NTV Telugu Site icon

President : రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి? కౌన్‌ బనేగా ప్రెసిడెంట్‌?

Whatsapp Image 2022 06 10 At 12.05.44 Pm

Whatsapp Image 2022 06 10 At 12.05.44 Pm

ప్రస్తుత రాష్ట్రపతిపదవీ కాలం ఈ ఏడాది జులై 24తో ముగియనుండటంతో దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్‌ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత?

దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

భారత దేశానికి కాబోయే 15వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన తర్వాత కాబోయే రాష్ట్రపతి ఎవరన్న అంశంపై తీవ్రస్థాయిలో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. దేశాధ్యక్షుడిగా, సర్వసైన్యాధ్యక్షుడు అయ్యేందుకు రాజకీయ కురువృద్ధులతో పాటు చాలా మంది ఆశావహులు రేస్ లో ఉన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74(2) ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలూ ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యూడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్‌మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్‌, మిలటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ మించి… దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసరక స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటి వరకూ 14మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కానుండటంతో.. కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైపోయింది.

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకొంటారు.

ఓటింగ్‌ బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో 776 ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉంటే.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది.

ఎలక్టోరల్‌ కాలేజ్‌ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86లక్షలుంటే, అందులో బిజెపికి లక్షదాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలున్నాయి. బిజెపికి 5.42లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే, విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు.ఎంపీ ఓటు విలువ 700ఉంటే, ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది. కర్నాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131 ఉంటే యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ అతి తక్కువగా 7మాత్రమే

ఎలక్టోరల్‌ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే, గెలవాల్సిన అభ్యర్థికి 5లక్షల 49 వేల 452 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే 13 పార్లమెంట్‌ స్థానాలు ఖాళీగా ఉంటే, రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22లక్షలు మాత్రమే. అయితే పార్లమెంట్‌ లో మాత్రం ఎన్డీఏకి 3.20 లక్షల ఓట్లుంటే, విపక్షాలకు 1.72 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి.

ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. కానీ, రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగనణలోకి తీసుకుంటారు. దీనిప్రకారం ఏపీలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ
159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708.

ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది. 2017లో ఎంపీ ఓటు విలువ 708ఉంది. కానీ, ఈ ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల ఓటు విలువ 700కు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ ఈ సారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని సమాచారం..

ఈ లెక్కన చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో 25లోక్‌ సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలున్నాయి. అంటే మొత్తం 36మంది ఎంపీల ఓటు విలువ 25,200 అవుతుంది. అంటే ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 53,025 కానుంది.

ఇక తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7.తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24. వీరందరి ఓటు విలువ 16,800. తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 32,508 కానుంది.

రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అత్యున్నతమైన పీఠంపై తాము కోరుకున్న వ్యక్తిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీయేకు సొంతంగా లేదు. గత ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్‌ చేసిన టియ్యారెస్‌, శివసేన, అకాలీదళ్ , టిడిపి లాంటి పార్టీలుఈ ఎన్నికల్లో ఎటు ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడింది. మరోపక్క బీజేపీయేతర పక్షాలు ఏకమై అభ్యర్థిని నిలబెడతాయా అనే చర్చ కూడా నడుస్తోంది.

2017లో జులై 17న రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. గతేడాది అధికార, ప్రతిపక్ష కూటములు దళిత అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. అప్పుడు ఎన్డీయే కూటమి పార్టీలతోపాటు, బయట నుంచి ఏఐఏడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, తెరాస, ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్రులు మద్దతివ్వడంతో రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు.

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అలాగే మద్దతు కోసం ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగిస్తున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీయేకు సొంతంగా లేదనే చెప్పాలి. అటు ఉమ్మడిగా కలిసి నడిచినా విపక్షాలు గెలిచే ఛాన్స్‌ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

గత ఎన్నికల సమయానికి దేశంలో బిజెపి ప్రభంజనం కొనసాగుతోంది. అప్పటికి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. ఫలితంగా కూటమి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎలక్టోరల్‌ కాలేజీలో 65.65% ఓట్లు దక్కించుకొని ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌ 34.35% ఓట్లకు పరిమితమయ్యారు.

2017తో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చాలా మారాయి. ఎన్డీయే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో పగ్గాలు కోల్పోయింది. శివసేన, అకాలీదళ్‌, టిడిపి లాంటి మిత్రపక్షాలు దూరమయ్యాయి. ఇప్పుడు ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయే ఓట్ల విలువ 48.9%గా ఉంది. విపక్షాల మొత్తం బలం 51.1%. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీయేకు మరో 1.1% కంటే కొన్ని ఎక్కువ ఓట్లు సరిపోతాయి. ప్రతిపక్షాలు మాత్రం అన్నీ ఒక్కటైతే తమ అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్సుంటుంది. కానీ, దీనికి అవకాశాలు తక్కువే.

