స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిన తర్వాత ముందుగా మొబైల్ ఫోన్ చూసిన తర్వాతమే మంచం దిగుతున్నారు. క్షణం ఫోన్ కనబడకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఫోన్‌లోనే ఉంటున్నారు. కానీ ఫోన్ సేఫ్టీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఫోన్లో డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని కొందరు భ్రమపడుతున్నారు. కానీ అదే ఫోన్ ఐపీ ద్వారా మొత్తం సమాచారం రికవరీ చేయొచ్చు.
మనం అత్యాధునిక సాంకేతిక యుగంలో బతుకుతున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా కుదరదు. ఏ పని చేయాలన్నా ఆన్ లైన్ లో చేయాల్సిందే. ఓవైపు ఇంటర్నెట్ సాయంతో.. పనులు వేగవంతంగా జరుగుతున్నా.. డేటా చౌర్యం కూడా ఈజీగా జరిగిపోతోంది. మన స్మార్ట్ ఫోన్ నుంచి మనకు తెలియకుండానే పర్సనల్ డేటా దొంగిలిస్తున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఏవీ సేఫ్ కాదు. ఏదో మెయిల్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే.. మొత్తం డేటా అంతా సైబర్ కేటుగాళ్లకు వెళ్లిపోతుంది.ఇక పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీస్ సిస్టమ్ ల గురించి చెప్పాల్సిన పని లేదు. పర్సనల్ పరికరాల్లో ఉన్న డేటాకే దిక్కులేనప్పుడు.. ఇక పబ్లిక్ యూజ్ లో ఉన్నవాటి గురించి చెప్పేదేముంది.
మన డేటాతో ఎవరికేం ఉపయోగం. మనమేమన్నా సెలబ్రిటీలమా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో అన్నింటికంటే ఎక్కువ విలువ ఉంది డేటాకే. కోట్ల మంది డేటాను డార్క్ నెట్ లో అమ్మకుని బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారంటే నమ్మాల్సిందే. చాలా తేలికగా రోజుల వ్యవధిలో బిలియన్ డాలర్లు వచ్చిపడుతుండటంతో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొదట ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేయడం, తర్వాత డేటా లీక్ చేయడం ఓ పద్ధతి. అంత రిస్క్ కూడా ఎందుకని కేవలం ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, మెయిల్ తోనే మొత్తం డేటాను లేపేయడం మరో పద్ధతి. ఇవే కాకుండా సర్వర్ ని హ్యాక్ చేసి ఒకేసారి గంపగుత్తగా కోట్ల మంది డేటా కొట్టేసే పద్ధతులూ ఉన్నాయి. ఇవేమీ లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు డబ్బులు కొట్టి.. వారి దగ్గర ఉన్న లక్షల మంది డేటాను చౌకగా కొట్టేసే టెక్నిక్ లూ ఉన్నాయి. ఇలా పలు మార్గాల్లో డేటాను సేకరిస్తున్న కేటుగాళ్లు.. దాన్ని ఇల్లీగల్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహ శక్తులు, కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఈ డేటా కోసం కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఈ డిమాండే సైబర్ నేరగాళ్లను డేటా చోరీ చేసేలా చేస్తోంది.
దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైనట్టు ఇటీవలి సర్వేలో తేలింది. ఈ డాటాను గత 20 ఏళ్లలో 10 సందర్భాల్లో చోరీ చేశారు. డేటా చోరీ బాధిత టాప్-5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా లాంటి చోట కూడా 20.7 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైంది. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డాటా చోరీ ఎక్కువగా జరిగింది. డేటా చోరీకి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు ఏ పని చేయడానికైనా ఫోన్ వీలుగా ఉండటంతో.. ఆ ఫోన్ నుంచే డేటాను తస్కరిస్తున్నారు. హ్యాకింగ్, ట్రాకింగ్, ట్యాపింగ్, డేటా లీకేజ్.. ఇలా రకరకాల పద్ధతుల్లో మన డేటా మనకు తెలియకుండానే అవతలివారికి చేరిపోతోంది.
