Site icon NTV Telugu

Story Board: ఏపీలో వ్యవస్థీకృత దోపిడీ కొనసాగుతోందా..? ఇసుక, మట్టి, మద్యం పేరుతో బరితెగింపా..?

Story Board

Story Board

Story Board: ఏపీలో పొలిటికల్ లీడర్ అంటే ఇసుక, మట్టి, మద్యం మాఫియాలో భాగం కావాల్సిందే అన్నంత దుర్మార్గంగా తయారైంది పరిస్థితి. అసలు వీటితో సంబంధం లేని నేత అంటూ ఎవరూ లేరేమో అన్నంతగా దోపిడీ జరుగుతోంది. సగం మంది ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. మరో సగం మంది మట్టిదోపిడీలో బిజీగా ఉన్నారు. ఎవరి ఆదాయ మార్గాలు వారు చూసుకుని సెటిలయ్యారు. ఇక మద్యం వ్యాపారం సంగతి చెప్పక్కర్లేదు. అనుచరుల పేరుతో లిక్కర్ షాపులు తీసుకుని.. రోజుకింత అని కలెక్షన్లు తీసుకుంటున్నారు.

ఇదేదో ఏ ఒక్క పార్టీకో పరిమితమైన వ్యవహారం కాదు. ఏదో ఓ సర్కారు హయాంలో మాత్రమే జరిగే తంతూ కాదు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు వేరైనా.. నేతల తీరు మాత్రం ఒక్కటే. ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబు ప్రోత్సహించినా.. జగన్ ప్రోత్సహించినా తప్పే అవుతుంది. జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక, లిక్కర్ వ్యాపారాలు చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇసుక, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలే. ఏ ఒక్కరూ దోపిడీకి అతీతులు కాదు. మద్యపాన నిషేధం డిమాండ్ పుట్టుకొచ్చిన రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది. కొందరు నేతల రోజువారీ లిక్కర్ కలెక్షన్లు చూస్తే.. వీటితో చిన్న స్థాయి ప్రాజెక్టులు పూర్తిచేయొచ్చంటే అతిశయోక్తి కానే కాదు. పైకి బీద అరుపులు అరిచే చాలా మంది నేతలు రహస్యంగా భారీగా డబ్బు వెనకేసుకుంటున్నారు. చాలామంది ఈ సంగతి సన్నిహితులకు కూడా తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు.

సాధారణంగా రాజకీయ నేతలకు అనుచరులు, సన్నిహితులు, ఆప్తులు ఉంటారు. కానీ ఏపీలో దోపిడీ పర్వం కారణంగా నేతలకు కొత్త రిలేషన్ పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆ రిలేషనే ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అదే దోపిడీ పార్ట్ నర్ రిలేషన్. ప్రతి ఏరియాలో అధికారపక్షం, ప్రతిపక్షానికి చెందిన నేతలతో కలిసి టీములు ఏర్పాటవుతున్నాయి. ఎక్కడా సమస్య రాకుండా ఎవరి కోపరేషన్ వారు చేస్తున్నారు. పైకి రాజకీయ విమర్శలు షరా మామూలే. కానీ తెర వెనుక మాత్రం పూర్తి అండర్ స్టాండింగ్ తో దోచేసిన సొమ్మును తేడా రాకుండా వాటాలేసుకుంటున్నారు. అందుకే ఆ పార్టీకి పట్టున్న ప్రాంతం, ఈ పార్టీకి పట్టున్న ప్రాంతం అనే తేడా లేకుండా దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లుతోంది. దోపిడీ ఎంత వ్యవస్థీకృతమైందంటే.. ఏకంగా గ్రామస్థాయిలో మాఫియాలు ఏర్పాటయ్యాయి. ఎవరి ఏరియాను వారు దోచేస్తున్నారు. ఇక్కడ మరొకరి దృష్టి పడకుండా సొంతంగా సరిహద్దులు గీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్ లాగే.. మాఫియా టీములు కూడా తమ ఏరియాలకు లిమిట్లు సెట్ చేస్తున్నాయి. ఇలా పూర్తిస్థాయి అవగాహనతో.. దోపిడీకి పాల్పడుతున్నారు. ఎవరేమనుకున్నా లెక్కచేయడం లేదు.

