Story Board: జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు. కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర సర్కారు జీఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. నిత్యావసర వస్తువులైన పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెట్రీస్ 5% స్లాబ్‌లోకి వస్తాయి. టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లు, పెట్రోల్ 1200cc వరకు, డీజిల్ 1500cc వరకు కార్లు, 350cc లోపు బైకులు 18% స్లాబ్‌లోకి వస్తాయి. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బెవరేజెస్, పెద్ద కార్లు, 350cc పైగా బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాట్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఇంతకుముందు వీటిపై 28% + సెస్ అమలులో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని ఒకే 40% స్లాబ్ లోకి తీసుకొచ్చారు.
రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు. 18% స్లాబ్‌లోనే 67% రెవెన్యూ వస్తోంది. కాగా 12% స్లాబ్ ద్వారా కేవలం 5% ఆదాయం మాత్రమే వచ్చింది. 5%, 28% స్లాబుల ద్వారా వరుసగా 7%, 11% రెవెన్యూ లభించింది. దీంతో 12% స్లాబ్ పెద్దగా ఉపయోగం లేకపోవడంతో రద్దు చేశారు. 28% స్లాబ్‌ను తొలగించి తయారీదారులను ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18%లో కలిపేసారు. అయితే ఈ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 48,000 కోట్ల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌక అవుతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం కఠిన పన్నులు అమలవుతాయి.
2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. కారు, ఫ్రిజ్, ఏసీని 28 శాతం నుంచి 18 శాతం శ్లాబ్‌కు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ శ్లాబుల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్.. సీబీఐసీ జీఎస్టీ రేటు నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం ఏడు షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
సీబీఐసీ నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్‌పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటెన్ పెన్నులు, స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ స్టేషనరీ వస్తువుల్ని 18% జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్లు, పాస్టెల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్‌ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% శ్లాబులో ఉండేవి. జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించిందని జీఎస్టీ నిపుణులు చెబుతున్నారు.
2017కు ముందు దేశంలో 17 రకాల పన్నులు ఉండేవి.. వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను.. నాలుగు శ్లాబ్‌ల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామనేది కేంద్రం చెబుతున్న మాట. . గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరింది.
జీఎస్టీ రేటు తగ్గింపులు దేశ వృద్ధి బేస్ పాయింట్లు పెంచుతాయని, ఒక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 100 బీపీఎస్ తగ్గించవచ్చునేది ఆర్థికవేత్తలు అంచనా. అయితే పన్ను తగ్గింపులో ఎంత భాగం తగ్గిన ధరల రూపంలో వినియోగదారులకు బదిలీ అవుతుందనే దానిపై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా బీమా పాలసీలపై పన్ను మినహాయింపు కల్పించారు. దీనికి సంబంధించి మినహాయింపు ప్రయోజనాలను ప్రస్తుతం, భవిష్యత్తు పాలసీదారులకు పూర్తిస్థాయిలో అందించాలని అన్ని రకాల బీమా కంపెనీలను కోరింది కేంద్రం.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ మార్పులకు సంబంధించి దేశంలో ప్రధాన రిటైలర్లు డిస్కౌంట్లను స్పష్టంగా కనిపించేలా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రిటైలర్ అసోసియేషన్‌కు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నోట్ పంపింది. రసీదులు, బిల్లులపైన జీఎస్టీ డిస్కౌంట్ టైటిల్ కింద స్పష్టంగా తగ్గింపు ఎంతనేది కనిపించేలా చూసుకోవాలని ఆదేశించింది. తగ్గింపు వివరాలు కనిపించడం ముఖ్యమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల తగ్గింపు గురించి ప్రింట్, టెలివిజన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్టర్లు, పాంప్లేట్ వంటి మార్గాలను ఉపయోగించాలని కోరింది. దీన్ని బట్టి రిటైలర్లు వచ్చే కొన్ని వారాల పాటు తమ అమ్మకాలను పెంచుకునే వ్యూహాలను అనుసరించడమే కాకుండా దుకాణాల వద్ద పన్ను సంస్కరణలు ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయో కూడా పరిశీలించాల్సి ఉంటుంది. పన్ను తగ్గింపు ప్రయోజనాలకు సంబంధించి ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో అమ్మకాల వాల్యూమ్‌లను ట్రాక్ చేయాలని, డేటా ప్రదర్శించాలని అధికారులు రిటైలర్లకు సూచించారు.
