Welfare schemes : దేశంలో సంక్షేమ పథకాలు, ఉచిత హామీలపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఏవి ఉచితాలు, ఏవి సంక్షేమ చర్యలు అని తేల్చడం అంత వీజీ కాదనే అభిప్రాయం ఉంది. ఉచితాల పేరుతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయన్న పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు.. నిపుణుల కమిటీ వేసింది. అయితే కమిటీ సూచనలపై కూడా చర్చ జరగాలని స్పష్టం చేసింది. ధర్మం వేరు ధర్మసూక్షం వేరు. ఈ రెండింటికీ తేడా ఓ రకంగా చూస్తే చాలా స్వల్పమే. కానీ మరో రకంగా చాలా ఉంటుంది. ఇప్పుడు ఉచితాలు, సంక్షేమం మధ్య తేడా కూడా అలాంటిదే అనే వాదన వినిపిస్తోంది.
ఉచితాలు అంటే ఏమిటో సరైన నిర్వచనం లేదు. వర్ధమాన దేశాలలో ప్రజల వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అభివృద్ధి సాధనలో ప్రభుత్వాల వైఫల్యాలు.ఈ వెనుకబాటుతనం వల్ల ప్రజలు రెండు పూటల తినగలగటం నుంచి ఒక మోస్తరుగా బతకటం వరకు పాలక వ్యవస్థ నుంచి సహాయం తప్పనిసరి అవసరం. లేనట్లయితే ఆ ప్రజలు ఇంకా నికృష్ట స్థాయిలోకి వెళ్తే.. వారి నుంచి తిరుగుబాట్లు వస్తాయి.
దేశంలో ఆర్థిక సమతుల్యత చాలా ముఖ్యం. అందరి దగ్గరా సమానంగా డబ్బు ఉండకపోవచ్చు. కనీస అవసరాలైనా అందరికీ తీరేలా ఉండాలన్నది రాజ్యాంగ సూత్రం. ఈ ఉద్దేశంతోనే కొన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ.. సంక్షేమం శృతి మించి.. ఉచితాలు తెరపైకి వచ్చాయనే అభిప్రాయాలున్నాయి. కనీస అవసరాలు తీరని సమాజాల్లో తిరుగుబాట్లు చెలరేగే అవకాశం ఉంది. ఈ మాటను సూటి గా, స్పష్టంగా ఆధునిక కాలంలో జర్మన్ పాలకుడు బిస్మా ర్క్ నుంచి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవకారుల వరకు చెప్పారు. ఈ అవసరాలు మాజీ వలస దేశాలలోనూ కొనసాగుతున్నాయి. ఒక మేరకు ధనిక దేశాలలోనూ ఉన్నా యి. సంక్షేమ వ్యవస్థల్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చెప్పే మానవాభివృద్ధి గాని, దాని సూచికలు గాని ఈ వ్యవస్థలపైనే ఆధారపడి ఉన్నాయి.
ఉచితాలు, సబ్సిడీలు క్రమంగా రద్దుచేయాలంటూ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ బోధనల మేరకు ఆర్థిక సంస్కరణల సిద్ధాంతకర్తలు, కొందరు పాలకులు కొంతకాలం ప్రయత్నించి విఫలమై, తిరిగి సంక్షేమబాట పట్టారు. పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఉచితాలు కావని, డూప్ ఏజెన్సీలకు కేంద్రం ఇస్తున్న రుణమాఫీ అసలైన ఉచితమనే విమర్శలున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం.. విద్య, ఆరోగ్య సదుపాయాలు ఉచితంగా కల్పించడం, రాత్రి పూట పేదలకు శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేసి ఇవ్వడంపై ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి హక్కుగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఉచిత విద్యుత్తు, నీళ్ళు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదంటూ నిబంధన తీసుకురావడం సరికాదనే అభ్యంతరాలున్నాయి.
ఎన్నికల వాగ్దానాల ఫలితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచితాల లోని లోపాలపై జరుగుతున్న చర్చ దేశానికి కొత్తేమీ కాదు. కానీ, ఉచితాలు అంటే ఏమిటనే దానిపై ఇంకా గందరగోళం నెలకొంది. ప్రభుత్వం దేశ పౌరుల కోసం రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన సేవలను కూడా ఈ కేటగిరీ లోకే కలుపుతున్నారు. ఇవి వనరులను వృధా చేస్తున్నాయని, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న ఆర్థిక వనరులపై మరింత భారం పడుతుందని.. ప్రధానమైన వాదన చేస్తున్నారు. ఇలాంటి చర్చల్లో ఉచితాలు అంటే టెలివిజన్లు, బంగారు గొలుసుల లాంటి వస్తువులు మాత్రమే కాక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన రేషన్, మధ్యాహ్న భోజన పథకం కింద వండిన ఆహారం, అంగన్వాడీల ద్వారా అనుబంధ పోషకాహారంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని సమకూర్చే పనులు కూడా చేర్చకూడదనే వాదన ఉంది.
అనేక మంది ప్రజల జీవితాలను, వారి జీవనాధారాలను సర్వనాశనం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో భారత ఆహార సంస్థ గోడౌన్లలో 100 మిలియన్ల టన్నులకు పైగా బియ్యం, గోధుమల నిల్వ ఉన్నపుడు ఈ ఆహార ధాన్యాలను ఉచితంగా చేసిన పంపిణీని కూడా ఉచితాలనే అంటారా? ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న సబ్సిడీ ఆహార ధాన్యాలు మౌలిక ఆహార భద్రతకు హామీ ఇవ్వడమే కాక తాము సమకూర్చుకోలేని వస్తువులను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే ఆదాయ బదిలీగా కూడా ప్రజలకు తోడ్పడుతుంది. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడమనేది రైతులకు ప్రయోజనకరంగా ఉన్న మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. రైతులకు లాభదాయకమైన ధరలకు భరోసా కల్పిస్తూ, వినియోగదారులు చౌకగా ఆహార ధాన్యాలను పొందడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ అనుమతిస్తుంది.
సుమారుగా 2000 నుంచి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి విస్తరించడం, ధరలను తగ్గించడంతో ఇది ఒక రాజకీయ సమస్యగా మారింది. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలోని ధరల తగ్గుదల కూడా ఎన్నికల సమస్యగా మారింది. 2009 లో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు 2000 దశాబ్ది మధ్య కాలం నుంచి చివరి దాకా దాదా పు అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వాగ్దానాలను చేశాయి. ఇది చివరకు, 2013లో పార్లమెంట్ ఏకగ్రీవంగా జాతీయ ఆహార భద్రతా చట్టం ఆమోదించడానికి దారి తీసింది. దీనిలో లోపాలు ఉన్నప్పటికీ, దేశంలోని మూడింట రెండొంతుల ప్రజలకు కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో జాతీయ ఆహార భద్రతా చట్టం లేకుండా, పీఎంజీకేఏవై మరియు దాని మద్దతు సాధ్యమయ్యేది కాదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా విస్తరించడంతో మినహాయింపులకు చెందిన దోషాలు వాటంతటవే తగ్గి పోయాయి. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ మనను లక్ష్యానికి దగ్గరగా చేర్చుతుంది.
ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని పెంచుతుందని అదే పనిగా విమర్శిస్తున్న ఇతర సంక్షేమ పథకాలు కూడా మానవ అభివృద్ధికి, పోషకాహారం, పని మొదలగు వాటిపై ప్రజల మౌలిక హక్కుల సంరక్షణకు, ముఖ్యంగా గౌరవంగా జీవించే హక్కుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు, కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో, అంతకుముందు కాలంలో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేకమంది ప్రజలకు జీవనాధారంగా ఉంటూ వస్తున్న మరొక పథకం. ఒకవేళ ఈ చట్టం వాస్తవమైన స్ఫూర్తితో అమలు చేసినట్లైతే ఇది కూడా డిమాండ్ ఆధారిత పథకమే. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో విద్యార్థుల చేరికల నమోదు పెరుగుదలకు, తరగతి గదుల్లో పిల్లల ఆకలి సమస్య పరిష్కారానికి దోహదం చేసిందని రుజువైన పథకం. వృద్ధాప్య, ఒంటరి మహిళలు, వికలాంగుల పెన్షన్లు, పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ వంటశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచిత యూనిఫాం దుస్తులు, పాఠ్య పుస్తకాలు మరియు ఉచిత వైద్య సేవల లాంటి ఇతర అనేక పథకాలు…మన దేశంలో సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకాలలో అనేక లోపాలున్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా విస్తరించాలి. ఎక్కువ వనరుల కేటాయింపులు జరగాలి. జవాబుదారీతనం, సమస్యల పరిష్కారానికి యంత్రాంగాలను పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ జోక్యాలను ఉచితాలుగా పేర్కొనడం ద్వారా వాటి ప్రాధాన్యతలను బలహీన పరచడం, పేదలను అనుత్పాదకులుగా, దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వారిగా చూడటం సరైన దృక్కోణం అనిపించుకోదు. వాస్తవానికి ఇక్కడ సమస్య ఏమంటే, రాజకీయ ప్రక్రియలో ఇలాంటి సమస్యలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలను ఎన్నికల అంశంగా మార్చి ప్రజల నుంచి ఒత్తిడి పెంచడమే ప్రస్తుత అవసరం. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు అందించాలా, వద్దా? ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజుల పనిని సమకూర్చుతారు? ఉచితంగా మందులు పొందే పథకాలు, లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాల ధర ఎంత? అనే అంశాలపై, మెజారిటీ ప్రజల అవసరాలకు ప్రతిస్పందనగా చేసే చర్చ ఎన్నికల ప్రజాస్వామ్యంలో సానుకూలమైన సూచికలుగా ఉంటాయి. అనేక సంక్షేమ పథకాలు, మానవాభివృద్ధి ఫలితాల్ని మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. దీని ఫలితంగా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియ నిష్ప్రయోజనం అనిపిస్తుంది, అయితే వాటిని పూర్తిగా కాదనకుండా కచ్చితంగా చర్చించాలి.
