Site icon NTV Telugu

Story Board: రూపాయి విలువ పడిపోవడానికి కారణాలేంటి..?

Story Board

Story Board

Story Board: మన కరెన్సీ రూపాయి. అమెరికా కరెన్సీ డాలర్. మన కరెన్సీని డాలర్‌తో ఎందుకు పోల్చాలి..? విలువ తగ్గిందనో.. పెరిగిందనో ఎందుకు చూడాలి..? అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ డాలర్‌తో మనకేం పని అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గరా అవసరమైనన్ని డాలర్ల నిల్వలుండటం తప్పనిసరి. అలా లేకపోతే సదరు దేశాలు సంక్షోభంలో జారిపోయే ప్రమాదం ఉంటుంది. మన లాంటి దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఆ డాలర్ రిజర్వులు ఇంకా కీలకం. పైగా మనకు అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాకు మన ఎగుమతుల కంటే.. దిగుమతులే ఎక్కువ. ఎప్పుడూ వాణిజ్యలోటు తప్పటం లేదు. ఇప్పుడు రూపాయ పతనం కావడం.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే. డాలర్ విలువ పెరగడంతో.. దిగుమతులు మనకు మరింత భారమౌతాయి. అలాగే విదేశీ విద్య కూడా ప్రియం కానుంది. రూపాయి పతనం ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. కొన్నాళ్లుగా దీనికి పూర్వరంగం సిద్ధమౌతోంది.

మన స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఏకంగా 17 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇటీవల మన దేశానికి వచ్చే ఎఫ్డీఐలు కూడా తగ్గిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎన్నారైల నుంచి వచ్చే రెమిటెన్సులు కూడా తగ్గిపోయాయి. ట్రంప్ పుణ్యమా అని ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో.. పార్ట్‌టైం ఉద్యోగాలకు తెరపడ్డ తరుణంలో.. ఎన్నారైలు గతంలో మాదిరిగా అదనంగా సంపాదించి.. ఇండియాకు పంపే వీల్లేకుండా పోయింది. కొత్త పన్నులు వేయడంతో పాట రెమిటెన్సులపైనా టారిఫ్ ఉండటం కూడా ప్రభావం చూపించింది. దీనికి తోడు ఎన్నారైల ఆర్థిక లావాదేవీలపైనా కఠిన పర్యవేక్షణ సాగుతుండటం కూడా దీనికి కారణమనే భావన వ్యక్తమౌతోంది.

రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగడం కూడా మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. చాలా కాలం నుంచి ట్రంప్ డీల్ దగ్గర్లోనే రెండు దేశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ అడుగులు ముందుకు పడకపోవటం ఇన్వెస్టర్లలో నిరాశను పెంచుతోంది. అమెరికా మన ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడంవల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితి మరోపక్క వాణిజ్యంపై ప్రభావం పెంచుతూ డాలర్లకు డిమాండ్ పెంచుతోంది. ప్రస్తుతం 90 రూపాయలకు పైగా పెరిగి.. చారిత్రక కనిష్ఠానికి చేరిన రూపాయి.. ఒకవేళ 89 స్థాయి కంటే దిగువకు పడిపోతేనే బలం పుంజుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 మార్కు వద్ద తన సపోర్ట్ తగ్గించుకుంటే.. రూపాయి పతనంలో 91 స్థాయిని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.

రూపాయి పతనం విషయంలో ఈసారి ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో మాదిరిగా తక్షణ జోక్యానికి త్వరపడటం లేదు. ఎందుకంటే గతంలో రూపాయి పతనమైన తీరుకీ.. ఇప్పటి పతనానికి నిర్దిష్టమైన తేడా ఉంది. గతంలో డాలర్‌తో పోలిస్తే మిగతా కరెన్సీలు బలహీనపడినప్పుడు.. రూపాయి కూడా పతనమైంది. కానీ ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగానే ఉన్నా కూడా.. రూపాయి మాత్రం వేగంగా పతనమౌతోంది. దీంతో ఆర్బీఐ కూడా స్వల్ప జోక్యానికే పరిమితమై.. ద్రవ్యపరపతి విధాన సమీక్షపై ఫోకస్ పెట్టింది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర కావాల్సినంత డాలర్ల రిజర్వ్‌ కూడా ఉంది. కాబట్టి రూపాయి పతనం కారణంగా పడే ప్రభావం తాత్కాలికమేనని, మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదనే ఉద్దేశంతో ఆర్బీఐ కనిపిస్తోంది.

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారమే ప్రారంభమైంది. వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తారు. డిసెంబర్ 10న యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కూడా రాబోతున్న తరుణంలో రూపాయి భవితవ్యంపై అనేక ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకుంటే రూపాయి మరింతగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, అప్పుడు బలహీనపడిన కరెన్సీ మానిటరీ పాలసీ పనిని మరింత కష్టతరం చేస్తుందనే అంచనాలున్నాయి. ఇటు ఆర్బీఐ తర్జనభర్జనలు పడుతున్న సమయంలో.. కేంద్రం మాత్రం ధీమాగానే కనిపిస్తోంది. రూపాయి పతనంతో ఆందోళన చెందాల్సిన పనేం లేదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అటు ద్రవ్యోల్బణంపై గానీ, ఎగుమతులపై గానీ ప్రభావం ఉండబోదని చెప్పారు. వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం కూడా వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే ఉత్కంఠ ఇంకా పెరిగింది. మరి ఆర్బీఐ కూడా ప్రభుత్వ ఉద్దేశంతో ఏకీభవిస్తుందా.. అందుకు భిన్నంగా ముందుకెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. స్వల్పకాలంలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ, దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం వంటి సానుకూల అంశాలు మధ్యకాలంలో మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక రూపాయి చారిత్రక పతనానికి చేరిన తరుణంలో.. స్వతంత్ర భారత్ ప్రస్థానంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమైన తీరును చూస్తే.. నిరంతర తిరోగమనమే కనిపిస్తోంది. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.3.30. మూడు దశాబ్దాల తర్వాత 1977లో రూ.8.334కి చేరింది. మరో ముప్ఫై ఏళ్లకు 2007 నాటికి రూ.43.95గా ఉంది. అదే 2020లో రూ.73.23గా, 2021లో రూ.74.56గా, 2022లో రూ. 82.76గా, 2023లో రూ.83.4గా, 2024లో రూ.83.28గా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.90.43కు చేరి.. పతనం లోతుల్ని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే విషయాన్ని కొందరు నిపుణులు ఊహిస్తున్నారు. వీరి అంచనా ప్రకారం వడ్డీరేట్లపై యథాతథ స్థితి, భవిష్యత్‌ రేట్లపై తటస్థ వైఖరి రెండూ పతనమవుతున్న రూపాయిని ఆదుకునేందుకు సాయపడొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ మూడు విడతల్లో రెపోరేటును ఒక శాతం తగ్గించిన సంగతిని కూడా వీరు గుర్తుచేస్తున్నారు.

Exit mobile version