NTV Telugu Site icon

బూతులు మాట్లాడితేనే నేతలవుతారా.? బూతు రాజకీయాలకు అడ్డుకట్ట పడేదెలా..?

Ambati

Ambati

బూతులు మాట్లాడితేనే నేతలవుతారా?అధినేతల మెప్పుకోసం అంతగా దిగజారాలా?తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు ఇలా ఎందుకు తయారైంది?రేపటి తరానికి ఇవాళ లీడర్లు ఏం మెసేజ్‌ ఇస్తున్నారు? భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలు సమాజానికి ఏం మేలు చేస్తాయి?చట్ట సభల్లో మాటలు అదుపు తప్పితే జనం నోట మంచిమాటలెలా వస్తాయి?

అడ్డూ అదుపు లేకుండా పోతోంది.ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్‌ చేస్తున్నారో సోయి లేకుండా పోతోంది. ఎలాపడితే అలా నోరుజారుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు.. ఎంత మాట అయినా అనొచ్చనుకుంటున్నారు. విమర్శలు… ప్రతివిమర్శలు రాజకీయాల్లో పాత సంప్రదాయంగా మారింది. తిట్లు, బూతులు, శాపనా ర్థాలు కొత్త ట్రెండ్ గా మారింది. రాజకీయాల్లో విలువలు దిగజారాయో, నేతలకు అసహనం పెరిగిందో తెలియని పరిస్థితి.

విమర్శలు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో సహజం..కానీ, మన పొలిటీషియన్లు ఆ స్థాయి నుండి ఎప్పుడో దాటిపోయారు..
బూతే మంత్రం, బూతే లోకంగా మారిపోయారు..తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు చూస్తే వీళ్లా మన పొలిటీషియన్లు అనిసించకమానదు..

సింపుల్‌ గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో బూతు రాజకీయం ఎక్కువైపోయింది.అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేదు..అన్ని పార్టీల నేతలూ.. బూతు పురాణంలో పోటీపడుతున్నారు.ఒకర్ని మించి ఒకరు రెచ్చిపోతున్నారు.
ప్రజలు వింటున్నారు.. ఏమనుకుంటారో అనే స్పృహలేకుండా చెలరేగిపోతున్నారు. ఏమైనా అంటారు..ఎంతకైనా దిగజారతారు..ఎవర్నైనా తూలనాడుతారు..నోటికి అడ్డూ అదుపు లేదు.. మాటమీద ఎలాంటి నియంత్రణా లేదు..

ఒకప్పుడు బూతులుగా భావించేవన్నీ ఇప్పుడు వాడుకపదాలుగా మారిపోతున్నాయి..అనడానికి, వినటానికి సిగ్గుపడే మాటలన్నీ ఇప్పుడు అలవోకగా పలికేస్తున్నారు..ఏ పొలిటికల్‌ స్పీచ్‌ చూసినా ఇదే తీరు.ఏ ప్రెస్‌ మీట్‌ చూసినా ఇదే కత..ఎవరి ట్విట్టర్‌ ఓపెన్‌ చేసినా ఇదే గోల..నువ్వొకటంటే నేను వందంటా అని బహిరంగంగానే చెబుతున్నారు.
అగ్రనేతలు కూడా ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలని నేతల్ని ప్రోత్సహిస్తున్నారనే వాదనల మధ్య మూడు బూతులు, ఆరు తిట్లుగా సాగుతోంది రాజకీయం.

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ మరింత ఊపందుకుంది. మొన్నటి వరకు మాటల రూపంలో ఒకర్నొకరు తిట్టుకున్న నేతలు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మంత్రి అంబటి రాంబాబు ల మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది.

ఇటీవల కాలంలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్‌ చేయటానికి గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తున్న టీడీపీ.. ఇప్పుడు తాజాగా మరో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ట్విట్టర్‌ వేదికగా, రాంబాబు ఏదేదో చేశారనే ప్రచారం అయ్యన్న చేస్తోంటే.. గతంలో తీవ్ర వివాదానికి దారి తీసిన కామెంట్లనే మరోసారి చేస్తున్నారు మంత్రి అంబటి.

మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి .. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ట్వీట్ వార్ తాస్థాయికి చేరింది.. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వెళ్ళింది.

ఓ యూ ట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ తో అంబటి వాట్సాప్‌ లో మాట్లాడిందంతా బయటపెడతానన్న అయ్యన్నపాత్రుడు… ఆ యాంకర్‌ సీఎంని కూడా కలవనుందని, అంబటి చీటీ చినిగినట్టే అని ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కూడా అదే స్థాయిలో రియాక్ట్‌ అవుతున్న పరిస్థితి. తన విషయంలో ట్విట్టర్‌ వేదికగా కామెంట్లు చేస్తున్న అయ్యన్నను ప్రత్యక్షంగా.. పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. ఏ విషయం గురించైతే అయ్యన్నపాత్రుడు ప్రస్తావిస్తున్నారో.. ఆ విషయాన్ని ఖండించడం వంటివి చేయకున్నా.. కాంబాబు అంటే ఎవరు..? బాబు గారి పుత్ర రత్నమేనా అంటూ గతంలో వైసీపీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసిన ఫొటోలను మరోసారి ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. అలాగే బట్టతల బడుద్దాయి అంటూ అయ్యన్నను కామెంట్లు చేశారు. ఇదే సందర్భంలో మాధవరెడ్డి, లోకేష్‌ అంటే కోపమొస్తోందంటూ గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనలను మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంబటి రాంబాబు.

అంబటి, అయ్యన్న మధ్య ట్విట్టర్‌ వార్‌ ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు..ఇద్దరూ ఎంతకైనా వెళ్లేలా కనిపిస్తున్నారు. ఇద్దరూ సీనియర్‌ పొలిటీషియన్లనే సోయి కాదు.. సాధారణ వ్యక్తులు కూడా ఇలా మాటల్లో దిగజారరనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

అంతకుముందు మంత్రి రోజా టిడిపిపై విరుచుకుపడ్డారు. పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎన్నికలకు పోలేని చంద్రబాబు నాయుడుకు చీర కావాలో చుడీదార్ కావాలో ఆలోచించుకోవాల్సింది ఆయనేనని.. తాము కాదన్నారు. డ్వాక్రా సంఘాలకు 14 వేల 500 ఎగ్గొట్టారని.. వాళ్లు చీరలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నారా లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని, పచ్చ చీర, పసుపు చీరలు పంపిస్తామన్నారు.

దీంతో మినిస్టర్‌ రోజాకు, టిడిపి నేతలకు మధ్య మాటల యుద్ధం కూడా ఇదే రేంజ్‌ లో సాగింది. రోజానూ అయ్యన్నపాత్రుడు వదల్లేదు. రోజా ఆమె మొగుడికి చీర కట్టి ఇంట్లో కూర్చుబెట్టిందంటూ అయ్యన్న నోరుపారేసుకున్నారు. అలాగే లోకేష్ మగతనం ఓసారి టెస్ట్ చేయాలని రోజాకు సూచించారు.

ప్రజాసమస్యలపై కనీస అవగాహన ఉండదు..జనానికి పనికొచ్చే పనులు చేయాలని ఉండదు..మాటల్తో మభ్యపెట్టి, బూతులతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జనాల్ని భ్రమపెట్టే ప్రయత్నంలో నేతలు ముదిరిపోయారు.
ఈ గోలంతా చూసి, జనాలు నవ్వుకుంటున్నారు.బూతుల పంచాంగం వినలేక జనం విసిగిపోతున్నా, నేతలు మాత్రం ఎక్కడా రిలాక్సవడం లేదు.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు.అయినా సరే నేతలెవరూ ఈ విషయం పట్టించుకోవడం లేదు.లేచిన దగ్గర్నుంచీ ప్రత్యర్థుల్ని తిట్టడానికి మాత్రం పోటీ పడుతున్నారు.రోజురోజుకూ ప్రజల కష్టాలు పెరుగుతున్నా.. అవి పట్టించుకునే వాళ్లెవరూ లేరు.
ప్రజలకు ఏదో చేసి ఎన్నికల్లో ఓట్లడగాలనే విషయాన్ని నేతలు ఎప్పుడో వదిలేశారు.ప్రత్యర్థుల్ని ఎంత భ్రష్టుపట్టిస్తే అంత ప్లస్ అని ఫిక్సైపోయారు.అందుకే పాజిటివ్ ప్రచారం కంటే.. నెగటివ్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు.
ఈ నెగటివ్ ప్రచారానికి మరింత కిక్ ఇవ్వడం కోసం బూతులు, తిట్లను అదనపు ఆకర్షణగా ప్రయోగిస్తున్నారు.
దీనికి సోషల్‌ మీడియాని బూతులతో నింపేస్తున్నారు..నేతల బూతులు కార్యకర్తలకు మంచి ఊపునిస్తున్నాయని పార్టీలు కూడా భావించటం ఇక్కడ విషాదం..

