మరికొద్ది రోజుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకోనుంది. ఆ తర్వాత పాలనకు ఇంకా రెండేళ్ల సమయమే మిగిలుతుంది. ఎందుకంటే చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో.. అంతా రాజకీయ హడావుడే నడుస్తుంది. మరి ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అధికారంలోకి వచ్చిన సంకీర్ణ సర్కారు.. ఇచ్చిన హామీలేంటి..? అవి ఏ మేరకు నెరవేరాయి..? ఏపీకి కీలకమైన రాజధాని అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి..? పోలవరం స్థితిగతులేంటి..?కూటమి సర్కారు ఎదుర్కుంటున్న సవాళ్లేంటి..? మొత్తం మీద కూటమి సర్కారు తొలి రెండేళ్ల పాలన తీరుతెన్నులే.. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని, దాని లక్ష్యాల్ని తేటతెల్లం చేస్తాయనడంలో సందేహం లేదు.
సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు.. హామీల అమలులో పురోగతిలోనే ఉందని చెప్పొచ్చు. దాదాపుగా ఐదు హామీలు పురోగతిలో ఉండగా.. ఒక్క హామీ మాత్రమే అమలుకు నోచుకోలేదు. అయితే సర్కారు మాత్రం అన్ని హామీలు అమలు చేశామని చెబుతుండగా.. విపక్షాలు అంతా బోగస్ అంటూ విమర్శిస్తున్నాయి. ఇక చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుని సమీక్షిస్తూ.. ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.
Also Read
- Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ఏపీలో కూటమి సర్కారు అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. మరో ఇరవై రోజుల్లో రెండేళ్లు పూర్తిచేసుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ఇచ్చిన హామీల్ని ఏ మేరకు పూర్తిచేసిందనేది ఆసక్తికరమైన అంశం. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించి.. అధికారంలోకి వచ్చారు. ఇక హామీల అమలు విషయానికొస్తే పెన్షన్ల పెంపు హామీని అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే అమలు చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఆర్థిక సాయం, విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు, ఉచిత గ్యాస్ సిలిండర్లం పంపిణీ వంటి హామీలు ఇప్పటికే అమలౌతున్నాయి. కాకపోతే మహిళలకు నెల నెలా ఇస్తామన్న ఆర్థిక సాయం.. యువతికి నిరుద్యోగ భృతి వంటి వాటి గురించి విపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే నిరుద్యోగ భృతి విషయంలో.. పాతిక లక్షల ఉద్యోగాల సృష్టిని సర్కారు ప్రత్యామ్నాయంగా చూపిస్తోంది. కచ్చితంగా ఐదేళ్లలో చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని, ఇప్పటికే ఏపీకి కంపెనీలు క్యూ కడుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
మొత్తం మీద ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలు వేగంగా పురోగతిలో ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించింది. ప్రధాన హామీల సామాజిక పింఛన్లను పెంచి, లబ్ధిదారులకు క్రమం తప్పకుండా ప్రతి నెలా 1వ తేదీన స్వయంగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 269కి పైగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించి, పేదలకు మూడు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లులకు ఏటా రూ. 15,000 సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.రాబోయే రోజుల్లో తల్లికి వందనం సాయాన్ని పెంచడం, పిల్లల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా ఇచ్చిన ప్రతి హామీకి బాధ్యత వహిస్తామని సర్కారు నమ్మకం కలిగించే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది.
