భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మున్నెన్నడూ చూడని ఒక అరుదైన మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఏడు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక కాలం ఎన్నికైన ప్రధాని రికార్డును ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ బద్దలు కొట్టబోతున్నారు. 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చి, సందిగ్ధ రాజకీయ పరిస్థితులను దాటుకుంటూ సగర్వంగా 4,399 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. తద్వారా దేశ రాజకీయాల్లో ఒకే ఒక్కడుగా కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.
భారత రాజకీయాల్లో జూన్ 10, 2026 ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోనుంది. ఆ రోజుతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలు అందించిన నేరుగా ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 12 ఏళ్ల 14 రోజుల రికార్డును ప్రధాని మోడీ అధిగమించబోతున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో విజయమే ఏ పార్టీ అయినా.. ఏ నేత సామర్థ్యానికైనా గీటురాయి. అందుకే గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ నానా తిప్పలు పడతాయి. రాష్ట్రాల్లో విజయం సాధించటానికే అనేక ఢక్కామొక్కీలు తినాలి. ఇక దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఆషామాషీ విషయం కానే కాదు. ఒక్కసారి ఎలాగోలా గెలిచినా.. వరుసగా రెండోసారి గెలవడం అంత తేలిక కాదు. అలాంటిది వరుసగా మూడోసారి కూడా జయకేతనం ఎగరవేయటమే కాకుండా.. పుష్కరకాలంగా ప్రధానిగా కొనసాగిన తర్వాత కూడా.. ఇప్పటికీ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న నేతగా ఉన్న చాలా అరుదనే చెప్పాలి. ఈ రేర్ ఫీట్ సాధించారు కాబట్టే.. ప్రధాని మోడీ.. ఇన్నాళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పలు రికార్డులను వరుసగా బద్దలు కొడుతున్నారు. కొన్నాళ్ల క్రితమే అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించిన మోడీ.. ఇప్పుడు అత్యధిక కాలం పదవిలో ఉన్న ఎన్నికైన ప్రధానిగా కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఆమాటకొస్తే కాంగ్రెసేతర ప్రధానుల రికార్డులన్నీ తన రెండో టర్మ్‌లోనే బద్దలు కొట్టిన మోడీ.. గతేడాది కాంగ్రెస్ ప్రధానుల రికార్డులు బద్దలు కొట్టే పని మొదలు పెట్టారు. మునుపటి ఏడాది ప్రధానిగా ఇందిర రికార్డు బ్రేక్ చేసిన మోడీ.. ఇప్పుడు నవ భారత నిర్మాత నెహ్రూ రికార్డును అధిగమించటానికి సిద్ధంగా ఉన్నారు.
సాంకేతికంగా చూస్తే నెహ్రూ మొత్తం ప్రధానిగా ఉన్న కాలం మోడీ కంటే కచ్చితంగా ఎక్కువే. కానీ నెహ్రూ మొదటిసారి 1947లో మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా సెలెక్ట్ అయ్యారు తప్ప నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక కాలేదు. కానీ, 2014 మే 26న మొదటిసారి నేరుగా ప్రజా బ్యాలెట్ ద్వారా ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహించిన నరేంద్ర మోడీ, నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ప్రజామోదంతోనే ఈ రికార్డును సొంతం చేసుకుంటున్నారు.
దేశ మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అంతకంటే ముందు 1947 ఆగస్టు 15 నుండి జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. అది రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం కాదు. ఆ రకంగా చూస్తే నెహ్రూ నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రధానిగా కొనసాగిన నికర కాలం 12 ఏళ్ల 14 రోజులు మాత్రమే. నరేంద్ర మోదీ 2014 మే లో తొలిసారి, ఆ తర్వాత వరుస విజయాలతో నేరుగా ప్రజామోదం పొందుతూ ఈ రికార్డును బద్దలు కొడుతున్నారు. మోదీ సాధించిన ఈ ఘనతకు ఆయన నాయకత్వం, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న తిరుగులేని ప్రజాదరణే ప్రధాన కారణం.
మోడీ హయాంలో దేశం దశాబ్దాల నాటి సంకీర్ణ రాజకీయాల అస్థిరత నుంచి బయటపడి పటిష్టమైన రాజకీయ సుస్థిరత వైపు అడుగులు వేసింది. ఈ సుస్థిరత వల్లే జీఎస్టీ లాంటి క్లిష్టమైన పన్ను సంస్కరణలు, డిజిటల్ ఇండియా విప్లవం, బ్యాంకింగ్ రంగ ప్రక్షాళన వంటి సంచలన నిర్ణయాలు సాధ్యమయ్యాయి. జాతీయ భద్రత విషయంలో రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తూ ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలతో దేశ అంతర్గత రాజకీయ స్వరూపాన్ని మోడీ మార్చివేశారు.
దేశ రాజకీయాల్లో రాణించడం, సమర్థ నాయకత్వం-సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆషామాషీకాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రధానిగా జవహార్లాల్ నెహ్రూది ఇన్నాళ్లుగా చెక్కుచెదరని చారిత్రక రికార్డ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేశానికి ప్రధాన మంత్రిగా ప్రాతినిథ్యం వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 15 మంది ప్రధాన మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీ తరఫున నరేంద్రమోడీ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా అరుదైన రికార్డును కొన్నేళ్ల క్రితమే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నెహ్రూ రికార్డుకు గురిపెట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఓ అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది.
2014లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ..పాత రికార్డుల పని పడుతున్నారు.దేశంలో రాష్ట్రప్రభుత్వ అధినేతగా.. దేశాధినేతగా నరేంద్రమోడీది ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి మంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. సమర్థ నాయకత్వం..సుస్థిర పాలనతో భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రభుత్వ పాలనలో వివిధ రికార్డుల్ని బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డులను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన భారత తొలి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీది ప్రత్యేక రికార్డు. ఇపుడు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. 2014 మే 26న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆ తర్వాత, రెండు పూర్తి పదవీకాలాలు పూర్తి చేసి, వరుసగా మూడోసారి తిరిగి ప్రధానమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.
బారత ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పని చేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, కాంగ్రెస్ నేత నెహ్రూ రికార్డును ఈ నెల 10న అధిగమించబోతున్నారు.
2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ.. 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్ర పక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఎలా ఏర్పాటైనా.. ప్రభుత్వాధినేతగా మోడీ పేరు కాకుండా మరో ప్రత్యామ్నాయం గురించి ఎవరూ ఆలోచించకపోవడం.. ఆయన నాయకత్వ పటిమకు అద్దం పట్టింది.
కాకపోతే ప్రధానిగా మోడీ పాలానాకాలంపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఈ పుష్కరాన్ని ప్రగతిశీలకంగా పేర్కొంటుంటే.. మరికొందరు కొంత నిరంకుశ వైఖరి లేకపోలేదనే భావనతో ఉన్నారు. అయితే ఎన్ని రికార్డులు సాధించినా.. ఎంత ఘనత వహించిన నేత అయినా.. ఆయన పాలనపై కచ్చితంగా రెండో అభిప్రాయం కూడా ఉంటుంది. అంతమాత్రాన ఆ నేత సాధించిన ఘనతలు చిన్నవి అయిపోవనేది చరిత్ర చెప్పే సత్యం. ఇప్పుడు నెహ్రూ, ఇందిర నిర్ణయాల్ని బీజేపీ తప్పుబడుతున్నట్టే.. రేపొద్దున ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాలను కూడా వేరొకరు తప్పుబట్టొచ్చు. కానీ కేవలం రాజకీయ విమర్శలు..ఏ నేత ఘనతలనూ చిన్నవి చేయలేవు. దేశ రాజకీయ చరిత్రలో తిరుగులేని నేతలుగా వారి పేరును చెడగొట్టలేవు.
మోడీ నెహ్రూ రికార్డును అధిగమించబోతున్న తరుమంలో.. నాటి నేటి పరిస్థితుల్ని బేరీజు వేస్తే.. చాలా తేడా కనిపిస్తోంది. దేశ జనాభా దగ్గర్నుంచీ రాజకీయ చైతన్యం వరకు ఎంతో మార్పొచ్చింది. అప్పట్లో నెహ్రూ ఎదుర్కున్న సవాళ్లకు.. ఇప్పుడు మోడీ చూస్తున్న సమస్యలకు పొంతనే లేదు.