విమర్శలు, దుమ్మెత్తిపోయటం రాజకీయాల్లో కొత్త విషయం కాకున్నా,ఈ మధ్య శృతిమించుతోంది. గతేడాది కోడెల వర్థంతి సభలో ఏపీ సీఎం, మంత్రులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

విపక్షనేత అయ్యన్న, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ అందర్నీ బూతులు తిట్టారు. ఆ ఘటన తర్వాత, అయ్యన్న బూతులపై వైసీపీ ఫైరైంది. ఏకంగా చంద్రబాబు నివాసం వైపు వైసీపీ నేత జోగి రమేష్ దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయ్యన్నకు పోటీగా జోగి రమేష్, రోజా లాంటి నేతలు కౌంటర్‌ ఇచ్చారు.ఏదైనా బూతులు తిట్టడం మాత్రం కామన్‌..
ఎన్నికల ప్రచారం అయినా, మామూలు ప్రెస్ మీట్ అయినా, ప్రభుత్వ కార్యక్రమం అయినా..ప్రత్యర్థుల్ని తిట్టందే నిద్రపోవడం లేదు. కొంతమంది నేతలైతే బూతులకు బ్రాండ్ అంబాసడర్లుగా మారిపోయారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని నిన్నటిదాకా బూతుల మంత్రి అంటూ టీడీపీ శ్రేణులు సెటైర్లేశాయి. అటు కొడాలి కూడా మంత్రి పదవిలో ఉన్నా, లేకున్నా ఎక్కడా తగ్గేలా కనిపించటం లేదు. పైగా టీడీపీ నేతలకు ఆ భాషలోనే చెబితేనే అర్థమవుతుందనేది ఆయన వాదన

ప్రజా సమస్యలపై మాటల యుద్ధం చేయాల్సిన పార్టీలు..ఎవరెక్కువ బూతులు తిడతారని పోటీలు పెట్టుకున్నట్టుగా తయారయ్యాయి.ఎవరెక్కువ బూతులు తిడితే.. వాళ్లంత తొందరగా ఫేమస్ అవుతారని,అధిష్ఠానాలు కూడా గుర్తించి ప్రాధాన్యత ఇస్తాయనే అభిప్రాయంలో ఉన్నారు.బూతులు తిట్టడంతో పాటు, తమ బూతులకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్‌ ఉన్నాయోఆసక్తిగా చూసుకుంటున్నారు నేతలు.చవరికి నేతలు బూతుల మంత్రాలు వినలేక ప్రజలు తలపట్టుకుంటున్నారు.ఇలాంటి నేతల్నా తాము గెలిపించిందని సిగ్గుపడుతున్నారు.

ఒక ప్రజాప్రతినిధి సభ అంటే.. అక్కడ అన్ని వర్గాల ప్రజలుంటారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా ఉంటారు.
అందరిముందు… ఏ మాత్రం సోయి లేకుండా నాలుగ్గోడల మధ్య ఉన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీ గ్రేడ్ సినిమాల రేంజ్‌ బూతులు అలవాటుగా మారిపోయింది.మామూలుగా విమర్శలు చేస్తే ఎవరూ గుర్తించరనుకుంటున్నారేమో..ఘాటైన విమర్శలతో అడ్డంగా నోరుజారుతున్నారు.