ఏ సర్కారు అయినా సరైనదారిలోనే వెళ్తోందని ప్రజలకు నమ్మకం కలగించడం చాలా కీలకం. ఈ ఫీల్‌గుడ్ ఫ్యాక్టరే అధికారాన్ని పదిలంగా ఉంచుతుంది. ఏపీలో కూటమి సర్కారు కూడ ఈ ప్రాథమిక సూత్రాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏపీకి విభజన కారణంగా వచ్చిన సమస్యలతో పాటు.. గత పన్నెండేళ్లలో పరిష్కారానికి నోచుకోని అంశాలపైనా దశలవారీగా దృష్టి సారిస్తున్నామని చెబుతోంది. ప్రధానమైన అంశాలపై ఫోకస్ పెడుతూనే.. ప్రతి సమస్యనూ అడ్రస్ చేస్తామని సమీక్షలు, సమావేశాలతో చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లాలకు వెళ్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. అక్కడ ప్రస్తావనకు వచ్చిన సమస్యల్లో.. ఆర్థికేతర సమస్యల్ని సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని చెబుతున్నారు. తద్వారా ప్రతి సమస్యకూ నిధులతో పని లేదని, చాలా సమస్యలకు యంత్రాంగంలో సమన్వయ లోపాలే కారణమౌతున్నాయని కూడా ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. తద్వారా అలాంటి లోపాలకు తావు లేని విధానాలు, కార్యాచరణ తీసుకోవటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్దేశాలేంటో, పెట్టుకున్న లక్ష్యాలేమిటో స్పష్టత ఇస్తున్నారు. ఎక్కడా అసాధారణ జాప్యాలు ఉండొద్దని, ప్రజలు లేవనెత్తే సమస్యలకు పరిష్కారం చూపించడమో.. ఎందుకు ఆలస్యమౌతుందో చెప్పడమో చేయాలని చెబుతున్నారు. సాధారణంగా యంత్రాంగంలో జరిగే పనులకూ, ప్రజల అంచనాలకు పొంతన ఉండదు. అలా జరగకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు హితవు చెబుతున్నారు. దీనికి నెలవారీగా తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఏ శాఖలో పురోగతి ఉంది..? ఏ శాఖ వెనుకంజలో ఉంది..? వంటి అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. ఇబ్బందులుంటే చెప్పాలే కానీ.. పెండింగ్ పేరుతో అంశాల్లో పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదనే సంకేతాలైతే ప్రస్తుతానికి కూటమి సర్కారు నుంచి క్లియర్‌గానే ఉన్నాయి.
గతంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకూడదని గట్టిగా భావిస్తున్న చంద్రబాబు, పవన్.. పాత తప్పులు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్లిస్తూ.. ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు వివరించాలని మంత్రులు, నేతలకు సూచిస్తున్నారు. ఇప్పటికే కూటమి పాలనలో ఏపీపై పెట్టుబడుదారులకు ఉన్న అభిప్రాయం మార్చగలిగామని సర్కారు ధీమాగా చెబుతోంది. పాలనలో తొలి ఏడాది గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల సవరణకే సరిపోయిందని చెప్పిన కూటమి సర్కారు.. రెండో ఏడాదిలో మాత్రం తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేసినట్టే కనిపిస్తోంది.
ఏతావాతా గతంతో పోలిస్తే.. ఏపీ ఇప్పుడేం చేయగలదు.. ఏ లక్ష్యాలు సాధించగలదు అనే విషయాల్లో పూర్తి స్పష్టత వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. గతానికి భిన్నంగా కీలక ప్రాజెక్టుల పూర్తికి నిధుల విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయని అంటోంది. కూటమి సర్కారు సెక్రేటరియట్ దగ్గర్నుంచి స్వర్ణ గ్రామ సచివాలయాల దాకా యంత్రాంగం పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతోంది. అలాగని సమస్యలు లేవని కాదు. పాలపాపరంగా అక్కడక్కడా అవాంతరాలు సహజమేనని, ఎక్కడా ఎక్కువకాలం ఏ అంశమూ పెండింగ్ పడకుండా చూసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలిస్తున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టేసే సంస్కృతికి స్వస్తి చెప్పి.. సమష్టి బాధ్యత తీసుకోవాలని కూడా హితవు చెబుతున్నారు. వీలైనంత వరకు పాలన డిజిటలైజ్ చేయడం కూడా పారదర్శకతను పెంచుతోందనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ పాలనను అందుబాటులోకి తెచ్చిన కూటమి సర్కారు.. మరిన్ని సేవలను ఆన్‌లైన్లో అందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతోంది. ఓవరాల్‌గా కూటమి పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉందని, దాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు చెడగొట్టకుండా ఉంటే అదే పదివేలు అంటున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. మంచి చేయకపోయినా పర్లేదు కానీ.. చెడు మాత్రం చేయకండని సూటిగానే చెబుతున్నారు. పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని కూడా చాలా ముందుగానే హింటిచ్చేశారు. తమ చుట్టూ తిరగడం కంటే.. ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవడమే కీలకమని గుర్తుంచుకోవాలని నేతలకు చురకలంటిస్తున్నారు.
విభజన తర్వాత ఏపీకి అమరావతి, పోలవరం నిర్మాణాలు కీలకంగా మారాయి. ఇప్పటికే కూటమి సర్కారు ఈ రెండు కీలక పనుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామని ప్రకటించింది. పనులు అసాధారణ వేగంతో జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరి అనుకున్న గడువు లోగా పనులు పూర్తవుతాయా.. లేదా అనేది చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకంగా చెప్పుకునే అమరావతి, పోలవరం నిర్మాణాల విషయంలో కూటమి సర్కారు స్పష్టమైన గడువుల్ని నిర్దేశించుకుంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టుని, 2028 నాటికి అమరావతి తొలి దశ పనుల్నీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతానికి భిన్నంగా ఈసారి నిధులకు ఇబ్బంది లేకపోవడం.. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటానికి ముందుకురావడం, అవసరమైనప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుండటంతో.. అన్నీ సానుకూలంగానే జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
రాజధాని పనులకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కూటమి సర్కారు.. రాజధాని విషయంలో సందిగ్ధతకు కూడా తెరదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ద్వారా అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధతను పొందింది. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలకు తిరిగి ఊపునిస్తూ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తున్నాయి. కిందటేడాది సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా ఇప్పుడు ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మరో వారం పది రోజుల్లో వీటిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించనున్నారు.