ఫోన్ హ్యాకైతే.. మన ఫోన్ అవతలివారి నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఇక్ ట్రాకింగ్ చేస్తే.. మన లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది. అదే ట్యాపింగ్ చేస్తే.. మనం మాట్లాడిన వివరాలన్నీ వారూ వింటారు. ఇక అంతిమంగా డేటా లీకేజ్ లో ఇక పర్సనల్ అంటూ ఏమీ మిగలదు. అంతా పబ్లిక్ అయిపోతుంది. డేటా లీకేజ్ ని సింపుల్ గా చెప్పాలంటే అతి రహస్యం బట్టబయలైనట్టే. ప్రపంచవ్యాప్తంగా డేటా సెక్యూరిటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల డేటా లీక్ చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టూ ఫాక్టర్ అథెంటికేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి దిగ్గజ సంస్థలు టూ ఫాక్టర్ అథెంటికేషన్‌కు మద్ధతిస్తున్నాయి. తద్వారా యూజర్ల డేటా సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తున్నాయి. టీ ఫాక్టర్ అథెంటిఫికేషన్ లాగిన్ ప్రక్రియకు అదనపు భద్రతను చేకూర్చుతుంది. ప్రతి ఖాతాకు దీన్ని వర్తింపజేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, కాస్త భిన్నమైన పాస్వర్డ్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు, మీ పాస్వర్ట్ను మార్చడం వంటివి అనుసరించాలని చెబుతున్నారు. తద్వారా, హాకర్లకు మీ బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా సోషల్ మీడియా అకౌంట్లకు యాక్సెస్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ హ్యాకర్లు మీ సోషల్ మీడియా ఖాతాలోకి లాగిన్ అయితే, ఇతర అకౌంట్లను కూడా యాక్సెస్ చేయగలరు. అంతేకాక పాస్‌వర్డ్‌ను కూడా మార్చగలరు. అయితే టూ ఫాక్టర్ అథెంటికేషన్ దీనికి అడ్డుకట్ట వేస్తుంది. సాధారణంగా హ్యాకర్లు ఫిషింగ్ స్కామ్, క్రెడెన్షియల్ స్టఫింగ్, బ్రూట్-ఫోర్స్ అటాక్, ఇతర పద్ధతుల ద్వారా మీ ఖాతాలోకి ప్రవేశిస్తారు. అందువల్ల, హ్యాకర్ల నుంచి మీ ఖాతాను రక్షించుకోవాలంటే టూ ఫాక్టర్ అథెంటికేషన్‌ను ప్రారంభించడం ఉత్తమం.దీని ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే మీ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది హ్యాకర్ల బారి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కేవలం ఎస్ఎంస్ మాత్రమే కాకుండా బ్యాకప్ కోడ్, టెక్స్ట్, వాయిస్ కాల్ లేదా గూగుల్ అథెంటికేటర్ యాప్ ద్వారా మీ ఖాతాకు మరింత రక్షణ కల్పించవచ్చు. అయితే, ఈ టూ ఫాక్టర్ అథెంటికేషన్‌ను కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇంకా అందుబాటులోకి తేలేదు. దీంతో గూగుల్ దీన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించడం లేదని తేలింది. దీంతో వారి డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
చాలా మందికి డేటా బ్రోకర్లు పనిచేసే రహస్య మార్కెట్ గురించి తెలియదు. వారు భారీ మొత్తంలో సున్నితమైన డేటాతో చెలగాటం ఆడుతున్నారు. ఇంటర్నెట్ ప్రతి చోటా అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై దొరుకుతుంది కదా అని వాడేస్తే మీ స్మార్ట్ ఫోన్ , ల్యాప్ టాప్ లో డేటా అంతా లూటీ అయిపోయినట్లే.
