Story Board: ఏపీ కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతోంది. అసలు రాష్ట్రం ఎటు పోతుంది..? ఏమైపోతుందనేది అంతుచిక్కడం లేదు. గత ఐదేళ్లూ 2019 నుంచి 2024 వరకు జగన్ పాలన వేధింపులు, ప్రతీకారాలు, అరెస్టులు, జైళ్లతోనే గడిచిపోయింది. చివరకు చంద్రబాబునే అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టేదాకా వెళ్లింది. సర్కారు నుంచి కిందిస్థాయి గ్రామాల దాకా ఇదే ధోరణి కనిపించింది. దీంతో ఎక్కడ చూసినా అశాంతి రాజ్యమేలింది. ఈ అరాచకాలు వద్దనే జనం జగన్ ను ఓడించి.. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయం గమనించకుండా ఇప్పుడు కూటమి సర్కారు కూడా అదే ప్రతీకార బాటలో పయనిస్తూ.. అరెస్టులు, కేసులు, జైళ్ల మీదే దృష్టి సారిస్తోంది. మొత్తం మీద అప్పుడు వైసీపీ అయినా.. ఇప్పుడు టీడీపీ అయినా.. పాలన అంటే ప్రతీకారమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీని శరవేగంగా అభివృద్ధి పథంలో పెట్టాల్సిన ముఖ్యమైన పని పక్కనపడేసి.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కోసం దేనికైనా తెగిస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రతీకార రాజకీయం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థతి వస్తుంది. అప్పుడు ఎవరూ పెట్టుబడులకు ముందుకు రాకపోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పనతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని తేలిన తరుణంలో.. పరిశ్రమలు రాకపోతే ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు రావు. అప్పుడు చదువుకున్న యువతలో అసహనం పెరుగుతుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన రాజకీయ పార్టీలు, నేతలే ఇలా రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.
ఇప్పటికే ఏపీలో ఉన్న వనరులకు తగ్గట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందటం లేదనే వాదన ఉంది. ఇఫ్పుడు ప్రభుత్వాలు కూడా పాలన వదిలేసి.. ఎవరి ప్రతీకారాలు వారు తీర్చుకుంటూ పోతే.. ఇక ప్రజల గతి అధోగతే అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ పార్టీల పోకడతో విరక్తి చెందే ఇప్పిటికీ ఏపీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు తరలి వెళ్తోంది. వారి బాధలు చూశాక కూడా నేతలు పద్ధతి మార్చుకోవడం లేదు. రాష్ట్రంలోకి కొత్తగా ప్రతీకార సంస్కృతిని తీసుకొచ్చారు. గతంలో తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ కూడా మార్పు కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం లేని పెడ పోకడలన్నీ వచ్చి చేరుతున్నాయి. పాలన అంటే ప్రతీకారమే అన్నట్టుగా ప్రభుత్వాలు నడిపి.. రేపు రాష్ట్ర ప్రజలకు పార్టీలు ఏం సమాధానం చెబుతాయనేది ఆలోచించాల్సిన విషయం.
ప్రతి సర్కారును ఎన్నుకోవటానికి ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు, ఆకాంక్షలు ఉంటాయి. కానీ ఏపీలో అవేవీ నెరవేరకపోగా.. పగలు, ప్రతీకారాలతో నిత్యం రావణకాష్టం రగులుతూనే ఉంటోంది. ఈ ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే.. చివరకు మిగిలేదేంటి అనే ప్రశ్నలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. పద్ధతలు మారటం లేదు. ఒకరు కాకపోతే మరొకరైనా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెడతారనుకున్న జనం ఆశలు కల్లలయ్యేలా ఉన్నాయి. ఏ సర్కారు అధికారంలో ఉన్నా.. పాలన సంగతి పక్కనపెట్టి.. ప్రతీకారం మీదే ధ్యాస పెడితే… ఏపీ ఇమేజ్ ఏమౌతుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామికవేత్తలు.. పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాన్ని కొన్ని ష్యూరిటీలు అడుగుతున్నారు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు మాత్రం ప్రతీకారాల్ని పక్కనపెట్టే ఉద్దేశం లేనట్టుగా వ్యవహరించటం.. ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాల్సి ఉంది. వాటికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతాలు, రంగాలపై మరింత అధ్యయనం చేయాల్సింది పోయి.. ఆ ఊసే ఎత్తకుండా అధికారం దక్కిందే తడవుగా ప్రత్యర్థుల పని పట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రతీకార రాజకీయం కరెక్ట్ కాదనే ఏపీ ప్రజలు జగన్ ను గద్దె దించారు. అయినా సరే ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో పాలన సాగించటం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా చేస్తే.. ఇక జగన్ సర్కారుకీ, చంద్రబాబు ప్రభుత్వానికీ తేడా ఏముందనే ప్రశ్నలు వస్తున్నాయి.