2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా భవనాలను పరిశీలించి తొమ్మిది నెలల్లో వాటిని పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరారు. అయితే ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకూ వీటి పనులు అంతగా సాగలేదు. నిజానికి 2019 నాటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు సంబంధించిన ఆరు అపార్ట్‌మెంట్లు 85 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఇంటీరియర్, గార్డెనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు కొంత మేర పెండింగులో ఉన్నాయి. వీటితోపాటు సీవరేజ్ ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. వీటన్నింటీనీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
ఎమ్మెల్సీ క్వార్టర్స్‌కు సంబంధించిన ఆరు అపార్ట్‌మెంట్ల నిర్మాణం 2019 నాటికి సివిల్ వర్కులను కూడా పూర్తి చేసుకోలేదు. మొండి గోడలతో ఉన్న వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక 23 నెలల్లో దాదాపుగా పూర్తి చేశారు. బయట రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, వైద్య సదుపాయాలతోపాటు, ఆరోగ్య, వ్యాయామ కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో సిద్ధం చేశారు.
అమరావతి పనుల విషయానికొస్తే.. ఎండాకాలం ముగియక ముందే వీలయినంత మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తున్నారు. మళ్లీ జులై, ఆగస్టు నెలల తర్వాత వానలు ప్రారంభమైతే పనులు జోరుగా సాగవు. అదుకే ఈ నాలుగు నెలలు పనులు వేగంగా చేయాలని ప్రభుత్వం నుంచి కూడా కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ పనులను నిరంతరం సమీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అమరావతి పనుల పురోగతిపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు నలభై వేల మంది కార్మికులు పైగానే మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సర్కారు అంతే సీరియస్‌గా తీసుకుంది. ఇక్కడ డయాఫ్రం వాల్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 960 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ పనుల్లో చాలా వరకు పురోగతి కనిపిస్తోంది. నిర్వాసితులకు ప్రాధాన్యతనిస్తూ, వేలాది మంది ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను, ఇళ్ల తాళాలను ప్రభుత్వం ఇటీవల అందజేసింది. ప్రాజెక్ట్ పనులను, నిర్వాసితుల పునరావాస ప్రక్రియను 2027 నాటికి పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు వెళుతోంది.రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం మరియు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షలు జరుపుతోంది. ఇరిగేషన్ క్యాలెండర్‌కు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
గత పన్నెండేళ్లుగా ఏపీ ప్రస్తవన వచ్చిన ప్రతిసారీ అమరావతి, పోలవరం ఎప్పటికి పూర్తవుతాయనే ప్రశ్నే తెరపైకి వచ్చేది. దీంతో ఈ విడత పాలనలో ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలని కూటమి సర్కారు ఫిక్సైంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు పరిశీలించి, ఆర్థిక వనరుల సమీకరణ చేసి.. గడువులు ముందే ప్రకటించింది. ఇప్పుడు టార్గెట్లకు అనుగుణంగా పనులు చేయడం మినహా మరో దారి లేదని కాంట్రాక్టర్లకూ స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. దీంతో ఈసారి అనుకోని అవాంతరాలకు ఛాన్స్ లేదని నమ్మకంగా చెబుతున్నారు. ప్రధాన అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు కొలిక్కి వస్తే.. అప్పుడు మిగతా సమస్యల పరిష్కారం కూడా తేలికవుతుందనే భావన సర్కారులో కనిపిస్తోంది. మాట్లాడితే ఏపీకి ఆదాయం తక్కువగా ఉందనే అభిప్రాయాలున్న తరుణంలో.. రెండు కీలక ప్రాజెక్టుల్ని చెప్పిన గడువులోగా పూర్తిచేయడం.. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రజలకూ కొత్త ఉత్సాహాన్నిస్తుందనే అంచనాలున్నాయి. అందుకే నెలవారీ లక్ష్యాల్ని, వారాల వారీగా పనుల పురోగతిని పర్యవేక్షిస్తూ.. ఎక్కడా అలసత్వం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమరావతి, పోలవరం నిర్మాణాల విషయంలో గతానికి, ఇప్పటికీ స్పష్టమైన తేడా ఉంది. అంతకుముందు నిధులనో, సాంకేతిక ఇబ్బందులనో, కోర్టు కోసులనో ఏదో ఒక కారణం చెప్పే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు సమస్యలు కొలిక్కిరావడం, పైగా సర్కారు గడువు ముందే ప్రకటించడంతో.. పనులు చెప్పినట్టుగా పూర్తికాకపోతే.. తేడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వ పెద్దలు కింది స్థాయి అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ.. నిర్లక్ష్యానికి తావు లేదని హెచ్చరిస్తున్నారు. అమరావతి తొలి దశ విజయవంతంగా పూర్తైతే.. ఇక మిగతా దశల పనులు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశాలుంటాయనే వాదన లేకపోలేదు. అన్నింటికీ మించి తొలిదశ నిర్మాణాల్లో రాజధానికి కీలకమైన భవనాలు ఉండటంతో.. ఇక రాజధాని తరలింపు ఆలోచన ఎవరికీ రాదనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే పోలవరం ఒక్కసారి పూర్తైతే.. రాష్ట్రంలో చాలా వరకు నీటి సమస్య పరిష్కారమవుతుందని చంద్రబాబు ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. ఇప్పుడ ప్రభుత్వం అనుకున్నట్టుగా పోలవరం పూర్తిచేస్తే.. మిగతా పెండింగ్ ప్రాజెక్టులపై బాగా ఫోకస్ పెట్టి.. వాటి పనుల్ని కూడా వేగవంతం చేసే వెసులుబాటు దొరుకుతుంది. అన్నింటికీ మించి ఈ రెండు కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం ఓ కొలిక్కివస్తే.. రాష్ట్ర ఆదాయవ్యయాలపై మరింత కచ్చితమైన అంచనాలు రూపొందించుకుని, భవిష్యత్ ఆర్థిక వ్యూహాలకు వీలు కలుగుతుందని కూడా సర్కారు భావిస్తోంది.
ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా కూటమి సర్కారు పని చేస్తోంది. సర్కారులో పైస్థాయిలో చంద్రబాబు, పవన్ కష్టపడుతున్నా.. కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, అధికారులపై మాత్రం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కూటమిలో పార్టీల మధ్య లుకలుకలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కీలకమైన ఆర్థిక గండాన్ని ఎలాగోలా గట్టెక్కిన కూటమి సర్కారుకు.. ఎమ్మెల్యేల తీరు, సమన్వయలోపమే పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. ఈ రెండు సమస్యల్ని ఏమేరకు సరిదిద్దుకుంటారనేదే.. కూటమి పాలన భవిష్యత్తును నిర్దేశించనుంది.
ఏపీలో సంక్లిష్టమైన ఆర్థిక సవాళ్ల మధ్య కూటమి సర్కారు పాలన ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి ఆర్థిక గండాలను దాటిన కూటమి సర్కారు.. ఎప్పటికప్పుడు నిధులు సర్దుబాటు చేసుకుంటూ.. కీలక కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూస్తోంది. కాకపోతే ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాలనపై ఎక్కువగా దృష్టి పెడుతుంటే.. ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రం యథాలాపంగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో.. అడపాదడపా చంద్రబాబు, పవన్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో గాడిన పడలేదనే వాదన వినిపిస్తోంది. పాలన సజావుగా సాగుతున్న తరుణంలో.. ఎమ్మెల్యేల్ని వీలైనంత త్వరగా అదుపు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలే.. కూటమి సర్కారుకు పెద్ద సమస్యగా మారొచ్చనే చర్చ జరుగుతోంది.
ఇక కూటమిలో సమన్వయం విషయంలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు.. అధికారంలోకి వచ్చాక తోచినట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటి్కే కోఆర్డినేషన్ లేకపోతే దెబ్బతింటామని పైస్థాయి నుంచి హెచ్చరికలు వచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అనుకున్న మార్పు రావడం లేదు. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు అనవసర వివాదాలు కొనితెచ్చుకుంటూనే ఉన్నారు. కొందరి తీరు ఏకంగా ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చివరకు నియోజకవర్గ స్థాయిలో కూటమి సమన్వయ సమావేశాలు జరిగినా కూడా నేతలు మాత్రం మారాలని అనుకోకపోవటమే అసలు సమస్యకు మూలమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. కూటమిలో సమన్వయ లేమి ఉందని కింది నుంచి పై స్థాయి దాకా అందరికీ తెలిసిన విషయం. దీన్ని వీలైనంత త్వరగా చక్కదిద్దాలనే ఆలోచన కూడా లేకపోలేదు. కానీ అందుకు సరైన కార్యాచరణ తీసుకోవడం, అనుకున్న ఫలితాలు సాధించడం కూటమి సర్కారు భవిష్యత్‌కు కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఏతావాతా కూటమి సర్కారు సంక్లిష్టమైన సవాళ్లను ఎలాగోలా అధిగమిస్తుంటే.. కింది స్థాయిలో కొత్త సమస్యలు పుట్టుకురావడం అంత మంచిది కాదనే చర్చ అయితే గట్టిగా జరుగుతోంది. తాము పాలనపై ఫోకస్ పెడుతుంటే.. మీరు చేయూత ఇవ్వకపోగా.. ఇదేం పని అని సీఎం, డిప్యూటీ సీఎం క్లాసులు పీకుతున్నా నేతలు మారడం లేదు. ఈ రెండు లోపాల్ని ఎంత సమర్థంగా సరిదిద్దుకుంటే.. కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆ మేరకు లబ్ధి ఉంటుంది. కానీ ఈ పని ఎంత వరకు సమర్థంగా చేయగలరనేది మాత్రం కీలక ప్రశ్నే. ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతున్నా.. ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేస్తున్నా.. నేతలు మాత్రం కొత్తదారులు వెతుకుతూ.. రెండు చేతులా సంపాదించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అటు ప్రజల నుంచే కాకుండా.. ఇటు పార్టీ శ్రేణుల నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొందరైతే జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల మాటను కూడా లెక్కచేయడం లేదని కూడా అంటున్నారు. ఈ ఆరోపణల తీవ్రత పెరగకుండా ఉండాలంటే.. తీవ్ర ఆరోపణలు వస్తున్న వారినైనా అదుపు చేయాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలనే సూచనలు కూడా కూటమి పార్టీల క్యాడర్ నుంచే వస్తున్నాయి. మరోవైపు అటు చంద్రబాబు, ఇటు పవన్ మాత్రం అందరి సూచనల్ని బేరీజువేస్తూ.. ఏం చేస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయి..? వాటిని ఏ మేరకు అధిగమించగలం..? అనే లెక్కలు వేస్తున్నారు.
ఎమ్మెల్యేల విషయంలో సాధారణంగా తొలినాళ్లలో కాస్త స్వేచ్ఛ ఇచ్చి.. తర్వాత కట్టడి చేసే సంప్రదాయం లేకపోలేదు. కానీ వారు శృతిమించుతున్నారనే సూచనలు కనిపించినప్పుడు కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. నిజానికి తొలి ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కానీ అప్పుడే చర్యలు తీసుకుంటే బాగుండదనే కోణం వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తవుతుందన్న సందర్భంలో కచ్చితంగా అదే కోణం పనిచేయదు. కాబట్టి ఈసారి చర్యలుంటాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా సమస్యాత్మకంగా మారిన ఎమ్మెల్యేల జాబితా రెడీ అయిందని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది తేలాల్సి ఉంది.
ఇక ఏపీకి గతంతో పోలిస్తే ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవడంలో సామర్థ్యం పెరిగిన మాట నిజమే అయినా.. ఆర్థిక ముప్పు ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. దాని కోసం కచ్చితంగా కొత్త కార్యాచరణ కావాల్సిందే. ఇప్పటిదాకా ఉమ్మడి ఏపీలో రూపొందించిన ఆర్థిక వ్యూహాల్నే అటూఇటూగా అమల చేసుకుంటూ వచ్చారు. ఇకపై అలా కుదరదని, ఏపీకి మాత్రమే ప్రత్యేకమైన ఆర్థిక వ్యూహాలు రూపొందినప్పుడే సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరుకుతుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు కూటమి సర్కరు ఆ దిశగా కూడా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఏతావాతా ఏపీలో కూటమి సర్కారు ప్రయాణం ప్రస్తుతానికి కీలక మజిలీకి చేరింది. ఇంకా చేయాల్సిన ప్రయాణం ముందుంది. కానీ ఈ సమయంలో జరిగిన పనులపై సమగ్ర సమీక్ష చేసుకుని.. జరగాల్సినవాటిపై అంచనాలు వేసుకుంటే.. కార్యాచరణపై స్పష్టమైన అవగాహనకు రావడానికి వీలవుతుంది. ఇప్పటికే ఆ దిశగా కొన్ని సమీక్షలు జరిగాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. ఇవన్నీ అయ్యాకే తొలి రెండేళ్ల పాలనను బేరీజు వేసి.. మలి రెండేళ్లకు కార్యాచరణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