అయితే ఈ వోటింగ్‌ లో ఏ పార్టీ ఎటు ఉంటుందనే అంశాన్ని చూస్తే, బిజెపి దాని మిత్రపక్షాలు ఏఐఏడీఎంకే, జెడీయూ, ఎల్‌ జెపీ, అప్నాదళ్ లాంటి పార్టీలు ఓవైపున ఉన్నాయి. అటు కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఐయూఎంఎల్‌ మరోవైపున్నాయి. మరోపక్క తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం, టిడిపి, వామపక్షాలు, టియ్యారెస్‌ కూడా బిజెపికి విపక్షాల జాబితాలో ఉన్నాయి.

గతంలో 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్‌డీఏకు ఆధిక్యం లేదు. అప్పట్లో టీఆర్‌ఎస్, వైసీపీ, శివసేన, జేడీయూ వంటి పార్టీల మద్దతుతో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాగలిగారు. కానీ ఇప్పుడు బీజేపీ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమంటున్నారు. శివసేన బీజేపీకి దూరమైంది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏ గెలవాలంటే వైసీపీ లేదా బీజెడీ అవసరం బీజేపీకి ఉంటుంది.
ఈ రెండు పార్టీలు బిజెపితో సత్సంబంధాలతోనే ఉండటంతో బిజెపి అభ్యర్థి గెలుపు పెద్ద కష్టమయ్యే అవకాశం లేదనే చెప్పాలి.

కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి వారిని ఆయన కలిశారు. తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌లతో కూడా కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో చర్చగా మారిన ఈ పర్యటనల ప్రభావం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కనిపిస్తుందనే అంచనాలున్నాయి. ఎందుకంటే, ఈ చర్చలన్నీబీజేపీ వ్యతిరేక పోరుబాటను చర్చించేందుకు సాగినవే.

అయితే, బిజెపి నిలబెట్టే అభ్యర్థి, ఆ అభ్యర్థికి ఏ పార్టీలు ఓటేస్తాయనేది స్పష్టంగా ఉంటే, ఇటు బిజెపి విపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడతాయా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే, తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు.. కాంగ్రెస్‌తో మిత్రపక్షంగా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు కాంగ్రెస్‌ను కాదని..వచ్చే అవకాశాలు తక్కువే అనే అభిప్రాయాలున్నాయి. ఇటు టియ్యారెస్‌, తృణమూల్‌, ఆప్‌ లాంటి పార్టీలు బిజెపికి, కాంగ్రెస్‌ కి దూరంగా ఉన్న పార్టీల కేటగిరీలో ఉన్నాయి. దీంతో భిన్న రాజకీయ లక్ష్యాలు, ప్రయోజనాలు, ఆలోచనలు ఉన్న పార్టీలు అన్ని కలిసి ఏకతాటిపైకి రావడం సాధ్యమేనా అని రాజకీయ విశ్లేషకుల సందేహం. ఒకవేళ వీరంతా కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలపెట్టినా.. కాంగ్రెస్ మద్దతిచ్చినా విజయం సాధించడం కష్టమే అనే అభిప్రాయాలున్నాయి.

మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సపోర్ట్‌ ఉన్న అభ్యర్థి రాష్ట్రపతిగా గెలిచే ఛాన్స్‌ ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో పోలయ్యే ఓట్ల తీరు, రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే, ఫెడరల్‌ రాజకీయాలు సక్సెస్‌ అవుతాయా? లేక బిజెపియేతర పక్షాలన్నీ ఒక్కటవుతాయా అనే అంశంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

2017లో దళితులకు అవకాశం వచ్చింది..ఇప్పుడు ఆదివాసులకు ఇస్తారా?లేక మైనారిటీలకు ఇస్తారా? లేదంటే మహిళలకు ఛాన్సుందా? బిజెపి వ్యూహమేంటి?అటు విపక్షాల అభ్యర్థిత్వంపైనా ఇదే ఆసక్తి నెలకొంది. దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే ప్రథమపౌరుడి విషయం రాజకీయ పార్టీలు ఆచితూడి అడుగులేస్తున్నాయని చెప్పాలి. ఈ ఎన్నిక వచ్చే సార్వత్రిక ఎన్నికల తీరుని స్పష్టం చేస్తుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

రాజ్యంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం… భారత దేశపౌరుడైన ఏ వ్యక్తికైనా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. వయసు కచ్చితంగా 35 ఏళ్లకు పైబడి ఉండాలి. వాటితో పాటు భారత లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలూ కలిగి ఉండాలి. ప్రతి అభ్యర్థి, కనీసం 50 మంది ఎంపీల మద్దతుతో మాత్రమే నామినేషన్ వెయ్యడానికి వీలవుతుంది.

ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలతో పాటు, రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి స్థానాల్లోనూ ఉండకూడదు. ఒకవేళ ఉండి ఉంటే… ఆ పదవికి రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేయాలి. అయితే భారత ఉపరాష్ట్రపతి, ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర క్యాబినెట్‌ మినిస్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు.