అన్ సెక్యూర్డ్ నెట్ వర్క్ లలో లాగిన్ అయితే ఇలాంటి సమస్యలే వచ్చిపడతాయని.. నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ లేదా లాగిన్ కోసం ఏదైనా క్రెడెన్షియల్ ఉండాలి అలా లేకుండా లీగల్ టెర్మ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మీ డేటా మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ప్రతి ఒక్కరూ పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అలర్ట్ గా ఉండాలి. బ్యాంకింగ్ సర్వీసులు లాంటివి ఇటువంటి వైఫైలతో లాగిన్ చేయకూడదు. పర్సనల్ బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేయొద్దు. అన్ సెక్యూర్డ్ నెట్ వర్క్ లలో సెన్సిటివ్ పర్సనల్ డేటాను అప్ లోడ్ చేసుకోవద్దు. పబ్లిక్ వైఫైలతోనే లాగిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ట్రావెలింగ్ లో ఉన్న సమయంలో మీ గ్యాడ్జెట్స్ ఆటోమేటిక్ కనెక్టివిటీ ఆఫ్ చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా పెను ప్రమాదమే. హ్యాకర్లు బ్లూటూత్ సిగ్నల్స్ ఓపెన్ గా ఉన్న డివైజ్ లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీ డివైజ్ బ్లూటూత్ కనెక్షన్ ఆఫ్ చేయడం మర్చిపోకండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సప్ చాట్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అని.. యూజర్ తప్ప మరెవరూ చూడలేరు అంటోంది. కానీ, ఇటీవల వాట్సాప్ చాట్ లీకైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే.. మెసేజ్ పంపినవారు.. మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే ఆ మెసేజ్ చూడగలరని అర్థం. వారి ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరూ ఆ మెసేజ్ చదవలేరు. కానీ బాలీవుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ల వాట్సప్ చాట్ల ఆధారంగానే వారిని విచారణకు పిలిచారు. మీతో ఉండేవారిలో ఎవరో ఒకరు మీ ఫోన్ అన్ లాక్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు అలాంటి సందర్భాల్లో చాట్స్ ఇతరులు యాక్సస్ చేసుకునే వీలుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వంటి పర్సనల్ డివైజ్ యాక్సెసింగ్ విధానం భద్రతపై చట్టాల్లో అస్పష్టత నెలకొంది. అదే అమెరికాలో లేదా ఇతర యూరప్ దేశాలలో ఫోన్‌లు, కంప్యూటర్‌లను సీజ్ చేయాలన్నా, అందులో డేటాను చెక్ చేయాలన్నా ముందుగా పోలీసులకు వారెంట్ అవసరం. ఆ తర్వాతే వాట్సాప్ చాట్ డేటాను యాక్సస్ చేసుకునేందుకు వీలుంది.
మీ ఫోన్ ఫిజికల్ యాక్సస్ అయి ఉండొచ్చు. మీకు తెలిసినవారు అన్‌లాక్ చేయమని అడిగి ఉండొచ్చు. అలా అన్‌లాక్ చేసిన తర్వాత.. అన్ని చాట్‌లు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్‌షాట్‌లను తీసుకోవచ్చు, వాటిని కాపీ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. ఫోన్ ఫిజికల్ యాక్సెస్ ఇవ్వలేదు. కానీ అది అన్‌లాక్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఫోరెన్సిక్ బృందాలు టెక్నాలజీ సాయంతో కొంతవరకు యాక్సస్ చేసుకునే వీలుంది. వాట్సాప్ చాట్‌లు ఎన్ క్రిప్టెడ్ అయి ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొన్నాళ్ల క్రితం వరకు వాట్సాప్ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో చేస్తున్న చాట్ బ్యాకప్‌లు ఎన్‌క్రిప్ట్ చేయలేదు. ఈ చాట్ బ్యాకప్‌లను కొన్ని ప్రత్యేక టూల్స్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక వాయిస్ ల కంటే మెసేజ్ లు ఇంకా ప్రమాదకరం అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మెసేజ్ టైప్ చేస్తే.. అది రికార్డ్ అవుతుంది. ఫోన్లో డిలీట్ చేసినా.. బ్యాకప్ సర్వర్ నుంచి రికవరీ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ క్లౌడ్ లో బ్యాకప్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలిసిందే.