Site icon NTV Telugu

Story Board: మోహన్ భగవత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి..?

Story Board

Story Board

Story Board: బీజేపీ సైద్ధాంతిక మూలాలు ఆరెస్సెస్ లో ఉన్నాయనే మాటను ఎవరూ కాదనలేరు. అలాగే ఆరెస్సెస్ కూడా బీజేపీని కంట్రోల్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మోడీ రాకముందు వరకు పూర్తిస్థాయిలో ఆరెస్సెస్ కనుసన్నల్లో నడిచిన బీజేపీ.. తర్వాత కాస్త స్వతంత్రించినా.. మళ్లీ ఇటీవలి కాలంలో ఆరెస్సెస్ సలహాలు తీసుకుంటోంది. ఆరెస్సెస్ ప్రధాన లక్ష్యం భారతీయ సంస్కృతి పరిరక్షణే అయినా.. అందుకోసం దేశంలో వివిధ వర్గాల్లో తన భావజాలాన్ని చొప్పించే పని చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య భారతంలో తమ భావజాల వ్యాప్తికి రాజకీయ పార్టీ అవసరమనే ఉద్దేశంతోనే జన్ సంఘ్ కు ఊపిరి పోసింది. ఆ తర్వాత జన్ సంఘే బీజేపీగా రూపు మార్చుకుంది. ఇటు బీజేపీ కూడా రాజకీయంగా ఎన్ని ఢక్కామొక్కీలు తిన్నా.. ఆరెస్సెస్ అజెండా విషయంలో రాజీ లేకుండా చూసుకుంటుంది. కాలం కలిసి రాకపోతే సైలంట్ గా ఉంటుంది తప్ప.. ఆరెస్సెస్ అజెండాకు భిన్నంగా వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. చేయదు కూడా.

రాజకీయంగా బీజేపీ విజయాల్ని చూసి ఆరెస్సెస్ సంతోషించే మాట వాస్తవం. వీలైనంత వరకు పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధానం కూడా కొంతవరకూ నిజమే. కానీ బీజేపీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా.. మూలాలు మరిచిపోయి.. సంఘ్ సిద్ధాంతాలతో సంబంధం లేని నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, వారి ప్రాధాన్యత పెరగటం ఆరెస్సెస్ ను అసంతృప్తికి గురిచేసేది. అందుకే ఎప్పటికప్పుడు బీజేపీలో జరిగే వ్యవహారాలపై ఆరెస్సెస్ నిరంతర పరిశీలన ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తుంది. చివరకు బీజేపీ పూర్తిగా ఆరెస్సెస్ కనుసన్నల్లో నడిచినప్పుడు కూడా సంఘ్.. తన సలహాలకు అనుగుణంగా పార్టీయే నిర్ణయాలు తీసుకోవాలని సూచించేది. అంతే కానీ ప్రత్యక్షంగా జోక్యానికి ఎక్కువగా ఇష్టపడేది కాదు. అసలు బీజేపీ, ఆరెస్సెస్ లింక్ గురించి ఎక్కువ మాట్లాడటానికి కూడా మొదట్లో ఇష్టపడేవారు కాదు. తాము ఏ ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టామో.. అది నెరవేరటమే ప్రధానం కానీ.. తమ పెత్తనం కాదనే దృష్టి కూడా ఉండేది. కానీ కాలక్రమంలో ఆ లక్ష్యసాధనకు దూరం జరిగేలా బీజేపీలో పరిణామాలు జరిగినప్పుడు మాత్రం ఆరెస్సెస్ పరోక్ష జోక్యం ఉండేది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పార్టీ నాయకత్వానికి సూచనలు అందేవి. అందుకే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు చెప్పిన దాంట్లో కొత్త విషయం ఏం లేదని కాషాయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివారే.. బీజేపీపై ఆరెస్సెస్ పెత్తనం చేస్తుందని భావిస్తారని అంటున్నాయి.

ఆరెస్సెస్ ఒక్క బీజేపీ విషయంలోనే కాదు.. తాను సృష్టించిన ఇతర సంస్థల విషయంలోనూ ఇదే వైఖరితో ఉంటుంది. ప్రతి విభాగం స్వతంత్రంగా పనిచేయాలి. అదే సమయంలో మూలసూత్రాలకు దూరం జరగకూడదు. ఇది ఒక్కటే ఆరెస్సెస్ షరతు. మొదట్లో బీజేపీ సమావేశాలకు ఆరెస్సెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యేవారు. పరిస్థితులు గమనించేవరు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో పార్టీలో ఆరెస్సెస్ నుంచి ఒక అబ్జర్వర్ ఉన్నారు. బీజేపీ రాజకీయ లక్ష్యాలకు, సంఘ్ మూలసూత్రాలకు సంఘర్షణ తలెత్తకుండా చూసుకోవటమే వీరి పని. ఈ ప్రయత్నం ఎక్కడైనా విఫలమైతే.. అప్పుడు నాగ్ పూర్ నుంచి పిలుపులు వస్తాయి. అగ్ర నాయకత్వానికి సలహాలు అందుతాయి. ఆ సలహాల అమలుకు కొంత కాలపరిమితి ఉంటుంది. అప్పటికే మార్పు రాకపోతే.. ఆరెస్సెస్ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి రావచ్చు. అప్పుడు తప్పనిసరిగా ఆ సలహాలు పాటించక బీజేపీకి తప్పని స్థితి ఉంటుంది.

ఇక్కడ బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి ముందు తాము సలహా ఇవ్వాలని కూడా ఆరెస్సెస్ అనుకోదు. మొదట బీజేపీకి స్వేచ్ఛ ఇచ్చి.. నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తోంది. కానీ ఆ స్వేచ్ఛ ఎక్కువై.. పరిధి దాటినప్పుడు మాత్రమే సలహాలిస్తుంది. ఈ విషయాన్నే మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పారు. పైగా ఆరెస్సెస్ నిర్ణయాలు చేస్తే ఇంత సమయం పడుతుందా అనే వ్యాఖ్య కచ్చితంగా బీజేపీకి చురకే. జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోవటానికి ఇంత ఆలస్యం ఏంటని ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మోహన్ భగవత్ చురకలు కూడా ఆ విమర్శల విషయంలో బీజేపీని అలర్ట్ చేయడమే అంటున్నారు.

బీజేపీ కూడా వీలైనంతవరకు ఆరెస్సెస్ మనసెరిగి నడుచుకునే ప్రయత్నమే చేస్తుంది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పరిధి దాటాల్సి వస్తుంది. అదీ పరిధి దాటాకే ఆ విషయం తెలుస్తుంది. ఏ సమయంలో అయినా నాగ్ పూర్ నుంచి పిలుపు వచ్చిందంటే.. అక్కడకు వెళ్లే ముందే బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఎక్కడ ఆరెస్సెస్ మనసు నొచ్చుకుని ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కొంత ప్రాథమిక కసరత్తు తర్వాతే ఆరెస్సెస్ ఆఫీస్ కు వెళ్తారు. అక్కడ ఏమైనా వివరణ అవసరమైతే ఇచ్చేసి.. అసలేం జరిగిందో చెప్పి.. మరోసారి అలా జరగకుండా చూసుకుంటామని నచ్చజెబుతారు.అవసరమైతే సమస్య పరిష్కారానిక కోఆర్డినేషన్ కమిటీ వేస్తారు. ఈ విషయం కూడా మోహన్ భగవత్ ప్రస్తావించారు. సమస్యలుంటే పరిష్కరించుకుంటామే కానీ.. తగాదా పడే ఉద్దేశం ఉండబోదని చెప్పారు.

ఇక కార్యాచరణ పరంగా చూసుకుంటే బీజేపీ, ఆరెస్సెస్ మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. అందుకే లక్ష్యం ఒకటే అయినా దారులు వేరే అనే అర్థం వచ్చేలా మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. ఇద్దరికీ లక్ష్యం విషయంలో స్పష్టత ఉంటుందని, ఏ దారిలో ప్రయాణించినా అంతిమంగా లక్ష్యం చేరటమే ప్రధానమనే అవగాహన ఉంటుందన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ, ఆరెస్సెస్ రైలు పట్టాల్లా విడివిడిగా కనిపించినా.. రెండూ కలిసి తమ లక్ష్యాల రైలును ట్రాక్ తప్పకుండా చూసుకుంటాయనే అభిప్రాయాలున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య లోతైన సమన్వయం లేకపోతే వందేళ్ల ఆరెస్సెస్, 45 ఏళ్ల బీజేపీ ప్రస్థానం ఇలా ఉండేవి కాదంటారు సంఘ్ అభిమానులు. అనుకున్న లక్ష్య సాధన కోసం ఓపికగా ఎదురుచూడటం.. క్రమం తప్పకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవటం.. వంటి లక్షణాలు రెండు సంస్థలకూ కామన్ గా ఉంటాయి. ఒక సంస్థకు అవసరమైనప్పుడు మరో సంస్థ అండగా నిలబడుతుంది. ఎవరికి ఎప్పుడు అడ్వాంటేజ్ వచ్చినా.. మరో సంస్థకు కూడా తోడ్పాటు ఇవ్వడం కనీస బాధ్యత అనే కట్టుబాటు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బీజేపీ రాజకీయంగా బలహీనప్పుుడు ఆరెస్సెస్ సంస్థాగత బలం ఉపయోగిస్తుంది. మెల్లగా అధికారంలోకి రావటానికి బాటలు వేస్తుంది. అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆరెస్సెస్ స్థితిగతులు చూసుకుంటుది. ప్రభుత్వ పరంగా సంఘ్ కు ఏమైనా ఆటంకాలుంటే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలా పరస్పర విశ్వాసం, సహకారంతో ఆరెస్సెస్, బీజేపీ మనుగడ సాగిస్తున్నాయి. మోహన్ భగవత్ సుదీర్ఘ ప్రెస్ మీట్ సారాంశం కూడా ఇదే.

Exit mobile version