తొలినాళ్లలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. కానీ కాలక్రమంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారికి నచ్చినట్లు ఓటు వేయొచ్చు. పార్టీలు విప్ జారీ చేయడానికి లేదు. మిగతా ఎన్నికలకు రాష్ట్రపతి ఎలక్షన్‌కు ఉండే ప్రధానమైన వ్యత్యాసం ఇదే. ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అయినప్పటికీ, ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని ఆ పార్టీలేవీ ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులను ఆదేశించలేవు. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్‌ జారీ చేస్తుంటాయి. ప్రజాప్రతినిధులు దానికి అనుగుణంగా ఓటు వేయకపోతే, వారిపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంటుంది. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఎలక్టరోల్‌ కాలేజ్‌ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకూ లొంగకూడదనే ఉద్దేశంతో విప్‌ వర్తించని విధానాన్ని అమలు చేశారు. 1969లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. పార్టీకుండే బలంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే.. కాని ఇందిరాగాంధీ ఆశీస్సులతో పార్టీకి సంబంధం లేకుండా వీవీ గిరి నామినేషన్‌ వేశారు. అందరు పార్టీతో సంబంధం లేకుండా ఓటు వేయడంతో నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో బిజెపి ఎవర్ని నిలబెడుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పక్షాల తరపు అభ్యర్థి ఎవరనే దానిపై కూడా అంతే ఆసక్తి ఉంది. ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ వయసు 76 ఏళ్లు. కాబట్టి ఆయనకు మరొకసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవచ్చు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితుడికి అవకాశం ఇచ్చిన బిజెపి ఇప్పుడు ఆదివాసీలకు అవకాశం ఇస్తుందనే వాదనలున్నాయి. ఈ ఏడాది గుజరాత్‌తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో సుమారు 15శాతం, మధ్యప్రదేశ్‌లో 21శాతం, చత్తీస్‌గఢ్‌లో 30శాతం, రాజస్థాన్‌లో 13.5శాతం ఆదివాసీలున్నారు. అంతేకాదు… ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయా ఉయికే, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి.

అయితే, దక్షిణ భారతంలో విస్తరించాలని బిజెపి చాలా ఏళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 2008లో తొలిసారి కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంత వరకు దక్షిణ భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోతోంది. ఒకవేళ దక్షిణ భారత్‌లోని రాష్ట్రాలకు బీజేపీ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే వెంకయ్యనాయుడుని రాష్ట్రపతిని చేసే అవకాశాలున్నాయి. మరోపక్క బిజెపిపై ఇప్పటికే ఉత్తరాదిన అగ్రవర్ణాల్లో అసంతృప్తి ఉందనే వాదనలున్నాయి. దానిపై కూడా బిజెపి దృష్టిపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్తిత్వంపై ఇప్పటికే ప్రధాని మోదీ … హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొందరు కీలక నేతలతో సమావేశం నిర్వహించారని సమాచారం.

మరోవైపు కశ్మీర్‌ సమస్యకున్న అంతర్జాతీయ ప్రాధాన్యత, ఆ రాష్ట్రంలో బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ పేరు కూడా ప్రధాని మోదీ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి కూడా చెక్‌ పెట్టినవుతుంది. పైగా కొంతకాలంగా ఆజాద్‌ బిజెపి విషయంలో సాఫ్ట్‌ కార్నర్‌ తో ఉన్నారనే వాదనలున్నాయి. ఓ దశలో ఆయన పార్టీ మారతాయనే చర్చ కూడా నడిచింది. ఇక కేరళ గవర్నర్‌ అరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదేసమయంలో.. ఎస్సీ నేత అయిన కర్ణాటక గవర్నర్‌ తావర్‌ చంద్‌ గెహ్లోత్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అర్జున్‌ ముండా పేర్లు కూడా ఉపరాష్ట్రపతి విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

మరోపక్క ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం బీజేపీకి చిక్కులు తప్పదనే వాదనలున్నాయి. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎంపికను కష్టసాధ్యం చేయాలంటే ఎన్డీఏతర పార్టీలన్నీ కలిసి ఒక బలమైన అభ్యర్థిని ఎంపిక చేయవలిసి ఉంటుంది. ఈసారి ప్రతిపక్షాల శిబిరం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్‌, శివసేన అధినేత ఉద్దావ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ విషయంపై కలిసి చర్చించవచ్చనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్‌ పవార్‌, దేవెగౌడ పేర్లు పరిగణనలోకి తీసుకోవచ్చంటున్నారు.

ఈ అంచనాలనుబట్టి చూస్తే రానున్న రాష్ట్రపతి ఎన్నికలు ఆసక్తికరంగా మారటమే కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా కొంతవరకు స్పష్టంగా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు.