంతో.. నాకే ఇన్ఛార్జ్ పోస్ట్ కావాలంటూ శంకర్ యాదవ్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు పదవి వచ్చేసినట్టేనంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఈ పరిణామ క్రమంలో…. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జయచంద్రా రెడ్డి ఒక వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియోలో శంకర్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారాయన. వైసీపీతో కుమ్మక్కయి సొంత పార్టీ క్యాడర్ దగ్గరే 10% కమీషన్ వసూలు చేసిన శంకర్ యాదవ్‌కు ఇన్ఛార్జ్ పదవి అంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తన తప్పు లేకపోయినా కేసు పెట్టారని, నిజాయితీగా బయటకు వస్తానని చెబుతూనే… శంకర్‌ని ఇన్ఛార్జ్‌గా నియమించకుండా పోరాటం చేయాలంటూ తన వర్గానికి సూచించడం కలకలం రేపుతోంది.
ఇలా నియోజవర్గంలో ఇన్ఛార్జ్ పదవి కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేశారని, ఇప్పుడు మా బాధలు వినేవాడే నియోజకవర్గంలో లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోకల్ తమ్ముళ్లు. మరోవైపు ఈ రెండు వర్గాలకు సంబంధం లేకుండా ఉంటున్న పాత టిడిపి క్యాడర్ ఆవేదన మాత్రం మరింత వర్ణనాతీతంగా ఉందట. వీళ్లతో వేగలేకపోతున్నామంటూ అమరావతికి వెళ్లి పార్టీ పెద్దలకు మొరపెట్టుకున్నారట. గతంలోనే శంకర్‌యాదవ్‌ని వ్యతిరేకించిన పాత టీడీపీ కేడర్ మళ్లీ ఆయన్ని రానిచ్చే ప్రసక్తే లేదని అంటోందట. దీంతో కొద్ది రోజుల పాటు ఇన్చార్జి పదవి అంశాన్ని పక్కనపెట్టి త్రిసభ్య కమిటీని వేస్తే బెటరన్న ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అలా కాకుండా శంకర్ యాదవ్‌కు ఇస్తే మాత్రం మా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిపోతుందని అంటున్నారట లోకల్ టీడీపీ కార్యకర్తలు. ఒకప్పటి కంచుకోటలో టీడీపీ పెద్దలు పార్టీని ఎలా సెట్ చేస్తారో చూడాలి.