అసలు, ఉచితాన్ని ఎలా నిర్వచించాలి? కార్పొరేట్ టాక్స్ చెల్లింపుదారులకు భారీగా టాక్స్ ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫలితంగా సంవత్సరానికి దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది ప్రభుత్వం. అన్ని పన్నుల మినహాయింపులు…విదేశీ వాణిజ్య, వ్యక్తిగత ఆదాయ పన్నుల రాయితీలను అన్నింటినీ కలిపితే…సంవత్సరానికి ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయం ఐదు లక్షల కోట్ల రూపాయలు. పైగా కార్పొరేట్ పన్నుల రేట్లు తగ్గుతూ ఉన్నాయి. 2019-2020 సంవత్సరంలో లాభాల రేటు పెరిగితే, పన్ను రేట్లు తగ్గినట్లు మన బడ్జెట్ పత్రాలు తెలియజేస్తున్నాయి. కానీ ప్రధాన స్రవంతిలో జరుగుతున్న చర్చల్లో ఈ రాయితీల సమర్థన గురించి ఎక్కడా మనకు ఒత్తిడి కనిపించదు. ఒక వ్యవస్థ ద్వారా పేదలకు ఇచ్చే కొద్దిపాటి మొత్తాలను ఉచితాలు అంటున్నారు. కానీ తక్కువ పన్ను రేట్లు, మినహాయింపుల పేరుతో నిత్యం ధనవంతులు పొందుతున్న ఉచితాలను మాత్రం ప్రోత్సాహకాలు అంటున్నారు.
ఉచితాలు ఎప్పటికీ ఉచితాలు కావనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రజలు ఏదో రూపంలో వాటికి మూల్యం చెల్లించాల్సి వస్తుందనే వాదన ఉంది. ఉచితాలపై హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలను, వాటి ప్రభావాలను కూడా ఓటర్లకు వివరించాలనే డిమాండ్ ఉంది. ధరలను వక్రీకరించే సబ్సీడీలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉచితాల మూలంగా ఉత్పత్తిపై, వనరుల కేటాయింపుపై ప్రభావం పడుతుందనే వాదన ఉంది. ఇది పరోక్షంగా ఖర్చులు పెంచుతుందని అంటున్నారు. సుప్రీం కోర్టు సైతం అలవికాని ఉచిత హామీలపై ప్రత్యేకంగా పరిశీలన జరపాలని కోరింది. పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాదని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు. వాటిని పొందే హక్కు సంపన్నుల కంటే పేదలకే ఎక్కువగా ఉన్నదని స్పష్టం చేశారు.
ఇతర దేశాల్లో కనీస అవసరాలను తీర్చే నాణ్యమైన వస్తువులు, సేవల్ని అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతగా భావిస్తారని.. ఉచితాలుగా పరిగణించరనే వాదన వినిపిస్తోంది. దేశ పన్నుల వ్యవస్థలో పరోక్ష పన్నులదే సింహభాగం. దీనివల్ల మన దేశంలో ధనవంతుల కంటే పేద ప్రజలే ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కాబట్టి వారికి కనీస అవసరాలు పొందే హక్కు ఉందనే అభిప్రాయాలున్నాయి. ఉచిత పథకాల అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలు కల్పించడాన్ని ఉచితం అనగలమా? అని ప్రశ్నించారు.