గతంలో జగన్ చేసింది తప్పే. అందుకే జనం అలాంటి తీర్పు ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తప్పు ఎందుకు చేస్తున్నారనేది తేలాల్సి ఉంది. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారొచ్చు. ప్రజలు గతంలో జగన్ గురించి అనుకున్నట్టే.. రేపు చంద్రబాబు గురించి అనుకోవచ్చు. అప్పుడు ఏమౌతుంది..?రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరం సాగాలే కానీ.. ప్రతీకారం నిరంతర చైతన్య స్రవంతిలా ప్రవహించాల్సిన పని లేదు. ఇలాంటి పగలు, ప్రతీకారాలను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తే.. ఇక రాష్ట్రం ఎటుపోతుంది.. ఏమైపోతుందనేది నేతలకే తెలియాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు.. భవిష్యత్తులో ఇంకేం చేస్తాయో అనేది ఊహించడానికే భయమేస్తోంది.
ప్రస్తుతం పోటీయుగం నడుస్తోంది. పెట్టుబడుల కోసం పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ రాష్ట్రాల్ని తట్టుకుని పెట్టుబడులు ఏపీకి తెచ్చుకోవాలంటే.. అసాధారణంగా కృషి చేయాల్సి ఉంది. కానీ గత జగన్ సర్కారు కానీ.. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎంతసేపూ ప్రత్యర్థి వర్గంలో ఎవర్ని ఇబ్బందిపెడదామా..? ఎవర్ని అరెస్ట్ చేద్దామా..? అనే ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడే పాలన దారి తప్పుతోంది. ఏపీకి నిధుల సమస్య ఉన్న మాట వాస్తవం. అలాంటి చోట సంపద పెంచాలంటే కొత్త పెట్టుబడులు ఆహ్వానించటమే సులువైన మార్గం. అప్పుడు యువతకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. వారి కుటుంబాల వినియోగ శక్తి పెరుగుతుంది. ఆటోమేటిగ్గా పన్నుల ఆదాయం పెరుగుతుంది. అప్పుడు రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగందుకుంటుంది. ఏపీలో సంపద ఎలా పెరగాలో ఏ ఆర్థికవేత్తోనో కాదు.. సామాన్యుడిని అడిగినా కూడా చెప్పేది ఇదే. మరి ప్రభుత్వాలు ఎందుకు ఆ దిశగా పనిచేయకుండా.. పనికిమాలిన ప్రతీకారంపై మోజు పడుతున్నాయో చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రభుత్వం నడపటం ప్రజలిచ్చిన బాధ్యత. రాష్ట్రాన్ని బాగుచేయమని అధికారం ఇచ్చారే కానీ.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కోసం వాడుకోమని కాదు. ఈ విషయాన్ని రెండు పార్టీలూ పట్టించుకోవడం లేదు. ఎవరికి ఛాన్స్ వచ్చినప్పుడు వారు కసి తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రమంతా రెండు వర్గాలు తప్పనిసరిగా విడిపోవాల్సిన దుస్థితి. ఇలా రాష్ట్రం రెండు వర్గాలుగా విడిపోయిన చోట అశాంతే కానీ.. సామరస్య వాతావరణం ఎలా ఉంటుందనేది అసలు సిసలు ప్రశ్న. ఇలాంటి వాతావరణం ఉంటే..ఓ సర్కారు ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమపై మరో సర్కారు కక్ష కడుతుంది. గతంలో ఇచ్చిన రాయితీలు ఎత్తేస్తుంది. ఏదోరకంగా ఇబ్బంది పెడుతుంది. ఈ వైఖరి తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు భయపడతారు. ఒక్కసారి ఏపీ గురించి నెగటివ్ ఇమేజ్ వచ్చిందంటే.. పరిశ్రమల్ని ఆకర్షించటం అంత తేలిక కాదు. ఈ విషయం తెలిసీ పార్టీలు పరస్పర ప్రతీకారాల రొచ్చులో పడుతున్నాయి.