Site icon NTV Telugu

Storyboard: ఇల వైకుంఠంలో శ్రీవారి వైభవం.. 9 రోజులపాటు కొంగొత్త శోభ..

Storyboard

Storyboard

Storyboard: నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు… ప్రతివారం వారోత్సవాలు… ప్రతి మాసం మాసోత్సవాలు.. నిర్వహిస్తూనే వుంటారు. స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు….. విశేష పూజ , అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు…..పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జేష్ఠాభిషేకం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహమహోత్సవం, పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి. ఏడాది పొడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినా….. ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత వేరు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లే వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యం భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింప చేస్తున్నాడు . శ్రీవారు వెంకటాద్రి పై అవతరించిన కన్యా మాసంలో శ్రవణా నక్షత్రానికి ముగిసేలా నిర్వహించే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ఎంతో విశిష్టత ,ప్రాధాన్యత కలిగినవి. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞమని అర్థం.యజ్ఞం పూర్తి అయింది అన్న దానికి సూచికగా యజ్ఞం చివరిలో యజమానికి అవభృధ స్నానం చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవం చివరి రోజున శ్రీవారి ఆలయంలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఒక యజ్ఞంగా నిర్వహిస్తున్నారు అర్చకులు.

శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి. వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి.

దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా అధిక భాద్రపదం లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్ని మాత్రం ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది.

శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా 10వ శతాబ్దం నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒక తమిళ శాసనంలో మొదటిసారిగా పదోవ శతాబ్దంలో తిరువేంగళ నాధుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది.అప్పట్లో 11 రోజులపాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.ఇక 14వ శతాబ్దం వరకు స్వామివారికి ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవి .పెరటాసి, మార్గాలి నెలలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు .13వ శతాబ్దంలో తిరు వెంకటనాధ యాదవ రాయని కాలంలో రాజయ్య దండ నాయకుని పేరు మీద సింగమ దండ నాయకుడు ఆడి తిరునాళ్లు నిర్వహించారు .14వ శతాబ్దంలో విజయనగర ప్రభువైన రెండవ హరిహర రాయులు మాసి తిరునాళ్లు నిర్వహించారు .ఇలా ఒక్కొక్క రాజు వారికి అనుకూలమైన తేదీలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తుండడంతో 15వ శతాబ్దంలోకి వచ్చేసరికి శ్రీ వేంకటేశ్వరునికి ఏడాదికి ఏడుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుండేవి. అవి చిత్రి,ఆడి ,అవని ,పెరటాసి,అల్పిసి,మాసి ,పంగుణి నెలలలో జరిగేవి .ఈ ఏడు బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం రోజున వెంకటేశ్వర స్వామికి అనంతశయనారు అనే భక్తుడు నైవేద్యాలు సమర్పించే వారని శాసనాలలో ఉంది. .అప్పట్లోనే స్వామివారికి ద్రవిడ సంప్రదాయాలను అనుసరించి కొన్ని ఉత్సవాలు సౌరమానం ప్రకారం జరుగుతూ ఉంటే.. మరికొన్ని ఉత్సవాలు తెలుగువారి సంప్రదాయమైన చాంద్రమాన పంచాంగం అనుసరించి నిర్వహించేవారు .అటు తరువాత తాళ్లపాక పెద్ద తిరుమల ఆచార్యులు స్వామివారికి తన పేరున ఆని నెలలో 13 రోజులపాటు బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశారు .మరోవైపు విజయనగర ప్రభువు సదాశివరాయల కాలంలో రాయసం వేంకటాద్రి అనే భక్తుడు తిరుమలలో జరిగే పది బ్రహ్మోత్సవాలలో కొలువు శ్రీనివాసమూర్తికి నైవేద్యాలు ఏర్పాటు చేసినట్లు శాసనాలలో ఉంది. అంటే ఆ సమయానికి స్వామివారికి ఏడాదికి పది సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు.పదహారవ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామికి 9 నెలల కాల పరిధిలో పది బ్రహ్మోత్సవాలను 9 ,11 ,13 రోజులపాటు జరుగుతూ ఉండేవి .రాజుల పేరిట మొదలైన బ్రహ్మోత్సవాలు అటు తరువాత నిలిచిపోతూ వచ్చినా.. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కొరకు వెంకటేశ్వర స్వామి అవతార నక్షత్రం అయిన కన్యామాసం శ్రవణా నక్షత్రం కు పూర్తయ్యేలా తొమ్మిది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండ వైభవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. విజయదశమికి అలంకార ఉత్సవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండ నాయకుడి వైభోగం కళ్లారా చూసి తరించటానికి భక్తజన సందోహం తరలివస్తుంది. తిరుమలేశునికి ఏటా ఎన్ని ఉత్సవాలు జరిగినా.. బ్రహ్మోత్సవాలది ప్రత్యేక స్థానం. సాధారణ రోజుల్లో మూలవిరాట్‌ దర్శనం మాత్రమే ప్రాప్తిస్తే… బ్రహ్మోత్సవ పర్వదినాల్లో స్వామి వారి ఉత్సవమూర్తులు వివిధ రూపాల్లో కనువిందు చేస్తాయి. పరమ పావన దివ్యత్వంతో అలరారే తిరుమల గిరులు… బ్రహ్మోత్సవాల్లో మరింత శోభతో కనిపిస్తాయి. దేవతలే నేరుగా వచ్చి స్వామి వారికి ఉత్సవాలను జరుపుతున్నారా అన్నట్లుగా కనిపిస్తుంది తిరుమల. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకున్న వారి భాగ్యమే భాగ్యము. వైకుంఠనాధుని దివ్య వైభోగాన్ని కళ్లారా చూడాలే తప్ప… ఎంత వర్ణించినా… ఎన్నిసార్లు కీర్తించినా.. తనివి తీరనిది.

Exit mobile version