StoryBoard: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కష్టాలు కొనితెచ్చుకుంటోంది. సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి పదవులు పొంది నేతలు.. కలిసికట్టుగా ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందిపోయి.. తమలో తామే కలహించుకుంటున్నారు. పోనీలే బయటపడటం లేదుగా అని ఇన్నాళ్లూ పార్టీ క్యాడర్ సరిపెట్టుకుంది. కానీ ఆ ఊరట కూడా వారికి దక్కకుండా చేస్తూ.. మంత్రి పొన్నం ప్రభాకర్.. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రెచ్చిపోయారు. ఏకంగా దున్నపోతు అంటూ నోరుపారేసుకున్నారు. అదీ ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన జరగడంతో.. అది క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో గగ్గోలు రేగింది. దీంతో మొదట కవర్ చేద్దామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వలేదు. పైగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొన్నం వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడంతో పాటు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో.. ఇక తప్పదని పీసీసీ రంగంలోకి దిగింది. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మంత్రులిద్దరితో సమావేశమయ్యారు. ఎట్టకేలకు పొన్నం అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడంతో.. వివాదం ముగిసినట్టుగా కనిపిస్తున్నా.. స్థానిక ఎన్నికల తరుణంలో ఈ ఘటన ఎటుదారితీస్తుందోనని కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇక్కడ పొన్నం అడ్లూరిపై కామెంట్లు చేసేటప్పుడు మరో మంత్రి వివేక్ కూడా మౌన ప్రేక్షకుడిగా ఉండటం.. పైగా నవ్వటం మరింత వివాదాస్పదమైంది. ఇదే అదనుగా ఈ గొడవను కులపరమైన చిచ్చు పెట్టే దిశగా మలుపు తిప్పాలనే ప్రయత్నాలూ జరిగాయి. ఓ బీసీ మంత్రి ఓ ఎస్సీ మంత్రితో మరో ఎస్సీ మంత్రి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంటనే కోణం రైజ్ అయింది. అంతే కులసంఘాలు వివాదాన్ని అందిపుచ్చుకున్నాయి. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య ఉండాల్సిన గొడవ కాస్తా.. కులసంఘాల మధ్య పోరుగా పరిణమించడంతో.. కాంగ్రెస్ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టినా ఇప్పటికే ఆలస్యమైందనే వాదన కూడా లేకపోలేదు.
మొత్తం మీద జరిగిన ఘటనలో ముగ్గురు మంత్రులదీ తప్పుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. సాటి మంత్రిని దున్నపోతు అని వ్యాఖ్యానించడం ద్వారా .. పొన్నం పొరబాటు చేస్తే..వెకిలిగా నవ్వడం వివేక్ చేసిన తప్పు. దీనిపై అంతర్గతంగా పరిష్కరించుకోకుండా ఓపెన్ గా గొడవకు దిగడం అడ్లూరి లక్ష్మణ్ పొరబాటు. ఇంత జరుతున్నా..వీళ్లని కూర్చోబెట్టి మాట్లాడి..సమస్యను పరిష్కరించకుండా..తాత్సారం చేయడం మరో పొరబాటు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటుందిలే.. ఆ పార్టీ కల్చరే అంత అని జనం నవ్వుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి తెరలేపాయి. ఈ కామెంట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని ఉద్దేశించి అని చర్చ జరిగింది.దీంతో పొన్నం ప్రభాకర్… మంత్రి లక్ష్మణ్‌ని ఉద్దేశించి కాదు…తన వ్యక్తిగత సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అంటూ స్పందించారు. అది అప్పటితో క్లోజ్ అవుతుందని భావించారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఈ ఎపిసోడ్ పై స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీనికి కొనసాగింపుగా అట్లూరి లక్ష్మణ్ వీడియోను విడుదల చేశారు. దళితులు అంటే పొన్నం ప్రభాకర్‌కి చులకన అంటూ కామెంట్స్ చేయడంతో ఇది పీక్స్‌కు చేరింది. అదే వీడియోలో పక్కనే ఉన్న తన సామాజిక వర్గం మంత్రి వివేక్.. కనీసం పొన్నం ప్రభాకర్ ని అడ్డుకోలేకపోయారంటూ కామెంట్ చేశారు.
కాంట్రవర్సీ ముదురడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగారు. పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్‌లతో పాటు మంత్రి శ్రీధర్ బాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు మంత్రులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. సమావేశానికి రావలసిందిగా పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ లకు పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇంతలో కాంగ్రెస్ పార్టీలోని దళిత ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిశారు. అడ్లూరి లక్ష్మణ్‌ని అవమానించేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాను ఎవరినీ, ఏమీ అనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చెప్పాల్సినదంతా పీసీసీ చీఫ్‌కు చెప్పానని.. ఏదైనా ఉంటే పార్టీ చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముందు మంత్రుల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఉపఎన్నికలో పార్టీ గెలుపుకు వ్యూహరచన చేయాల్సిన మంత్రులే ఇలా పరస్పరం గొడవకు దిగటం ఏమిటని కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అసలు మంత్రులు పొన్నం, అడ్లూరి మధ్య గతం నుంచీ పొరపొచ్చాలున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు అయిన పంచాయితీని బట్టి.. అదీ నిజమేనేమో అని జనం అనుకునే ప్రమాదం ఉంది.
మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా హుందాగా ఉండాలి. బహిరంగ వేదికలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక ప్రెస్‌మీట్ లో ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కారణాలు ఏవైనా పొన్నం అలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదనే సూచనలు వస్తున్నాయి. కనీసం వివేక్ అయినా ఖండించే ప్రయత్నం చేసినా.. ఇఫ్పుడొద్దులే తర్వాత మాట్లాడదాం అన్నా వివాదానికి అవకాశమే ఉండేది కాదు. సరే జరిగిందేదో జరిగిపోయింది. దీనిపై అంతర్గతంగా పార్టీ వేదికలపై చర్చించకుండా.. అగ్రనాయకత్వం దృష్టికి తేకుండా.. ఎవరికి వారు తెగేదాకా లాగటం, బలప్రదర్శనకు దిగే ప్రయత్నం చేయడంపై పార్టీలో గగ్గోలు రేపింది. ఇదేంటి ఇటీవల కనపడకుండా పోయిన సంస్కృతికి మళ్లీ కొత్తగా ఆజ్యం పోస్తున్నారనే చర్చ మొదలైంది. చిన్న విషయాన్ని పెద్దది చేసి.. అనవసర రచ్చ చేశారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఇక్కడ పనిగట్టుకుని ఎవర్నీ చిన్నబుచ్చాలని పార్టీ అనుకోలేదు. అందరికీ సమానంగా వాక్ స్వాతంత్ర్యం వచ్చింది. చనువిచ్చింది కదా అని చంకనెక్కినట్టుగా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మర్యాద కాదు. వ్యక్తిగత వివాదాన్ని కులపరంగా రుద్దటమే కాకుండా.. ఏకంగా పార్టీని బద్నాం చేయటానికి పూనుకోవటం చిన్న విషయం కానే కాదు. ఇలాంటి పోకడలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే.. కాంగ్రెస్సే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి తమకు అప్పగిస్తుందంటున్న ప్రతిపక్షాల మాటలు నిజమేనని జనం కూడా అనుకోవాల్సి వస్తుంది. గతంలో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నా కూడా.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం మారకపోవడం ఏమిటనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. ఇంకేం జరిగితే వీళ్లు మారతారనే విసుగు క్యాడర్లో కూడా ధ్వనిస్తోంది. ఓవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. వీటిల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. ఇలాంటి సమయంలో పాత విభేదాలు కూడా పక్కనపెట్టి గెలుపు కోసం పనిచేయాలి. కానీ కొత్తగా గొడవలు కొనితెచ్చుకోవడం ఏంటని పార్టీ పెద్దలు కూడా మంత్రులకు క్లాస్ పీకారు. కానీ ఇదేదో ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించిన సమస్య కాదని.. పార్టీలో అంతర్గతంగా గ్రూపు తగాదాలు కొనసాగుతున్నాయని, నివురు గప్పిన నిప్పులా ఉన్నవి.. అవకాశం రాగానే అదను చూసుకుని చెలరేగుతున్నాయనే వాదన లేకపోలేదు.