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలను నిషేధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్నికల మేనిఫెస్టోను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో చేసిన వాగ్దానాలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్.. అయితే, ఇది సమస్య కాదని ఎవరూ అనరు.. ఇది తీవ్రమైన సమస్య.. ఉచితాలు పొందుతున్న వారికి అది కావాలి.. ఇక, మాది సంక్షేమ రాజ్యం.. తాము పన్నులు చెల్లిస్తున్నామని,. అభివృద్ధి ప్రక్రియకు వినియోగించాలని కొందరు అనవచ్చు.. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య.. అందుకే ఇరు పక్షాల వాదనలను నిపుణుల కమిటీ వినాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దేశంలో రాజకీయ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటీపడి వాగ్దానాలు ఇస్తుంటాయి. అందులో భాగంగా మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీల కట్టడి కోసం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, లా కమిషన్, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది.
ఉచితాలు, నగదు బదిలీ, సబ్సిడీల ద్వారా కొన్ని సార్లు పాలకపక్షాలకు సానుకూలత లభించే ఆస్కారం ఉంటుంది. జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ద్వారా మొత్తం 36 కేంద్ర,రాష్ట్ర పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా యూపీలో బీజేపీ చేసిందనేది అభియోగం. ఎన్నికల్లో వారికదే లాభించిందని విశ్లేషణలొచ్చాయి. 2019 ఎన్నికలప్పుడు ఏపీలో అధికార పార్టీ ఉచితాల పేరుతో భారీగా నగదు బదిలీ చేసినా.. ప్రయోజనం కనిపించలేదు. అనుచిత ఉచితాలు.. ఖజానాకు భారమై ఆర్థిక అస్థిరతకే కాకుండా ఎన్నికల్లో రాజకీయ పార్టీల అవకాశాల్లో అసమతుల్యతకు కారణమౌతాయనే వాదనా ఉంది. అందరికీ ఏకరీతిలో వర్తించేటట్టు ఉచితాలను కట్టడి చేసే సంస్కరణలకు రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలి. ప్రధాని చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల అధినేతల్ని పిలిచి ఒక సమావేశం పెట్టాలి. అంతా కలిసి, చిత్తశుద్ధితో ఓ పరిష్కారం కనుక్కోవాలి. అదెలా ఉన్నా.. ఓటర్లుగా ప్రజలు అప్రమత్తమై అనుచిత ఉచితాలతో పార్టీలు లబ్ధిపొందకుండా తమ ఓటు అస్త్రాన్ని ఒడుపుగా ప్రయోగించాలి. అదే, మన ఆర్థిక వ్యవస్థలకు రక్ష.
ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడుదిగుడు సమాజంలో అట్టడుగు నుంచే బడుగు,బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పైగా, మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారినీ భాగస్వాముల్ని చేసేలా సమ్మిళిత ప్రగతి అవసరం. అందుకై చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు దండుకునే యావతో ఎవరెవరికో ఉచితాలు ఇవ్వడం, నగదు బదిలీ చేయడం పట్లనే అభ్యంతరాలు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేసి, అన్నీ సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించటాన్ని ఎవరూ క్షమించరు.
ఓట్లు కొనడానికి డబ్బుల పంపిణీ, ప్రలోభ పెట్టడానికి కానుకలు పంచడాన్ని అడ్డుకునే వ్యవస్థ మనకుంది. కానీ, విధానాల పేరు చెప్పి పలు అనుచిత ఉచితాలు ప్రకటించి మూకుమ్మడిగా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగడలకు అడ్డుకట్ట లేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో, ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్ప చేస్తున్న రాజకీయ క్రీడకు తెర పడాలి. ఆ దిశలో క్రమంగా అడుగులు పడుతున్నాయ్.
ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ, అమలు పరిచే సమయం వచ్చే సరికి అన్ని రాజకీయ పక్షాలూ ఒకే తాను ముక్కలు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు. ఎన్నికల ఏరు దాటి, అధికారపు ఆవలి గట్టు చేరేలా, లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు తప్పకుండా అభివృద్ధికి అవరోధమే. ఉచితాల సంస్కృతి నుంచి సమకాలీన రాజకీయాలకు విముక్తి కల్పించేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. సమ్మిళిత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఒక గాటన కట్టలేం. సదరు సంక్షేమ కార్యక్రమాలకు, ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకూ మధ్య నుంచే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో.. సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి.
దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన స్కీమ్ ఉంది. చివరకు కేంద్రంలో కూడా ఉచిత పథకాల సంస్కృతి వచ్చేసింది. సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య.
దేశంలో ప్రజలందరి ఆదాయం ఒకే రకంగా లేదు. సంపద పంపిణీ కూడా క్రమపద్ధతిలో లేదు. అలాంటప్పుడు మొత్తానికి మొత్తం పథకాలు వద్దంటే.. పేదవాడు ఎలా బతకాలనే ప్రశ్నలున్నాయి. ఆ సాకుతో అన్నింటికీ అనుమతిస్తే.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఆందోళనలూ ఉన్నాయి. ఇప్పడు సుప్రీంకోర్టు నియమించే నిపుణుల కమిటీ వీటన్నింటికీ సమాధానాలు కనుక్కోగలదా అంటే చెప్పడం కష్టమే.
దేశంలో అన్నాదురై రూపాయికి కిలో బియ్యం పథకంతో ఉచిత పథకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో ఈ పథకాలు పీక్ స్టేజ్ కు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉచిత సైకిళ్ల నుంచి ల్యాప్ టాప్ ల పంపిణీ వరకు జరిగింది. ఇప్పుడు ఏకంగా కరెంట్, ఇళ్లు, తీర్థయాత్రలు ఫ్రీ అనేదాకా వచ్చింది వ్యవహారం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, లా కమిషన్, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత ఉచిత రాజకీయాల మార్గదర్శకులలో ఒకరు. ఓటర్లకు ఉచిత విద్యుత్, మొబైల్ ఫోన్లు, వైఫై కనెక్షన్లు, సబ్సిడీ స్కూటర్లు, వడ్డీలేని రుణాలు, ఫ్యాన్లు, మిక్సీలు-గ్రైండర్లు, స్కాలర్‌షిప్‌లు వంటి మరెన్నో వాగ్దానం చేశారు. ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ చైన్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆమె మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై నుంచి ఈ వారసత్వాన్ని అందుకున్నారు. ఆయన 1960లలో కిలో బియ్యం రూపాయికి అందించారు.
తమిళనాడులో ఉచిత రాజకీయాల్లో డీఎంకే వెనుకంజ వేయలేదు. 2006లో ప్రజలకు ఉచిత కలర్ టెలివిజన్ సెట్లు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పార్టీ వాగ్దానాలు చేసింది. అయితే 2011లో తిరిగి అధికారంలోకి వచ్చిన జయలలిత.. డీఎంకే కలర్ టీవీ పథకాన్ని రద్దు చేశారు.
ఉచితాలను నియంత్రించడమెలా? అని తీవ్రంగా యోచిస్తోంది సుప్రీంకోర్టు . సుప్రీం ఆదేశాల మేరకు నియమావళి రూపొందించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ఆరంభించింది. నిర్దిష్ట చట్టం లేకుండా, మీరు ఉచితాలు ప్రకటించకూడదు అని పార్టీలను కట్టడి చేయలేమని, అది చట్టాతీత చర్య అవుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకు నివేదించింది. ఇబ్బడిముబ్బడి సబ్సిడీలు, ఎన్నికల తాయిలాలు, వివిధ సామాజిక వర్గాల్ని దువ్వే నగదు ప్రయోజనాలతో ఖజానా ఖాళీ అయి ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని, పొరుగు దేశం శ్రీలంక రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్ని అందరూ ఉటంకిస్తున్న ప్రస్తుత పరిస్థితి తరచూ చర్చకొస్తోంది.
ఉచిత పథకాలు ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు పథకాలు ప్రకటించే అధికారం లేదా అనే ప్రశ్న కూడా వస్తోంది. అసలు ఉచితాలు అమలు చేస్తే తప్పేంటి అనే వాదన కూడా ఉంది. చాలా మంది పేదలకు ఈ పథకాలే ఆసరాగా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది. ప్రజా ప్రభుత్వాలపై కమిటీలు ఎలా పెత్తనం చేస్తాయనే ప్రశ్నలకు భవిష్యత్తులో ఎలాంటి సమాధానాలు వస్తాయనేది ఆసక్తకరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అదే ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును అనుచితంగా ఖర్చు చేయడం మాత్రం సబబా అనే ధర్మ సందేహం అలాగే ఉంది. ఈ సంక్లిష్టతను పరిష్కరించడం అంత సులభం కాదు. ఒక్క పార్లమెంటో, కేవలం నాయవ్యవస్థో అత్యంత సున్నితమైన ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అందుకే అన్ని వ్యవస్థలతో పాటు పౌర సమాజం కూడా భాగస్వాములైతేనే.. ఉచితాలను ఎలా చూడాలనే విషయంలో స్పష్టత వస్తుంది. లేకపోతే ఎప్పటిలాగే గందరగోళం కొనసాగుతుంది.