మామూలుగా ఇలాంటి దోపిడీ అధికార పక్షం మాత్రమే చేస్తే.. ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంది. ఇక ప్రతిపక్షంలో నేతలెవరైనా మాత్రమే ఇలాంటి పనులు చేస్తే.. ఆటోమేటిగ్గా కేసులు బుక్కవుతాయి. కానీ ఏపీలో కొత్తగా అభివృద్ధి చెందిన పార్టీలకు అతీతమైన దోపిడీ గ్యాంగులు.. గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నాయి. అసలు దోపిడీ జరుగుతున్న విషయమే ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎవరికైనా తెలిసినా.. ఎవరు చేస్తున్నారో ఆ దేవుడు కూడా కనిపెట్టలేని విధంగా మాఫియా వేళ్లూనుకుంది. ప్రతిపక్షానికి భాగస్వామ్యం ఉంది కాబట్టి.. దోపిడీ గురించి ఎక్కడా రచ్చ జరగదు. అధికార పక్షం కూడా ఉంటుంది కాబట్టి.. కేసులు పెట్టే ఛాన్సే లేదు. ఇలా రెండు రకాలుగా వచ్చే అడ్వాంటేజ్ ను.. ఏపీలో రాజకీయ నేతలు రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. అరే దోపిడీకి రెండు చేతులే ఉన్నాయే.. రావణాసురుడిలా ఇరవై చేతులుంటే ఎంతో బాగుండేదని బాధపడిపోతున్నారు.

ఏపీలో నిధులకు లోటుంది కానీ.. ఇసుక, మట్టి, మద్యానికి లోటు లేదు. దీంతో అందుబాటులో ఉన్నవాటిని సొమ్ముచేసుకోవాలని రాజకీయ నేతలు బరితెగించారు. అందినకాడికి దోచేస్తున్నారు. దోపిడీలోనూ పాత పద్ధతులకు మంగళం పాడేసి.. ఎక్కడలేని వినూత్న ఆలోచనలకు పదును పెడుతున్నారు. అసలు దోపిడీ ఇలా కూడా చేయొచ్చా అని దోపిడీ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా ఉంది నేతల తెలివైన దోపిడీ. ఏపీలో దోపిడీని వ్యవస్థీకృతం చేయడానికి ఎక్కడలేని తెలివితేటలు వాడుతున్న నేతలు.. తమ ప్రాంతాల అభివృద్ధి గురించి మాత్రం ఇసుమంతైనా ఆలోచించడం లేదు.

సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దోచుకుంటారనే భ్రమలుంటాయి. కానీ ఏపీలో మాత్రం దోపిడీలో సర్వజన సమానత్వం కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా తక్కువ తినడం లేదు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు, మరికొన్నిచోట్ల ప్రతిపక్ష నేతలు చొరవ తీసుకుని.. మాఫియాను ఏర్పాటుచేస్తున్నారు. అల్టిమేట్ గా ప్రతి ఎమ్మెల్యేకు నికరంగా ఆదాయం వచ్చేలాగా నెట్ వర్క్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఎలా సంపాదిస్తున్నాడనే ప్రశ్నలకు తావు లేదు. అందరిదీ కామన్ ఫార్ములా. అందుబాటులో ఇసుక, మట్టి ఏది ఉంటే దాన్ని క్యాష్ చేసుకోవాలి. లిక్కర్ ఎలాగో రాష్ట్రవ్యాప్తం కాబట్టి.. ఎవరి ఏరియాలో వాళ్లు అనుచరుల పేరుతో షాపులు తీసుకుని బినామీ వ్యాపారాలు చేయాలి. తర్వాత రోజువారీగా కలెక్షన్లు చేసుకోవాలి. అంతకుమించి వీలైనప్పుడల్లా కాంట్రాక్టులు తీసుకుంటూ.. కమీషన్లు కొట్టేయాలి. ఇలా ఎమ్మెల్యేలంతా బాగుపడాలనే సత్సంకల్పంతో నేతలు చెలరేగిపోతున్నారు. అన్ని పార్టీలూ ఒక్కటయ్యాక.. ఇక మనల్ని ఆపేదెవడ్రా అనే ధీమాతో రెచ్చిపోతున్నారు.

ఏపీలో సాగుతున్న దోపిడీ పర్వం.. అలా చేయాలనుకునే నేతలందరికీ కేస్ స్టడీగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడానికి.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతూ.. పరస్పర విమర్శలతో పొద్దపుచ్చటం నేతలకు అలవాటు. కానీ దోపీడీలో, మాఫియా ఏర్పాటులో.. ఎక్కడా తేడా రాకుండా అలవిమాలిన ఐకమత్యం కనబరుస్తున్నారు. నేతల టాలెంట్ చేసి.. ఏపీ జనం విస్తుబోతున్న పరిస్థితి. ఎక్కడైనా దోపిడీ మరీ బట్టబయలయ్యే పరిస్థితి వస్తే.. కొందరు సామాన్యులకూ వాటాలిస్తామని నేతలు ఆఫర్లిస్తున్నారంటే ఏమనుకోవాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా దినదినప్రవర్థమానంగా జరుగుతున్న దోపిడీ.. ఏ తీరానికి చేరుతుందో ఏపీ నేతలకే తెలియాలి.

Exit mobile version