Site icon NTV Telugu

Story Board: మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు కొత్త కళ

Story Board

Story Board

Story Board: మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు కొత్త కళ వచ్చింది. 109 దేశాల సుందరీమణులు భాగ్యనగరంలో కలియదిరిగారు. జిల్లాల్లో చారిత్రక కట్టడాలు చూసి పరవశించిపోయారు. తాము అద్భుత అనుభూతులు సొంతం చేసుకున్నామని, తమ తమ దేశాల్లో తెలంగాణ గొప్పతనం గురించి ప్రచారం చేస్తామని కూడా చాలా మంది చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం బాగుంటుందని చాలా మందికి తెలిసినా.. ఇక్కడి వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసి పులకించిపోయారు భామలు. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ గా ఉంది. మొదట్లో రాష్ట్రస్థాయికే పరిమితమైన హైదరాబాద్ ను జాతీయ సదస్సుల నిర్వహణతో.. జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలున్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ బ్రాండ్ ఖాయమైపోయిందనే అభిఫ్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నో గ్లోబల్ సమ్మిట్‌లకు.. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైదరాబాద్.. మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరోసారి తన ఆతిథ్య సత్తాను చాటింది.

మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌ మహానగరానికే పరిమితం చేయకుండా.. రామప్ప ఆలయ దర్శనం, యాదగిరిగుట్ట నారసింహుడి ఆశీర్వాదం పోటీదారులకు కలిగేలా సర్కారు షెడ్యూల్‌ను రూపొందించింది. అంతేకాదు.. భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌ పట్టు చీరల తయారీ తీరు.. ఇప్పటికీ ఆద్యంతం చిక్కుముడిగా ఉండే మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి, ప్రఖ్యాత బౌద్ధారామమైన నాగార్జునసాగర్‌, హైదరాబాద్‌కు మకుటాయమానం గా ఉన్న చార్మినార్‌.. ఆ పక్కనే అపురూపమైన గాజులకు నిలయమైన లాడ్‌బజార్‌, ఆణిముత్యాల ఆభరణాలను విక్రయించే వీధులు, అస్‌ఫజాహీల కాలం నుంచి దేశవిదేశీ ప్రతినిధులకు ఆతిథ్యమిచ్చే చౌమొహల్లా ప్యాలెస్ లను మిస్‌వరల్డ్‌ పోటీదారులకు పరిచయం చేసింది. ఈ పోటీలకు వచ్చిన వారు హైదరాబాద్‌ యాత్ర అనుభూతి గురించి తమ డైరీల్లో ప్రముఖంగా రాసుకునేలా కార్యక్రమాలను రూపొందించింది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసింది. అతిథులకు స్థానిక వంటకాల రుచి చూపించింది.

ఈ నెల 10న మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ నెల 12న నాగార్జునసాగర్ బుద్ధవనానికి ఆధ్యాత్మిక యాత్ర జరిగింది. ఈ టూర్ లో ఆసియాకు చెందిన 28 దేశాల అందగత్తెలు పాల్గొన్నారు. ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల్లో జరిగిన హెరిటేజ్ వాక్ లో సుందరీమణులు పాల్గొన్నారు. ఆ తర్వాత చౌమహల్లా ప్యాలెస్ లో డిన్నర్ చేశారు. ఈ నెల 14న 22 మంది పోటీదారులు వరంగల్‌ హెరిటేజ్‌ టూర్‌లో భాగంగా వేయి స్తంభాల గుడి, వరంగల్‌ కోటను సందర్శించారు. రామప్ప టెంపుల్‌ టూర్‌లో భాగంగా ఐరోపాకు చెందిన 35 మంది పోటీదారులు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. వీరికోసం ఇక్కడ కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ పేరిణి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ నెల 15న కరీబియన్‌ దేశాలకు చెందిన 10 మంది భామలు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించారు. హ్యాండ్లూమ్‌ ఎక్స్పీరెన్సియల్‌ టూర్‌లో భాగంగా ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది అందగత్తెలు పోచంపల్లిలోని చేనేత పరిశ్రమను సందర్శించారు ఈ నెల 16న తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న మెడికల్‌ టూరిజంను మిస్‌ వరల్ట్‌ పోటీదారులు ప్రత్యక్షంగా అనుభూతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పిల్లలమర్రి వనంలో అమెరికా గ్రూప్‌ పోటీదారులు పర్యటించారు.