నేతల మాటలు వింటుంటే…ఒక్కోసారి అసలు తెలుగు భాషలో ఇన్ని బూతులున్నాయా అనే అనుమానం వస్తుంది..అసలు బూతులతో ఓ డిక్షనరీ కూడా రూపొందించొచ్చేమో అనిపిస్తుంది..
అసెంబ్లీ నుంచి బహిరంగ సభ దాకా.. ఎక్కడ మాట్లాడినా బూతులు మాట్లాడటమే పెద్ద అర్హతగా మారింది. గతంలో ఆఫ్‌ ది రికార్డ్ లో ఎలా ఉన్నా, అసెంబ్లీ కాస్త పవిత్రంగా ఉండేవాళ్లు.
ఇప్పుడు అక్కడ కూడా అతి చేస్తున్నారు. ఏ నేత మాటలకు బీప్‌ వేసుకోవాలో తెలియని పరిస్థితి.
కొన్నాళ్లు పోతే.. అసెంబ్లీ సమావేశాలు కూడా మ్యూట్ లోనే చూసే పరిస్థితి వస్తుందేమో..

ఈ విషయంలో ఏపీ, తెలంగాణ అనే తేడా లేదు.ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా కూడా లేదు.
ఒకర్ని చూసి మరొకరు కొత్తగా బూతురాయుళ్లవుతున్నారు.
తిట్టడమే కాదు..బూతుల్ని సమర్థించుకుంటూ సవాళ్లు కూడా విసురుతున్నారు.

సమాజంలో రాజకీయ పార్టీలకు చాలా బాధ్యత ఉంది. చట్టసభల్లో ఉండే సభ్యులకైతే అంతకు మించిన బాధ్యత. జాతిని నడిపించే శాసనాలు, చట్టాలు చేయాల్సింది వాళ్లే. అలాంటి పవిత్ర బాధ్యతలో ఉన్నవాళ్లు.. ఉచితానుచితాలు వదిలేసి.. ప్రజలు ఏమనుకుంటారో అనే భావనే లేకుండా.. నోరు పారేసుకోవడం రాజకీయాల్లో పైత్యానికి పరాకాష్ట. ఓ నేత మరో నేతను తిడితే.. విషయం వారిద్దరికే పరిమితం కాదు. అది ఆయా పార్టీలకు, అంతిమంగా రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తుందనే విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

సమాజంలో ఓ వ్యక్తి ఓ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అదే విధంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లు సమాజానికి, రాష్ట్రానికి బాధ్యత వహిస్తారు. ప్రజాప్రతినిధులు కచ్చితంగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఒకప్పుడు అలాగే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఒకర్ని మించి మరొకరు మాటల్లో దిగజారుతున్నారు. అదేమంటే జనసామాన్యంలో వాడుకలో ఉన్న భాషే మాట్లాడుతున్నామని సమర్థించుకుంటున్నారు. మార్కెట్లో మాట్లాడే బూతులకు, అసెంబ్లీలో మాట్లాడే భాషకు తేడా ఉండొద్దా అంటే.. జనానికి అర్థం కానప్పుడు సంస్కారవంతంగా మాట్లాడి ఏం ఉపయోగం అని వెటకారాలు చేస్తున్నారు. ఇలాంటి నేతల్నా మనం ఎన్నుకుందని ప్రజలే తలకొట్టుకోవాల్సిన పరిస్థితి.

ఎవరికైనా భాషే సమాజంలో మర్యాద ఇచ్చేలా చేస్తోంది. ఈ విషయం రాజకీయ నేతలకు ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. ఇలాంటి దిగజారుడు భాష మాట్లాడి.. ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో కూడా నేతలు ఆలోచించడం లేదు. పబ్లిగ్గా ప్రజల ముందే ఏది పడితే అది మాట్లాడటం, ఎవరేమన్నా నోరేసుకుని సోషల్‌ మీడియాలో పడిపోవడమే రాజకీయమని కొత్త కల్చర్ తీసుకొచ్చారు. రాష్ట్రం మొత్తానికీ చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. తెలుగు కల్చర్ ఇలాగే ఉంటుందా అని ఇతర రాష్ట్రాల వాళ్లు కథలు కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత దిక్కుమాలిన రాజకీయం జరగడం లేదు. నోటికి ఏమొస్తే అది మాట్లాడటం ఏంటనే కనీస స్పృహ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు.

బూతులు మాట్లాడే సంస్కృతిని ముందు మీరే అలవాటు చేశారని కూడా పార్టీలు పరస్పర విమర్శలతో పొద్దుపుచ్చుతున్నాయి. ఎవరికి వారు మనం బాధ్యతగా మాట్లాడదాం అనుకుంటే.. ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అనుకోవడం కాదు.. అసలు కట్టాలని కూడా ఎవరూ అనుకోకపోవడమే ఇక్కడ ప్రజల దురదృష్టం. బూతులు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న నేతలు ప్రజల్లో కూడా విలువ పోగొట్టుకుంటున్నారని గుర్తించటం లేదు.

ఏపీలోనే కాదు… తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు సన్నాసులు, లోఫర్లు అంటూ గతంలో ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఒకటంటే రెండంటా అనే థియరీనే తప్ప.. దీని వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందనే ఆలోచనను పక్కన పెట్టేస్తున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్యల ఇలాంటి పరుషమైన డైలాగులకు అన్‌ పార్లమెంటరీ పదాలతో కూడిన విమర్శలకు అడ్డే లేదు.

గతంలో నాయకులు ఒకటీ అరా మాటలు పొరపాటున నోరు జారితేనే.. తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే వారు. క్షమాపణ చెప్పేవారు. అలాంటి పదాలు వాడినందుకు సిగ్గు పడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఏది పార్లమెంటరీ, ఏది అన్‌ పార్లమెంటరీ అనే విభజన చేయడమే కష్టంగా మారింది. దమ్ముంటే రా, దొంగలు, లుచ్చాలు, ఫోర్‌ట్వంటీలు ఇప్పుడు చాలా చిన్న మాటలైపోయాయి. నాలుగ్గోడల మధ్య పరిమితం కావాల్సిన వ్యవహారాల్ని కూడా బహిరంగ విమర్శల్లోకి తెస్తున్నారు. ఆఖరికి కుటుంబం సభ్యుల్ని కూడా ఇందులోకి లాగుతున్నారు.

ఈ రోజుల్లో అన్ని పార్టీలు బూతు నేతల్ని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నాయి.వాళ్లు మాట్లాడుతుంటే.. ఉత్సాహం రావడానికి ప్రత్యేకంగా ఛీర్ లీడర్ల లాంటి వాళ్లను పెడుతున్నాయి. సదరు నేతల నోటి నుంచి ఒక్కో బూతు జాలువారుతుంటే.. పక్కనున్న నేతలు చప్పట్లు కొట్టడం, ఉత్సాహ పరచడం చేస్తున్నారు. ఈ పైత్యం ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైంది. కొంత మంది నేతలు తమ పార్టీలో సదరు నేత అయితేనే ప్రత్యర్థులకు బాగా ఘాటుగా జవాబిస్తారని కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రతి పార్టీకి ఓ బూతు నేత బాగా ఫేమస్ అయిపోయారు. ఆ నేత లేకపోతే ఎలాగని ప్రతి పార్టీ ఫీలైపోయే పరిస్థితి ఏర్పడింది.రాజకీయాల్లో ఈ ట్రెండ్ ఎంతకాలం సాగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

నిజానికి గౌరవంగా మాట్లాడుతూనే చేసే వ్యంగ్య సంభాషణ మరింత పదునుగా ఉంటుంది. కానీ అంత సయమనం నేతల్లో లేదు. మాట జారితేనే ఫలితం ఉంటుందని నమ్ముతున్నారు. కానీ, చర్యకు ప్రతిచర్య తప్పదు అంటుంది న్యూటన్‌ లా. బూతులకు వచ్చే రియాక్షన్స్‌ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే, నేతలు మాటల దగ్గరే ఆగుతారా? లేక ముందు ముందు దాడుల వరకు పోతారా అనే అనుమానం కూడా వస్తుంది.

జాతీయ పార్టీ అయినా.. ప్రాంతీయ పార్టీ అయినా.. ఇప్పుడు మాటల్లో, సోషల్‌ మీడియా పోస్టుల్లో కట్టు దాటటం కామన్‌ గా మారింది. బూతులు మాట్లాడటం రాని వాడు నేత ఎలా అవుతాడనే కొత్త లాజిక్ తెర మీదకు వస్తోంది. ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోతేనే గుర్తింపు..పదవులు వస్తాయని నమ్ముతున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలు, వారి స్థానాల్ని చూస్తే ఇదే విషయం అర్థమౌతుంది. పార్టీలు ఈ రకంగా బూతుల నేతల్ని ఎంకరేజ్ చేస్తుంటే..
మిగిలిన నేతలు కూడా అదే ఎదగడానికి సరైన దారి అనుకోవడం తప్పే లేదనుకుంటున్నారు. కొన్నాళ్లుగా లైమ్ లైట్ లో లేని నేతలు ఒక్కసారిగా పతాక శీర్షికలుగా ఎక్కాలంటే.. బూతుకు మించిన మందు లేదనుకుంటున్నారు.

ఇక మరికొందరు నేతలు పేరుకి పాదయాత్రలు చేస్తారు. కానీ నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడతారు. ప్రజా సమస్యలపై పాతిక శాతం కూడా ఫోకస్ పెట్టరు.
కానీ ప్రత్యర్థుల్ని తిట్టడానికి మాత్రం 75 శాతం సమయం వినియోగిస్తారు. ఎన్నికల ప్రచారం చేసినా అంతే. అక్కడ కూడా సమస్యల కంటే బూతులే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. గతంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బూతులు తిట్టేవాళ్లు. ఇప్పుడు బూతులు తిట్టి మరీ లేని దాన్ని ఇష్యూ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సమస్యను పక్కదోవ పట్టించడానికి కూడా బూతుల్నే మార్గంగా ఎంచుకుంటున్నారు నేతలు. జనమందరూ బూతుల గురించి ఆలోచించి.. అసలు విషయం మర్చిపోతారని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.

మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేదిక మీదే తొడ గొట్టి మరీ సవాళ్లు విసురుతున్నారంటే.. ఆయన ఆలోచనా స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు మాట్లాడే భాష చూస్తే ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అధికార పార్టీ నేతలు కూడా తగ్గేదే లేదని రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చూస్తూ ఉరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలు తవ్వితీయడం, వారి వ్యక్తిగత అలవాట్లపై నోరు పారేసుకోవడం నయా రాజకీయంగా మారింది.వ్యక్తిగత జీవితం వేరు..రాజకీయం వేరు అనే విభజన రేఖ కూడా చెరిపేస్తున్నారు నేతలు. కుటుంబాలు, వంశాల్ని కూడా చేర్చి మరీ బూతులు తిడుతున్నారు. చనిపోయిన నేతల్ని కూడా ఈ రొంపి లోకి లాగుతున్నారు.

రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఇచ్చింది స్వేచ్చగా భావ వ్యక్తీకరణ చేయమనే కానీ… ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ప్రత్యర్థుల్ని బండ బూతులు తిట్టేయవచ్చని కాదు. పార్టీల కీలక నేతలే ప్రత్యర్థులపై.. నోరు పారేసుకుంటుంటే… కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా అలాంటి భాషే వాడుతారు. దీంతో మొత్తం వాతావరణమే రచ్చ రచ్చగా మారుతోంది. నేతల బూతు పురాణంతో ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయి. ప్రత్యర్థుల్ని తిట్టడం మీద ప్రజా ప్రతినిధులు చూపిస్తున్న శ్రద్ధ కాస్తైనా ప్రజల మీద, వారి సమస్యల పరిష్కారం మీద పెడితే.. దేశానికి కాస్తైనా మేలు జరుగుతుంది. అడ్డంగా నోరుజారే సంస్కృతికి రాజకీయ పార్టీలు అడ్డుకట్ట వేయాలి..లేదంటే ఆ పని ప్రజలు వేసే రోజు కచ్చితంగా వస్తుంది.. ఆ రోజు నేతలకు నోరెత్తే అవకాశం ఉండదు..