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి దేశ జనాభా దాదాపు 34 కోట్లు. కానీ, మోడీ 2014లో పదవి చేపట్టే సమయానికి దేశ జనాభా 131 కోట్లు. ప్రస్తుతం 146 కోట్లు అని అంచనా. ఇన్నేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీల భాగస్వామ్యం కూడా పెరిగింది. దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951-52లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సమయానికి దేశంలో 464 పార్టీలు పోటీచేయగా, 2024 ఎన్నికల సమయానికి 744 పార్టీలు పోటీ చేశాయి. దేశ తొలి ఎన్నికల సమయంలో 17 కోట్ల మంది ఓటు వేయగా, 2014 నాటికి దాదాపు 84 కోట్ల మంది ఓటు వేశారు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్ ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. అప్పట్లో 489 లోక్‌సభ స్థానాలుంటే అందులో 364 సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురుకాలేదు. ఆయన సెక్యులర్ ఐక్యత సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు. అత్యంత తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోడీ ఎదిగారు. గుజరాత్ సీఎంగా వరుసగా మూడుసార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తెచ్చిపెట్టారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంతో మోడీ దేశ రాజకీయాలను మార్చేశారు.
తొలి ప్రధానిగా నెహ్రూపై రాజకీయ బాధ్యతలకు మించిన పని పడింది. అదే స్వతంత్ర భారతాన్ని పటిష్ఠమైన పునాదులతో పదిలంగా నిర్మించడం.. అంతేకాదు పేదరికంలో మగ్గిపోతున్న, శతాబ్దాల బానిసత్వంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన జాతిని సగర్వంగా తలెత్తుకు నిలిపేలా చేయడం. ఇవి మరే ప్రధానికీ ఎప్పుడూ ఎదురుకాని కఠిన సవాళ్లు అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని సమర్థంగా నిభాయించిన నెహ్రూ.. దేశంపై చెరిగిపోలేని ముద్ర వేశారు. అంతకుముందు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నెహ్రూ.. ఆ తర్వాత స్వతంత్ర భారత తొలి ప్రధానిగా.. అటు స్వయంత్ర సమరయోధుల ఆశయ సాధనకు, ఇటు దేశ ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ.. తర్వాత వచ్చిన ప్రధానులకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం మోడీకి కూడా కొన్ని సవాళ్లున్నాయి. రాజకీయ సవాళ్లతో పాటు ప్రధానిగా.. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని లాఘవంగా నడిపించాల్సిన నేర్పు అవసరమౌతోంది. దేశంలో రాజకీయ పునరేకీకరణ సాధ్యం చేసిన మోడీ.. ప్రధానిగానూ.. తనకంటే ముందు పని చేసిన వారి వేసిన బాటను మరింత పటిష్ఠం చేసుకుంటూ వస్తున్నారు. ఎలాంటి పరిస్థితులైనా దేశమే ముందు అని చెబుతున్నారు. పనిలోపనిగా ప్రజాస్వామ్య భారత్‌కు తొలి నుంచీ ఉన్న పునాదుల్నీ, మూల సూత్రాల్నీ విస్మరించకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానం, దౌత్యం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా నెహ్రూని విమర్శించినా.. తొలి ప్రధాని సెట్ చేసిన బెంచ్ మార్కుల్ని పాలనా పరంగా గౌరవిస్తున్నారనడంలో సందేహం లేదు.
ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ ప్రజల్ని మెప్పిస్తేనే అధికార పీఠం దక్కుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప అనుకుంటున్న తరుణంలో.. దశాబ్దాల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగటం, అందులోనూ సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా ఉండటం చిన్న విషయం కానే కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయపథంలో కొనసాగాలంటే.. ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు కచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఎన్నికైన ప్రధానిని చేయబోతున్నాయి. అసలు మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. మోడీ అధికారంలో కొనసాగుతూ వచ్చారు. నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వరుసగా ఆరు ఎన్నికల్లో అంటే మూడు సార్లు అసెంబ్లీ, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో.. ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవీ రాజ్‌ను, బుజ్జగింపు రాజకీయాలకు.. బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోడీ రేకెత్తించలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు.. అభివృద్ధి రాజకీయాలకు మధ్య బ్యాలెన్స్ తీసుకురాగలిగారు. మోడీ బ్రాండ్ మేనేజ్ మెంట్ లోనే సక్సెస్ సీక్రెట్ ఉందంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ సీఎం అయినప్పట్నుంచీ ఇప్పటిదాకా.. ప్రతి ఐదేళ్లకు మోడీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. గుజరాత్ సీఎం అయ్యేనాటికి మోడీకి అసలు ఇమేజే లేదు. ఆయన కేవలం ఆరెస్సెస్ ప్రచారక్ మాత్రమే. కానీ 2002లో హిందూ హృదయ సామ్రాట్ అయ్యారు. దీంతో ఆరెస్సెస్ ప్రచారక్ అనే స్థాయి దాటేసి.. చాలా పెద్ద హిందుత్వ వాదిగా అవతరించారు. మళ్లీ 2007 వచ్చేసరికి మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన సమర్థ పాలకుడిగా బ్రాండ్ సృష్టించారు. ఈ బ్రాండే మరింత పెరిగి గుజరాత్ మోడల్ గా దేశమంతా ప్రచారమైంది. ఈ గుజరాత్ మోడల్ ప్రభావం ఎంతగా ఉందంటే.. అభివృద్ధికి గుజరాత్ ను పర్యాయపదంగా మార్చిన మోడీ ప్రధాని అయితే.. దేశం కూడా కచ్చితంగా మారుతుందని మెజార్టీ ప్రజలు నమ్మారు. అదే మోడీ 2019 ఎన్నికల నాటికి.. దేశాన్ని గర్వపడేలా చేసిన నేతగా రూపాంతరం చెందారు. తర్వాత 2024 ఎన్నికల సమయంలో రాముడ్ని అయోధ్యకు తెచ్చిన నేతగా బ్రాండ్ సృష్టించుకున్నారు. ఇలా ప్రతి దశలోనూ విపక్షం పోటీ ఇవ్వలేని స్థాయిలో బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటూ విజయప్రస్థానం కొనసాగిస్తున్నారు మోడీ. రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా మోడీ సరికొత్త బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకుంటూ వచ్చారు. హిందూ హృదయ సామ్రాట్ అనేది గుజరాత్ వరకు సరిపోయింది. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టగానే.. దేశాన్ని మార్చగల నేతగా అవతరించారు. క్రమంగా వికాస్ పురుష్ గా, విశ్వగురువుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ దృక్పథం కార్పొరేట్లను కూడా మెప్పించింది. సుస్థిర సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులకు రెడ్ కార్పెట్, అవినీతికి చెక్ లాంటివి అందరికీ నచ్చాయి.
అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి అనుకున్నారంటే.. ఆరు నూరైనా ఆ పనైందాకా నిద్రపోరు మోడీ. అలాగే మోడీ పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటులేదు. ఎంత కష్టమైనా పడి అనుకున్నది సాధించాలనే తపనతో పనిచేస్తారు. తన అంకితభావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ.. వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకూ అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు.. ఏకంగా రెండుసార్లు సాధ్యం చేశారు మోడీ. అంతేకాదు వరుసగా మూడోసారి కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారీ.. దిమ్మతిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది.
ఎప్పుడూ గత చరిత్రను గుర్తుచేసుకుంటూ.. పాత ఘనతలను తలుచుకుంటూ పొంగిపోకపోవడం.. మోడీ దగ్గరున్న మరో ప్రత్యేక లక్షణం. ఎంత పెద్ద విజయం సాధించినా.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా.. వాట్ నెక్స్ట్ అని ఆలోచించడమే మోడీకి తెలుసు. ఏ పరిస్థితుల్లో అయినా విజయం సాధిస్తూనే ఉండాలని.. తనతో పాటు తన పార్టీని కూడా విజయపథంలో నడపాలనేది మోడీ సక్సెస్ సీక్రెట్ కావచ్చని అంచనా. అలాగని మోడీకి మైనస్‌లు లేవని కాదు. మనిషన్నాక ఎవరికైనా బలాలతో పాటు బలహీనతలూ ఉంటాయి. కానీ బలహీనతల్ని కూడా క్రమంగా బలాలుగా మార్చుకోవడం ఎలాగో మోడీ స్వీయ అనుభవంతో నేర్చుకున్నారు. అందుకోసం సరికొత్త వ్యూహాల అమలుకు, వినూత్న ఆలోచనలు చేయటానికి ఆయన ఎప్పుడూ వెనుకాడరని సహచరులు చెబుతుంటారు.
మోడీ సుదీర్ఘ అధికార జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషీగా రాలేదు. అవినీతి కనిపించని పాలన, జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు.. ఇలా మోడీ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి.
దేశంలో కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి.. మోడీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలూ అర్రులు చాస్తున్నాయంటే.. దానికి మోడీ మ్యాజిక్కే కారణం.కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ.. ఇప్పుడు పార్టీలో సర్వంసహా ఆధిపత్యాన్ని సంపాదించారు. మరే నేతకూ సాధ్యం కాని రీతిలో కొంతవరకు వ్యక్తిపూజ సంస్కృతిని కూడా తీసుకొచ్చారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే బీజేపీలో చేరాలంటే ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే నిబంధనలకు నీళ్లొదిలారు. ఎవరైనా చేరొచ్చని, బీజేపీ కూడా మిగతా పార్టీల్లాంటిదేనని లిబరల్ లుక్ ఇచ్చారు. బీజేపీ అంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, అసలు రాజకీయాలపై ఇంట్రస్ట్ లేని వాళ్లు కూడా మోడీని చూసి పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది.
దేశంలో రాజకీయం చేయడం ఒక ఎత్తైతే.. ఎన్నికల రాజకీయం మరో ఎత్తు. చాలా మంది నేతలకు ఈ సూక్ష్మం తెలియకే రాజకీయ తెరపై కొంతకాలం వెలిగి తెరమరుగైపోతున్నారు. కానీ మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాన్ని పూర్తిస్థాయిలో ఔపోసన పట్టారు. అసలు ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగ అని ప్రకటించిన తొలి అగ్రనేత మోడీనే అంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా నేతల్లా ఎన్నికలప్పుడే వాటి గురించి ఆలోచించే నేత కాదు మోడీ. అనుక్షణం ఎన్నికల చుట్టే ఆయన ఆలోచనలు తిరుగుతాయి. ప్రధానిగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే చాలనుకునే వ్యక్తి కూడా కాదు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం దక్కింది కొన్నాళ్లు రిలాక్స్ అవుదాం అని కూడా మోడీ ఆలోచించరు. ఎప్పటికప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించే కాకుండా.. జరగబోయే ఎన్నికల గురించి కూడా ఆలోచించటం ఆయన నైజం.
అంతకుముందు ఎన్నికలొస్తే చాలు అన్ని పార్టీల మాదిరే బీజేపీ కూడా టెన్షన్ పడేది. పైస్థాయి నేతలకు తగ్గట్టుగానే కిందిస్థాయిలో కార్యకర్తలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారు. కానీ మోడీ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మిగతా పార్టీలకు భిన్నంగా ఎన్నికలు వస్తే బీజేపీ మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. పై స్థాయి నుంచి కిందిస్థాయి సరికొత్త వ్యూహరచన కనిపిస్తోంది. దీనికి మోడీ ఇచ్చిన స్ఫూర్తే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్ని పండగలా సెలబ్రేట్ చేసుకుని.. ప్రజల ఆశీర్వాదం తీసుకునే అద్భుత అవకాశంగా చూడాలనే మోడీ సరికొత్త థియరీ.. ఎన్నికల విషయంలో బీజేపీ దృక్పథాన్నే మొత్తంగా మార్చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీకి ఎప్పుడూ ఊహించని ఫలితాలు చాలా అలవోకగా వస్తున్నాయి. కొన్నిసార్లు బీజేపీ సాధిస్తున్న ఫలితాల్ని చూసి.. ప్రత్యర్థులు కూడా ఏదో జరిగిందని అనుమానించే పరిస్థితి. కొందరు ప్రత్యర్థులు బీజేపీ గెలుపు సూత్రాల్ని కొంతవరకు అర్థం చేసుకున్నా.. ఇంతవరకూ ఎవరూ పూర్తిస్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ఎన్నికల పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయారు. ఎన్నికల విషయంలో మోడీ పనితీరు, ఆలోచన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పటానికి ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని పరిశీలించాల్సిన పని లేదు. గత రెండేళ్ల కాలంలో ఆయన వ్యవహారశైలి చూస్తే సరిపోతుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్ని ప్రామాణికంగా తీసుకుంటే.. ఆ ఎన్నికల్లో మిత్రులతో కలిసి మోడీ విజయం సాధించారు. హ్యాట్రిక్ పీఎం అనే ట్యాగ్ వచ్చినా.. ఆయన ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలో వచ్చిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు ముందు నుంచే వ్యూహరచన చేశారు. ఎన్నికలు రాగానే ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. అనుకున్న ఫలితం సాధించారు. అక్కడితో ఆగితే ఆయన మోడీ ఎందుకవుతారు. అసలు ఎన్ని విజయాలు సాధించినా తృప్తి పడటం మోడీకి ఇష్టం ఉండదు. రాజకీయ నేతగా ఒక్క గెలుపుతోనో.. కొన్ని విజయాలతోనే సంతృప్తి చెందితే.. ఇక భవిష్యత్తు ఉండదనేది ఆయనకు ఆయనగా పెట్టుకున్న రాజకీయ సూత్రం. దేశంలోనే అత్యంత విజయవంతమైన నేతగా ఉన్నా కూడా మోడీ తాను పెట్టుకున్న సూత్రాల విషయంలో రాజీ పడరు. ఓవైపు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే.. మరోవైపు వ్యక్తిగతంగా తన రాజకీయ సూత్రాల్ని కూడా మేళవించి ఎన్నికల్లో ప్రయోగించటం మోడీకి అలవాటు.
ఎన్నికల ప్రచారం విషయంలో మోడీకి విసుగు లేదు. అలుపు రాదు. తాను ప్రచారం చేసే రాష్ట్రంలో బీజేపీ గెలుపు అవకాశాలు, పార్టీ అస్తిత్వం.. ఇవేవీ ఆయనసలు పట్టించుకోరు. ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా బీజేపీ జెండా ఎగిరేలా చేయటానికి తనకు చేతనైనంత పని చేయాలనే ఏకైక లక్ష్యంతో మోడీ పనిచేస్తారు. ఎన్నికల ప్రచారం అంటే మూస పద్ధతుల్లో కాకుండా.. రాష్ట్రాన్ని బట్టి.. అక్కడి ప్రజల ఆలోచన తీరును బట్టి.. శైలి మార్చుకోవాలని ఆయన సూచిస్తారు. స్వయంగా పాటిస్తారు కూడా. బీజేపీ ఎంత ప్రచారం చేసినా.. దక్షిణాదిలో అనుకున్న ఫలితాలు రావడం లేదన్న ఆ పార్టీ నేతల మాటల్ని ఆయన లైట్ తీస్కుంటారు. గెలిచేదాకా ప్రచారం చేస్తూనే ఉండాలంటారు. ఆ పట్టుదలతోనే గతంలో బీజేపీ గెలవని ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో గెలిచిందనేది మోడీ నమ్మకం. ఇప్పటివరకూ కాషాయ పార్టీ ఖాతా తెరవని రాష్ట్రాల్లోనూ ఇదే సూత్రం అమలుచేయాలనేది మోడీ వ్యూహం. ఇక్కడ కేవలం వ్యూహరచన చేయటమే కాదు.. ఆ వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేయడంలోనూ ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న మోడీ.. ఆ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూనే.. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లోనూ ప్రచారానికి వెళ్లారు. అలా చూసుకుంటే.. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ అందరికంటే ముందుంటారని చెప్పాలి.
మోడీ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగానే ఉంటుంది. ఏదో ప్రచారం చేశామంటే చేశాం.. అంతటితో నా పనైపోయిందనుకునే సగటు నేత కాదు మోడీ. తన ప్రచారానికి ఎంత ఫలితం వచ్చిందో.. తనకు తానుగా బేరీజు వేసుకుంటారు. పార్టీలో తనను అడిగేవారు ఎవరూ లేకపోయినా.. ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేలా పనిచేయాలనుకుంటారు మోడీ. ఈ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తారు కాబట్టి.. మోడీ రోడ్‌షోలు, సభలు.. చాలావరకు విజయవంతమౌతాయి. దేశంలో ఎక్కువ మంది జనం మోడీతో నేరుగా కనెక్టవుతున్నారు. భిన్నాభిప్రాయాలున్నా.. భిన్నమైన రాజకీయ పార్టీల సానుభూతిపరులుగా ఉన్నా..ఏ సందర్భంలో అయినా మోడీతో కనెక్ట్ అవుతున్నారు. మార్కెటింగ్ లో కీలకంగా భావించే పబ్లిక్ రిలేషన్ అనే పాయింట్ ను మోడీ ప్రభావశీలంగా ఉపయోగిస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. మెజార్టీ ప్రజలతో మోడీ నేరుగా సంబంధం పెట్టుకున్నారు. మోడీ మన మనిషి అని చాలా మంది అనుకునేలా చేసుకుంటున్నారు. జనంతో మోడీకి ఉన్న ఈ కనెక్షన్ సిద్ధాంతాలు, భావజాలాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తోందని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ బలమైన బంధమే మోడీని విజేతగా నిలబెడుతోంది. అన్నింటికీ మించి అత్యంత సాధారణ జీవితం నుంచి.. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన మోడీ ప్రస్థానంపై దేశ ప్రజలందరికీ గౌరవం ఉండటం కూడా ఆయనకు కలిసొస్తోంది.