ఆసియాకు చెందిన 24 మందితో కూడిన బృందం.. ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్క్‌ను సందర్శించింది. ఈ నెల 17న స్పోర్ట్స్‌ ఫినాలేలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు స్పోర్ట్స్‌ ఫైనల్స్‌లో పాలుపంచుకున్నారు. మరో బృందం రామోజీ ఫిల్మ్‌ సిటీ, ఫిల్మ్‌ స్టూడియోను సందర్శించింది. ఈ నెల 18న సేఫ్టీ టూరిజంలో భాగంగా పోటీదారులు ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను సందర్శించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయాన్నిపోటీదారులు సందర్శించారు. ట్యాంక్‌బండ్‌, నెక్లె్‌సరోడ్‌లో నిర్వహించిన సండే ఫన్‌డే కార్నివాల్‌లో పాల్గొన్నారు. ఈ నెల 20, 21 కాంటినెంటల్‌ ఫైనల్‌ జరిగింది. ఈ నెల 21 ఐరోపాకు చెందిన 35 మంది శిల్పారామంలో తెలంగాణ డ్వాక్రా బజార్‌ స్టాళ్లను సందర్శించారు. ఈ నెల 22 మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫైనల్‌లో భాగంగా శిల్పకళావేదికలో పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ నెల 23 హెడ్‌-టు-హెడ్‌ చాలెంజ్‌లో భాగంగా హోటల్‌ ట్రైడెంట్‌లో మిస్‌ వరల్డ్‌ చాలెంజ్‌ జరిగింది. ఈ నెల 24 మిస్‌ వరల్డ్‌ టాప్‌ మోడల్‌.. ఫ్యాషన్‌ ఫైనల్‌లో భాగంగా.. హోటల్‌ ట్రైడెంట్‌, లో సుందరీమణులంతా ఫ్యాషన్‌, జ్యువెలరీ షోలో పాల్గొన్నారు. అదే రోజు బ్యూటీ విత్‌ పర్పస్‌ పేరుతో హైటెక్స్‌లో విందును ఏర్పాటు చేశారు. ఈ నెల 31 సాయంత్రం 5.30 గంటలకు మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ రెడ్‌ కార్పెట్‌ వేడుక ప్రారంభమవుతుంది. రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ఫైనల్స్‌ ఉంటుంది. మిస్‌ వరల్డ్‌ విజేతను ప్రకటిస్తారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన “మల్టీమీడియా ఛాలెంజ్” పోటీల విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది.

ఈ ఛాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి నలుగురు సుందరీమణులు విజేతలుగా నిలిచారు. ఆసియా-ఓషియానియా నుంచి థాయ్‌లాండ్, యూరప్ నుంచి మాంటెనీగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా-కరేబియన్ దీవుల నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు గెలుపొందారు. ఈ విజయంతో వీరంతా ఫైనల్స్‌లో టాప్-40 జాబితాలో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఫైనల్‌కు 108 దేశాల అందాల భామలు హాజరై మొదట ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వారిలో 40 మందిని నెక్ట్స్‌ రౌండ్‌కు వెళ్తారు. ఆ తర్వాత రౌండుకు 20 మందిని ఎంపిక చేస్తారు. అనంతరం వారిలో 8 మంది షార్ట్‌లిస్ట్ అవుతారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున నిలుస్తారు. వారిని అతివల సమ కాలిక సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు చెప్పిన తీరు ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. దీంతో పోటీలో నలుగురు నిలుస్తారు. మిస్ వరల్డ్‌ అయితే ఏం చేస్తారన్న చివరి ప్రశ్నను వీరిని అడుగుతారు. ఆ నలుగురిలో బెస్ట్ ఆన్సర్‌ ఇచ్చేవారు మిస్ వరల్డ్‌గా నిలుస్తారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన మహిళకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా కిరీటాన్ని పెట్టిస్తారు. తుది పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మిస్ వరల్డ్ ఫైనల్స్ కోసం ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ ఖట్టర్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున రాజ్‌భవన్‌ లో మిస్‌వరల్డ్‌ విజేతతో పాటు.. ఆరు ఖండాల టైటిళ్లను గెలిచిన అందగత్తెలు, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ కమ్ సీఈవో జూలియా మోర్లీ.. ఇలా 8 మందికి రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ తేనీటి విందును ఇస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అడుగడుగునా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్ ను ప్రపంచానికి చాటేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటివరకూ పెద్దగా పరిచయం లేని ప్రాంతాలు, కళలు, నైపుణ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీదారులు తిరిగే ప్రదేశాలు, అనుభూతి చెందే కళల ద్వారా.. తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందనడంలో సందేహం లేదు. ఈ పోటీలు ముగిశాక హైదరాబాద్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు.. పెట్టుబడులు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్లాన్ చేసిన ప్రతి కార్యక్రమం అనుకున్నదాని కంటే బాగా జరిగిందనే సంతృప్తి వ్యక్తమౌతోంది. మిస్ వరల్డ్ పోటీదారులు కూడా ఊహించిన దాని కంటే బాగా స్పందించారని, చాలా మంది మరిన్ని వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం శుభ పరిణామమని భావిస్తున్నారు.

Exit mobile version